శ్రీ మహాశాస్తా చరితము - 123 | చేయదగినవి - చేయతగనివి | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 123 | చేయదగినవి - చేయతగనివి | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

*చేయదగినవి - చేయతగనివి*

శాస్తా పూజా విధానమనునది మనకు ఇహపర ప్రయోజనములను సిద్ధించుటకై ఏర్పరచబడినది.
ముల్లోకములకూ తన లీలావినోదముల చేత అనుగ్రహము కలుగునట్లు చేయు ఈశ్వరునకూ ,
పార్వతీదేవికి , శ్రీమహావిష్ణువునకు పుత్రుడైన మూర్తిని ఉపాసించినచో మనకు లభ్యము కానిది
ఏదియూ లేదు.

*హరిశంభోః సుపుత్రస్య పూజై షా భువి దుర్లభా*

హరిహరసుతుని కొలుచుటయే ఒక అపూర్వమైన అదృష్టము అనునది శివునివాక్కు

ఉపాసనయందు కామ్యపూజ , నిష్కామ్యపూజ అని రెండు విధములు కలవు. నిజమైన ఉపాసన
అనునది నిష్కామ్యమైనదే అగును. ఏ ప్రత్యేకమైన కోరికలూ లేక , శ్రద్ధా భక్తులతో భగవంతుని ,
శరణాగతి తత్వముతో పూజించునదియే నిష్కామ్యమగును. ఇట్లు పూజించువారికి , తగిన సమయము
ఆసన్నమైనపుడు స్వామియే అన్నిటినీ అనుగ్రహించును. భక్తుల పాలిటి పెన్నిధి అయిన భగవంతుడు
ఇహమున భక్తిని , పరమున ముక్తిని ప్రసాదించును.

ఒక ప్రత్యేకమైన కోరిక కోరుచూ భగవంతుని ప్రార్థించునది కామ్యఉపాసనయగును. స్వామిని ప్రార్థించు భక్తులకు లౌకిక పరమైన సమస్యలను తొలగించి , వారి వారి అవసరములను భగవంతుడే స్వయముగా నెరవేర్చును. ఇందులకుగానూ స్వామి అనేక రీతులుగా అవతరించి , అనుగ్రహించు చుండును. స్వామి వారి ఒక్కొక్క అవతారమూ , ఒక్కొక్క ఫలితమును ప్రసాదించును. వారి వారి
కోరికలననుసరించి , దానికి తగిన పూజావిధానమును ఆచరించుచూ పూజించువారికి , తగిన
వరములను తప్పక అనుగ్రహించును.

*'ప్రత్యక్షం తు కలియుగౌ'* అన్నట్లుగా కలియుగ ప్రత్యక్ష దైవముగా భాసిల్లువాడు శాస్తా. అతడిని
ఏ రీతిని కొలిచిననూ అతడి అనుగ్రహము మనకు తప్పక లభించును.

ఒక ప్రత్యేక మంత్రము ద్వారా ఉపాసించుచూ , జపమును ఆచరించి మనకు కావలసిన రీతిని
పూజించుటయే మంత్ర ప్రయోగమగును. ఇది ఎనిమిది రకములు.

*వశ్యము:*

దేవతలు , మహారాజులు , ఆడ , మగ. వేయేల భూతభేతాళములను సైతము తాను చెప్పినట్లు
చేయించుకొనునది.

*ఆకర్షణము:*

తాను ఇష్టపడువానిని తన వైపునకు ఆకర్షించుకొనునది.

*మోహము:*

ఎదుటివారిని తన వైపునకు మోహపరవశులగునట్లు చేయునది.

*స్తంభనము:*

మానవులను , మృగములను , ఆయుధములను , పంచభూతములను చలనము లేని విధముగా
చేయునది.

*ఉచ్ఛాటనము:*

తన వశమైన దేవతచే , పగవారిని నాశనము అగునట్లు చేయునది. పరులు తనపై ప్రయోగించిన వాటిని తిప్పి కొట్టునట్లు చేయునది.

*మారణము:*

శత్రువులను , పగవారిని మరణింపజేయునది.

*భేదనము:*

ఎదుటివారిని వారిలో వారికి కలతలు ఏర్పడునట్లు చేయునది.

*విద్వేషణము:*

మైత్రీభావముతో , ఐక్యమత్యముగా ఉండువారిని సైతము పగవారుగా మారునట్లు చేయునది.

*వశ్యా కర్షణయోః జపారుణ నిభం సమ్మోహనే శ్యామలం*
*స్తంభే హేమ రుచిరం విషాపహరణే జ్ఞానే సూత సన్నిభం*
*ద్వేషోచ్ఛారణ మారణేఘ నితరాం కాలాంబుద శ్యామలం*
*ధ్యాయేత్ సర్వ ఫలప్రదం హృది మహాశాస్తారం ఈశాత్మజం !*

వశ్యము , ఆకర్షణము వంటి వాటియందు ఎరుపురంగు గలవానిగానూ , మోహనమునందు
నల్లనిరంగు , స్తంభనము నందు బంగారు రంగు , విషము హరించుటయందునూ ,
జ్ఞానము పొందుటకు
చేయువాటి యందునూ తెలుపురంగు , ద్వేషము , ఉచ్ఛాటనము , మారణము - వీటియందు నలుపు రంగు కలవానిగా మహాశాస్తాని పూజింపవలయును. అట్లు చేసినచో త్వరలోనే శాస్తా వారి కోరికలను నెరవేర్చును.

*అష్ట కర్మ శ్రియాదక్ష్మ మొహం పుణ్యవర్ధనం*
*ఆయురారోగ్యదం సౌమ్యభం మృత్యు భయాపహం*

*శాస్తా యొక్క - యంత్రము , వశ్యము , స్తంభనము మొదలగు అష్ట కర్మ కార్యములందు పూజచేసినచో తప్పక ఫలితములు సిద్ధించును. ఇది ఆయురారోగ్యమును ప్రసాదించునది , పుణ్యమును వృద్ధి చేయునది , సుఖమును ప్రసాదించునది , అకాల మృత్యువును పోగొట్టునది”* అని వర్ణించుచున్నది
ఆకాశ భైరవ కల్పము.

పైన తెలిపిన వన్నియూ కత్తిమీద సాము వంటివి. కలికాలము నాటి మానవులకు ఇది
సాధ్యము కానిది. అనన్యమైన భక్తి భావము , తల్లి వద్దకు బిడ్డ చేరునట్టి లాలిత్యము, సౌమ్యత్వము స్వామిని చేరుకొనుటకు ఇవి చాలును.

*ఏకాంతవాసా, నన్నేలు ఈశా ,*
*నామనవి చేరలేదా నీచెంత పరమేశా॥*

ప్రత్యేకమైన ఏ కోరికలూ లేక స్వామిని శరణాగతి కోరువారికి తల్లీ , తండ్రి , గురువు , దైవమూ
అన్నీ తానే అయి , వారికి సకలమూ ప్రసాదించువాడూ ఆ దయాపరుడు.

భక్తియే , ప్రార్థనకు పునాది అయిననూ , సంప్రదాయ తీరులను మన ఇష్టము వచ్చిన రీతిని మార్చుకొనుట తగదు. పూజలు , మంత్ర ఉచ్చాటనలు , ఉపాసన మొదలగువాటిని అందులకు అర్హులైన వారు చేయుటయే ఉత్తమము.

ఇందులకు తగిన విజ్ఞుల పర్యవేక్షణలో చేయుటయే ఉత్తమము. వారి వద్ద ఉపదేశము పొందిన
తరువాతనే పూజలు చేయుటకు అర్హతను పొందగలుగుదురు.

