రజకునికి సాక్షాత్కరించిన స్వామి అయ్యప్ప - 2*
*"తిప్పా ! అయ్యప్పస్వామి సాక్షాత్కారము పొందుట కొరకై ఈ పూజా భజనలు , దాని వలన శబరిగిరీశుడైన స్వామి అయ్యప్ప సంతసించి లోకు లెల్లరిని చల్లగాచూచును. అందుల కొరకే అందరు గుమిగూడి వారిని పూజించి సాక్షాత్కారము పొందుట కొరకు ప్రయత్నించుచున్నాము"* అనెను. *"ఎవరికైనను అయ్యప్ప సాక్షాత్కారము లభించునా స్వామి ?"* అని తిప్పడడుగగా... *"గాఢమైన భక్తితోను , దృఢమైన విశ్వాసముతోను , అచంచల ఆకాంక్షతోను ఆస్వామిని పూజించే ప్రతియొక్కరికిను స్వామి అయ్యప్ప సాక్షాత్కారము లభించును"* అనెను శ్రీశర్మగారు.
*"అయితే నేను గూడా ప్రయత్నించ వచ్చునా స్వామి ?"* అని వెర్రిగా తిప్పడడిగెను. ఆమాటలు పరమేశ్వర శర్మగారికి ఆగ్రహమును కలిగించెను. మహాశాంతస్వరూపులు , అహంభావరహితులు అని బిరుదొందిన శ్రీ శర్మగారు తిప్పని మాటలకు రెచ్చిపోయెను. వారిలోని స్వస్వరూపము మాటలుగా పరిణమించెను. మనము ఇంతకాలము పలుసాధనములు చేసి , పూజా హోమాదులు సలిపి పలురీత్యా శ్రమించి సాధింపతలచిన మహత్కార్యమును మురికి బట్టలను ఉతికి పొట్టపోసుకునే ఈ రజకుడు సులభంగా సాధించగల్గునా ? ఈతడు కర్తవ్యమును మరచి బాటమారు చున్నాడు. ఇతనికి తగు గుణపాఠము నేర్పాలి అని ఆలోచింపసాగినవుడే స్వామి అయ్యప్ప శ్రీశర్మగారి నాలుకపై అమరి ఇలా పలికించెను. *"తిప్పా ! నీకు అయ్యప్ప సాక్షాత్కారము కావలయునా ? అది యేమి కష్టసాధ్యముకాదులే ! ముక్కుమూసు కొని నీటిలో కూర్చుంటే అయ్యప్ప కనిపించకపోతాడేమి"* అనెను. తిప్పని మనసులో ఆమాటలు గట్టిగా నాటుకుపోయెను. శర్మగారి మాటలను గురువాక్కుగా స్వీకరించి వైరాగ్యచిత్తుడై నీటిలో కూర్చొనుటకు అచటనుండి వెళ్లెను. 'వీరందరికి అయ్యప్ప సాక్షాత్కారము లభ్యమైతే దేశం బాగుపడినట్లేయని తలచిన శర్మగారు తన పూజా కార్యక్రమములను నిర్వహించుటకు ఉపక్రమించెను.
చెరువు గట్టు చేరిన తిప్పడు బట్టలమూటను గట్టుపై పడవేసి గబగబా నీటిలోదిగి ముక్కుమూసుకొని *“అయ్యప్పా ! అయ్యప్పా !"* అని స్మరిస్తూ అమరెను. క్షణాలుదాటి నిమిషాలు గడువసాగెను. శ్వాసవదలకపోతే చనిపోతామన్న తలంపేలేక పెద్దస్వాములగు పరమేశ్వరశర్మగారి వచనములనే గురూపదేశంగా స్వీకరించి నీటిలో అలా కూర్చొండి పోయెను. వైరాగ్యముతో , నిండు విశ్వాసముతో , తన దర్శనార్థం నీటిలో అమరియున్న తిప్పని ఇంకను పరిశోధింప వలదను రీత్యా శ్రీస్వామివారు అతనిముంగిట ప్రత్యక్షమై వాత్సల్యముతో అతని రెట్టను పట్టి పైకిలేపెను. కనుతెరచి చూచిన తిప్పుడు తనముంగిట సర్వాలంకారభూషితుడైన స్వామి అయ్యప్ప నిలబడియుండుటగాంచి మైమరచిపోయెను.
