శ్రీ మహాశాస్తా చరితము - 66 | భక్తుని రూపు దాల్చి వచ్చిన పరమాత్ముడు | | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 66 | భక్తుని రూపు దాల్చి వచ్చిన పరమాత్ముడు | | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

భక్తుని రూపు దాల్చి వచ్చిన పరమాత్ముడు | 

*'మేరునందనుడు'* అను రాజు , నేపాళ దేశమును , ధర్మము తప్పక పాలించు చుండెను. శాస్తా యందు అమిత భక్తి కలిగియుండెను. అనుదినమూ స్వామిని ఎన్నో రీతుల పూజించుచుండిననూ ,
విధివశాత్తూ భయంకరమైన వ్యాధి పాలు పడెను. ఎన్నో బాధలు అనుభవించుచుండెను.

అదే సమయమున *'హిరణ్యపురం'* అను దేశమును *'దుశ్శకుడు'* అను రాజు పాలించుచుండెను.
అతడు వీరునిగా , పరాక్రమశాలిగా నుండిననూ , దుర్గుణములను అనేకము కలిగి యుండెను.
అతడికి ఎప్పుడూ యుద్ధకాంక్ష అధికముగా ఉండెను. పొరుగు రాజ్యములపై దండెత్తుటయూ ,
వారిని ఓడించి పీడించుటయూ , వారి ఐశ్వర్యమును కొల్లగొట్టి , వారి స్థావరములను భస్మీపటలము
చేయుటయందు ఆసక్తి కలిగి , రాక్షస ఆనందము పొందుసాగెను. అటువంటి దుర్మార్గపు గుణములు
గల అతడిని ఎదిరించుటకు ఎవరికీనీ ధైర్యము చాలకుండెను.

ఇటువంటి దుర్మార్గునికి , ఐశ్వర్యసంపద , ప్రశాంత రమణీయత కలిగిన నేపాళ దేశముపై కన్ను
పడకుండునా ! నేపాళ దేశమున నున్న వనరులను , ఐశ్వర్యమును తన వశము చేసుకొనవలయు
నను దురాశతో తన సేనతో ఆ నగరమును ముట్టడించెను. ఎదురుచూడని ఈ హఠాత్ పరిణామమునకు
దిగ్భమ చెందిన నేపాళరాజు , ముందుగా తన సేనాపతిని పంపెను. బలపరాక్రమములను చూపి , ఎంత పోరాడిననూ , దుశ్శకుని రాక్షసశక్తి ముందు సేనాపతి నిలువలేక ఓడిపోయెను. చివరకు
దుశ్శకుని చేతిలో వీరమరణము పొందెను. తమను నడిపించు వారు లేక అల్లాడిపోయిన నేపాళ సైనికులు తలొక దిక్కుగా పారిపోయిరి.

కొంచెము కొంచెముగా దుశ్శకుని సేనలు నేపాళ దేశమునందలి ఒక్కొక్క ప్రాంతమునూ
ఆక్రమించు కొనుచూ , చివరకు రాజధాని వైపుగా తరలి వచ్చుచుండుట చూచిన మహారాజు మిగుల వ్యాకులము చెందుచూ , అనుదినమూ తాను కొలుచు శాస్తా ముందు నిలబడి చేతులు జోడించి
*“శరణాగతరక్షణా ! శత్రుసంహారకా ! నీవు తప్ప వేరెవరనీ కొలువక , నీవే గతియని నమ్మిన నాకు ఈ పరిస్థితి మిక్కిలి దుర్భరముగా నున్నది. ఇందు నుండి నన్ను , నా దేశమును కాపాడు దైవము నీవు మాత్రమే."* అని దీనముగా ప్రార్థించెను.

మనసారా ప్రార్థించినచో , ఆ ప్రార్థనలు శాస్తా చెవినిబడకుండా ఉండునా ! లోకాలనేలు పరమాత్ముడు ,
క్షణమైననూ ఆలస్యము చేయకుండా నేపాళ దేశపు మహారాజు రూపును ధరించగా , అతడి
భూతగణములు , నేపాళ సైనికులుగా మారిపోయి యుద్ధరంగమున దూకిరి.

తాను ఎదిరింపనెంచిన మహారాజే ఎదుటబడుటతో , ఆక్రోశముగా పోరాడసాగెను. కొంతసేపు
దుశ్శకునితో వినోదముగా పోరు సల్పిన శాస్తా , ఇక ఉపేక్షింపక తన చేత నున్న కొరడాని అతడిపై
విసరగా , దాన్ని ఏమాత్రమూ ఎదురుచూడని దుశ్శకుడు అయోమయముగా చూచుచుండగా , ఆ
కొరడా , కోటి సూర్యుల ప్రకాశముతో వెలుగొందుతూ , చూచు వారి కళ్ళు మిరుమిట్లు గొల్పునట్లుగా పోయి , దుశ్శకుని సంహరించినది. దుశ్శకుని రక్తముతో తడిసిన ఆ కొరడా పరమ పవిత్రమైనది గావున , ఆ రక్తపు చారికలు తొలగునట్లు సముద్రమున మునిగిలేచి , పరిశుభ్రమై మరల స్వామి
వద్దకు చేరుకొనెను. భయపడి నిలుచుని యున్న దుశ్శకుని సేనలను చూచి స్వామి పెద్ద పెట్టున హూంకారము చేసినంత మాత్రముననే భస్మీపటలమైపోయినవి.

తరువాత రాజప్రాసాదము నందు జరిగిన దేదియూ తెలియక భగవత్ ప్రార్థనలో మునిగి
యున్న మహారాజు ముందు ప్రత్యక్షమై *"ప్రియభక్తుడా ! దిగులు మానుము. నీకు బదులుగా , నీవేషమును ధరించి యుద్ధరంగమునకు బోయి శత్రువును. అతడి సేనలను సంహరించితిని. ఇకపై నిన్ను ఇన్నాళ్ళుగా బాధించు చున్న వ్యాధియూ తొలగిపోవును“* అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యెను.
వ్యాధి తొలగిపోయిన మహారాజు చాలాకాలము సుభిక్షముగా రాజ్యమునేలెను.

*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow