అయ్యప్ప సర్వస్వం - 112 | ర్మ వ్యాధిని కూడా తీర్చగల స్వామి శరణ మంత్రం - 1 | Ayyappa Sarvaswam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

అయ్యప్ప సర్వస్వం - 112 | ర్మ వ్యాధిని కూడా తీర్చగల స్వామి శరణ మంత్రం - 1 | Ayyappa Sarvaswam

P Madhav Kumar
కర్మ వ్యాధిని కూడా తీర్చగల స్వామి శరణ మంత్రం - 1*


కేశవుడు నివసించే గ్రామమునకు కృష్ణశర్మ వేంచేసి యున్నారు. కృష్ణశర్మ పరమ భక్తులు. వారు శ్రీస్వామి అయ్యప్పమీద అపారమైన భక్తిపూని గత నలభై సంవత్సరములుపైగా శబరి యాత్రజేసి శ్రీ స్వామివారిని కాంతమల శిఖరాగ్రముపై నుండి దివ్యమంగళ జ్యోతిగా దర్శించ గల్గిన వారు. సంవత్సరమున అన్ని దినములు శ్రీ ఆ స్వామి అయ్యప్పను పూజించి లోక క్షేమములు కోరి ప్రార్ధనలు చేసే ఉత్తమోత్తములువారు. వారు అయ్యప్ప స్వామి విగ్రహముతో దేశసంచారము చేస్తూ ఒక్కొక్క ఊరులోను కొన్ని దినములు బసచేసి పూజలు , భజనలు , ఉపన్యాసములు నిర్వహిస్తూ అయ్యప్ప సేవయూ భక్తి ప్రచారము చేయు మహనీయులు.


సద్వర్తన పరాయుణుడైన వారి పూజలో పాల్గొని వారి పుణ్యహస్తములతో విబూది ప్రసాదములను స్వీకరించుటకు , లెక్కించుటకును , లెక్కింపలేని భక్తులు వారిని సమీపించెదరు. నిస్వార్థమైన వారి పూజకు సంతసించిన అయ్యప్ప భగవానుడు ప్రతిరోజువారికి ఏకాంతములో దర్శనమొసంగి సంభాషించుతారని గూడా అనుకొందురు. *అవును ! నిస్వార్థ వాదియగు ఉత్తమమైన మానవుని హృదయం భగవన్నిలయముగదా !* అటువంటి యొకడు ఈ భువిలోని వారి యోగక్షేమములు కోరి ప్రార్థనచేసినచో ఆ ప్రార్థనను మన్నించి , అతని కోరికను తీర్చుటకు సర్వవేళలా సిద్దముగానే యుంటాడను సత్యమును పలు పురాణ గాధలచే గ్రహించియున్న కొందరు , ఆ మాట నిజమే కాబోలు ! కృష్ణశర్మ అనేకుల కొరకు పలు సందర్భములలో స్వామి అయ్యప్పతో సంభాషించి , వారు చెప్పిన సమాధానమును తెలిపి యున్నారనియు , అయ్యప్ప వాక్యములుగా వారు చెప్పినట్లే అన్నియు జరిగి యున్నందువలన , వారు నిజముగానే అయ్యప్పతో సంభాషించి , శ్రీ స్వామివారు పలికే సమాధానమునే భక్తులకు తెలుపుతున్నారనియు విశ్వసించిరి. ఔను ! విశ్వాసమునందే గదా భగవంతుడు దాగి యున్నాడు. అంతటి ప్రఖ్యాతి గాంచిన మహనీయుడు. కేశవుడు నివసించే గ్రామమునకు వేంచేసి యున్నారు. కృష్ణశర్మ గారి పూజను చూసి ఆనందించిన కేశవుడు వారి భజనలో పారవశ్యముచెంది , భక్తితో వారి పాదములమీదబడి , కన్నీరు గార్చి *"స్వామి తమరు స్వామి అయ్యప్పతో ముఖాముఖి సంభాషించగల భాగ్యశాలి యని అన్నారే ? నా పై యదయుంచి నాకున్న తీరని ఉదరం వేదనకు (కడుపు నొప్పి) కారణమేమని , స్వామి వారినడిగి చెప్పగలరా ? నేను గత పలుసంవత్సరములుగా భరించలేని కడుపునొప్పితో బాధపడుచున్నాను.*


అందులకు పరిహారముగోరి నేను ఆశ్రయించిన వైద్యులనేకులు , స్వీకరించిన ఔషధములో పలురకములు. ఐనను బాధ దినదినాభివృద్ధి చెందినదేగాని కాసింత గూడ తగ్గలేదు. నేను తృప్తిగా కడుపు భోజనము చేసి పలు సంవత్సరములైనది. ఇక నిద్రను గురించి ప్రత్యేకించి చెప్పనవసరము లేదు. పరిశోధించిన వైద్య నిపుణులందరు శరీరములో ఎట్టి వ్యాధియు కనబడలేదనియే చెప్పుచున్నారు.


*ఇక దేవుడే దిక్కను స్థితిలో పలుపుణ్య క్షేత్రములను దర్శించి వచ్చినాను. ఇంకను నా ఉదరవేదన తీరలేదు. కనుకనే మీ ద్వారా నా తీరని కడుపునొప్పికి కారణమేమని శ్రీస్వామివారి నడిగి తెలుసుకొందామని తలచాను"* అని మిక్కిలి వినయముతో అడిగెను. అతని దీనస్థితిని గ్రహించిన కృష్ణశర్మ అతనిపై జాలిపడి పలు రీత్యా ఓదార్చి , అతను కోరినట్లే అయ్యప్ప స్వామినడిగి తెలుసు కొంటాననియు చెప్పి కేశవుని మరుసటి దినము రమ్మనమనెను. ఎప్పటివలె ఆ దినము శ్రీశర్మగారి పూజాంత్యమున ఏకాంతములో స్వామి అయ్యప్ప ప్రత్యక్షమవ్వగానే శ్రీ స్వామివారివద్ద *"తండ్రీ ! అయ్యప్పా కేశవునియొక్క వైద్యుల కందని ఊదర రోగమును , అందులకున్న కారణమును మీరెరుంగనిదా ? అతనికోర్కె గూడా న్యాయమైనదే గదా ! స్వామీ ! నాపై దయయుంచి అతనిరోగమునకు కారణమేమని తెలుపవలయును"* అని అడిగెను. అందులకు స్వామి అయ్యప్పవారు మందహాసముతో *"హే కృష్ణశర్మ ! కేశవుని యొక్క ఈ ఉదర రోగమునకు కారణము అతని కర్మఫలమగును. అతడు పూర్వము చేసినట్టి దుష్కర్మ ఫలితము ఉదరవేదనగా రూపొంది పీడించుచున్నది. ఇది ఏడు జన్మలకు అనుభవించి తీరవలసినదే యగును. కర్మవ్యాధిని తొలగించుట ఎవరి తరము ?"* అని మారుపలికెను. మరుసటి దినము తనవద్దకు వచ్చిన కేశవునితో


*"కృష్ణశర్మ అతని కర్మవ్యాధి , అది అతని పూర్వజన్మ దుష్కర్మఫలితము వలన వాటిల్లినదనియు , అది అనుభవించి తీరవలసినదేనని"* అక్షరము గూడా పొల్లుపోకుండా శ్రీస్వామివారు పలికిన విధముగనే తెలిపెను. కేశవుడు గూడా తనకర్మ వ్యాధికి మిక్కిలి దుఃఖించి ఇంకను మూడు జన్మలకు ఇలాగే కడుపునొప్పితో బాధపడి తీరవలసినదే యను నిర్ణయముతో తీరని వ్యాధియని తెలిసిన పిమ్మట గూడ వైద్యుల ఖర్చులు ఎందుకు ? వృథాయని మందు మాత్రలేమియు స్వీకరించక కడుపునొప్పితోనే రోజులు గడుపు చుండెను. ఆ దినములలో నారాయణియమ్మయను వృద్ధురాలైన స్త్రీ యొకరు యుండేటివారు. వారు స్వామి అయ్యప్ప నామములను గానములుగా చేసి పాడి పరవశించే భక్తులలో ముఖ్యులైన వారు. వారి అయ్యప్ప గానముల యందును , నామజపసంకీర్తనముల యందును పరవశించిన భక్తులు అనేకులు కలరు. చిన్నవయసులోనే భర్తను పోగొట్టుకొని , సంతానము కూడలేని ఏకాకియైనవారు. అప్పటి నుండియే భగవద్భక్తిగల వారు. శ్రీ కృష్ణశర్మవారి పూజా భజనలచే స్వామి అయ్యప్ప పట్ల ఆకర్షింపబడ్డవారు.


శ్రీ శర్మవారి కథాకాలక్షేప ఉపన్యాసములను వినిన పిమ్మట ఎలాగైనను శబరిమలయాత్ర జేసి , ఒక్కసారియైనను శ్రీస్వామి అయ్యప్ప వారిని కనులారా చూడవలెనను అభిలాషతో శ్రీ శర్మవారిని సమీపించి తన తనకోర్కెను తెలిపెను. కానీ శబరీశుని కొండకు యౌవ్వనవయస్సులోనున్న స్త్రీలైనవారు యాత్ర గావించుటకు ఇప్పుడే సాహసించరాదనియు , మాలాధారులైన స్వామి భక్తులయందే ప్రత్యక్ష అయ్యప్పను దర్శించి తరించేవారు. వారి సేవలోనే శబరినాధుని మనసారా ధ్యానించి , మనశ్శాంతి పొందుటయే ప్రస్తుతము వారికి శ్రేయస్కరమనియు , పిదప తగిన తరుణమువరకు వేచియుండి (అనగా స్త్రీల ఋతు చక్రము అగునంతవరకు వేచియుండి) మాల ధరించి యాత్రగావించుటయే ఉత్తమము అని శర్మగారి ఉపదేశములను గ్రహించి , ఆచరించి తన 50వ సం॥ వరకు వేచియుండి తదుపరి మాలధరించి గత 10సం॥గా శబరియాత్ర జేసి అయ్యప్ప సేవచేయుచున్న సద్గుణవతియైన మాతృ శిరోమణివారు.


*"నామ సంకీర్తనాత్ ముక్తిః"* అను అప్తవాక్యమును మార్గదర్శిగా గైకొని కీర్తన భక్తియే భగవంతుని మెప్పింపగల మహాశక్తి అను దృష్ట్యా స్వామి శరణు నామజప పారాయణమే అందులకు మార్గదర్శి అని ధృఢంగా విశ్వసించేవారు. తన్మూలన కలిగిన భక్తి ప్రపత్తులతో పలుకీర్తనలను , సాహిత్యముచేసి , వాటిని ఊరు ఊరున వెడలి , పాడి , పరవశముచెంది , శ్రవణించేవార్లను ఆనందసాగరములో ముంచివేయుదురు నారాయణియమ్మగారు. మహాభక్తురాలైన నారాయణియమ్మ గారిని గూర్చివిని యుండిన కొందరు పెద్దలు కేశవునితో ఆమెను దర్శించి రమ్మని ఆదేశించిరి. సాక్షాత్ స్వామి అయ్యప్ప మూలముగానే ఇది కర్మవ్యాధి , అనుభవించి తీరవలసిన దేనని తెలుసుకొనియుండిన కేశవుడు , అందులకు పిమ్మట కడుపునొప్పి యని వైద్యుల వద్దకు వెడలుట వదలెను. కాని నొప్పిమాత్రము బాధ పెట్టుచునే యుండెను.


ఇక అన్యమార్గము లేదనురీత్యా మనస్సు దానిని భరించు శక్తిని పొందినది. ఐనను మహాత్ములను దర్శించుట క్షేమదాయకం అను అప్తవాక్యమును గుర్తించిన కేశవుడు నారాయణి అమ్మగారిని దర్శించుటకు వెడలెను. వృద్ధురాలైనను , తేజోమయమైన ముఖ కాంతితో భజనలు చేయుచున్న నారాయణి అమ్మ గారి సంకీర్తనలో భగవత్ సాక్షాత్కారమును దర్శించిన కేశవుడు భక్తి పారవశ్యము , కన్నతల్లివలె కన్పించిన ఆవిడకాళ్ళమీద సాష్టాంగపడి కన్నీరుకార్చి , తన ఉదరవేదనను , కృష్ణశర్మ మూలాన తాను తెలుసుకొన్న సత్యమును విన్నవించుకొనెనను.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow