మహాభారతం - సభా పర్వము - ప్రథమాశ్వాసము

P Madhav Kumar

ప్రథమాశ్వాసము

- అర్జునుని చూసిన దానవ శిల్పి మయుడు " అర్జునా ! నీ దయ వలన నేను అగ్నికి ఆహుతి కాకుండా బ్రతికాను. నేను దానవ శిల్పిని. చిత్ర విచిత్రమైన నిర్మాణాలు చేయగలను. మీకు ఇష్టమైనది ఏదో చెప్పండి చేస్తాను " అన్నాడు. అర్జునుడు కృష్ణుని వంక చూసాడు. శ్రీకృష్ణుడు " కురువంశ మహారాజు ధర్మరాజు వైభవానికి తగినట్లు ఒక భవనం నిర్మించి ఇవ్వు " అని మయునితో అన్నాడు. మయుడు " ఈ భూమిపై ధర్మరాజుని మించిన రాజు లేడు. అందుకని ప్రజలు మెచ్చేలా చిత్ర విచిత్రమైన భనాన్ని నిర్మించి ఇస్తాను. వృషపర్వుడనే రాక్షస రాజుకు ఒక సభ నిర్మించడానికి ఉపకరణాలు సమకూర్చుకున్నాను. కారంణాంతాల వలన నిర్మించ లేక పోయాను. ఉపకరణాలను బిందుసరము అనే సరోవరంలో దాచాను వాటిని తెచ్చి భవన నిర్మాణం చేస్తాను. నా వద్ద భౌమాదిత్యుడు దాచిన గద, శంఖము ఉన్నాయి. గదను భీమసేనునికి దేవదత్తము అనే శంఖమును అర్జునినికి ఇస్తాను " అన్నాడు.

మయసభా వైభవం


మయ సభ వైభవము
మయుడు బిందుసరములో ఉన్న దూలాలూ, కంభములను ఉపయోగించి చిత్ర విచిత్రమైన భవనాన్ని నిర్మించాడు. నీటికి బదులు ఇంద్రనీల మణులను, పద్మరాగ మణులతో ఎర్రని పద్మాలను, రజితముతో తెల్లటి తామరలను, రాజహంసలను, వజ్రాలతో చేపలను, ముత్యములతో తెల్లటి నురగలను, మరకత మణులతో నీటిలోని నాచుని తయారు చేసాడు. అవి నిజమని బ్రమించేలా నిర్మించాడు. నీటి యంత్రాలు, చెట్లు, నీటీ పక్షులు, పాక్షిగూళ్ళు మొదలైనవి వివిధ రత్న కాంతులతో శోభిల్లే భవనం పదునాలుగు మాసాలు శ్రమించి నిర్మించాడు. దానిని ఎనిమిది వేల మంది బలిష్టులతో ఆకాశమార్గాన మోసుకు వచ్చి ధర్మరాజుకు బహూకరించాడు. ధర్మరాజు ఒక శుభ ముహూర్తాన పురోహితుడైన ధౌమ్యుని ఆశీర్వాదంతో భార్యతో తమ్ములతో మయసభా ప్రవేశం చేసాడు. సామంతరాజులు ధర్మరాజుని దర్శించి కానుకలు సమర్పించారు.

నారదమహర్షి రాక

ఒకరోజు ధర్మరాజు వద్దకు నారదమహర్షి వచ్చాడు. ధర్మరాజు నారదమహర్షికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించాడు. నారదమహర్షి ధర్మరాజును రాజనీతి సంబంధమైన విషయాలు అడిగాడు. ధర్మరాజా నీవు ధర్మ మార్గము అనుసరిస్తున్నావు కదా ! రాజకార్యాలను ధర్మనిష్టతో, స్వబుద్ధితో అర్ధరాత్రి దాటిన తరువాత కూడా ఆలోచిస్తున్నావు కదా ! రాజోద్యోగాలలో యోగ్యులను, స్థిరచిత్తులను నియమించావు కదా! సమర్ధులైన బ్రాహ్మణులను, శాస్త్ర నియమాలు తెలిసిన వారిని మంత్రులుగా నియమించావు కదా ! నీ విజయానికి కారణమైన రహస్యాలోచనం ఎవరికి తెలియకుండా రక్షిస్తున్నావు కదా ! నీ చేత యజ్ఞములు చేయించిన యాజ్ఞికుడు యజ్ఞాలు సక్రమంగా నిర్వహిస్తున్నాడు కదా ! ఎల్ల వేళలా నీ మేలు కోరేవారిని విశ్వాసపాత్రులను సైన్యాద్యక్షులుగా నియమించావు కదా ! పలుకుబడి కలిగిన మంత్రి నీకు వ్యతిరేక కార్యాలలో దిగి నీకు ద్రోహం తలపెట్ట లేదు కదా ! ఎందు కంటే ధనము అధికారం ఎలాంటి వారికైనా గర్వం, దురాశను కలిగిస్తుంది. నీ రాజ్యంలోని శాస్త్రజ్ఞులు రాబోయే ఉత్పాతాలను కనిపెట్టి శాంతి క్రియలు చేపడుతున్నారు కదా ! ఆయుర్వేద వైద్యులు ప్రజలకు ప్రేమతో సేవ చేస్తున్నారు కదా ! ఆర్థిక సంబంధిత కార్యాలలో నైపుణ్యం కలవారిని, పాపరహిత చరిత్రులను, నీతి నియమాలు కలవారిని, ధర్మ పరీక్షలో నెగ్గిన వారిని నియమించావు కదా! యోగ్యతను దృష్టిలో ఉంచుకుని ఉత్తమ, మధ్యమ అధమ ఉద్యోగాలలో నియమించావు కదా ! నీ ఉద్యోగులకు సకాలంలో జీతభత్యాలు అందచేస్తున్నావు కదా ! లేకుంటే రాజుకు అది కీడు కలిగించ వచ్చు. వంశపారంపర్యంగా నీకు సేవ చేస్తూ ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్న ఉద్యోగులను గుర్తించి సత్కారాలు చేస్తున్నావు కదా ! నీ రాజ్యంలో నీ కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు తిండి, బట్ట, నీడ కల్పిస్తున్నావు కదా ! లోభబుద్ధి కలవాళ్ళను, దొంగలను, శత్రువులతో స్నేహంగా ఉండేవాళ్ళును, పిరికి వాళ్ళను, దుర్మార్గులను రాజకార్యాలను నిర్వహించడానికి పంపడం లేదు కదా! నీ రాజ్యంలో అనావృష్టి లేదు కదా ! చెరువులన్నీ నిండి ఉన్నాయి కదా ! పేద రైతులకు ఉచితంగా విత్తనాలు, తదితరాలు ఇస్తున్నావు కదా ! పౌరులకు నూటికి ఒకటి చొప్పున వడ్డీకి ఋణసౌకర్యం కల్పిస్తున్నావు కదా ! నీ రాజ్యం లోని కుంటి గుడ్డి, వికలాంగులు, అనాథలు, దిక్కులేని వారిని దయతో పోషిస్తున్నావు కదా ! యుద్ధంలో శరణన్న వారిని కాపాడుతున్నావు కదా ! నీకు మేలు చేసిన వారిని ఉచితరీతిన సత్కరిస్తున్నావు కదా ! నీకు వచ్చిన ఆదాయంలో నాల్గవ లేక రెండవ లేక మూడవ భాగాన్ని మాత్రమే ఖర్చు చేస్తున్నావు కదా ! ఆయుధాగారానికి, ధనాగారానికి సమర్ధులు మరియు నీతి మంతులను నియమించావు కదా ! వృద్ధులైన శిల్పులను, గురువులను, వర్తకులను పేదరికం లేకుండా పోషిస్తున్నావు కదా ! మంత్రులూ సేనానులూ అధికంగా ఉండగా కొలువు తీరుతున్నావు కదా ! బయట ఉన్న వారి వలన కాని లోపల ఉన్న వారి వలన కానీ శత్రురాజుల వలన కానీ ముప్పురాకుండా నిన్ను నీవు వేగులను నియమించి కాపాడు కుంటున్నావు కదా ! మంచి విద్వత్తు కలిగిన ప్రముఖలతో రాగద్వేష రహితంగా ధర్మం పాటిస్తూ వ్యవహారాలు చక్కపెడుతున్నావు కదా ! నీ పరి రక్షణలో ఉన్న ప్రాంతాలు, కోటలు, రాజ్యాలు అన్నీ ధనదాన్య సమృద్ధిగా ఉన్నాయి కదా ! ఉప్పు, పులుపు, కారము కలిగిన ఆహార పదార్ధాలు వివిధ పానీయాలు వంటసామాగ్రి, వంటచెరుకు సమృద్ధిగా ఉన్నాయి కదా ! నీ కోటలన్నీ శత్రువులకు అభేద్యంగా ఉన్నాయి కదా ! నీవు నీ అంతఃశత్రువులను జయించి పాలిస్తున్నావు కదా ! మదాంధులైన శత్రువులను జయిస్తున్నావు కదా ! నీ శత్రురాజులు నీపై దండెత్తకుండా వారిపై సామ, దాన, బేద, దండోపాయాలను ఉపయోగిస్తున్నావు కదా! అని నారద మహర్షి రాజులకు ఉపయుక్తమైన విధులన్నీ ప్రస్తావించాడు.

