శ్రీ మహాశాస్తా చరితము - 106 | ప్రసాదము యొక్క ఫలితము | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 106 | ప్రసాదము యొక్క ఫలితము | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

ప్రసాదము యొక్క ఫలితము*

స్వామి యొక్క ప్రసాద మహిమను వర్ణించతరముకాదు. నమ్మినవారికి , నమ్మకము లేనివారికి ఎన్నో రకముల మేలు చేయును.

*'పెరువనం'* అనుచోట శాస్తా విద్యామూర్తి నామధేయుడై కొలువై యుండెను. ఆ క్షేత్రము
*తిరువల్లక్కావు'* అను పేరుతో పిలువబడుచుండెను. శాస్తా అవతరించిన వెంటనే ఈశ్వరుడు ఆ
బిడ్డను తన కుడిచేతిలోకి తీసుకుని ముద్దుచేసెను. తమిళ భాషయందు *'వలదు'* అనగా కుడి ప్రక్క అని అర్థము. అందువలననే ఈ క్షేత్రము *'తిరువలంకై కావు'* అని పిలువబడుచూ , కాలక్రమేణా తిరువల్లక్కావుగా స్థిరపడినది.

ఈ స్థలమున స్వామి వేదపండితుల మధ్య , వేదములకు అధిదేవతగా వేదఘోషప్రియునిగా ,
వేదమూర్తిగా అవతరించియుండెను.

స్వామి ఆలయమున పూజాధికములు నిర్వహించు భట్టద్రివంశమునకు చెందిన వాసుదేవుడు
అను బాలకుడు ఉండెను. శాస్తాని అనుదినము భక్తి శ్రద్ధలతో పూజించు భట్టద్రి వంశము వారందరూ , స్వామి యొక్క అనుగ్రహము వలన తరతరాలుగా జ్ఞానసంపన్నులై , విద్యాపాండిత్యములు
కలిగినవారై యుండిరి. కానీ ఎందువలనో వాసుదేవుడు మాత్రమే మందబుద్ధియై యుండెను.

ఆలయపూజాదికములను అభ్యసించి , నిర్వర్తించుట అనునది ఒక వివేకుడు ,
జ్ఞాని అయినవాడు
మాత్రమే చేయగలగును. వేదనాయకుడైన శాస్తాని ఆరాధించుటకు వేదములను అభ్యసించిన వాడై యుండుట ముఖ్యము. కానీ ఎంత ప్రయత్నించిననూ బాలునిపట్ల సరస్వతీదేవి కరుణింపనిదాయెను.

వాసుదేవునికి వాక్కు సరిగా పలుకని దయ్యెను. నోటమాట సరిగ్గా రాక మూగవాడేమో
నన్నట్లుగా ప్రవర్తించుచుండెను. వాని పేరైన వాసు అను శబ్దము కూడ సరిగ్గా పలుకలేక *'వాదు'* అనే పలుకుచుండెను. మిగతావారుకూడా *'వాదు'* అని హేళనగా పిలువసాగిరి. ఒకనాడు పాఠశాల నుండి అతడిని తిరిగి ఇంటికి పంపివేసిరి. అదిచూచి మనోవేదన పొందినదైన అతడితల్లి , అతడిని బాగుచేయు శక్తి ఏ వైద్యులకూ లేదు , కేవలము ఒక్క శాస్తా తప్ప అను ధృఢనిశ్చయమునకు
వచ్చినదై , జ్ఞానస్వరూపుడైన శాస్తాని ప్రార్థించుమని తన కుమారుని ఆలయమునకు పంపినది.

అనుదినమూ ఆలయమునకు పోయి వచ్చునట్లైన మాత్రమే తినుటకు ఆహారమును ఇత్తునని అంక్ష విధించెను. భోజన ప్రియుడైన వాసుదేవుడు, ఆలయమునకు పోవనిచో ఆహారమును ఈయదను
భయముచేత తప్పనిసరిగా ఆలయమునకు పోయి స్వామిని ప్రార్థించుచుండెను.

దినములు గడుచుకొలదీ , వాడు పెరిగి పెద్దవాడయ్యెను. తల్లి వలన భయము చేత ఆలయమునకు
పోవుటకు ప్రారంభించినవాడు , స్వామి యందు మిక్కిలి ఆసక్తి కలుగసాగెను. అదియునుగాక ఆలయమునకు పోయిన వెంటనే అచటి ప్రసాదము దొరుకుచుండెను. ఇంటికి వచ్చిన తరువాత తల్లి భోజనమును ఈయుచుండినది. భోజన ప్రియుడైన వాసుదేవునకు రెట్టింపు ఆహారము
దొరుకుచుండినది.

భక్తి అనగా ప్రేమే కదా ! అది ఏ రూపున ఉన్ననూ దానిని ఆస్వామి తప్పక ఆమోదించును.

అవ్యాజ కరుణామూర్తియైన శాస్తా , ఆ బాలునకు తన అనుగ్రహమును ప్రసాదించుటకై
ఆయత్తమయ్యెను.

ఒకనాడు వాసు యొక్క మందబుద్ధిని , అతడి మిత్రులు హేళన చేయుచుండగా , వేదన
పొందినవాడై ఎటు పోవుటకూ పాలుపోక , అనాలోచితముగా అతడి పాదములు ఆలయమువైపుగా
నడవసాగినవి.

ఆశ్చర్యకరముగా గుడి తలుపులు తెరచియేయుండెను. వాసుని అనుగ్రహించగోరిన శాస్తా , ఒక అరటిపండును అతడికి ప్రసాదముగా పంచెను. వాసుదేవునకు పూజాది కార్యక్రమములు తెలియదు. మంత్రమును అనుష్టించు విధానమూ తెలియదు. కానీ స్వామి యొక్క దివ్య ప్రసాదము వలన పాఠశాలకు పోయి చదువకనే , గొప్ప పండితుడయ్యెను.

వాసు అను తన పేరును కూడా సరిగ్గా పలుకలేని వాడైన బాలుడు , పండితుడైన వాసుదేవ
భట్టద్రిగా పేరుపొంది , నిరంతరము స్వామి యొక్క సేవలందే తరించుచుండినవాడయ్యెను.

స్వామి యొక్క ప్రసాదము తినినంతనే , స్వామిని స్తుతించుచున్న విధానమును చూసిన
జనులందరూ ఆశ్చర్యపోయిరి. స్వామి యొక్క అనుగ్రహమును వేనోళ్ళ కొనియాడిరి.

కాశీపట్టణముననున్న మహారాజులు , పండితులు ప్రశంశించువిధముగా జ్ఞానవంతుడై విలసిల్లెను.
అతడు రచించిన *'యుధిష్ఠా'* అను కావ్యము మిక్కిలి ప్రసిద్ధి చెందినది. అతడి తరువాత వచ్చిన అతడి వంశీయులందరూ స్వామి సేవ యందే తరించినవారు.

భగవత్ ప్రసాదము యొక్క మహిమను పొగడతరమా ? శాస్తా ప్రసాదించిన అరటిపండును తిన్న వాసుదేవుడు జ్ఞానియైనట్లే అతడు పారవేసిన అరటిపండు తోలును , స్వామి ఆలయమున
ఊడిగము చేయు పరిచారిక మహా ప్రసాదిముగా భావించి తినెను. చదువుసంధ్యలు లేని పరిచారిక సైతము , స్వామి యొక్క ప్రసాద ఫలితముగా పండితురాలై *'రామోదంతము'* అను గ్రంధమును రచించునంతటి గొప్ప కవయిత్రిగా ప్రసిద్ధి పొందెను.

ఆ విధముగా స్వామి జ్ఞానస్వరూపుడై కొలువుతీరి , అజ్ఞానము అను అంధకారమును రూపుమాపి ,
జ్ఞానజ్యోతులు వెలిగించువాడయ్యెను.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow