అమెరికాలో అయ్యప్ప ఆలయం*
భారతీయులే గాక పాశ్చాత్యులు కూడా శ్రీ ధర్మశాస్తావారిని ఆరాధించి యున్నట్లు ఆధారములు లభ్యమయినట్లు *"యుగ పురుషుడు ఈ అయ్యప్ప"* వ్యాసములో ఇదివరకే పేర్కొనబడి యుంటిమి. దాని ప్రకారం ఈజిప్టు , టర్కీ , బర్మా (మైన్ మార్) , మలేషియా , శ్రీలంక , కాలిఫోర్నియా మొదలగు ప్రదేశములలో శ్రీ ధర్మశాస్తా వారికి పురాతన ఆలయాలున్నట్లు తెలియవస్తున్నది. వీటిపై విస్తృత పరిశోధనలు ఇంకను చేయవలసి యున్నది. ఇటీవలి కాలంలో అమెరికాలో వాషింగ్టన్ నగరంలోని మేరిల్యాండ్ నందును , కెనడాలో టోరాంటో నగరం నందును. అచ్చట నివశించే మన భారతీయులచే శ్రీ అయ్యప్పస్వామి వారికి విశాలమైన , కళాత్మకమైన ఆలయాలు నిర్మించి మన సాంప్రదాయ పద్దతిలో నిత్య ఆరాధన , విశేషపూజలు నిర్వహించ బడుచున్నది. అమెరికాలోని వాషింగ్టన్ మహా పట్టణములోని మేరీల్యాండ్ నందు నిర్మితమైన శివా విష్ణు ఆలయ ప్రాంగణములోని శ్రీధర్మశాస్తా వారి ఆలయం.
*వాషింగ్టన్ అయ్యప్పస్వామి దేవాలయం*
అమెరికా నగరంలో నివసించే సుమారు ఎనభై వేల హైందవులు కలిసి 1995 జూలై నెలలో శబరిమల పోలిన దేవాలయ మొకటి వాషింగ్టన్లో నిర్మించి శాస్త్రోక్తముగా కుంభాభిషేకము గావించిరి. వాషింగ్టన్ నగరంలోని మేరిల్యాండ్ అనబడు స్థలములో బ్రహ్మాండముగా నిర్మించబడిన స్వామి అయ్యప్ప దేవాలయ కుంభాభిషేక మహోత్సవం 1995 జూలై 9న వైభవోపేతముగా జరిగినది.
పై కార్యక్రమాన్ని చెంగన్నూర్ తాయమణ్ మడ నివాసస్థులు , శబరిమల పారంపర్య వంశావళి ప్రధాన తాంత్ర పూజారులలో పెద్దలు అయిన శ్రీ కంఠరారు మహేశ్వరరు తంత్రి , వారి తనయులు మోహనరు తంత్రిగారు కలిసి దిగ్విజయముగా జరిపించిరి. వారితో కేరళ నుండి నారాయణ బట్టద్రి , కె.పి. వాసుదేవ శర్మ , శ్రీధరన్ , రవి , ఈశ్వరన్ నంబూద్రి, శ్యాం కుమార్ బట్టద్రి మున్నగు విద్వాంసులు సహాయకులై వెళ్ళిరి. ఇది వరకే అచ్చటి శివా విష్ణు దేవాలయములో పనిచేయు లక్ష్మీనారాయణ అయ్యర్ , ఎస్. చంద్రమౌళి స్వామి , అనంత పద్మనాభాచార్యులు , హెచ్. ఎస్. రమేష్ మున్నగు వారు గూడా ప్రతిష్ఠా కార్యక్రమములో తంత్రి గారికి సాయపడిరి. భారత దేశమునకు , అయ్యప్ప సమాజమునకు గొప్ప ఖ్యాతిని తెచ్చి పెట్టిన ఈ ప్రతిష్ఠా కార్యక్రమం 1995 జూలై 10న వాషింగ్టన్ పోస్టు అనబడు ప్రఖ్యాత దినపత్రికలో దాని మెట్రో సప్లమెంటరీ శీర్షికలో మొదటి పేజీలో మూడు వర్ణ చిత్రాలతో ప్రచురించబడినది.
సుమారు ఒక కోటి , డెబ్బైఐదు లక్షల రూపాయల వ్యయంతో పదునెనిమిది మెట్లతో నిర్మించబడిన ఈ అయ్యప్ప స్వామి దేవాలయం మేరిల్యాండులో 15 ఎకరాల విస్తీర్ణములో ఇదివరకే బ్రహ్మాండముగా నిర్మించబడిన శివ , విష్ణు ఆలయ ప్రాంగణములో గలదు. చెంగన్నూరు వాస్తవ్యులైన నట్టావిళ రాజరత్నం స్థపతిగారు ఇచ్చట ప్రతిష్ఠించబడిన పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని తయారు చేసినారు. మద్రాసు వాస్తవ్యులు , పారంపర్య వాస్తు శిల్ప కేంద్రం డైరెక్టర్ వి. గణపతి స్థపతి గారు గర్భాలయము , ముఖ మండపము , మణిమండపము , ఉప దేవాలయాము మున్నగు వానిని వాస్తు శాస్త్రరీత్యా రూపొందించియున్నారు. భక్తాదుల బహుకాల వాంఛగా నుండిన స్వామి అయ్యప్ప ప్రతిష్ఠ 1995 జూలై 10న కన్నుల పండగ జరిగిందని అమెరికాలోని హైందవులు మహదానంద పడిపోయిరి. ఆమెరికాలోని మేరీల్యాండులో సుమారు 15 ఎకరాల విస్తీర్ణ స్థలములో గత 1990 అక్టోబరు నెలలో శివ , విష్ణు క్షేత్రం నిర్మించబడినది. అపుడే పార్వతి , వళ్ళీ , దేవసేన , సుబ్రహ్మణ్య , గణపతి , దుర్గ , సరస్వతి , నవగ్రహములు , విష్ణు , లక్ష్మీ , ఉడిపి కృష్ణుడు , ఆండాళ్ , హనుమంతుడు మున్నగు విగ్రహములకు ప్రతిష్ఠలు జరిగినది. కానీ అపుడు అయ్యప్ప ప్రతిష్ఠ కాలేదు. తదుపరి 1992 మే నెలలో స్వామి అయ్యప్ప దేవాలయమునకు భూమి పూజ జరిగినది. ఈ లోపు 1993 మే నెలలో వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగినది. తదుపరి ఈ క్షేత్ర కమిటి మాజీ చైర్మెన్ ఎం.జి. మేనోన్ గారు , ప్రస్తుత ప్రసిడెంటు పి.వి. చందర్ , రాజు బాలసుబ్రహ్మణ్యం , సి.కె. ధనంజయన్ , గిరీష్ , గిరిధర్ , పి.జి. మేనోన్ , డా॥ ఎస్. నాగులు , భాసినాయర్ , డా॥ విజయన్ నంబియార్ , ఎస్. నారాయణ స్వామి , డా॥ సి.ఆర్. నాధ్ , ఎస్.ఇ. ఉణ్ణిత్తాన్ , ఆర్. ఎమ్. ఫణయ్యప్పన్ , డా॥ ఎమ్. వి. పిళ్ళ. అంబికా పిళ్ళై , బి.కె. రాధాకృష్ణన్ , కె.జి. రమణి , డా॥ శివసుబ్రహ్మణ్యన్ , డా|| కె.ఎం. వినాయకం , టి.వి. వెంకటేశ్వరన్ , రామకృష్ణన్ , మున్నగు ప్రఖ్యాత అమెరికా నివాసస్థులతో కలిసి ఈ బ్రహ్మాండమైన శబరిమల పోలిన దేవాలయాన్ని వాషింగ్టన్లో నిర్మించియున్నారు. ప్రతిష్టా దినం పలువేల మంది ఇరుముడి కట్టుకొని , పదినెట్టాంబడి దాటి శ్రీస్వామి అయ్యప్పకు నెయ్యభిషేకం చేయించినారు. వారిలో మహేష్ యోగి గారి శిష్యులైన పెర్రియోగమన్ అనబడు అమెరికన్ ఒకరు ఇరుముడి కట్టుకొని వచ్చినది చెప్పుకో తగ్గదగును. శివుడు సంహారమూర్తి , విష్ణువు సంరక్షణ మూర్తి ఈ ఇరువురు కలిసియుండు దేవాలయ ప్రాంగణములో వారిరువురి పుత్రుడైన స్వామి అయ్యప్ప ప్రతిష్టింపబడుట చాలా సమంజనమగును. భవిష్యత్తులో అమెరికా వచ్చేవారు తప్పక దర్శించుకో తగ్గ దేవాలయ సముదాయం ఈ హరిహర క్షేత్రం అని అమెరికా ఫియర్ ఫాక్స్ హిందూమత అధ్యాపకులై వ్యవహరిస్తున్న శ్రీ జి.వి.వి. రావు గారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. *"విదేశాల్లో మొట్టమొదటగా నిర్మించబడిన 18 మెట్లతో గూడిన స్వామి అయ్యప్ప దేవాలయం ఇదే అగును. ఈ దేవాలయం మరో శబరిమలలా తీరాలని కలిసి కట్టుగా కృషిచేసిన వారందరికి కృతజ్ఞతలు. మన పని ఇంతటితో తీరిపోలేదు. శ్రీస్వామి అయ్యప్పకు బంగారు అంగీ కూడ తయారు చేయించాలి. ఇంకనూ చాలా అభివృద్ధి పనులు చేయవలసి వున్నది. శ్రీ ధర్మశాస్తావారి అనుగ్రహము భక్తుల సహకార సహాయములు వుంటే అవన్నిటిని సులభముగా చేయిస్తాము"* అని సదరు క్షేత్ర సమితి కార్యకర్తలు ఉత్సాహ భరితులై తెలిపిరి.
అమెరికాలోనే గల హిందూదేవాలయములోనే అతి పెద్దది ఈ దేవాలయమేనట. ఏడు కలశములతో 56 అడుగుల ఎత్తుగల రాజగోపురము అతి గంభీరముగా కనపడి చూపరులను ఆకట్టుకొనుచున్నది. ఆలయము ముంగిట మెట్లుగలవు దీన్ని మొత్తము ఎత్తు 70 అడుగుల ఎత్తున నిర్మించబడి అతిగంభీరమైన భంగిమను కల్గించుచున్నది. ఈ ఆలయమునకు మరొక్క విశిష్ఠత కూడా కలదు. విదేశాలలో నిర్మించబడిన ఆలయమే అయిననూ ఆగమశాస్త్రవిధి విధాన ప్రకారము నిర్మించుటయేగాక పల్లవరాజులు , చోళుల శిల్పకల నైపుణ్యములు విజయనగరం సామ్రాజ్యపు చిత్రములు మరియు కేరళ , కర్ణాటక రాష్ట్రముల ఆలయముల శిల్పకళా నైపుణ్యములు యొకటిగా రూపుదిద్దుకొని యుండుట విశేష అంశమగును. ఆలయ రూపచిత్రీకరణ మరియు కళానైపుణ్య నిర్మాణములన్నియూ ఆలయ నిర్మాణ వేత్త శ్రీగణపతి స్తపతిగారి ఆదేశానుసారము జరిగియుండుట మరొక్క విశిష్టత అగును. ఇచ్చట శివుడు లింగాకారములోనే యున్నారు. కాని ఇచ్చట ప్రతిష్ఠింపబడి యుండు శ్రీవిష్ణుమూర్తి తిరువనంతపురంలో యుండు శ్రీ అనంత పద్మనాభస్వామివారి ఆకారంలో యున్నారు. ఈ ఆలయములోని ముఖ్యాంశము ఏమనగా ఈ దేవాలయమున అయ్యప్పస్వామివారి ఆలయము పదునెట్టాంబడితో యుండుటయే. మొత్తం అమెరికాలోనూ ఇంకెక్కడా అయ్యప్ప స్వామివారికని ప్రత్యేక ఆలయము లేదు. కొన్ని దేవాలయాలలో అయ్యప్పస్వామి విగ్రహము మాత్రము ప్రతిష్ఠ చేయబడియున్నది. ఇచ్చటిమాత్రమే ప్రత్యేకమైన సన్నిధి , విమానముతోకూడా యున్నది. ఈ ఆలయమున శ్రీ పరమేశ్వరుడు , శ్రీదుర్గా , శ్రీవినాయకుడు , శ్రీపార్వతి , శ్రీసరస్వతి , శ్రీ నవగ్రహములు , శ్రీకార్తికేయుడు , శ్రీవిష్ణువు , శ్రీలక్ష్మీ, శ్రీకృష్ణుడు , శ్రీ ఆండాలు , శ్రీరాముడు , శ్రీ ఆంజనేయుడు , శ్రీవెంకటేశ్వరుడు , శ్రీసుదర్శన చక్రము , శ్రీయోగనరసింహుడు , శ్రీ అయ్యప్ప యని సకలదేవతల సముదాయము యున్నది. ధ్వజస్థంభము గలదు. హైందవ ఆచార ప్రకారము ఈ ఆలయము నిర్వహించబడిననూ అమెరికా దేశస్తులకు ప్రవేశ అనుమతి కలదు. ఈ లన్ హామ్ , మేరీల్యాండ్ పరిసర ప్రాంతపు నివాసుల అభిమాన ఆలయముగా శ్రీశివావిష్ణు ఆలయము వెలయుచున్నది. వాషింగ్టన్ దాక వెళ్ళే వారు తప్పక చూసి తరించవలసిన ఆలయము ఈ శ్రీశివావిష్ణు ఆలయము.
