Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

06. లింగార్చన విధి | Lingaarchana Vidhi


శ్రీ మద్విభూతి రుద్రాక్షలను మేనదాల్చి, పంచాక్షరీ జప పరాయణుడైయున్న లింగధారి. ప్రతిదినము తన ఇష్ట లింగమును విధ్యుక్త ప్రకారముగా బూజించవలయును. లింగ పూజాసక్తుడు మొదలు జలము పత్రి పుష్పాక్షతాదులను సంగ్రహించుకొని (సిద్ధ పరచుకొని) పిదప స్నానముజేసి, మడివస్త్రములను ధరించి నీటితో నింపిన చెంబును ఎడమ చేత బట్టుకొని కుడిచేత అందులోని నీరును శివపూజాగృహము వరకు సంప్రోక్షణము జేస్తూ వెళ్ళి ఆసనమును యథారీతిని బూజించి దానిపై గూర్చుండి ప్రథమలింగార్చన కొరకు సంకల్పమును బఠించవలెను.

సంకల్ప మంత్రము :- "మమకాయిక, వాచిక, మానసిక, జ్ఞాతాజ్ఞాత సకల పాప విమోచనార్థం, శివభక్తి, శివజ్ఞాన సంపద భివృద్ధ్యర్థం శ్రీమద్గురు, జంగమప్రసాసిద్ధ్యర్థం, శ్రీ మత్రాణలింగ, భావలింగ, అధిష్ఠాన శ్రీమదిష్ట లింగ పూజామహంకరిష్యే"


-: అథవా :-

హరః "ఓం, శివశివ శంభోరాజ్ఞేయ ప్రవర్తమానస్యద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థేస్వేత వరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే మేరోర్దక్షిణదిగ్భాగే భరతఖండే, భారతవర్షే దండకారణ్యే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావర్యోర్మధ్యదేశేదక్షిణకూలే శాలివాహనశక శ్రీవీరభద్రవతారే శివక్షేత్రే అస్మిన్ వర్తమానే స్వస్తిశ్రీ వ్యవహారిక చాంద్రమానే ప్రభవాదిషష్ఠి సంవత్సరానాం మధ్యే అస్మిన్ ( ) వత్సరే, అస్మిన్ ( ) అయనే, అస్మిన్ ( ) మాసే, అస్మిన్ ( ) పక్షే, అస్మిన్ ( ) వాసరే, అస్మిన్ ( ) నక్షత్రే, అస్మిన్ ( ) యోగే, అస్మిన్ ( ) కరణే, ఏవం గుణయుక్తాయాం, అస్మిన్ ( ) శుభతిథౌ, అస్మిన్ ( ) గోత్రోత్పన్నోహం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పార్వతీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ గురు-లింగ-జంగమ ప్రసాదసిద్ధ్యర్థం శ్రీమదిష్ట లింగ-ప్రాణలింగ-భావలింగ-పూజా మహంకరిష్యే॥"

ఈ విధముగా సంకల్పమును బఠించి పిదప లింగాభిషేకమును జేసికొనవలెను. తన ఇష్ట లింగమును ఎడమ హస్త మందు లింగముయొక్క గోముఖమును ఎడమచేతి బొటనవ్రేలి వైపున ఉంచి ఒక తాలి(గ్లాసు) లేదా పాత్రలో భస్మోదకమును జేసికొని అభిషేకమును జేసికొనవలెను.

📢 Follow