*శ్రీ మహాశాస్తా ఉపాసనాక్రమము - మహాశాస్తా యొక్క ఐదు విధములైన స్వరూపములు*
ముల్లోకములనూ పరిపాలించు నాయకుడైన శ్రీమహాశాస్తా యొక్క రూపమును ఐదుమహాస్వరూపములుగా పేర్కొనవచ్చును.
1. పరమాత్మ స్వరూపము
2. ఐదువిధములైన స్థితిగతులను వివరించు స్వరూపము
3. అవతార స్వరూపము
4. పీఠిక
5. అర్చావతారస్వరూపము.
*1. పరమాత్మ స్వరూపము*
వాక్కునకు , మనస్సునకు అతీతుడై కాలములన్నిటినీ అధిగమించి భాసిల్లునది శాస్తులోకము.
లోకమున శ్రీమహాశాస్తా శ్రీపూర్ణాదేవి , పుష్కలా దేవులతో సహా అందమైన మణిమయ మండపము
నందు ప్రకాశవంతముగా కొలువైయుండును. పవిత్రమైనటువంటి ఛండాయుధము , కొరడా దండము మొదలగు ఆయుధములు ధరించి పలువిధములైన చిత్రవర్ణ దుస్తులను అలంకరించియుండును.
అచట , మహాకాలుడు , మహావీరుడు , భూతనాధుడు వంటి కేవలము స్వామి సేవకే
అంకితమైనటువంటి ఉన్నతమైన గణనాధులు చేయు శరణఘోషలతోనూ , సామగానములతోనూ
స్తుతింపబడుచూ అప్పటికే ముక్తి చెంది స్వామి సన్నిధానమును చేరియున్న పుణ్యాత్ముల చేతనూ కొలువబడుచూ , దివ్యమంగళ స్వరూపుడై , శుద్ధ తత్వస్వరూపుడై జ్ఞానముద్రను కలిగినవాడై
భాసిల్లుచుండును.
ఇటువంటి పరబ్రహ్మ స్వరూపుడే శ్రీమహాశాస్తాగా సదా కొనియాడబడుచున్నాడు.
*2. ఐదువిధములైన స్థితిగతులను వివరించు స్వరూపము*
ఈ స్వరూపము లోకములను పరిపాలించుటకై సృష్టి , స్థితి , లయ , తిరోధనాము , అనుగ్రహము , అను దైవకార్యములను ప్రాతిపదికగా కలిగినది. దీని ప్రకారము శాస్తా మనకు ఐదు విధములుగా దర్శనమిచ్చును. అతడే సాక్షాత్తూ బ్రహ్మదేవుని అంశగా అవతరించి , అండ బ్రహ్మాండములను
సృష్టించు చతుర్ముఖునిగానూ , దక్షప్రజాపతిగానూ అనేక విధములైన సృష్టి కార్యములను
చేయుచుండును.
మరల అతడే విష్ణు స్వరూపుడై అవతరించి మనుపు , మహారాజు , తల్లి , దండ్రివలె లోకమును
పరిపాలించువాడు.
మరల అతడే రుద్రునివలె ప్రకాశించుచూ లయకారకత్వము వహించి ముల్లోకములనూ
నాశనము చేయువాడు.
అతడే మహేశుడై మాయ అను తత్వరూపము బూని జ్ఞానమును పొరలు కమ్ముకొనునట్లు
చేయువాడు.
మరల అతడే సదాశివుని వలె ఆ మాయను ఛేదించి , తనను తాను తెలుసుకొనునట్లు
చేయువాడు.
ఈ విధముగా ఐదు విధములైన స్థితిగతులకు కారణబూతుడై విలసిల్లువాడు శ్రీమహాశాస్తా.
*3. అవతారస్వరూపము*
అన్ని కల్పములయందునూ , పలురకములైన కారణములకై పరమాత్మ అనేక విధములైన అవతారములను ధరించుచూ యుండును. విశేషమేమనగా పరమాత్మునియొక్క అవతారములకు
ప్రాతిపదిక అతడి లీలావినోదములను మనకు తెలియజేయునదియే. *“దుష్టులను శిక్షించి , శిష్టులను కాపాడుట అనునది ధర్మ ఉనికిని రక్షించుట కొరకే”* అన్న శ్రీ కృష్ణ పరమాత్మ వాక్కు ప్రకారము , హరిహరుల సంగమ ఫలితముగా శ్రీమహాశాస్తా *హరిహర పుత్రునిగానూ , వేటగాని వలెనూ , గ్రామ పాలకుని వలెనూ , మణికంఠునిగానూ , ఆయారూపములను ధరించి లోకమున అవతరించిన తీరు అత్యద్భుతము.*
*4. పీఠిక*
లోకమునందలి జనులకొరకు ముందు ముందు భవిష్యత్తున ఏమేమి జరుగునో తెలియజేయువాడు
హరిహరాత్మజుడు. ఎచట చూచిననూ అంతటా తానే నిండియుండువాడైన అతడు పరిపూర్ణానందుడై
లోకులకు ఊపిరివంటివాడై , ఆత్మస్వరూపుడై , పరమాత్మ స్వరూపుడై విలసిల్లుచుండును. జీవాత్మగా సంచరించిననూ , జీవుల యొక్క పాపపుణ్యముల చేత భాధింపబడకుండా , స్వయంప్రకాశజ్యోతివలె
ప్రకాశించువాడు. సర్వవ్యాప్తియై , సమస్త జీవుల మదిలో అంతర్యామివలె విలసిల్లుచుండును.
*5. అవతారస్వరూపము*
అనేక ఆలయములందు శిలారూపముగానూ , బంగారు , రాగి , పంచలోహము వంటి వాటితో చేయబడిన దేవతామూర్తి విగ్రహమువలె గోచరించు వాడు మహాశాస్తాయే.
ఆలయములందునూ , గృహములందునూ , భక్తుల హృదయము లందునూ అతడే
నిలచియుండువాడు. ఆకృతి ఉన్ననూ , లేకపోయిననూ అంతటా తానే అయి నిలచి యున్నవాడు.
దేశ , కాలములకు అతీతుడైన ఆ పరమాత్ముడు భక్తులను అనుగ్రహించుటకై , వారిచేత నిర్మింపబడిన మూర్తులలో ఒదిగియుండి , భౌతికమునకు *"అతీతమైన దేవతా స్వరూపమును సంతరించుకుని , ప్రత్యక్షముగా జీవించువాడు. భక్తులు ఆచరించు స్నానము , నివేదనము , అలంకారము , ఆరాధన , శయనము , ఊరేగింపు , ఉత్సవములు అంటూ భక్తులు చేయు ఔపచారిక సేవలయందు విలసిల్లువాడూ అతడే. అతడే పరమాత్మ.*
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు , పరబ్రహ్మ స్వరూపుడూ అయిన శ్రీమహాశాస్తా
ప్రాణకోటికంతటికీ దేవుడై , అన్నీ తానే అయి , అధిపతి అయి ప్రకాశించువాడు.
అన్ని కాలములకూ అతీతుడై , ఎవరిచేతనూ తక్కువ చేయబడని వాడై తనకు తానే అధిపతియై
భాసిల్లువాడు.
అన్ని కార్యములకూ ఆధారభూతుడు అతడే. చేసిన కార్యములకు ఫలితములను ప్రసాదించువాడూ
అతడే.
అన్నిటికీ మూలాధారుడై , అంతము లేనివాడై విలసిల్లువాడు అతడే. అనేకములైన మంత్రశబ్దముల ద్వారా పూజింపదగువాడు అతడే. ఆ మంత్ర శబ్దములకు ఆధారభూతుడూ అతడే.
