అపూర్వ శాస్తా - 3*
*అంబేతి గౌరీ మహ మాహ్వయామి పత్యైః పితుర్మాతర ఏవసర్వాః |*
*కథన్ను లక్ష్మీమితి చింత యంత శాస్తార మీధే సఖలార్ధ సిద్యై ||*
పై శ్లోకము అప్పయ్య దీక్షితులు వారి నోటనుండి వెలువడిన క్షణమే *"అవును ! ఇదియే సుమా నావిచారము. నా ఈ ఆలోచన అందులకే. ఈయన చెప్పిందే సత్యము"* అన్నట్లు ఆ అపూర్వ శాస్తా భంగిమలో అమరియున్న శ్రీ అయ్యప్పస్వామివారు ముక్కుమీద నుండి వేలుతీసి చిన్ముద్ర ధరించెను. లోకులకు ధర్మాన్ని శాసించి నేర్పించే శ్రీశాస్తావారే విచారపడుతూ *"ఇదేమిటి దీనికి సరైన సమాధానం లభించదా ? యని ముక్కుమీద వేలుపెట్టుకొని దేనిని గూర్చి ఆలోచించుతూ యున్నట్లు దీక్షితులవారు తన శ్లోకములో వివరించారంటేగౌరీదేవిని నేను "అమ్మా" అని పిలువగలను.*
అంభేతి అంబయితి -- అమ్మా అని , అహ్వయామి - పిలువ గలను. వాస్తవానికి విష్ణుమాయలోని మోహినియే నాకు జన్మనిచ్చిన తల్లి. అయినను తండ్రికి ఎంతమంది పత్నిలున్ననూ అందరూ అమ్మవరుసే అగుతారు. ఎలా శ్రీరామచంద్రుడు కౌసల్యాదేవినే గాక , కైకేయి , సుమిత్రలను గూడా కన్నతల్లిగానే ఎంచి “అమ్మా” యని పిలువలేదా ? విఘ్నేశ్వరుడు గంగను తల్లిగా ఎంచలేదా ? అలాగే నా తండ్రియగు పరమేశ్వరుని పత్నియగు గౌరీదేవిని నేను *"అమ్మా"* అని పిలువగలను. ఈశ్వరుని తండ్రిగాను , మహావిష్ణువును తల్లిగాను పొందిన నాకు పరాశక్తి ఏమి వరస అవుతుందిని ఆలోచిస్తూ కూర్చోపనిలేదు. *పత్న్యః పితుర్మాతుర ఏవసర్వాః* తండ్రియొక్క భార్యలందరూ తల్లులే అవుతారు. కావున గౌరీదేవిని అమ్మా అను వరుసతో పిలిచి ఆనందము చెందగలను. *"అంబేతి గౌరీమహమహ్వా యామి."*
ఐతే ఇదీ వరుస అని దలచి పిలువలేని , ఎంత ఆలోచించిన బోధపడని బంధమొకటి యున్నది. ఆ బంధమేమిటి ? శాస్తావారు ఎవరిని వరుసపెట్టి పిలువలేకపోవుచున్నారు. లక్ష్మిం ! *"లక్ష్మీదేవిని నేను ఏ వరుసపెట్టి పిలవాలి ? కథన్నులక్ష్మీం"* ఇదియే శాస్తావారి విచారము ముక్కుమీద వేలుపెట్టుకొని దీనికి సమాధానమెలా కనిపెట్టేది ? యని దీర్ఘాలోచనలో పడ్డది. ఎందుకంటే -- నేను లక్ష్మీదేవిని ఏవరుసపెట్టి పిలవాలన్నది అర్థంగాకనే. మనకు గూడా అర్థంకాలేదు కదూ ? ( లక్ష్మీదేవి ఎవరు ? విష్ణుపత్ని , మహావిష్ణువుకు , శాస్తావారికి గల బంధమేమిటి ? తల్లిబిడ్డలు సాక్షాత్ మహావిష్ణువే మోహిని అవతారమెత్తినపుడు శ్రీ పరమేశ్వరునితో కలిసి శాస్తావారిని కలుగజేసిరి.
కావుననే వీరికి హరిహరసుతుడు అను కారణనామము ఏర్పడినది. అటులైనచో లక్ష్మీదేవి శాస్తావారికి ఏమౌతుంది ? *తల్లియొక్క పత్ని* అగుతూంది. ఇందు ఆశ్చర్యమేమనగా తండ్రిగారి భార్య , పినతండ్రిగారి భార్య , మేనమామ భార్య , అన్నయ్య భార్య , తమ్ముని భార్య , బావమరిది భార్య , స్నేహితుని భార్య యని చెప్పగా వినియున్నాం. వీళ్లను అమ్మ , పిన్నమ్మ , మేనత్త , వదిన , మరదలు , సోదరియని వరుసపెట్టి పిలుస్తుంటాము. అమ్మ యొక్క భార్య అని చెప్పగా , పిలువగా వినియున్నామా ? ఈ శాస్తావారికి మాత్రమే ప్రపంచములో ఇంకెవరికీ లేని విచిత్రముగా అమ్మగారి భార్య అనబడు లక్ష్మీదేవియున్నారు. ఆమెను శ్రీశాస్తావారు ఏవరుసపెట్టి పిలువగలరు ? కథన్ను లక్ష్మీ - లక్ష్మీ దేవిని ఏవరుస పెట్టి పిలువగలను ? ఇదియే శాస్తావారి విచారము. ఇదియే వారి దీర్ఘాలోచనకు అసలు కారణం అన్నారు. అంతటితో ఆపినారా అంటే లేదు.
*'ఇతి చింత యంతం శాస్తారం ఈదే ఈ విశ్వమంతయూ పరిపాలించి పోషించువారు. వామనమూర్తియై వచ్చి తన ఒక్క పాదముతో ఈ విశ్వమంతయూ కొలిచినట్టివారు , యధాయధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన మధర్మస్యతదాత్మానం సృజామ్యహం అని మురాసురుడు , బాణాసురుడు , రావణాసురుడు మొదలగు రాక్షసుల వలన లోకానికి ధర్మగ్లాని కలిగినపుడు సాకార అవతారము గైకొని వార్లను సంహరించి లోకానికి మేలుగూర్చినవారు. ఈ జగన్నాటక సూత్రధారి అయినటువంటివారు. సమస్త సంపదలకు నిలయమైన లక్ష్మీదేవి యొక్క భర్త అయినట్టివారు. అలంకార ప్రియులు , శంఖుచక్ర గదాదారి , నీలమేఘ శ్యాములు , సౌందర్యం స్వరూపులు అయిన మోహిని సుతుని ఈడే సకలార్ధ సిద్యై అని ముగించారు. అనగా సకల విధములైన పురుషార్థ సిద్దులు పొందదలచినవారు. శ్రీ శాస్తావారిని ఆశ్రయిస్తే అర్థంకాని తత్వములు గూడా అర్థమగును. కావున శాస్తావారిని ఆశ్రయించి మ్రొక్కుచున్నాను.* అని ముగించారు. దీక్షితులవారి శ్లోకములో "శివకేశవ భేదముగాని , హెచ్చుతగ్గులైన భావ బేధము గానీ లేదు. పరమేశ్వరిని లక్ష్మీదేవిని ఒకేలాగ వర్ణించి యున్నారు.
*దానితో దీక్షితుల వారు తన శ్లోకములో బుద్ధి చాతుర్యమును మాత్రమేగాక భక్తి పారవశ్యాన్ని గూడా కలిపి సకలార్థసిద్ధి కొరకు శ్రీశాస్తావారిని ఆరాధించుచున్నాను"* అని చెప్పియున్నారు. *"ఎందుకొరకు వారిలా ముక్కుమీద వ్రేలెట్టుకొని కూర్చున్నారన్నది. అర్థంకానపుడు , సకల అర్థములు సిద్ధించుటకు వారివద్దనే వేడుకొనునట్లు వినయముగా చెప్పడములోని పరమార్ధము ఏమనగా వారి కృపయుంటే తప్ప వారిని గూర్చిన రహస్యములను మన బుద్ధిచాతుర్యము వలన మాత్రము కనిపెట్టలేము"* అనునదియే.
అన్నిటికన్నా మిన్నగా దీక్షితులు చెప్పిన కారణమును ఇంతవరకు
ఏ మేధావియూ కనిపెట్టలేదుగదా ! ఇంకనూ ఎవరైనా కనిపెట్టగలరా ? అమ్మ యొక్క భార్యను ఏవరుసపెట్టి పిలవాలి అని ఎంత ఆలోచించినా సమాధానము లభించునా ? నిజానికి సమాధానము లేని ఈ ప్రశ్న శాస్తావారి మదిలో కలిగి , దీర్ఘాలోచనలో మునిగి ముక్కుమీద వేలుపెట్టుకొనియుండు స్థితిలో స్థపతికి దర్శనమివ్వగా ఆస్థపతి దానినలాగే శిలావిగ్రహముగా చెక్కించియుంటాడు. కావుననే దీక్షితులవారు స్వామి విచారమునకు అసలు కారణాన్ని కనిపెట్టి చెప్పగానే అదియే నిజమన్నట్లు బింబము తనముక్కుమీద నున్న వ్రేలును చటుక్కున తీసి అన్ని దేవాలయాలలో వున్నట్లు చిన్ముద్ర దాల్చేను..
*ఒకరాతి విగ్రహము శ్లోకము విని ముక్కుమీద నుండి వ్రేలుతీసి వేయగానే అచ్చట గుమిగూడి యున్నవారందరూ మహదాశ్చర్యము చెందిరి. శ్రీభుక్క భూపతులవారు ఆమహాద్భుతాన్ని తిలకించి , ఆనందోత్సాహము చెంది , శిలాఫలకములో వ్రాయబడిన మహనీయులు శ్రీ అప్పయ్య దీక్షితుల వారైనందులకు ఎంతో ఆశ్చర్యపడి అందరూ ముక్కుమీద వ్రేలుపెట్టుకొనిరి. అప్పటినుండి శ్రీ అప్పయ్య దీక్షితులవారి నామము లోక ప్రసిద్ధమైనది. శ్రీ తాతా చార్యులు గూడా శివకేశవులు అబేధమును గ్రహించి , శివనింద చేసినందులకు పశ్చాత్తాపపడి , పరమేశ్వరుని పలురీత్యా ప్రార్ధించి తరించిరి.*