స్వామి యొక్క పూజా విధానము , నిర్దేశించబడిన కట్టుబాట్లు పాటించుచూ , నియమము తప్పక
పూజించువారికి , కల్పవృక్షము వలె అన్ని వరములనూ ప్రసాదించునది.
సకల జగత్తునకు కారణ భూతుడైన , శ్రీమహాశాస్తా యొక్క ఉపాసనా విధానము మిక్కిలి
ఉన్నతమైనది. మహాశాస్తా యొక్క ఉపాసనా విధానమున పండితులు పలువురు , ప్రత్యేకమైన
పద్ధతిని సూచించిరి.

*"కలౌ శాస్త్రు వినాయకౌ”* అన్నట్లుగా కలియుగ ప్రత్యక్ష దైవముగా వరములను అనుగ్రహించువాడు
పరమదయాపరుడైన హరిహరపుత్రుడు. వ్రత కల్పములనునవి వేదములందలి భాగములే. ఒక కార్యమును పద్ధతి ప్రకారము ఎట్లు ఆచరించవలెనో తెలియజేయునది. వీటిని పటలం , పద్ధతి ,
ప్రయోగం , కవచం , నామావళి అని ఐదు విధములైన పంచాంగములుగా చెప్పబడుచున్నవి.

*1. పటలం:*

మూలమంత్రము యొక్క ప్రాశస్త్యము , సాంప్రదాయము , దానిని సూచించిన ఋషి , ఛందస్సు , దేవత , వ్యాసములు , ధ్యానము , మంత్రము వీటిని గురించి తెలియజేయునది.

*2. పద్ధతి:*

ఉదయము లేచినంతనే చేయవలసిన ప్రాతఃస్మరణము, స్నానము మొదలుకుని యంత్రపూజ , దేవతాపూజ , బలిపూజ , తర్పణము , హోమము మొదలగు వాటిని వివరించునది.

*3. ప్రయోగము:*

వశ్యము , మోహనము , ఉచ్ఛాటనము , స్తంభనము , భేదనము , ఆకర్షణము , విద్వేషణము ,
మారణము వంటి ఎనిమిది కర్మలను చేయు విధానమును తెలుపునది.

*4. కవచము:*

తల మొదలుకొని పాదము వరకూ గల అవయములు కాపాడుమని వేడుకొను విధానము.

*5. నామావళి:*

అష్టోత్తరశతం , సహస్రనామం , త్రిశతి వంటి నామావశులలో కూడుకున్నది.

శ్రీమహాశాస్తాకి పలురకములైన పూజా విధానములు అమలులో ఉన్నవి. కానీ వాటిలో శివ , పార్వతుల సంభాషణలో వారే స్వయముగా తెలియజేసిన ఆకాశభైరవ కల్పములోని శ్రీమహాశాస్తా
పూజా విధానము ప్రత్యేకమైనది. యంత్రశాస్తా పద్ధతి ప్రకారము , విస్తారముగా చేయు పూజావిధానము
కూడా మనకు లభ్యమగుచున్నది. కానీ అవన్నియూ కష్టసాధ్యమైనవి.

ఈ పూజావిధానము ప్రకారం చేసినచో స్వామి మిక్కిలి సంతుష్టుడై భక్తునికి , అతడి సంతతికి
సకల సౌఖ్యములను ప్రసాదించుట తధ్యము.

*భక్తి పరిపాలకుడు ఉత్సవమూర్తియై ఊరేగి వచ్చుచున్నాడు.*

*ముల్లోకములందునూ సర్వవ్యాపియై నిండియుండు ఈశ్వరా ! కరుణించుమా ! భువిపై ఎచట కేగిననూ నిన్ను పొగడుచూ , స్తుతించుచూ , జీవించునట్లుగా పుత్రమిత్ర కళత్ర , భక్తిముక్తి జ్ఞాన పురుషోత్తమములను నాకు ప్రసాదింతువుగాక.*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీ మహాశాస్తా చరితము పూర్తి అయినది స్వామి*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow