మణిదాసుడు శాస్తాకు దాసుడగుట*
శాస్తాభక్తులలో *'మణిదాసుడు'* అను పేరుగలవారు అత్యంతాగ్రగణ్యుడు. ఇతడు దక్షిణపాండ్యమండలమునందు నివపసించుచుండెను. *'పునలూరు'* కు సమీపము నందు *'మేల్ వాసల్'* అను ప్రాంతమున శాస్తా యొక్క ఆలయము నెలకొని యుండెను. మణి దాసుడు శాస్తాను
అపరిమితమైన భక్తిశ్రద్ధలతో అనుదినమూ అర్చించుచుండెను.
మణిదాసుకు ఆధ్యాత్మిక విషయములందు పరిజ్ఞానము కలిగియుండెను. పురాణములను ,
ఇతిహాసములను విశదముగా తెలిసికొనియుండెను. మంత్రశాస్త్ర విషయములు సైతము అతడికి
విదితమై యుండెను.
ఆదినుండియు స్వామిని నిశ్చల భక్తిభావముతో కొలుచుచూ అతడినే తమ కులదైవముగా
ఆరాధించుచున్న కంబంగుడి వంశీయులయొక్క వారసుడే ఈ మణిదాసుడు.
విధి వైపరీత్యము వలన అతడు ఇతర కార్యభారములయందు నిమగ్నుడై కొంత కాలము శాస్తా పూజలను మరచి యుండెను. ఆ సమయమున అతడి కుమార్తె అకాలమరణమునకు గురయ్యెను. తనకు సంభవించిన దురవస్థను తలచుకొని మణిదాసుడు దురపిల్లుచుండెను.
తనంతటతానే ప్రత్యక్షమై , యెదుట నిలచిన భగవానుడిని సేవింపక నిర్లక్ష్యము చేసితిని కదా
అని మణిదాసుడు పశ్చాత్తాపము చెందెను.
తనకొక వారసుడిని ప్రసాదించుమని శాస్తాను వేడుకొనెను. తనను శరణుకోరిన మణిదాసుడిని
శాస్తా కనికరించి అనుగ్రహించెను.
సమస్తమూ శాస్తా చిత్తము ననుసరించియే జరుగుచుండునని మణిదాసుడు దృఢముగా
విశ్వసించెను. ఇదంతయు తననీ ప్రాపంచిక విషయములనుండియు , లౌకిక బంధములనుండియు
మరలించుట కొరకై శాస్తా జరుపుచున్న నాటకమనియు భావించెను. తండ్రిగా , గురువుగా ,
దైవముగా తనకు మార్గమును చూపిన అతడికి తన జీవితసర్వస్వమును అర్పణము గావించెను.
శాస్తా కొలువు దీరియున్న దేవాలయములన్నింటిని మణిదాసుడు సందర్శించెను. భగవానుడి
మీద తాను రచించిన భక్తిగీతాలనన్నింటిని పాడి పరవశించుచుండెను. సదా అతడి నోటివెంట
తియ్యనైన తమిళ పదములు , సంస్కృత శబ్దములు ధారావాహముగా వెలువడుచుండెను.
మణిదాసుడి పాటలలో శాస్తా జీవిత చరిత్ర. నానావిధములైన మహిమలు వర్ణింపబడి
యుండెను. స్ఫూర్తిదాయకములై మొప్పుచుండెడి అతడి పాటలు సాక్షాత్ స్వామినే ఆకట్టుకొనెను. శాస్తా యొక్క శాంతగుణము పరిపూర్ణముగా గోచరించు శాస్తా యొక్క ప్రీతివైభవములలో మణిదాసుడి
పాటలు విశిష్టమైనవని చెప్పవచ్చును. ఏ భక్తజన సమావేశములోనైనను , మణిదాసుడు భక్తిపరవశుడై పాటలు పాడిన వెంటనే భగవానుడు ఆసభలో ప్రత్యక్షమై వారికి సంతోషమును కలిగించుచుండెను.
అతడి గానమాధుర్యమునకు శాస్తా పరవశించి బదులు పలికెవాడను మాట నిజము , ఇందులో
అతిశయమేమియు కానరాదు.
తన పరివారగణములతో ఊరేగుచుండు శాస్తావైభవము కన్నులారాగాంచి , మనసారా స్మరించిన
మణిదాసుకు పాటలుగా మలచి తనివితీరా పాడి పరవశత్వమునందెను.
సహస్రాధిక సంఖ్యలో శాస్తామీద భక్తి గేయములను , వృత్తములను రూపొందించిన వారిలో
మణిదాసుడిని మించిన వారు లేనే లేరని చెప్పవచ్చును. భక్తి భావసంభరితమైన అతడి
అంతరాంతరాలలోనే వెలువడిన పాటలు కనుక , వాటిలో భావ సౌందర్యము , పదలాలిత్యము
పరిపూర్ణముగా గోచరించును. శాస్తా ఆలయములందు జరుగు శాస్తా ప్రీతి సందర్భములలో , అతడి
ఆరాధనలో నేటి వరకూ మణిదాసుడి పాటలే వినిపించుచున్నవి.
పునలూరుకు సమీపముననున్న మేల్ వాసల్ నెలకొనియున్న శాస్తా మణిదాసుకి యొక్క ఇష్టదైవము శాస్తా యొక్క చక్రపూజ విశేషముగా నిర్వహించు మేల్ వాసల్ ప్రధాని మణికంఠడి మీద మణిదాసుడుకి
ప్రత్యేకాభిమానమును గలిగియుండెను.
శాస్తా దివ్య దర్శనము కొఱకు నిరీక్షించుచున్న మణిదాసుడికి స్వప్నమునందు భగవానుడు
సాక్షాత్కరించెను. తత్ ఫలితముగా శాస్తా జీవిత చరిత్రను , దివ్యలీలను ఇంకను విశేషముగా
నభివర్ణించుచు భక్తి గీతములను పాడిపాడి పరవశించుచుండెను.
శాస్తా వెలసియున్న ప్రధాన స్థలములు ఆరు ముత్తేయ్యన్ కోవిల్ , కుళత్తుపుళి , ఆరియంగుడి ,
అరసన్ కోయిల్ , శబరిమలై , కాంతమలై , ఈ ప్రదేశములందు కొలువుదీరియున్న భగవానుడి మీద
మణిదాసుడు పంచకములను , వృత్తములను గానము చేసెను.
తమిళములో దేవారము , తిరువాచకము , తిరుప్పుగళ్ వలె మణిదాసుడి పాటలు మంత్ర గ్రంధముగాను , ప్రతిదినమూ భగవానుడిని స్తుతించుచు పాడుకొను సంగీత రూపమైన గ్రంథముగాను
భావింపబడుచున్నది.
శీతలమును కలిగించి , సేద తీర్చునటు వంటి వర్షపుజల్లుల వలె మణిదాసుడి పాటలు
భక్తజనులను రసార్ద్రహృదయములను గావింపజేయును.
తన మధురగీతములతో భగవంతుడిని ఆకట్టుకున్న మణిదాసుడు చివరికి అతడి దివ్యచరణములలో
విలీనుడయ్యెను.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
