రజకునికి సాక్షాత్కరించిన స్వామి అయ్యప్ప - 1*
గతనెలరోజుల నుండియే ఆ ఊరు తిరునాళ్ళ వైభవాలతో కళకళలాడిపోవుచున్నది. ఆ ఊరిలో ఒక పెద్దస్వాములవారు విచ్చేసి లోక కళ్యాణార్ధం ఒక మహోన్నత యజ్ఞాకార్యక్రమమును చేబట్టి సలుపుచున్నారు. కార్లలోను , బస్సులలోను , కాలినడకగాను భక్తులు గుంపులుగుంపులుగా వచ్చి ఆ కార్యక్రమములను సందర్శించి పరవశులై మరలుచున్నారు. ఊరికి మధ్యనున్న ఖాళీస్థలములో భారీ ఎత్తున పందిరివేసి , వేదికను నిర్మించి రంగురంగుల దీపాలతో అలంకరించి యున్నారు. పందిరికి ఇరువైపుల హోమ గుండమును నిర్మించి వేదమంత్రోచ్ఛారణతో హోమము సలువబడుచునే యున్నది.
వేదిక మధ్యమున సుమారు 20 అడుగుల ఎత్తుగల స్వామి అయ్యప్ప వర్ణచిత్రపటము పట్టబంధా కారుడై అమరి సర్వులను ఆకర్షించి అనుగ్రహించురీత్యా అందముగా అమర్చబడియున్నది అందులకు క్రిందిభాగమున పంచలోహములచే చేయబడిన అయ్యప్ప విగ్రహమునకు నెయ్యి , పాలు , తేనె , పెరుగు , పంచామృతము మున్నగు వాటితో అభిషేకములొనర్చి సుగంధభరిత పుష్పములతో అలంకరించి అర్చనాదులు సలిపి రుచికరమైన పిండి వంటలతో పలురకములైన పండ్లతోను నైవేద్యము లొనరింపబడు చుండెను. ఎల్లవేళలా ఆధ్యాత్మిక ఉపన్యాసములు , లయ విన్యాసములతో గూడిన స్వామిఅయ్యప్ప భజనలు అచ్చటికి వచ్చినవారిలో భక్తి పారవశ్యమును కల్గించెననిన మిన్నగాదు. కొందరు పరవశము చెంది ఆనందాశ్రువులతో ఆవేశ పూరిత నృత్యముగూడా చేయసాగిరి. ఈ పూజాకార్యక్రమము బ్రహ్మశ్రీ పరమేశ్వరశర్మగారి ఆధ్వర్యమున క్రమబద్ధంగా నిర్వహించబడు చుండెను. వారు మహాభక్త శిఖామణి సద్గుణశీలురు. సాక్షాత్తు స్వామి అయ్యప్పపట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు నిండినవారు. గ్రంథకర్త. మంచి వక్త.
కీర్తనగానముతో అటుస్వామివారిని , ఇటు భక్తులను అలౌకికానుభూతిలో యుంచి మరోప్రపంచమునకే కొనిపోగలిగిన సమర్ధులు వారు. ఎన్ని పర్యాయములు శబరి యాత్రచేసి యున్నారన్నది వారికే తెలియదు. వారికి దేశమంతట శిష్యులున్నారు.
పేరుకు తగ్గట్టు సాక్షాత్ శ్రీపరమేశ్వర తేజస్సుతో ప్రశోభిల్లు వీరు ఇలాంటి మహాయజ్ఞములను పలురాష్ట్రముల యందు , పలు పర్యాయములు జయప్రదముగా నిర్వహించి , ప్రజలలో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించు మహనీయులు వీరు అని అందరిచేత అనిపించుకున్నవారు. వీరివద్ద తీర్థ ప్రసాదములు పొంది బాధావిముక్తులైన వారెందరో గలరు. వీరి ఉపన్యాసములను విని ఆత్మ స్థైర్యము పొంది జీవితమున సుఖశాంతులు పొందిన వారనేకులు గలరు. ఈ పర్యాయము సలిపే యజ్ఞములో ఎలాగైనను సాక్షాత్తు అయ్యప్ప సాక్షాత్కారము పొందవలెనను పట్టుదలతో ఒకమండలకాలము (41 దినములు) కోటి నామార్చన , హోమాదులు , పూజలు , భజనలు చేయతలపెట్టి ఆ ఊరికి వేంచేసిన వీరికి , వీరి బృందములకు ఆ ఊరి ప్రజలేగాక పొరుగూరి ప్రజలుగూడా తమ తమ శక్తి కొలది సహాయ సహకారములను పరిపూర్ణముగా అందించిరి.
వారితో హోమాది భజన కార్యములందు పాల్గొనుటకు వచ్చియున్న వేదపండితులకు సాధుసన్యాసులకు కావలసిన వాటిని సమకూర్చుటకు పనివాండ్రను నియమించిరి. అలావార్లకు సేవచేయుటకు నియమింపబడినవారిలో యొకడే *చాకలితిప్పడు.* అతనికి కేటాయింపబడిన పని ఏమనగా ప్రతినిత్యము ఉదయముననే అతిథుల నివాసమునకు వెడలి వారి స్నానా నంతరము మురికి బట్టలను కొనిపోయి ఊరి చివరనున్న చెరువులో ఉతికి ఆరవేసి మడిచి ఎవరిది వారివద్ద చేర్చుటయే.
మొదట చేతినిండా పని దొరుకును గదా ! కావలసినంత కల్లు త్రాగవచ్చునను ఉద్దేశ్యముతోనే పై పనికి ఒప్పేసుకున్నాడు. తిప్పడు. కానీ అతనికి పని ఇప్పించిన వ్యక్తి పరమేశ్వర శర్మగారి సమక్షమునందే *"తిప్పా ! వీరు మహామహనీయులు. ఇట్టివారు మన ఊరికి వేంచేసినది మనపూర్వజన్మ సుకృతం. "సాధూనాందర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం" అంటారు పెద్దలు. ఇలాంటి వారి దర్శనమాత్రముననే మనకు పుణ్యార్జనము లభించినచో మరి నీకు వారు ధరించిన దుస్తులను శుభ్రపరచుటచే వార్లను స్పర్శించే భాగ్యము కూడా కల్గియున్నది. కావున మాకన్నా భాగ్యవంతుడ నీవేయని నేను తలంచుచున్నాను , కనుక వీరిసేవ పూర్తయ్యేంత వరకు నీవు కల్లుతాగనని మాట ఇవ్వాలి. చక్కగా పనిచేసి పెద్ద స్వాముల వారివద్ద మంచిపేరు సంపాదించుకొన వలెను అనెను.*
ప్రప్రథమముగా శ్రీశర్మగారిని చూచిన మాత్రమునే వివరించలేని భక్తిపూరిత మర్యాద వారిపై తిప్పనికి ఏర్పడెను. ఆ పరిస్థితిలోనే వారి ఆజ్ఞకు కట్టుబడి యుంటానని మాటయిచ్చి పనిలో ప్రవేశించెను. నాటినుండి తిప్పడు కల్లుపాకకు వెడలడము మాను కొనెను. మొదటి రెండు మూడు దినములు కాస్త కష్టముగా యనిపించినను పనిలో దిగిన దినము నుండి ప్రతినిత్యము యొకసారి శ్రీ పరమేశ్వర శర్మగారిని దర్శించు వేళ అతనిలో దాగియుండిన చపల చిత్తము క్రమ క్రమముగా తొలగి పోయెను. ఈ ముప్పదిరోజులు తిప్పనికి తెల్లవారి మొదలు రాత్రివరకు పని ఒత్తిడితో సరిపోయెను. దృష్టి ఇక దేనివైపున మరల్చక స్వామిసేవ చేయువారికి పనిచేయుటలోనే కాలము వ్యజించినందున కల్లుతాగ వలెను , నిషాలో మునిగితేల వలెనను చెడుతలంపే మరచిపోయి ఇది వేణుస్వామి దుస్తులు , ఇది రాఘవస్వామి దుస్తులు ఇది పెద్దగురువు గారి దుస్తులు యని ఒక్కొక్కటిగా వేరుచేసి తడిపి ఉతికి ఆరవేసి మడతపెట్టి వారి వారి దుస్తులను వారివారికి ఒప్ప జెప్పుటయే కర్తవ్యముగా చేసుకొనుటకు అలవరచుకొనెను తిప్పడు.
నీ కర్తవ్యమును నీవు నిర్వహించుము ఫలితమును నేనొసంగెదను యని చెప్పి యున్న భగవంతుడు తనకర్తవ్యమును చక్కగా నిర్వహించిన తిప్పనికి ఫలితమును యొసంగుటకు నిశ్చయించెను. సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం గదా ! పాపము వీడిన తిప్పనికి దైవసాక్షాత్కారము కలుగక యుండునా ? మరుసటి దినము ఎప్పటివలె తిప్పడు మురికి బట్టలను సేకరించుకొని చెరువుకు బయలుదేరువేళ పెద్ద స్వాముల వారు ఒంటరిగా వేదికను చుట్టి ఆ దినము జరుగబోవు కార్యక్రమము లను పరిశీలించుటగాంచి బట్టలుమూటను క్రిందపడేసి పరుగిడి వెడలి వారికి సాష్టాంగ ప్రణామములిడి వినమృడై చేతులు జోడించి నిలబడెను. అతనిని వాత్సల్యముతో దీవించిన శర్మగారు *'ఏమి ! తిప్ప ! కార్యకర్తల వస్త్రములను శుభ్రముగా ఉతుకు చున్నావా ? అని ప్రశ్నించెను. నా శక్తి వంచనలేక కృషిచేయు చున్నాను స్వామి. అని వినమ్రుడై బదులిచ్చెను. అదేవేళ వేదికపై దివ్యమంగళ స్వరూపముగా కొలువున్న శ్రీశబరినాధుడు తిప్పని పరిశోధింపతలచెను. అందులకు తార్కాణమువలె తిప్పని తదుపరి ప్రశ్నవెలువడెను. స్వామీ ! మీరు మాఊరికి వచ్చి పలుదినములుగా అహర్నిశలు పూజలు చేయుచున్నారే ఎందులకొరకు స్వామి అని అడిగెను.
