శ్రీ మహాశాస్తా చరితము - 87 | శాస్తా పూజా విధానము | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 87 | శాస్తా పూజా విధానము | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

శాస్తా పూజా విధానము  - చేమంతి , చెంగల్వులు శాస్తా పూజా సామాగ్రిలో విశేషములగుట*

పూర్వము , శ్రీమంతమై వెలయుచుండిన కోశలదేశమును నంది వర్మ అను రాజు
పరిపాలించుచుండెను. అతడి కుమారుడైన భీముడు మహాపరాక్రమవంతుడు , కుమార్తెలిరువురు
సుగుణ , సుందరాంగి అను పేర్లు గలవారు.

ఒకనాడు రాకుమార్తె లిరువురూ తమ చెలికత్తెలతో చేరి వన విహారమున కేగిరి. అచట
శాస్తాభక్తుడగు శ్వేత బాహువను పేరు గల ఒక మునివర్యుడు ఆ వనమునందు తపము
నాచరించుచుండెను. శాస్తా చరణకమలములను పరిపూర్ణముగా శరణుజొచ్చిన భక్తాగ్రగణ్యుడాముని.
రాకుమార్తెలు తమ విహారమును మాని ఆమునివైపు వింతగా కన్నార్పకుండా చూడసాగిరి. అతడి
శిరోభాగమునకు మీదుగా ఒక తేనెపట్టు వ్రేలాడుచుండుటను వారు గమనించిరి. అతడి తపస్సుకు భంగము కలుగునని భావించినవారై , చెలికత్తెలు ఎంతగా వారించినను వినక , రాకుమార్తెలు రాళ్లను
గైకొని తేనెపట్టుపై విసరివేయుచు , దానిని చెల్లా చెదరు గావించిరి. తేనెటీగలు ముని శరీరముపై దాడిచేసి విపరీతముగా బాధింపజొచ్చెను.

ఆబాధ నోర్చుకొనజాలక , ముని తన తపస్సుకు విఘ్నమును కలిగించిన కారణము వలన
యువరాణులిద్దరినీ రెండు వృక్షములుగా మారునట్లు శాపమునొసగెను. సాధారణముగా
మహామునులకు ఆగ్రహము కలుగదు. కలిగినచో , ఆక్షణమాత్రమున అనర్థమెంతేనియు జరిగి తీరును. ఆముని శాపము తప్పక ఫలించి తీరును కదా ?

సుగుణ మట్టిలో మొలచునట్చి చేమంతి చెట్టుగాను , సోదరి సుందరాంగిని నీటిలో పెరుగునట్టి
ఎఱ్ఱ కలువ మొక్కగాను జన్మించిరి.

రాజు తన తనయలకు సంభవించిన దుర్గతిని విని దురసిల్లుచు ముని చెంతకు వచ్చి చేతులు
జోడించి నమస్కరించెను. వారి తప్పునుక్షమించి , వారికి శాపవిమోచనమును కలిగింపజేయుమని
వేనోళ్ల వేడుకొనెను. అప్పుడాముని శాంతించి , *'రాజా ! నీకుమార్తెలకు సద్గతి కలుగవలయుననిన
మహాశాస్తాను ఆరాధించుము. అదొక్కటియే సక్రమమైన మార్గము అని పలికి , అతడి కోరిక తీరునట్లుగా అభయమిచ్చెను. రాజు అడవికేగి , అచ్చట గాలిని మాత్రమే శ్వాసించుచు , దానినే ఆహారముగా భావించుచు , భగవానుడిగూర్చి ఘోరతపస్సు నొనరించెను.

కొంత కాలమిట్లు గడచిన పిమ్మట , పరమాత్మ స్వరూపుడైన మహాశాస్తా రాజు తపస్సుకు మెచ్చి
దివ్యతేజోరూపముతో కరుణరసార్ధములైన వీక్షణములతో గంభీరమైన మదగజమునధిరోహించినవాడై సాక్షాత్కరించెను.

భక్తా ! నీ యొక్క కఠోర తపస్సును గాంచి ప్రసన్న హృదయుడినైతిని. నీమనోభీష్టము నాకు
విశదముగా అవగతమైనది. నావాక్కు ఒకవేళ ఫలించక పోవచ్చునేమో కానీ నా భక్తుల వాక్కు
మాత్రము అవశ్యము ఫలించి తీరును . నామాట మారినను మారవచ్చును. కానీ నా భక్తులమాటను మార్చుటకు నావలన సాధ్యమగు పనికాదు సుమా ! నీవు నిష్కపటమైన భక్తిగలవాడివి. నీయొక్క తపో నిష్ఠాగరిష్ఠ ప్రస్తుతింపదగినది. నీకుమార్తెలకు ముని యొసగిన శాపమును నేనెంత మాత్రమూ
మార్చజాలను. కానీ , ఆశాపమును వరముగా అనుగ్రహించుదును. వారిద్దరూ చెట్లు రూపములో
శాశ్వతముగా నుండగలరు. చేమంతి పువ్వుగా , చెంగలువపువ్వుగా స్వామిని అనునిత్యమూ
సేవించుచుందురుగాక ! స్వామివారికి చేయు ఆరాధనలో వీరికి ప్రాధాన్యము గలుగును గాక. ఈ పుష్పములతో నన్ను పూజించువారికి నా అనుగ్రహభాగ్యమును సంపూర్ణముగా కలిగించుదును. ఈ
పుష్పముల పూజ వలన సంప్రీతి చెందినవాడనై , నాభక్త జనులకు పలువిధములైన యాగములు , దానములు చేయుట వలన సంప్రాప్తించునట్టి ఫలమును ఒసగి అనుగ్రహించుదును అని
ఉభయవాచనములు పలికెను.

భగవానుడి ఆశీస్సులను పొందిన రాజు తన కుమార్తెలకు ప్రాప్తించిన సద్గతిని తలచుకొని
మురిసిపోయెను. ఆ సమయమున నుండి చేమంతి , చెంగలువ భగవంతుడి పూజా సామాగ్రిలో ఉతృష్టమైనవిగా ఉన్నత స్థానమును అలంకరించినవి.

*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow