అపూర్వ శాస్తా - 1*
కలియుగ వరదన్ ధర్మశాసితుడై వెలసి , నేడు దేశ విదేశములా ప్రఖ్యాతి నొందుచుండు శ్రీ అయ్యప్పస్వామి వార్ని గూర్చిన విశేష గాథ యొకటి *దీక్షితేంద్ర విజయము* అనబడు గ్రంధము నుండి లభించినది. అందులో *శ్రీమహాలక్ష్మిదేవికి స్వామి అయ్యప్పకు గల బంధుత్వం గూర్చి విశేషముగా వివరించబడియున్నది.*
చాలాకాలము క్రిందట కేరళ దేశములోని ఒకానొక ఆలయములో స్వామి అయ్యప్ప విగ్రహం చిన్ముద్ర దారివలే గాక తన కుడిచేతి చూపుడు వ్రేలును ముక్కుపై పెట్టుకొని ఏదో దీర్ఘాలోచనలో మునిగి యున్నటువంటి భంగిమలో ఉండేదట.
ఆ ఆలయములోనే యొక శిలాఫలకములో శ్రీ స్వామివారి ఈ అపూర్వ భంగిమను , ఆ భంగిమలో దాగియున్న ఆలోచనకు కారణమేమనియు తెలిపెడి మహనీయులొకరు ఈ దేవాలయానికి వస్తారు. అట్టి మహనీయుని వలన ఈ దేశానికి మేలు కలుగుననియు , ఆ మహానుభావుడెవరో తెలుసుకొనేందుకు ఈ దేవాలయములో శ్రీస్వామివారిని దర్శించుకొనేందుకు వచ్చే ప్రతివారు శ్రీస్వామివార్ని ఈ విచిత్ర భంగిమలో దర్శించుకొనువేళ వారెందుకిలా ఆలోచనా రూపంలో అమరియున్నారు. కారణమేమిటి ? అని మనస్సులో ప్రశ్నించి వారివారికి లభించిన సమాధానాన్ని ఈ సన్నిధి ముంగిట గట్టిగా చెప్పాలి. ఎవరి మాటలను విని శ్రీస్వామివారు అదియే నా ఆలోచనకు సరియైన కారణం అనురీత్యా దీర్ఘాలోచన భంగిమను వీడి చిన్ముద్రను అనగా బొటనవ్రేలు , చూపుడు వ్రేలును కలపి గుండ్రముచేసి , తక్కిన మూడు వ్రేళ్ళను పైకి నిలిపే చిన్ముద్రతో దర్శనమిచ్చునో అతడే ఆ మహనీయుడని గుర్తించవలయుననియు ఆ శిలాఫలకంలో లిఖించబడి యుండెను. ఆకాలమున దేశములో ఇన్ని మతాలు పుట్టలేదు. ఐనను కలికాలంలో జనులు కలహించుకోవడానికి ఏదైనా కారణాలు కావాలి కదా ? శివుని కొలిచే వారు , విష్ణుమూర్తిని కొలిచేవారు అని ఇరువర్గీయులై శైవమే గొప్పది. శివుడే గొప్ప వాడనియు , లేదు లేదు విష్ణువే గొప్పవాడు. అతనికి మించిన దైవమే లేదు. వైష్ణవమతమే చాలా విశేషమైనది. అంటూ జనులు ఇరువర్గీయులై కలహించి కొట్టుకొని , చంపుకొనే దాకా వెళ్ళేవారు. అప్పటి మతాచార్యులు గూడా తన మతస్థాపనాభివృద్ధి కొరకై ప్రజలలోను , రాజులలోను శైవం , వైష్ణవం అను భేదాలను హెచ్చు తగ్గులను సృష్టించి , వారి వారికి తోచిన రీతిగా ప్రచారం చేసేటివారు. అది శ్రీభుక్క భూపతుల వారు రాజ్యమేలు చుండినకాలము. విజయనగర సామ్రాజ్య పాలకుల గురువైయుండే వైష్ణవ మత ఆచార్య పీఠము నందుండిన శ్రీ తాతాచార్యుల వారే శ్రీభుక్క భూపతుల వారి ఆస్థాన గురువు. ఆ కాలమునందే అప్పయ్య దీక్షితులు అను మహనీయులొకరుండేటివారు. వారు అద్వైతి అయినను శివ ఉపాసనను చాలావరకు అభివృద్ధిపరచిన వారు. తీవ్ర విష్ణు ఉపాసకులై యుంటూ , శివపూజను , అరాధనలను ఖండిస్తూ శివాచారియార్లను కించపరుస్తూ, విష్ణుప్రచారం చేసేవారిని ఖండిస్తూ అనేక గ్రంథాలు వ్రాసి , వాద ప్రతివాదములు చేస్తూ శివోత్కర్షమును నెలకొలువుట కొరకు అతీత ప్రచారం చేయవలసివచ్చేది. వారి సమకాలికులైన తాతాచార్యుల వారు , విజయనగర రాజ్యపాలకులకే గాక దేశంలో అనేక రాజ్యాధిపతులకు కుల గురువై , ప్రధాన సలహాదారులై వుంటూ అతీత పలుకుబడులను పొంది అటు రాజులలోను , ఇటు ప్రజలలోను శివద్వేషాన్ని పెంచి విష్ణుప్రచారంచేసి , అనేక ప్రజల మత మార్పిడికి కారకులై వ్యవహరించి నందువలననే అప్పయ్య దీక్షితులవారు శివప్రచారం చేసి , శివమతాన్ని నెలకొల్ప వలసిన స్థితిని కల్పించినది. అంతేగాని మిగిలిన విష్ణుభక్తుల మనస్సులో కరుడు కట్టుకుపోయిన శివద్వేషం వున్నట్లు అద్వైతియైన అప్పయ్య దీక్షితుల మనస్సులో విష్ణుద్వేషము అణుమాటకే తావులేదు. ఈశ్వరుడు - ఈశ్వరి వీరితో విష్ణుమూర్తిని గూడా సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపముగానే భావించి మ్రొక్కేటివారు. వైష్ణవ మతాచారులైన శ్రీ తాతాచార్యులవారు రాజనీతిజ్ఞులై వ్యవహరించి , రాజ్యపాలనా విధానములో శ్రీ భూపతులవారికి సలహాలిచ్చుచూ వారిని సన్మార్గమున నడిపించుచుండేవారు.