రాజులు చేయకూడని పనులు

అలాగే ధర్మజా ! రాజు చేయకూడని పనులు చెప్తాను విను అన్నాడు. రాజు నాస్తికుడిగా ఉండకూడదు. అబద్ధం ఆడకూడదు. ప్రమాదాలను ఆలస్యంగా గుర్తించ కూడదు. తెలివి తక్కువ వాళ్ళతో సమాలోచన చెయ్యకూడదు. ఎక్కువగా కోపగించ కూడదు. చేయవలసిన పనులను నాన్చకూడదు. ఆలస్యం చేయకూడదు. తెలివి కలిగిన వారిని ఆలస్యంగా గుర్తించ కూడదు. ప్రయోజకమైన విషయాలు తప్ప అప్రయోజక ఆలోచనలు చేయకూడదు. నిర్ణయించిన పనులు ఆపకూడదు. ప్రభుత్వ రహస్యాలను బయటపడనీయ కూడదు. ప్రజాహితకార్యాలు చేయకుండా జాగు చేయకూడదు. ఇంద్రియ సుఖాలకు ముఖ్యత్వం ఇవ్వకూడదు. సోమరితనం, నిర్లిప్తత, నిష్క్రియా తత్వం రాచకార్యాలలో తగదు. నారద మహర్షి మాటలను శ్రద్ధగా ఆలకించిన ధర్మరాజు " మహర్షీ ! నా యధాశక్తిన అధర్మాన్ని వదిలి ధర్మ మార్గంలో పాలన సాగిస్తున్నాను. తమరు మయ సభను చూసారా ఎలా ఉన్నది " అని అడిగాడు.

రాజసూయ యజ్ఞానికి నాంది

నారదుడు " ధర్మరాజా ! నేను దేవేంద్ర, యమ, వరుణ , కుబేర, బ్రహ్మదేవుల దివ్యసభలే కాక ఇంకా ఎన్నో సభలు చూసాను. అన్నింటి కన్నా మయసభ అపూర్వంగా ఉంది " అన్నాడు. ఒక సారి నేను బ్రహ్మ సభను చూసాను. దాని రూపం అద్భుతం. మరీచి, మనువు, సూర్యచంద్ర గ్రహాలు, దేవగణాలు, వసువులు, రుద్రులు, సిద్ధులు, సాధ్యులు, మహర్షులు, అశ్వినీ దేవతలు, విశ్వకర్మ, పితృదేవతలు, ధర్మార్ధ, కామ మోక్షాలు, శబ్ధ, గంధ, రూపాలు, తపస్సు, దమం, ధృతి, శ్మృతి, మేధ, క్షమ, బుద్ధి, కీర్తి, సంకల్పం, వికల్పం, ప్రణవం, క్షవం, లవం, తృటి, కాష్ఠ, ముహూర్తం, పగలు, రాత్రి, పక్షం, మాసం మొదలైన విభాగాలతో కూడిన కాలచక్రం, చతుర్వేదాలు, వేదాంగాలు, పురాణేతిహాసాలు, సాకారంగా బ్రహ్మదేవుని సేవిస్తుండగా సరస్వతీ సమేతుడై పద్మాసనంపై కూర్చుని జీవసృష్టి చేస్తుంటాడు. ఇది వింటున్న ధర్మరాజుకు ఒక సందేహం కలిగింది. నారదుడు వివిధ సభలను వర్ణిస్తూ కృతవీర్యుడు, జనమేజయుడు, పాండురాజు యమసభలో ఉన్నట్లు చెప్పాడు. కానీ మహారాజు హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఉన్నట్లు చెప్పాడు. " మహర్షీ ! పరమ ధర్మాత్ముడైన నా తండ్రిగారు యమసభలో ఉండగా హరిశ్చంద్రుడు మాత్రం ఇంద్రసభలో ఎలా ఉన్నాడు " అని అడిగాడు. " ధర్మరాజా ! త్రిశంకు మహారాజు పుత్రుడైన హరిశ్చంద్రుడు అందరు రాజులను జయించి రాజసూయ యాగం చేసాడు. అందువలన ఇంద్రసభలో ఉన్నాడు. నీ తండ్రిని యమసభలో సందర్శించినప్పుడు పాండురాజు నాతో " రాజసూయ యాగం చేసిన రాజులు ఇంద్రసభలో ఉంటారు. కనుక నా కుమారుడు ధర్మరాజుని రాజసూయ యాగం చేయమని ఆజ్ఞాపించానని చెప్పండి " అని అడిగాడు. కనుక ధర్మజా నీ తండ్రి ఆజ్ఞ ప్రకారం రాజసూయ యాగం చేసి నీతండ్రిని ఇంద్రసభకు వెళ్ళేలా చెయ్యి " అని చెప్పి నారద మహర్షి నిష్క్రమించాడు.ధర్మరాజు తన పురోహితుడు ధౌమ్యుడు ఇతర మంత్రులతో రాజసూయయాగం గురించి చర్చించాడు. అందుకు ధౌమ్యుడు " ధర్మరాజా నీ తండ్రి కోరిక తీర్చడం నీకర్తవ్యం. ఈ యాగం వలన సమస్త రాజులు సామంతులు ఔతారు. నీవు సంపదలు సమకూర్చుకోవడానికి ఇది తగిన సమయం " అని అన్నాడు. ధర్మరాజు తన తమ్ములతో కూడా చర్చించి రాజసూయ యాగం చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఈ యాగ నిర్వహణకు శ్రీకృష్ణుడు తగిన సమర్ధుడు అని శ్రీకృష్ణుని తీసుకు వచ్చేందుకు ద్వారకకు ఆప్తులను పంపాడు. ధర్మరాజు సందేశం అందుకుని శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్తానికి వచ్చాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని తగిన రీతిని సత్కరించాడు.

జరాసంధుడు


జరాసంధుని కథ
శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించాడు. ధర్మరాజుతో " ధర్మనందనా ! నీ నిర్ణయం ప్రశంశనీయం. పూర్వం జమదగ్ని కుమారుడైన పరశురాముడు క్షత్రియ వంశాలన్నీ నిర్మూలించాడు. అప్పుడే ఇక్ష్వాకు, ఇల అనే రెండు వంశాలు మిగిలాయి. అవి రెండే సహజ వంశాలు. మిగిలినవి మిశ్రమ వంశాలే. ఆ రెండు వంశాలు నూటొక్క వంశాలుగా వృద్ధి చెందాయి. యయాతి, భోజ, వంశాల వలన మరో పదునాలుగు వంశాలు ఏర్పడ్డాయి. ఈ రాజవంశాలనన్నింటిని జరాసంధుడు జయించాడు. ఛేది భూపాలుడు శిశుపాలుడు జరాసంధునికి సైన్యాధి పతి. హంసఢింబకులు అనే మహా బలవంతులు జరాసంధునికి ఆప్తులు. కౌశిక చిత్రసేనులు జరాసంధునికి కుడి ఎడమ భుజాలు. ఛేది రాజులలో పురుషోత్తముడు, అంగ, వంగ, పుండ్ర, కిరాత రాజులు పౌండ్రక వాసుదేవుడు జరాసంధుని సేవిస్తున్నారు. తూర్పు దక్షిణదేశాల రాజులు పురుజితుడు, కరూశుడు, కలభ, నకుల, సంకర్షణ, సూపహిత, మనోదత్త, చక్ర, సాల్వేయ, యవనులు జరాసంధుని కొలుస్తున్నారు. ఉత్తర దిక్కున పద్దెనిమిది మంది రాజవంశాలు భయంతో జరాసధుని కొలుస్తున్నారు. నేను వధించిన కంశుని భార్య జరాసంధుని కూమార్తె. అందు వలన జరాసంధుడు నా పై పగబూని ఉన్నాడు. ధర్మరాజా! ఆ హంస ఢింబకులు జరాసంధుడు మూడు లోకాలను జయించగలరు. ఒకసారి హంసఢింబకులతో మధురమీద దండెత్తారు. ఒక ఉపాయంతో హంసఢింబకులను చంపాము. ఇప్పుడు జరాసంధుడు నిస్సహాయుడు. మేము జరాసంధునితో విరోధం వలన రైవతకాద్రిలో కోట కట్టుకుని ఉన్నాము. మనం ముందు జరాసంధుని వధించాలి. అప్పుడు రాజసూయం సాధ్యపడుతుంది. నీ రాజ్యం స్థిరపడుతుంది. జరాసంధుడు ఎంతటి బలవంతుడైనా దుర్మార్గుడు కనుక పతనం తప్పదు " అని శ్రీకృష్ణుడు అన్నాడు.