ధగ ధగ మెరిసే నవరత్న ఖచితమైన దివ్యమణిహారము ధరించి , మందహాస వదనుడై నిలచిన అస్వామిని చూచి తనువు మరచి యుండిన తరుణాన *"తిప్పా నన్నుచూడ తలచిన కారణమేమి ?"* యని స్వామి అయ్యప్ప అడిగెను. ఆమాటలతో స్వస్థితికి చేరిన తిప్పడు వారిని మరొక్కసారి సుదీర్ఘముగా పరిశీలించి అనుమానము తీరక *"స్వామి ! స్వామి ! అయ్యప్ప మీరేనా ? అంతలో నాముంగిట సాక్షాత్కరించినారా ? నేను కొద్ది నిమిషాలు కూడా నీటిలో కూర్చొని యుండలేదు ! గురువు గారి మాటలను ఆచరించినచో కొన్ని దినములలోపైనను స్వామి అయ్యప్పను దర్శించవచ్చునని తలచాను. కానీ నేను నీటిలో మునిగి అత్మహత్య చేసుకొన బోవుచున్నానని పొరబాటుగా గ్రహించుకొని నన్ను కాపాడదలచి అయ్యప్ప వేషధారియై మీరు నాముంగిట వచ్చియున్నారేమోయని నేను అనుమానించు చున్నాను అనెను. అందులకు స్వామి అయ్యప్ప “తిప్పా ! నీటిలో శ్వాస వదలక ఎవరివలనను ప్రాణముతో కొన్ని నిమిషములకంటె ఎక్కువ యుండుట అసాధ్యము , గురుమూలాన నన్ను దర్శించు మార్గము ఇదియేనని వినినన్ను చూడగోరు ధృఢవిశ్వాసముతో ప్రాణమును సైతము లెక్కింపక నీటిలో అమరిన నీవు మరణించినచో గురువు లేక ఈశ్వరుని దర్శించుట అసాధ్యమను ప్రమాణవచనము అసత్యమైపోవును. నీ విశ్వాసము సడలి నీవు మరణించినచో..... నీవు దైవమును చూడలేక పోయినచో ఇకముందెవ్వరు ఈశ్వరాన్వేషణకు పాల్పడరు. ఈశ్వరవిశ్వాసము లేనిచో భువిపై భగవదారాధన లేకుండా పోవును. అలా జరిగిన నాడు సజ్జనులు , సాధువులు నలగిపోవుదురు. అలా జరగక అడ్డుపడి భువిలో ధర్మమును శాసించు వాడను గనుకనే నన్ను ధర్మశాస్తాయని అందురు.*
నీ విశ్వాసమును ధృవపరచుటకును , విశ్వాసమే భగవత్ సాక్షాత్కారము అను సత్యమును లోకులకు తెలియజేయుటకును , గురువాక్యమును ప్రమాణ వచనముగా లోకులు ఆచరించుటకొరకే నీవంటివారికి నేనప్పుడప్పుడు దర్శన మొసంగుచుంటాను. *"తిప్పా ! నీ భక్తికి మెచ్చితిని నీకు ఏమి వరము కావలయునో కోరుకొమ్ము"* అనెను. *"వరమా ! అవంతయు నాకెందులకు స్వామి , ఏదో మిమ్ములను దర్శించవలయునని అనిపించినందువలన గురువు గారిని అడిగాను తప్ప నాకేమియు వలదు స్వామి. మీ దర్శనమే నాకు మహాభాగ్యమైనది స్వామి. నాకు అవతల చాలా పనులున్నాయి. అలాగే మీకును చాలా పనులుంటాయి గదా ! ఇక దయచేయండి స్వామి"* యని తిప్పడు తన మురికి బట్టలను విప్పసాగెను *"తిప్పా ! ఇంతవరకు నన్ను దర్శించిన ఎవ్వరిని వట్టి చేతులతో పంపుట నా ఆచారము గాదు. ఏదైనా కోరుకోవయ్యా"* అనెను - మరల మరల స్వామి అయ్యప్ప, ఎంతసేపు శ్రీ స్వామివారు బ్రతిమలాడినను తిప్పడు మాత్రము ససేమిరా యంటూ గబగబా తన పనిని ముగించుకొని బయలుదేరసాగెను. అది గాంచిన స్వామివారు *"తిప్పా"* ఇప్పుడు వలదనినను ఇంకెప్పుడు నీకు ఏమి వరము కావలయున్నను నిస్సంకోచముగా నావద్ద అడుగవచ్చు"* నని చెప్పి అదృశ్యమయ్యెను. గబ గబా తన ఇల్లు చేరుకొనిన తిప్పుడు జరిగిన వృత్తాంత మంతయు యథాతధంగా తన ఇల్లాలితో చెప్పెను. *"మావా ! ఈయేల ఏంటి ఇంత ఖుషీగా వున్నావు. సుక్కేసుకొచ్చావా ! ఏంటి" అని ప్రశ్నించగా... "సింగీ ! నీమీద ఒట్టే. సత్యంగా నేను ఈయాల స్వామి అయ్యప్పను దర్శించినాను. నమ్మనంటావే"* యని దీనంగా ఆవిడను ఎలా నమ్మించాలో తెలియక మారు పలికెను. అతని ఇల్లాలు కాస్త లోకజ్ఞానము కలిగిన మనిషి , తిప్పని మాటలలో ఆమెకు ఏదో కాస్త వాస్తవమున్నట్లు గోచరించగా వానితో ఇలా నిష్ఠూరముగా సంభాషించెను , *“మామా ! నిజంగా నీవు ఎంత స్వార్థ పరుడి వయ్యా. నీవు మాత్రము అయ్యప్పను దర్శించినానని అంటున్నావు. నా పెళ్ళాం ఇంట్లో ఉంది. ఆమెకు గూడా కనిపించు స్వామి... అని అడక్కపోయావా"* యని ప్రశ్నించగా......
*"నీకేం కావాలియని స్వామియే నన్ను పదేపదే అడిగారు. నాకప్పుడు నీ సంగతి అసలు గుర్తుకు రాలేదే పిల్లా. మరల స్వామి నీకు ఎప్పుడు ఏ వరము కావలయునన్నా నిర్మోహమాటముగా అడుగవచ్చునని అన్నారు. ఉండు , ఇపుడే ఆ స్వామిని నీవద్దకు పిలుచుకొని వచ్చెదను"* అనంటూ ఆమె బదులుకొరకై ఎదురు చూడక రివ్వున చెరువువద్దకు పరుగిడి మరల నీటిలో దిగి *"స్వామి అయ్యప్పా నీవు రావాలి"* అంటూ మునుపటి వలె ముక్కు మూసుకొని కూర్చొనెను. కాసేపటికల్లా స్వామి అయ్యప్ప తిప్పని ముంగిట ప్రసన్నమై ఇదివరకు మళ్ళీ హస్తావలంబనమిచ్చి లేపి *'ఏమి కావలయు'నని అడిగెను.*
