రజకునికి సాక్ష్యాత్కరించిన స్వామి అయ్యప్ప - 3*
*"స్వామి ! నేను నిన్ను దర్శించినాను మొర్రోయని ఎంత చెప్పిన నా సింగి నమ్మనంటుంది. నీవు ఒకసారి ఆమెకు గూడా కన్పించి నా మాటను ఋజువు చేయవా"* యని అడిగెను. సర్వమెరింగిన ఆస్వామి వారు ఏమియు తెలియనివారికి మల్లే *"తిప్పా ! సింగెవరు ? నేను ఆమెకు కన్పించడమేమిటి?"* యని అమాయకంగా ప్రశ్నించగా *"స్వామి నీకు సింగి తెలియదుగదా ఆమె నా పెళ్ళాం. చాలా గట్టిది. ఏమి చెప్పినా సాధారణంగా నమ్మదు. నేను ఈయేల మిమ్ములను దర్శించాను గదా ! ఆ మాటలను చెబితే నమ్మనే లేదు. పైగా సుక్కేసుకొచ్చావా ! సూర్యుని చూసొచ్చావా ! తల తిరుగు తుందా ? యని నాతో వేళాకోళనూడుతున్నది. నాకు ఆమెను నమ్మించాలంటే నిన్ను ఆమె వద్దకు పిలుచుకొని వెళ్ళడానికి వేరే మార్గము తోచక మరలా నీటిలో కూర్చొని నిన్ను మరలా పిలిచాను.*
ఓసారి మా ఇంటి దాకా వచ్చి వెళ్ళవా స్వామి" అని అడిగెను. తిప్పని అమాయకపు మాటలను మన్నించిన స్వామివారు తిప్పని ఇంటికి వచ్చుటకు సమ్మతించి అతని వెంట బయలుదేరెను. పోయిన మొగడు ఎలాగైనను స్వామి అయ్యప్పను పిలుచుకొనియే వస్తాడను నమ్మకముతో సింగి క్షణకాలములో ఇల్లలికి , ముగ్గేసి , దీపము వెలిగించి , ఇంట్లోయున్న కాసిని బెల్లము , పెసరపప్పు , బియ్యము వేసి పొంగలి తయారుచేసి , పెరటిలోని అరటాకు కోసుకొచ్చి , నట్టింట పీటవేసి , ముంగిట అరిటాకు పరచి , అందున తాను వండిన తీపి పొంగలిని వడ్డించి స్వామి రాకకొరకు ఎదురుచూడసాగెను. శ్రీస్వామివారు తిప్పనితో సహా ఇంటి ముంగిట రాగానే , గబగబా చెంబుతో నీరు తెచ్చి శ్రీస్వామివారి పాదము కడిగిన సింగి , ఆ జలమును తలపై చల్లుకొని స్వామివారికి స్వాగతము పలికి ఇంటిలోనికి పిలుచుకొనివెడలి , పీటపై స్వామివారిని కూర్చుండ ప్రార్థించెను. స్వామివారు పీటమీద ఆసీనులయ్యెను. ఆశ్చర్యభరితుడై వాటిని గాంచిన తిప్పనికి నోట మాట రాలేదు. పీటపై అమరిన స్వామివారితో పొంగలిని ఎంగిలిచేయమని సింగి ప్రాధేయ పడెను. మందహాస వదనముతో ఆ పొంగలిని ఆరగించుచున్న స్వామివారితో తిప్పడు *"స్వామి ! నీకు అంత ఆకలి యున్నదని తెలిసియుంటే నిన్ను సరాసరి మా పెద్ద స్వాముల వారి యాగశాలకు గొనిపోయివుండే వాడిని గదా ! అచ్చట అచ్చము నేతితో చేసిన చిత్రాన్నము , పొంగలి , దద్యోజనము , రకరకాల పిండివంటలు నీకొరకై ప్రతినిత్యము వడ్డించి యుంచుట చూచియున్నాను.
*అవన్నియు నీకందించక , నెయ్యి , జీడిపప్పు వగైరా లేవియు జతకూడని ఈ పేదవాని ఇంటి పొంగలిని ఇంత తృప్తితో భుజించుచున్నావే ! ఇప్పుడుకూడా మించిపోయినది లేదు. నాతో రా ! నీకవన్నియు తినిపిస్తాను"* అని అనగానే సింగి తిప్పనితో *"మావా ! నీకసలేమి తెలియదనుకో. బువ్వ తినేటప్పుడు ఎవరినైనా మధ్యలో లేపొచ్చునా ? మీరు తినండి స్వామి"* అన్నది. ఆమాటలకు శ్రీస్వామి వారు చిరునవ్వుతో *"సింగి ! తిప్పని మాటలను పట్టించుకోకు , నీవు వెళ్ళమన్నా నేనచటికి వెళ్ళను. ఎందుకంటే వాళ్ళు ఎంతెంతో రుచికరమైన పండ్లు ఫలహారమును నా చిత్ర పటము ముంగిట పరచి , పూజలు భజనలు సలుపుతునే యుంటారు. వారిలో ఏ ఒక్కరికి కూడా నేను వచ్చి వీటిని ఆరగించాలని ఉండదు.
*ప్రతియొక్కరు ఈ పూజ యెప్పు డెప్పుడు ముగియునా ! ఎప్పుడెప్పుడు ఈ పదార్ధములను ఆరగిస్తామా యని కక్కుర్తిపడ్తూనే యుంటారు. పూజచేసే ఆ కాసేపైనా నేను రావాలనే పట్టుదల వారిలో ఏ కాస్త కూడా యుండక పోవడమువలననే నేను అచ్చటికి వెళ్ళడంలేదు"* అన్నారు. *"ఆయన మాటలకేమి స్వామి ! మీరు కడుపునిండా భుజించండి"* అన్నది సింగి. శ్రీస్వామివారు తృప్తిగా భుజించారు. తదుపరి *"తిప్పా ! సింగి ! మీ భక్తికి మెచ్చినాను. మీకు ఏమికావలయునో కోరుకోండి"* అన్నారు. అందులకు తిప్పుడు *"స్వామి ! నిజంగానే మామీద నీకంత అభిమాన ముంటే మాతో వచ్చి ఆ పెద్ద స్వాములవారికి ఒకసారి దర్శనమీయవా"* అని వినమ్రుడై ప్రార్ధించెను. *"తిప్పా వాళ్ళకా యోగ్యత లేదని ఎంత చెప్పినా వినిపించుకోనంటున్నావు. సరే నీ ఇష్ట ప్రకారమే కానీ బయలుదేరు పోదాం"* అని పీట నుంచి లేచి వాళ్ళవెంట యాగశాలవైపు నడక ప్రారంభించినారు శ్రీ స్వామివారు. ముందు నడచిపోతున్న తిప్పుడు సింగితో శ్రీస్వామివారిని గూర్చి గొప్పగా మాట్లాడుతూ గబగబా నడక సాగిస్తుండగా ఒక క్షణం తిప్పని మనసున చిన్న అనుమానము చెలరేగెను. *''సింగీ శ్రీ స్వామివారు మనకోసం పెద్దస్వాములవారి వద్దకు వస్తానని ఒప్పుకున్నారేగాని వారికి ఏమాత్రం ఇందులో ఇష్టంలేదు"* అంటూ అయ్యప్పస్వామి వారు తమవెంట వస్తున్నారా ! లేదా ! అను అనుమానముతో వెనక్కి తిరిగి చూశాడు. స్వామి వారు వెనుక కాన రాలేదు. *"స్వామి ! స్వామి!"యని* ఎంతగట్టిగా కేకపెట్టినను ఫలితము శూన్యం. వారిరువురు నిలబడియున్నది ప్రతి నిత్యము తిప్పడు గుడ్డలు ఉతికే చెఱువు గట్టు. వెంటనే తిప్పడికి ఒక ఆలోచన తట్టినది.
మునుపటివలె నీటిలో ముక్కు మూసుకొని కూర్చుందామని నీటిలో దిగాడు. అప్పుడు *"తిప్పా ! ఎవరైనా నీటిలో ముక్కు మూసుకొని కాసేపు కూర్చుంటే చనిపోతారు"* అన్న శ్రీస్వామివారి నచనములు గుర్తుకు వచ్చి నిమగ్నుడై కాసేపు కూడా నీటిలో కూర్చోనివ్వక ప్రాణభీతి అడ్డుపడింది. ఎంత ప్రయత్నించినను శ్రీస్వామివారు మాత్రం వార్లకు తదుపరి కనిపించకనే పోయిరి. ఏమిచేయాలో తోచక ఆ చెఱువును పలుమార్లు ప్రదక్షిణము చేయసాగిరి. అప్పుడు ఒక ఆకాశవాణి వార్లకు వినిపించినది. *"తిప్పా ! నీవు నిస్వార్థముగా నన్ను చూడాలను తపనతో మొదటిసారిగా నీటిలో కూర్చున్నప్పుడు నేను వెంటనే నీకు కన్పించాను. తదుపరి నీవు అమాయకంగా నీ భార్య కోరికమేరకు నీ ప్రాణాలు సైతం లెక్కపెట్టక నీటిలో మరల కూర్చున్నప్పుడు నీకు కన్పించి , నీవెంట మీ ఇంటికి వచ్చాను. అప్పుడు నేను నీవెంట వస్తున్నానా లేదా యను అనుమానమే. నీకు కలుగలేదు. వస్తాననే గట్టి నమ్మకంతో ముందుకు నడిచావు. కావున నీవెనుకనే నేనున్నాను. తదుపరి యజ్ఞశాలకు నీవు పిలిచి నపుడు రాకూడదనుకున్నాను.
కాని నీ కోర్కెను మన్నించి నీకోసం నీ వెంట బయలు దేరాను కాని నేను రానేమో నను అను మానమనే పెనుభూతం నీ మనస్సును ఆవహించి నప్పుడే నేను నీనుండి దూర మయ్యాను. తదుపరి గూడా నీవు ప్రాణమును లెక్కింపక నీటిలో కూర్చొని యుంటే నేను వచ్చియుంటా నేమో , కానీ నీవు అట్టి సాహసము చేయుటకు శంకించినపుడు నీనుంచి నేను సుదూరానికి వెళ్ళిపోయాను. కావున *ఎవ్వరైనను సరే నన్ను సాక్షాత్కారము చేసుకొనవలయు నంటే సర్వసంఘ పరిత్యాగులై , నిస్సందేహులై యుండాలి. ఇదియే భగవత్ సాక్షాత్కార తత్వము. నీవు , సింగి , పరమేశ్వర శర్మ అందరు నా అనుగ్రహ పాత్రులే. మీరు చిరకాలము ఇష్ట కామ్యార్ధ సిద్ధులై జీవించి , చివర నా సాన్నిధ్యం చేరుకోగలరు. "శుభం భూయాత్"* యని స్వస్తివాక్యము పలికెను ఆకాశవాణి.
