నిత్య నియమావళి

నిత్య నియమావళి 

Ø  ప్రతి దినము వేకువనే మేల్కొని శిరస్నానాంతరము కనీస అర్చన విధానము అనుసరించవలెను. దీనికి పూర్వము ఏమియు సేవించరాదు. సాయంకాల సమయములందు కూడా శిరస్నానమ చేసి దేవతార్చన అనుసరించిన పిదపనే అల్పాహారము తీసుకొనవలెను. 
Ø  ముద్రమాలను యెట్టి సమయమునందు తీసివేయరాదు. ముద్రమాలను ధరించి స్వామి సన్నిధానము చేరుటకు కనీసము 41 రోజుల ముందుగా దీక్షనవలంభించవలెను. 3 రోజులు, 11 రోజులు, 21 రోజులు ఎట్టి పరిస్థితులలో మాలాధారణ చేయరాదు. ఈ రోజులలో వేసిన వారికి దీక్ష ఫలం ఉండదు.
Ø  నల్లదుస్తులు కాని, కాషాయం దుస్తులు కాని, నీలి దుస్తులు కాని ధరించుట పరిపాటి.
Ø  కాళ్ళకు చెప్పులు వేసుకునరాదు. పరిశుభ్రతను పాటించుట అత్యవసరము. యెట్టి పనులు చేయుటకు ముందు కర, పాద, నేత్ర ప్రక్షాళనము చేయవలెను.
Ø  నిరంతరము శరణువష జపించుచుండవలెను. స్వామియే శరణమయ్యప్ప అను మూల మంత్రమును నిరంతరము జపించుచుండవలెను.
Ø  తాము చేయు ప్రతికార్యమునందు అయ్యప్ప భగవానుని గుర్తించుచుండవలెను.
Ø  మాల వేసిన ప్రతి ఒక్కరు అయ్యప్పస్వామి స్వరూపులే. ఇతరులను కూడా అయ్యప్ప ప్రతిరూపంగా భావించవలెను.
Ø  ప్రతి స్త్రీ (భార్య సైతము) దేవి స్వరూపులే. వాంఛతో ఏ స్త్రీని చూడరాదు. తలచరాదు. అస్కలిత బ్రహ్మచర్యము పాటించవలెను.
Ø  తమ నామధేయమున చివర అయ్యప్ప అని సంబోధించవలెను.
Ø  ఇతరులను అయ్యప్ప అని సంబోధించవలెను. స్త్రీలను మాతా అని భార్యను మాలికాపురం అని సంబోధించవలెను.
Ø  అయ్యప్ప శవమును చూడరాదు. బహిష్టం అయిన స్త్రీలను చూడరాదు. ఒకవేళ చూచిన యెడల తిరిగి ఇంటికి వెళ్ళి శిరస్నానము ఆచరించి శరణుఘోష జపించు వరకు ఏమి సేవించరాదు.
Ø  దీక్షా కాలమందు కేశఖండన చేసుకొనదారు, గోళ్ళను తీయరాదు.
Ø  అయ్యప్పను యెవరైన అయ్యప్ప బిక్షకకు పిలిచిన యెడల తిరస్కరించరాదు. జాతి, మత, కుల, వివక్షత అయ్యప్పకు లేదు. సర్వులు సమానం.
Ø  అతిముఖ్యమైన విషయం : మాల వేసిన ప్రతి ఒక్కరు ఎరుమేళి వావరుని దర్శించుకున్న తర్వాత శబరీశుని దర్శించుకునవలెను.
Ø  మెత్తటి పరుపులు, దిండ్లు ఉపయోగించరాదు. గృహశ్రమానికి ఉపయోగించిన బెడ్ షీట్లు సైతము ముట్టుకోరాదు.
Ø  సాధ్యమైనంత వరకు నేలమీద కొత్త చాప వేసుకొని శయనించవలెను.
Ø  అయ్యప్ప ఎల్లప్పుడు విభూతి, చందనము, కుంకుమ బొట్టులతో విరసిల్లుచుండవలెను.
Ø  అబద్దమాడరాదు, దుర్భాషలాడరాదు, అధిక ప్రసంగములకు దూరముగా వుండవలెను.
Ø  ఎల్లప్పుడు మనస్సులో శ్రీ అయ్యప్ప స్వామినే తలచుచుండవలెను. ప్రతి వారిని శ్రీ అయ్యప్ప స్వామి స్వరూపముగానే భావించవలెను. లింగ, వయో బేధము లేకుండా అందరిని స్వామి అనియే పిలువలెను. శ్రీ అయ్యప్పస్వామి దీక్ష స్వీకరించిన స్వాములు ఎదురైనా పరస్పరము స్వామి శరణం అని నమస్కరించుకొనవలెను.
Ø  దీక్షా కాలములో దీక్షా మాల ధరించి స్వాములందరికి వ్యక్తిగత హెూదా, వయస్సు, అంతస్తుల తేడాలు పాటించకుండా పాదాభివందనము చేయవలెను.
Ø  దీక్ష స్వీకరించిన వారు ఎటువంటి విందులకు వినోదాలకు పోరాదు.
Ø  దీక్ష స్వీకరించిన స్వాములు తమ ఆర్థిక స్తోమతను బట్టి అన్నదానము చేయవలెను. (కనీసం 5 మంది స్వాములకు)
Ø  దీక్షా కాలములో ఏ స్వంత నిర్ణయమైనను తీసుకొనరాదు. గురుస్వామిని అడిగి వివరముగా తెలుసుకొని, గురుస్వామి సూచన ప్రకారము ప్రవర్తించవలెను. గురుస్వామి "అతిముఖ్యుడనే విషయం మరువరాదు.
Ø  కేవలం మానవజాతి యందేగాక మృగ, పశు, పక్షాదులందు కూడా దయచూపుట గొప్ప విశేషము ఇట్టి నియమములు సూచన తప్పకుండా అమలు పెట్టిన భక్తుడే శబరిమల సన్నిదానమందు పదునెట్టాంబడి నెక్కనర్హుడు. అతనికి భగవత్ సాక్షాత్కారము లభించును. తీర్థయాత్ర ఫలితము పొందగలరు.
Ø  ఇరుముడి కట్టిన తరువాత యాత్రకువెల్లి శ్రీ అయ్యప్పస్వామి దర్శనాంతరం ఇంట్లో వారితో ఫోన్ ద్వార సంప్రదించవలెను.
Ø  ఈ నియమములు పాటించువారే అయ్యప్పకు ప్రీతి పాత్రులు కాగలరు.
Ø  సద్ది మధ్యాహ్నం 2 గం||లలోపు, భిక్ష రాత్రి 9 గం||లోపు అయ్యప్ప స్వాములకు పెట్టవలెను. గురుస్వాములకు ఇది విజ్ఞప్తి చేయవలెను. లేనిచో అజీర్ణమై, అస్వస్థలకు గురై దీక్షభంగం కలుగును.
Ø  కన్నెస్వాములకు సద్దిని, భిక్షను బలవంతంగా ఎక్కువగా వడ్డించరాదు. ఎందుకు అనగా కన్నెస్వాములు సాక్షాత్తు అయ్యప్పస్వామి స్వరూపులు.
Ø  మాంసాహారం, గుట్కా, మద్యపానం, ధూమపానం, మొదలగునవి భుజించరాదు. సేవించరాదు.
Ø  శబరిమలకు వెళ్ళే అయ్యప్పస్వాములు దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో మాలవిసర్జన చేయరాదు. ఎందుకనగా అయ్యప్పస్వామి ప్రసాదం, అభిషేకపు నెయ్యి వుంటుంది. అయ్యప్ప మాలముద్ర మెడలో వుండుటవలన జరగబోయో అపశ్రుతులకు, శ్రీరామ రక్ష. ఎవరి నిర్బంధము వలనకాక స్వయముగా పాపములు తొలగించుకొనుటకు, అభీష్ట శుభములు పొందుటకు దీక్ష స్వీకరించిన శ్రీ అయ్యప్ప భక్తులు, స్వామి యందు భక్తి, విశ్వాసములు, ఆదర్శమైన సత్ప్రవర్తన గలవారై శాంతి, సహన భావముతో పవిత్ర శబరిమల యాత్రచేసి శ్రీ అయ్యప్పస్వామి కృపకు పాత్రులు కావలెను. ఈ భక్త జన కల్పవృక్షము, కరుణా సముద్రుడైన "శ్రీ అయ్యప్పస్వామి దయతో ఇహలోకమున సకల శుభసంపదలు, సమస్త సుఖశాంతులు, పరలోకమున మోక్షానందము పొందగలరు. అందులకు ఈ నియమాలను నిష్ఠతో తప్పనిసరిగా పాటించాలి.
స్వామియే శరణం అయ్యప్ప! స్వామియే శరణం అయ్యప్ప!! స్వామియే శరణం అయ్యప్ప!!!

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!