శ్రీ మహాశాస్తా చరితము - 122 | శ్రీ మహాశాస్తా ఉపాసన | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 122 | శ్రీ మహాశాస్తా ఉపాసన | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

*శ్రీ మహాశాస్తా ఉపాసన*

మన సనాతన ధర్మమునకు వేదశాస్త్రములే జీవనాడి. నిర్గుణ పరబ్రహ్మమును నిరూపించుటకై మనకు దారి చూపునవి ఇవియే. కాని మనంతట మనము ఆ స్థితిని చేరుకొనుట సాధ్యము కానిది.
నిర్గుణ స్వరూపమును సగుణముగా ఉపాసనచేసి , భక్తి మార్గము ద్వారా ఉన్నతగతిని చేరుకొనుటకు
ఈ శాస్త్రములు మనకు తోడ్పడును. ప్రేమ , ఆరాధనలకు పునాది అయిన భక్తి మార్గమును
ప్రాతిపదికగా చేసికొని ఆచరించునదియే ఉపాసనా మార్గము.

భక్తి మార్గమున లయించి , ముక్తి ఫధమును చేరుటకు భక్తి , జ్ఞాన , కర్మ మార్గములను మూడు , విధములైన మార్గములను మన హింధూశాస్త్రములు మనకు బోధించుచున్నవి.

*సర్వ - వర్ణాశ్రమ ధర్మేణ తససా హరితోషణాత్*
*సాధనం ప్రభవేత్ పుంసాం వైరాగ్యాది చతుష్టయం*

దేవుని వాక్యము ప్రకారం , మానవుడు తనకై నిర్దేశించబడిన బాధ్యతలను సక్రమముగా
నిర్వర్తించి , దానిని మరల ఆ భగవంతునికే అర్పించుట కూడా భక్తిలో ఒక రకమే. అతడి నామమును స్మరించుచూ , మంచి చెడులను అతడికే అర్పించుటయే ఉన్నతమైన ఉపాసనా
మార్గము.

*మనకై నిర్దేశింపబడిన కర్మను అనుష్టానము చేయుచూ , తద్వారా ఈశ్వరపూజ చేసినట్లుగా భావించుకొనటయే ఉత్తమము”* అంటారు శంకర్ భగవత్పాదులు.

కానీ కలియుగమున మాయకమ్ముకొనబడి అల్లాడు మానవులకు ఇది అసాధ్యము కావున ,
తత్వవేదుడైన స్వామియే పూనుకొని , ఆరాధన , భక్తి అను ముడులతో భక్తునికి , భగవంతునికి
అనుసంధానము అగునట్లుగా పెనవేసిన భక్తి అను ఉపాసనా మార్గమును మనకు సూచించినాడు.

భక్తి అనునదియూ , ఉపాసన అనునదియూ వేరు వేరు కాదు. భక్తి పారవశ్యమున ఆనంద
అశ్రువులను జాలువార్చుచూ భగవంతుని ప్రార్థించి స్తుతించుటయూ ,
జ్ఞానవంతులై మంత్ర జపముతో అతడిని మనస్సున నిలిపి ధ్యానించుటయూ , పూజలు , ఆరాధనలు , వ్రతములు అంటూ
పూజించుటయూ ఉపాసనలోని ఒక భాగమే.

ఇష్టదైవము అను పేరున తన యొక్క మూర్తి స్వరూపమును భక్తుడు తన మనస్సున
నిలుపుకొనుటకై , పరబ్రహ్మ స్వరూపుడైన భగవంతుడు నిర్దిష్ట స్వరూపమును , రూపమును సంతరించుకొనుచుండును. ఒక ప్రత్యేక పద్ధతి ప్రకారము తనను ఉపాసించు భక్తులకు , వారు కోరిన స్వరూపములతో వారి ముందు సాక్షాత్కరించి వారిని అనుగ్రహించుచుండెను. వారితో ప్రత్యక్ష
సంభాషణనలను జరుపుచూ , వినోదములను సలుపుచూ , ఆనందించుచుండును. సకల జనులూ అటువంటి బ్రహ్మానందము పొందుటకుగానూ మంత్రము , తంత్రము , జపము అను మార్గములను
పెద్దలు మనకు సూచించినారు.

*'మం'* అనగా మనస్సు. *'త్ర'* అనగా కాపాడునది. మంత్రము అనునది మనస్సును కాపాడునది.
సదా సర్వకాలమూ మనస్సునందు లయించి , మనలను ఉన్నతులను చేయునదియే మంత్రము.

మనస్సు నందుండు మంత్రములను , బాహ్యమునకై ప్రకాశింపజేయునవియే మంత్రములు. ఒకే
మూర్తి యొక్క ఉపాసనలోని భగాములే ఈ మంత్ర , యంత్రములనునవి. వీటిని తెలియజేయువాడు
గురువు. సాక్షాత్తూదైవ స్వరూపుడైన గురువు మనకు మార్గము చూపనిదే భగవంతుని చేరుట అసాధ్యం. రోగి యొక్క రోగము ననురించి వైద్యుడు చేయు వైద్యవిధానము మారునట్లే , పూర్వజన్మ
యొక్క పాపపుణ్యములను అనుసరించి ఒక్కొక్క మానవునకూ , ఒక్కొక్క విధముగా వైద్య విధానమును
సూచించువాడు గురువే. మనకై మనము స్వయముగా ఆచరించు వైద్యము ప్రమాధభరితమే కదా.

*శాస్త్రస్యగురువాక్యస్య సత్య బుద్ధ్యావతారణా*
*శాస్త్రత్తా గదితా సతభిర్యయా వస్తూ పలభ్యతే.*

శాస్త్రము , గురు వాక్యము రెండూ సత్యమేననియూ , బుద్ధితో తీర్మానించుటయే శ్రద్ధ అనియూ
సంతుజనులు ఉపదేశించిరి.

ఈ శ్రద్ధ అనుదానితోనే భగవంతుని చేరుట సాధ్యపడునని శంకరాచార్యుల భావము.

*గురువు అనుగ్రహము లేనిదే శివుని అనుగ్రహము లేదు*

ఈ నిజమును గుర్తించక , పుస్తక పాండిత్యముతోనూ , ఇతరులు చెప్పిన ధ్యానములతోనూ
మనకై మనమే స్వయముగా మంత్రములను , తంత్రములను ఆచరించుటవలన మంచి ఫలితములు కలుగజాలవు. గురువు యొక్క ఉపదేశానుసారము , మన శక్త్యానుసారము స్తోత్రముల మూలముగానూ ,
పూజా విధానముల ద్వారానూ భగవంతుని చేరుటయే ఉన్నతమైన మార్గము. అక్షరజ్ఞానము లేనివారు సైతము ముక్తి పొందుటకై స్తుతులు , స్తోత్రములు , శ్లోకములు మున్నగువాటిని మహర్షులు , పెద్దలు
కొన్నిటిని మనకు తెలిపిరి.

భక్తికి ముఖ్యమైన అర్హత మనస్సున నందు ఆరాధనయే. భగవంతునికి కావలసినిది కూడా అటువంటి ఆరాధనయే. ఏ మార్గమున ఉపాసన
చేసిననూ భగవంతుడు మనలను తప్పక ఆశీర్వదించును.

కాబట్టి వారి వారికి చేతనైన విధముగా భగవంతుని ఉపాసించుటయే శ్రేష్టము. ఆ విధముగానే
వారిని కొంచెము కొంచెముగా ఉన్నతమైన మార్గమునకు మళ్ళించుచుండును. చివరగా తనను చేరు
భక్తి మార్గమును తెలియజేసి తనలో తాదత్మ్యము చెందు మార్గమును సూచించును.

అప్పుడు ఆ జీవునకు

*దేహోదేవాలయ ప్రోక్తః జీవోదేవ సనాతనః*
*త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్||*

అను స్థితి సంప్రాప్తమగును.
స్వామి యొక్క ఆలయములన్నియూ చాలావరకు కొండలయందునూ , దట్టమైన వనములందునూ
అమరియుండుట మనకు తెలిసినదే. ఒక్కొక్క కొండనూ ఎక్కుచూ , దట్టమైన వన ప్రాంతములను దాటి ఆస్వామి సన్నిధానమును చేరుకొనుచున్నాము. అటులనే ఇంద్రియములు , మనస్సు , బుద్ధి
అను కొండలను దాటి , రాగద్వేషములను వన్యమృగములు సంచరించు వనములను అధిగమించుచూ ,
స్వామి సన్నిధానమును చేరినచో ఆత్మజ్ఞానము తప్పక లభించును.


*శ్రద్ధానామత్ పరమో భక్తాస్తే దీవమే ప్రియా|*


*“నన్ను శరణాగతి కోరువారు నాకు అత్యంత ప్రియమైనవారు.”*


అంటూ భక్తి యోగము నందు గీతాచార్యులు ప్రవచించినారు.


ముందుగా ఆచరించవలసినది కర్మ. ఆ తరువాత భక్తి , ఉపాసన , చివరిదే జ్ఞానము.


ఉపాసనా ఫలితముగా , భగవంతుని శరణాగతి కోరువారికి అతడి ఆశీర్వాదముల వలన సకల సౌఖ్యములు కలుగును. అంతట జ్ఞానము అనునది భక్తుని ప్రయత్నము లేకనే భగవంతుని
అనుగ్రహము వలన సిద్ధించును.


*“హే భూతనాధా ! భగవాన్ భవ దీయ చారు*
*పాదాంబుజే , భవతు భక్తి రసంచమే*


*నాధాయ సర్వజగతాం భజతాం భవాబ్ది*
*బోధాయ నిత్యమఖిలాంగ భువే నమస్తే”*


హే భూతనాధా , భగవంతుడా ! నీ యొక్క పాదకమలములందు నిరంతరము భక్తి యుక్తుండనై
యుందునుగాక. అఖిల భువనములకూ పాలకుడవు , నాధుడవు అగు నిన్ను ప్రార్థించువారికి
భవసాగరము నుండి కాపాడి , ముల్లోకములచే స్తుతింపబడు దేహము కలవాడు అయిన నీకు
వందనము చేయుచున్నాను.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow