కర్మ వ్యాధిని కూడా తీర్చగల స్వామి శరణ మంత్రం - 3*
ఆ అమ్మగారి మాటలనే వేదవాక్యములుగా తలచిన కేశవుడు , ఆ సంవత్సరమే మాలధరించి క్రమముగా వ్రతముండి ఇరుముడితో శబరిగిరి చేరెను. మరుసటి దినము చీకటి తొలగకముందే లేచి భస్మకుళములో స్నానమాడి విభూతి , చందన , కుంకుమలు ధరించి తనగురునాధునికి సాష్టాంగ ప్రణామములిడి , వారి ఆశీర్వచనము తో కలియుగ ప్రత్యక్షదైవమగు శబరినాధుని దివ్యసన్నిధి జేరుకొనెను. ముఖద్వారము ముంగిట , ధ్వజస్తంభము నకు సమీపముగా నిలబడి , భక్తి పారవశ్యముతో *"స్వామియే శరణం - అయ్యప్పా శరణం"* యని పట్టు విడువక దీనార్థితో పిలిచే తన పిలుపు స్వామి అయ్యప్పవారిచెవిలోపడి , తన వ్యాధి తొలగవలయు నను తపనతో , కంఠమును ఉచ్ఛస్థాయిలో శరణఘోషములు శరవేగముతో ఉచ్ఛరించుటకు ప్రారంభించెను. సమయము గడిచేకొలది అతని స్వరము ఉచ్ఛస్థాయిని ఆక్రమించెను. చుట్టూ గుమిగూడి కాసేపు వేడుకచూసి నిలబడి యుండిన వారుగూడా కాసేపు చూసాక విసుగుచెంది తమదారిన వెడలిపోయిరి. మరి కొంతమంది అనుభవస్థులైన పళమస్వాములు *"స్వామీ ! ఈభక్తుని కోర్కెను నెరవేర్చుము"* అని స్వామివారితో ప్రార్థిస్తూ ఆ స్థలము వీడిపోయిరి. కాని కేశవుడు మాత్రము పరిసర ప్రాంతము మరచి కనులు మూసుకొని శరణాలు పలుకుటయే కర్తవ్యమై అలుపు , సొలుపు లేక శరణనామములను ఉచ్చరించుచునే యుండెను.
సమయము గడిచెను. తెల్లవారై , పగలై , మధ్యాహ్నమై , సాయంత్రమై , రాత్రియు వచ్చెను. కేశవుని వద్దనుండి వెలువడుచున్న శరణ నామజపములు మాత్రము ఆగలేదు. పాపం తెల్లవారుజాము మొదలు జలపానీయము కూడా లేక వైరాగ్య చిత్తముతో శరణములను ఘోషించుచునే యున్నందువలన నీరసించిపోయిన అతని శరీరము , శబ్ధమును తక్కువస్థాయిలో వెలుబుచ్చు చుండెను. ఈ స్థితిలో కేశవుడు మూర్చిల్లి నేలవ్రాలెను. అప్పుడు రుద్రాక్షమాలా ధారియై , సర్వాంగ భస్మలేపనములతో జటామకుట ధారియై , కారుణ్య వీక్షణములతో , సాక్షాత్ శివతేజోమయము తొణికిసలాడు చున్న యొక వృద్ధుడు , కేశవుని తట్టిలేపి... *"ఏమయ్యా ! కేశవస్వామి ! లే. నీకు తీరని కడుపునొప్పి ఉన్నది అంటనే ఇదిగో ! ఇది శ్రీ అయ్యప్ప స్వామి వారిని అభిషేకించిన నెయ్యి ప్రసాదము "సర్వరోగనివారిణి"* యైన ఈ దివ్యౌషధముచే తొలగిపోని కర్మవ్యాధులు గూడా కలవా ? ఇదిగో నోరుతెరువు. ఇది శబరిమల భస్మము. దీనికన్న మిన్నయగు చూర్ణమింకోటి లేదు" యని కేశవుని ఉదరము చుట్టూ నెయ్యిని రాసి , నోటినిండా గుమగుమలాడే విబూదివేసి భుజింప మనెను. ఇవన్నియూ కలయా ! నిజమా ! అని వూహించుకోకముందే ఉలికి పడి నిలబడిన కేశవుడు చుట్టుప్రక్కలా పరిశీలించెను. తనయెదుట ఆ వృద్ధుడు కనబడలేదు. తాను తప్ప మిగిలన స్వాములందరు సన్నిధానము చుట్టూ పరుండి , నడచివచ్చిన అలసటలో గాఢ నిద్రావస్థలో యున్నారు. సరే ! కలేయని అనుకొందామనుకొంటే బొజ్జకడుపునుంచి నెయ్యికారు చుండెను. నోరు విబూది వాసనతో గుమగుమలాడుచుండెను.
కాని వీటిని ప్రసాదించిన ఆ వృద్ధుడు మాత్రము కనిపించలేదు. మరిచి పోలేని కాంతివంతమైన ఆ ముఖమును తలంచుచు , పరుండి నిద్రబోవుచుండు వారందరిని క్షుణ్ణముగా పరిశీలింప సాగెను. ఆలయమును పలుమార్లు ప్రదక్షిణము చేసినదియే ఫలితమాయెను తప్ప ఆ వృద్ధుడు మాత్రము కంట పడనేలేదు. అంతవరకు తనను వేధించుచుండిన కడుపునొప్పి ఒక్కసారిగా తుడిచి వేసినట్లు అనిపించినది. కేశవుడు మిక్కిలి పరవశముచెందిన స్థితిలో తన విరినిచేరుకొని తన గురుస్వామికి నమస్కరించి జరిగినదంతయు వారికి విన్నవించెను. అప్పుడే ఏకాంతసేవ ముగిసి లభ్యమైన ప్రసాదమగు అరవణ పాయసమును అందరికి పంచిపెడుతున్న అతని గురునాధుడు ప్రేమతోను , వాత్సల్యముతోను కేశవుని తనవద్దకు చేర్చుకొని , ఆ ప్రసాదమును అతనికిచ్చి భుజింపమనెను. *“కేశవా ! నీ మొరను ఆ ఆస్వామి ఆలకించి నట్లేయున్నది. ఐతే నీ కడుపు నొప్పిగూడ తొలగిపోయి వుండవలెను. ఎలాగున్నది ఇప్పుడు" అని అడిగెను. అందులకు కేశవుడు గురునాధా ! ఇప్పుడునాకు కించిత్ గూడా కడుపులో నొప్పిలేదు"* అనెను. కేశవా ! నీవు మహాభాగ్యవంతుడవు. నీ మాటలను బట్టిచూస్తే నీ వద్దకు వచ్చినది మరెవరోకాదు. సాక్షాత్ శ్రీ అయ్యప్పస్వామివారే. నేటితో నీ కడుపునొప్పి అనబడు కర్మవ్యాధి తీరినది.
అహా ! ఏమిటి ! ఈ అయ్యప్పస్వామి మహిమ. ఏమని వర్ణించను అని *"స్వామియే శరణం అయ్యప్పా"* అనెను కేశవుని గురునాధుడు. అప్పటినుండి కేశవునికి కడుపునొప్పి రానేలేదు. రోజులు ఆనందముగా గడిచినవి. వదలక భక్తి శ్రద్ధలతో కేశవుడు శబరియాత్ర వెడలి వచ్చుచునే యున్నాడు. ఆ స్థితిలో కేశవుని గ్రామమునకు మరల కృష్ణశర్మగారు విచ్చేసినారు. కేశవుడు పరుగిడి వెళ్ళి వారి పాదములకు సాష్టాంగ నమస్కారముచేసి , తానెవరని వారికి గుర్తుచేసి , నారాయణి అమ్మగారి ఉపదేశము వలన , స్వామి శరణ నామమహిమచే స్వామి అయ్యప్ప అనుగ్రహము పొంది. తనకర్మవ్యాధి తొలిగిన విధానమును తెలిపి తనను ఆశీర్వదింప గోరెను. కృష్ణశర్మ అతనిని ఆయురారోగ్యములతో పలుకాలముల బాటు చల్లగా జీవించమని మనస్పూర్తిగా ఆశీర్వదించి పంపెను. ఆ దినము కృష్ణశర్మగారి మనసు పూజలో నిమగ్నము కాలేక పోయినది. నారాయణీయమ్మ ఎవరోకాదు. తన శిష్యురాలే. ఆవిడ గారి భక్తి పారవశ్యము నిండిన స్వామి భజనలు తనను ఆకర్షించియున్నది. శ్రీ శర్మగారే నారాయణి అమ్మను గూర్చి పలు పర్యాయములు ప్రశంసించియున్నారు. కానీ కేశవుని విషయమునందు అయ్యప్ప స్వామి చెప్పిన దాన్ని ఆక్షరము వదలక తెలిపినారు. అలా యుండగా , ఇంకను మూడు జన్మలు అనుభవించియే తీరవలసిన కర్మవ్యాధి , నారాయణి అమ్మగారి ఉపదేశానుసారము నడచు కొన్నందువలన ఈ జన్మయందే నివారణమైనదను చున్నాడే ! అలాగైనచో అయ్యప్ప స్వామి వారిమాటగా తాను తెలిపినది అసత్య వచనమైపోయినది గదా ! అయ్యప్పా ! నన్ను అసత్యవాదిగా చేసితివే.
నేను ఏమి అపచారము చేసితిని అని పలురీత్యా దుఃఖించి ఒక విధముగా పూజను ముగించి ఏకాంతములో శ్రీ స్వామి వారిని దర్శించి *"స్వామీ ! అయ్యప్పా ! నా పూజలో ఏదైనా అపచారము వాటిల్లి తన్మూలాన తమకు ఆగ్రహం కలిగినదా ? అందువలననే నన్ను అసత్యవాది గావించితిరో ? ఇలా మీ మాటగా పలికిన నా మాట అసత్య వచనమైనందులకు నేను తమపట్ల చేసిన అపచారమేమిటో తెలుసుకోవాలని వుంది"* అని కన్నీటితో స్వామివారి పాదములు పైబడి పలు రీత్యా ప్రాధేయ పడెను. అందులకు శ్రీ స్వామివారు విచారము చెందక లెమ్ము. ఇందులో మీ అపరాధమంటూ ఏమియూ లేదు కనుక మీరు ఏ మాత్రము బాధపడవలదు." అనగా అందులకు కృష్ణశర్మ *"అయ్యప్పా నీవు కేశవుని యొక్క వ్యాధి , కర్మవ్యాధి యనియూ , ఇంకను మూడు జన్మలు అనుభవించితేనే తీరుననియూ తమయొక్క మాటనే నేను అతనివద్ద తెలిపినాను అది ఇప్పుడు అసత్యమైనదే ! ఇకనేనేమి చెప్పినను అబద్దమని లోకులందురే. ఇక నేనేమి చేసెదను"* అని దుఃఖించెను. *"శర్మా ! కలతచెందకు. నీ యొక్క కల్మషరహితమైన పూజాది కాలచే ఆనంద పరవశము చెందియున్న నేను , మిమ్ములను అసత్యవాదిని గావించెదనా. బాగా ఆలోచించి చూడుము.*
ఆ దినము నీవు నావద్ద , కేశవునియొక్క ఉదరవేదనకు కారణమేమని మాత్రమే అడిగినందు వలన , మేమును కారణము మాత్రము తెలిపితిమి. కాని నీ శిష్యురాలు - నా భక్తురాలు అయిన నారాయణియైనచో ఆ రోగమును తీర్చే ఔషధముగా నాయొక్క *"స్వామి శరణం"* నామ జపమునుగదా యొసంగెను. కేశవుడు గూడ దానినే పరిపూర్ణ విశ్వాసముతో స్వీకరించెను. ఫలితము పొందెను. మూడు జన్మలకు అనుభవించ వలసిన కర్మవ్యాధిని నిరోధించడానికి అతడు పలికిన ఉదయాస్త మాన శరణఘోష సరిపోయినది. తన్మూలాన అతని కర్మవ్యాధి ఈ జన్మలోనే తొలగిపోయినది. ఒక భక్తుని విశ్వాసమును కాపాడుటకును , స్వామిశరణ నామజపము యొక్క మహిమను లోకులెరుంగుటకు మేమే కేశవుని కర్మవ్యాధిని తొలగించినాము. ఇందులో మీ అపరాధమేమియులేదు. మీరు , నారాయణి ఇద్దరును నా ప్రేమ పాత్రులే" అని చెప్పి అదృశ్యమయ్యెను. చంచలము తొలగిన కృష్ణశర్మ ఆదినమునుండి స్వామి శరణ నామజపమును ఆధారముగా గైకొని పారాయణము చేసి సద్గతి పొందెను.
