ఉత్తరా నక్షత్ర వ్రతము*
వెనుకటికొకసారి *'వృత్తాసురుడు'* అను రాక్షసుడు దేవతలను అనేక విధముల బాధించసాగెను.ఇంద్రుడు తన దేవసైన్యముతో అతడిని ఎదిరించెను. కానీ రాక్షసబలముముందు అతడు , అతడి
సైన్యము ఓడిపోయి అమరలోకమును వదలి , అజ్ఞాతవాసము చేయుగతిపట్టెను.
*ఇందులకు బాధపడుచున్న ఇంద్రునితో , దేవగురువైన బృహస్పతి కాలము యొక్క ప్రతికూలత వలన కలిగిన ఈ దుష్ప్రరిణామము నుండి తప్పించుకొనవలెనన్నచో దుఃఖనాశకుడైన మహాశాస్తాని ప్రార్థించుటయే ఉత్తమమైన మార్గము. అందుకు చేయవలసినదల్లా స్వామి యొక్క జన్మనక్షత్రమైన ఉత్తరానక్షత్రమందు వ్రతమును ఆచరింపవలెను. ఆ వ్రత ప్రభావము వలన అమితమైన బలపరాక్రమములను పొంది , అసురులను యుద్ధమునందు అవలీలగా జయించగల శక్తిని పొందగలవు”* అని ఆశీర్వదించెను.
ఇంద్రుడు తన గురువు వాక్కును , వేదవాక్కుగా భావించినవాడై శాస్తా యొక్క మూల మంత్రమును జపించుచూ , ఉత్తర నక్షత్రమందు , ఒక సంవత్సరకాలము వ్రతమును ఆచరించెను.
అతడి భక్తికి మెచ్చిన స్వామి అతడి ముందు ప్రత్యక్షమయ్యెను.
దేవేంద్రా ! నన్ను గురించి ఉత్తరానక్షత్రమునందు నీవు చేసిన ఈ వ్రతమునకు నేను మెచ్చితిని. వృత్తాసురుని వధించుటకు నీ వద్ద నున్న ఆయుధములు చాలవు.
*త్రిపురాసుర సంహారి అయిన నా తండ్రిపై అమిత భక్తి కలిగి జీవించు తపస్సంపన్నుడైన దధీచి మహర్షి యొక్క వెన్నెముకను పొంది , ఆ వెన్నెముకతో చేయబడిన వజ్రాయుధమును వృత్తాసురునిపై ప్రయోగించినచో అతడిని అవలీలగా జయింపగలవు”* అను ఉపాయమును తెల్పెను.
ఇది విన్న దేవేంద్రుడు సంతోషించి , మునివర్యుని ఆశ్రమ వాకిట నిలచి , నమస్కరించినవాడై తాను వచ్చిన కారణమును తెల్పెను.
బదులుగా దధీచి మహర్షి అతడితో *“ఇంద్రా ! చనిపోయిన తరువాత , ఎవరికీ ఉపయోగపడక మట్టిలో కలసిపోవు , ఈ శరీరము ఒక మంచి కార్యమునకు వినియోగపడువన్నచో , అంతకన్నా భాగ్యమేమున్నది”* అని యోగమహిమతో సంతోషముగా తన శరీరమును వదిలివైచెను. అంతట శివగణములు త్యాగశీలుడైన దధీచి భౌతికకాయమును , అందమైన విమానమున అమరచేసి , తగిన
మర్యాదలతో శివలోకమునకు గొనిపోయిరి.
అంత దేవేంద్రుడు దధీచి మహర్షి యొక్క వెన్నెముకతో వజ్రాయుధమును తయారు చేసి అసురులతో యుద్ధము చేసెను. వజ్రాయుధమును ఉపయోగించి శత్రుసేనను అవలీలగా సంహరించెను. ఇతడి ధాటికి ఆగలేని వృత్తాసురుడు గజగజ వణకుచూ , అక్కడినుండి పారిపోయి , సముద్రము అడుగున దాక్కొనెను.
ఏమి చేయుటకూ తోచనివాడై మరల శాస్తాని ప్రార్థించగా అతడు ఆకాశవాణి రూపున ఇట్లు
సెలవిచ్చెను. *“ఇందులకు తగినవాడు నా భక్తుడైన అగస్త్యమహాముని. అతడిని ప్రార్థించినచో సముద్రపు నీటిని అంతయూ పీల్చివేయును. ఇక వృత్తాసురుని వెదకి పట్టుకొనుట కష్టమైనది కాదు".*
స్వామి ఆనతిచ్చిన ప్రకారము అగస్త్యమహాముని వద్దకు దేవతలు తరలిపోయి , అతడి సహాయమును
అర్థించగా , అగస్థ్యుడు సముద్రపు జలమునంతనూ తన కమండలమునందు ఇమిడియుండునట్లు చేసి తన అరచేతియందు పోసుకుని , స్వామిని ధ్యానించి , త్రాగివేసెను.
సముద్రపు జలమంతయూ ఇగిరిపోయి , వృత్తాసురుడు వెలికివచ్చెను. స్వామిని ధ్యానించుచూ ,
దేవేంద్రుడు వజ్రాయుధమును వృత్తాసురునిపై ప్రయోగింపగా , దాని ధాటికి ఆగలేని రాక్షసుడు
ప్రాణములు విడిచెను.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