శైవమతావలంబులైన శ్రీ అయ్యప్ప దీక్షితుల వారేమో యజ్ఞయాగాది క్రతువులను ప్రభువుల వారిచే చేయించుచూ దేశమును , దేశప్రజలను , రాజ్యాంగమును దైవానుగ్రహపాత్రులు గావించుచుండేటి వారు. ఒక సారి శ్రీ భూపతులవారు పైన చెప్పబడిన *అపూర్వ శాస్తా వారి ఆలయములోని శిలాఫలకము గురించి విని ఆశ్చర్యము చెంది. ఆ స్థలాన్ని దర్శించుకోవాలని నిర్ణయించి తన గురువర్యులిరువురితో సహా బయలుదేరెను.* మార్గమధ్యములో శైవ , వైష్ణవ బేధములేక అనేక దేవాలయములను దర్శనము చేసుకొనుచూ కరుణాసముద్రుడు , కలియుగ ప్రత్యక్షదైవం , శైవ , వైష్ణవ సంగమ స్వరూపి అయిన శ్రీ అపూర్వ శాస్తావారి ఆలయము చేరుకొనిరి. ఆలయమున ప్రతిష్ఠించబడిన మూలవిగ్రహమగు శ్రీ శాస్తావారి బింబము ఒక వింత విగ్రహములా ముక్కుమీద వేలుపెట్టుకొని మిక్కిలి విచారముతో ఏదో దీర్ఘముగా ఆలోచించు ధోరణిలో యుండినది గాంచిన భూపతులవారు ఆలయ నిర్వాహకులతో ఇచ్చటి స్థలపురాణమేమని అడిగెను.
అందులకు ఆలయ నిర్వాహకులు *"ప్రభో ! ఈ ఆలయము మిక్కిలి పురాతనమైనది. ఈ విగ్రహము చాలాకాలం క్రితం చెక్కించబడినది. ఒక పెద్ద దేవాలయం నిర్మించే పనులలో యుండగా ఈ విగ్రహం చెక్కించిన స్థపతికి అయ్యప్ప శాస్తా ఇలా ఏదో యొక విషయమై దీర్ఘాలోచనలో యుండే భంగిమలో దర్శనమిచ్చినారట. ఆ ఆలోచనకు కారణమేమని శిల్పి అడగలేదో యేమోకాని తనకు దర్శనమిచ్చిన భంగిమతోనే ఈ మూర్తిని చెక్కించి ప్రతిష్ఠింపజేసి నారట. ప్రతిష్టానంతరం స్థాపితమైన ఆ మూర్తిని దర్శించుకొనిన శిల్పికి నేనెందుకిలా ఆలోచిస్తూ కూర్చున్నాననే సంగతిని లోకులకు తెలిపే సర్వజ్ఞులొకరు భవిష్యత్తులో ఇచ్చటికి వస్తారు. వారు నా విచారమునకు కారణమేమను రహస్యమును తెలుపుతారు. అపుడు నాముక్కుమీద నుంచి వేలుతీసి , సర్వ ఆలయములలో యున్నట్లు చిన్ముద్ర వహిస్తాను. అతని మాటలే వాస్తవము. అతడే సర్వజ్ఞుడు అని లోకులు గుర్తించాలి"* అని అనిపించినదట. అది ఇచ్చట శిలాఫలకంగా చెక్కించబడి యున్నది. అందువలననే ఈ స్థలములోని శాస్తావారిని దర్శించుకొనేవారు వారివారి మనస్సులో కలిగే అభిప్రాయమును తెలపాలియనియు చెక్కించి వెడలినారు.
తదుపరి ఎందరో మహనీయులు ఈ స్థలమునకు వచ్చి శ్రీస్వామి అయ్యప్పను దర్శించుకొని శ్రీస్వామివారి చింతనకు ఏవేవో కారణాలను చెప్పిరి. కాని అవన్నియు సరియైన కారణాలు కాకపోవడముతో ఈ శాస్తావారు ముక్కు మీదనుండి చేతులు తీయకనేయున్నారు. ఆ మహనీయులెవరో ఎపుడు వస్తారో అని అనిరి. తదుపరి ఆలయములోనికి వెళ్ళి పూజాదులు ముగించి.. శ్రీస్వామివారిని దీపారాధనలో దర్శించుకొనువేళ భూపతి వారి మనస్సులో నా ఈస్థితికి కారణమేమని నీ గురువర్యులను అడిగి తెలుసుకో అని అనిపించెను. వెంటనే శ్రీభూపతులవారు తాతాచార్యులను చూపెను. భూపతిగారి మనోగతాన్ని గ్రహించిన తాతాచార్యుల వారు మరోమారు ఆ అపూర్వ విగ్రహాన్ని చూసి యొక కారణాన్ని కల్పించి క్రింది శ్లోకరూపంలో చెప్పెను.
