శ్రీ మహాశాస్తా చరితము - 64 | అయ్యనార్‌గా అవతరించిన విధము | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 64 | అయ్యనార్‌గా అవతరించిన విధము | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

అయ్యనార్‌గా అవతరించిన విధము

 *'తిరువంజిక్కుళం'* (తమిళనాడుకి చెందిన) అను ప్రదేశమును *'పెరుమాక్కోదయర్'* అను రాజు
పాలించుచుండెను. చేరవంశమునకు చెందిన ఇతడు శివభక్తుడు. శివుని యందు అపారమైన భక్తి
కలిగియుండెను. అతడు తరువాతి కాలమున *'చేరమాన్ పెరుమాన్'* అను పేరుతో ప్రసిద్ధి నొందెను. శివభక్తుడైన *'సుందరమూర్తి నాయనార్'* ఇతడికి ప్రియమిత్రుడై యుండెను. శివభక్తులైన వీరిరువురూ
*'తిరువంజిక్కుళం'* నందు నివసించుచూ కైలాసనాధుని గూర్చి అనేక పూజలు చేయుచుండిరి. *'సుందరమూర్తి నాయనార్'* అనునతడు ఇహలోకము జీవితమునందు విరక్తి చెందినవాడై , పరమశివునితో తనకు కైలాసప్రాప్తి కలుగజేయమని వేడుకొనెడివాడు. పరమశివుడు తన సేవకులను పంపి సుందరమూర్తిని శ్వేతగజముపై ఊరేగింపుగా కొనిరమ్మని పంపెను.

ఈశ్వరునిచే పంపబడిన దేవసేనలు , పరమశివుని ఆదేశమును సుందరమూర్తికి తెలియజేయగా ,
పరమసంతోషముగా శ్వేతగజముపై ఊరేగి వచ్చుచుండెను. ఆ సమయమున తన ఆప్త మిత్రుడైన చేరమానుడు కూడా వచ్చినచో బాగుండును కదా అని ఆలోచించుచుండెను.

సుందరుని కైలాస యాత్ర గురించి విన్న చేరమానుడు తన మిత్రుని విడిచి ఉండలేని వాడై , ఒక అశ్వమునెక్కి *'తిరువంజిక్కుళం'నకు* వచ్చి చేరెను. అంతలో శ్వేతగజముపై ఆసీనుడైన తన మిత్రడు ఆకాశమార్గమున పయనించుటను చూచి , తాను కూడా అతడిని అనుసరించిపోవలెనను కోరికతో తన గుర్రము చెవిలో శివపంచాక్షరి జపించెను. శివపంచాక్షరిని మహిమచే గగన మార్గమున పయనించు శక్తిని ఆ అశ్వము పొందెను. క్రొంగొత్త శక్తిని పొంది ఆ అశ్వము ఆకాశమార్గమును
చేరి , ముందుగా పోవుచున్న సుందరమూర్తిని అడ్డగించి , ముమ్మారు ప్రదక్షిణగావించి , అతడిని
అనుసరించినది. స్నేహితులిరువురూ కైలాసమును చేరుకొనిరి.

నందీశ్వరుడు వారిని అడ్డుకుని , ఈశ్వరానుజ్ఞ కలిగిన సుందరుని మాత్రమేలోనికి పోవుటకు
అనుమతి నొసగినది. చేరరాజుని లోనికి పోనీయక అడ్డగించినది. శివుని యొక్క దేవసభయందు అడుగు పెట్టిన సుందరుడు , మేని ఉప్పొంగగా పలు విధములు పరమశివుని స్తుతించినవాడై
పరమశివుని చూచి *"తండ్రీ ! నా వలెనే శివభక్తుడైన చేరమానుడు నిన్ను చూడవచ్చినవాడై , వాకిలియందు నిలుచుని యున్నాడు. నందీశ్వరుడు అనుమతించలేదు. అతడిని కూడా , నా వలెనే కరుణించి కటాక్షింపుము”* అని వేడుకొనెను.

పరమేశ్వరుని అనుమతి పొంది , నందీశ్వరుడు వెంటరాగా , సభయందు ప్రవేశించిన చేరమానుడు
ఈశ్వరునికి అనేక ప్రణామములు ఆచరించి నిలుచుని యుండెను. అనుదినమూ పార్వతీ
పరమేశ్వరులను పూజించు చేరమానుడు ప్రత్యక్షముగా స్వామిని చూచి , మైమరచి యుండెను. ఆ సమయమున కైలాసనాధుడు , తన భార్యయైన ఉమాదేవితోనూ , పుత్రులైన గణపతి , స్కందులతోనూ,
శాస్తాతోనూ , తన పరివార గణములతో కొలువై యుండుట చూచి ఆశువుగా ఆ అందమును
అభివర్ణించెను.

ఈశ్వరుని అనుమతితో తాను రచించిన *'తిరుక్కెలాయజ్ఞానఉలా'* అను తమిళ గ్రంధమును ఈశ్వరుని ఎదుట పాడివినిపించెను.

*'తిరుక్కెలాయజ్ఞానులా'* అనగా కైలాస పర్వతమున జరిగిన ఊరేగింపు లేక ఉత్సవము అని అర్థము.

ఆ సమయమున తల్లిదండ్రుల నడుమ కూర్చుని యున్న హరిహరపుత్రుడు ఇది విని ఆనందము పొందెను. అంతటితో ఆగక , ప్రాచీన తమిళ గ్రంధమైన దీనిని భూలోకవాసులు చదివి.
పునీతులు కావలెనను కోరికతో , వైదిక సంస్కారము వెల్లివిరయు తమిళనాడుకి చెందిన *'తిరుప్పిడవూర్*
అను పుణ్యక్షేత్రమున వెలువరించగోరెను. పరమశివుని స్తుతించుచూ చేరమానుడు పాడిన పురాతన తమిళ ప్రజలకు అర్థమగురీతిలో వెలువరించెను.

చేతిలో ఘంటము ధరించి అవతరించిన అయ్యనార్‌గా పరమశివుడు సదా పూజింపబడుచుండెను.

*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow