అపూర్వ శాస్తా -2*
*విష్ణోః సుతోహం విధినా సమోహం ధన్యస్తతోహం సురసేవితో హం ॥* *తథాభి భూతేశ సుతోహ మేతైర్ భూతైర్ వృతశ్చింత యతీహ శాస్తా ||*
శ్రీశాస్తా వారి విచారమునకు కారణమేమనగా ఇదియేనని శ్రీతాతాచార్యుల వారు శ్రీశాస్తావారు చెప్పినట్లుగానే శ్లోకమును చేసియున్నారు. శాస్తావారు ఏమి చెబుతున్నారంటే.... *"నేను శ్రీమహావిష్ణుసుతుడను కావున బ్రహ్మకు సమమైన వాడను. అందువలన నేను ధన్యత చెందుచున్నాను. దేవతలందరి చేతను మ్రొక్కబడుచున్నాను. కాని...... “తథాభియని శ్లోకములో వచ్చేపదానికి “ఐనను” “కాని” అని అర్థం చెప్పుకోవలెను. తనగొప్పతనాలన్నిటిని చెప్పుకొంటూ వచ్చిన శాస్తావారు కాని అని ఆపేసారంటే తరువాత తన విచారమునకు అసలు కారణం చెప్పబోతున్నారనియే గదా అర్థం. అందులోనే శ్రీ తాతాచార్యుల వారికి శివ సంబంధిత విషయములో సదభిప్రాయము లేదనునది స్పష్టమగుచున్నది. కాని.... నిలిపిన శాస్తా ఏమంటున్నారో తాతాచార్యుల ముఖదా విందాము. "కాని... నేను స్మశానవాసి , కరిచర్మాంబరదారి యగు శివుని కుమారుడు"* అనిగూడా చెప్పుకొనవలసి యున్నదే *"తథాభి భూతేశ సుతోహం"* శివుడు , పరమేశ్వరుడు , శంభు , ఉమాపతి , పశుపతి , సాంబశివుడు , నటరాజుడు , దక్షిణామూర్తి యని కైలాసవాసునికి ఎన్నెన్నో అందమైన నాముబులుండగా భూతేశుడనియో శ్లోకములో చెప్పబడియున్నది. స్మశానవాసి , భూత బంధముల నాయకుడు అనియే ఈశ్వరుని సంబోధించి యున్నారు. అలాంటివాని పుత్రునిగాను నేను వున్నానే అని శ్రీశాస్తావారు , తన విచారాన్ని వ్యక్తం చేస్తున్నట్లు శ్లోకవాక్యములు చెబుతున్నది.
భూతగణములను అణచిపెట్టి అందులకు నాయకులై ఒకరున్నారంటే నిజానికి అదియు వారియొక్క గొప్ప ప్రభుత్వశక్తిని , అధికార సంపదను ఎలుగెత్తి చెప్పేటిది యేఅగును. శ్రీపరమేశ్వరులు , భూతగణములు జనులను హింసించక కాపాడే వారేగాని వాటిని విచ్చలవిడిగా విడిచిపెట్టేవారు కాదు మనలను దుష్టశక్తులు ఆవహించి దెబ్బతీయక వాటిని అరికట్టి పాలించి నందువలననే వారిని భూతపతి యని పిలిచి మ్రొక్కుచున్నాము. భూతేశుడైన పరమేశ్వరునికే మహాదేవుడని పేరు గలదు. దేవతలందరికి పెద్దవారాయన తన ముగ్గురు తనయులలో పెద్దవానికే దేవగణాధిపత్యమిచ్చి గణనాథుడు గావించియున్నారు. రెండవవాడైన సుబ్రహ్మణ్య స్వామికి దేవ సేనాధిపత్యమిచ్చి దేవనాథుడుగా గావించియున్నారు. భూత గణములో యొక విభాగమును మూడవ తనయుడగు శ్రీశాస్తాకు ఆధిపత్యమిచ్చి భూతనాథుడుగా గావించియున్నారు.
సులభముగా లొంగని భూత సంఘమును అణచి పాలించుటయన్నది శ్రీ శాస్తావారికి కీర్తి కల్గించేపనియే. క్షుద్రగుణగణములు గల్గిన దుర్దేవతలు జనావాసములో ప్రవేశించి , హింస చేయక వాటిని తన అదుపులో పెట్టి గ్రామ రక్షణ దేవతయై గ్రామ పొలిమేరులో యుంటూ శ్రీశాస్తావారు లోకపావనం చేయుచున్నారు. కాని శివ సంబంధమైన సద్విషయాలలో తాతాచార్యుల వారికి సదభిప్రాయము లేదు గనుక ఇదియే ముక్కుమీద వేలు పెట్టుకొనియున్న శాస్తావారి చింతకు కారణమని శ్లోకముద్వారా చెప్పారు.
గొప్పఖ్యాతి సంపన్నుడైన విష్ణుపుత్రుడై బ్రహ్మ సమానుడై సర్వదేవతా నమస్కార స్వీకృతుడై యుండినను ఈ భూతపతిసుతుడై యున్నందువలన సదా దుష్టభూతగణ బృందము మధ్య యుండవలసివచ్చినదే. *“ఏతైర్ భూతైర్ వృత్తః"* యనిశ్లోకములో వచ్చుటకు అట్టి భూతగణములు చుట్టుముట్టియుండగా మధ్య నేనుండవలసివచ్చినదే యనియే శ్రీ శాస్తావారు ముక్కుమీద వేలుపెట్టి చింతించే భంగిమలో అమరియున్నారు. *"చింతయతీహశాస్తా"* యని తాతాచార్యులవారు ముగించిరి. కాని ఆ మాటలకు (శ్లోకానికి) శ్రీశాస్తావారి బింబము తనముక్కుమీద నుండి వేలుతీసి వేయలేదు. ఏలనగా...... వారి ఆలోచన ప్రకారం అర్థంచేసుకొన్నట్లు , భూతసంఘ పరివారముతో యుంటూ గ్రామ రక్షణ భారం వహించుట యనునది శ్రీ శాస్తావారికి కీర్తిని తెచ్చిపెట్టేదేగాని విచారాస్పదం కాదు. కావుననే శాస్తా విగ్రహం తాతాచార్యులవారు చెప్పిన కారణం సరియైనది కాదు - అన్నట్లు వ్రేలు మార్చక అలాగే యుండిపోయినది. తదుపరి శ్రీభుక్క భూపతులవారు శ్రీ అయ్యప్ప దీక్షితుల వారితో మీ అభిప్రాయాన్ని గూడా తెలుపండి అని ప్రార్థించెను. మరోమారు క్షుణ్ణంగా శ్రీశాస్తావారి విగ్రహాన్ని భక్తితో దర్శించుకొన్న దీక్షితులవారికి శాస్తావారి చింతనకైన అసలుకారణం స్పూర్తించెను. వెంటనే శ్లోకరూపముగా దాన్ని తెలిపిరి. శ్రీతాతా చార్యులవారు చెప్పినట్టే శ్రీ శాస్తావారి వచనములుగానే ప్రారంభించి చెప్పసాగెను.