జరాసంధ జననం

అప్పుడు భీముడు ధర్మరాజుతో " అన్నయ్యా ప్రయత్నంతో అన్ని విజయములు సమకూడుతాయి శ్రీకృష్ణుని దయ అర్జునిని సహాయం నీ అనుమతి ఉంటే జరాసంధుని సంహరిస్తాను " అన్నాడు. అర్జునుడు " అన్నయ్యా రాజులందరిని జయిస్తాము. రాజసూయం నిర్వహిస్తాము. లేకపోతే రాజసూయం, మయసభ, గాండీవం ఎందుకు " అని అన్నాడు . భీమార్జునుల మాటలు విని శ్రీ కృష్ణుడు సంతోషించాడు. ధర్మరాజు " కృష్ణా !అసలు జరాసంధుడు అంతటి బలవంతుడు ఎలా అయ్యాడు ? " అన్నాడు. శ్రీకృష్ణుడు " ధర్మనందనా ! మగధరాజైన బృహధ్రధుడు కాశీరాజు పుత్రికలను వివాహమాడాడు. వారికి సంతానం కలుగలేదు. అతడు భార్యలిద్దరితో అరణ్యాలకు పోయి ఛండకౌశికుడు అనే మునిని భక్తితో సేవించారు. వారి సేవలకు ఛండకౌశికుడు సంతోషించి వారిని చూసి " ఏమి వరం కావాలి కోరుకో " అన్నాడు. అందుకు బృహద్రదుడు " మహాత్మా నాకు పుత్రసంతానం ప్రసాదించండి " అని కోరాడు. అప్పుడు ఒక మామిడి చెట్టు మీద నుండి ఒక మామిడి పండు ఆ మహర్షి తొడమీద పడింది. మహర్షి ఆ పండును మంత్రించి బృహద్రదునికి ఇచ్చాడు. ఈ పండుని తిన్న వారికి సంతానం కలుగుతుంది అని చెప్పాడు. సంతోషంతో ఆ పండును ఇద్దరు భార్యలకు కోసి ఇచ్చాడు. ఇద్దరు గర్భం ధరించి ప్రసవించారు. ఇరువురికి నిలువుగా సగం చీలిన శరీరంతో రెండు శిశువులు జన్మించారు. ఆ శిశుఖండాలను చూసి భార్యలిరువురు భయపడ్డారు. బృహధ్రధునికి చూపించటానికి సిగ్గుపడి పరిచారికలకు ఇచ్చి బయట పారేయించారు. వారు వాటిని నాలుగుదారుల కూడలిలో పారవేసారు. అర్ధరాత్రి జర అనే రాక్షసి వాటిని తినాలని పట్టుకుని రెండు ముక్కలను పట్టుకుని చూడగా ఆశ్చర్యంగా రెండూ కలిసి ఒక బాలుని రూపంగా మారింది. ఆ బాలుని ఏడుపు విని అంతఃపురం లోని స్త్రీలు పరుగెత్తుకు వచ్చారు. వారిని చూసి రాక్షసి పారి పోయింది. ఇంలో అక్కడికి వచ్చిన బృహధ్రధుడు బాలుని చూసి సంతోషించాడు. ఇది గమనించిన రాక్షసి బృహధ్రధుని వద్దకు వచ్చి " మహారాజా ! నేను జర అనే రాక్షసిని. ఆ శిశుఖండాలు నా చేతిలో బాలుని రూపం ధరించాయి . ఇతడు వజ్రశరీరం కలవాడు. ఇతనిని స్వీకరింపుము " అని చెప్పింది. బృహధ్రధుడు జరతో " నీ దయ వలన నా వంశం ఉద్దరింప బడింది. కనుక ఈ బాలునికి జరాసంధుడు అని నామకరణం చేస్తాను. నీవు నాపాలిట పుణ్య దేవతవు " అన్నాడు. ఒకసారి ఛండకౌశికుడు బృహధ్రధుని వద్దకు వచ్చాడు . బృహధ్రధుడు ఆ మహర్షిని పూజించి తన కుమారుని చూపించాడు. ఛండకౌశికుడు బృహధ్రధునితో " వీడు పరాక్రమవంతుడౌతాడు. ఎలాంటి ఆయుధములు, అస్త్రములు, ఇతనిని చంప లేవు. ఇతడు రాజులందరిని జయిస్తాడు. ఆ రాజుల సంపదలన్నీ పొందుతాడు. ఆ పరమశివుని ప్రత్యక్షం చేసుకుంటాడు " అన్నాడు. అందువలన జరాసంధుడు అసమాన బలాడ్యుడు అయ్యాడు. బృహధ్రధుడు జరాసంధునికి రాజ్యం అప్పగించి తపోవనాలకు వెళ్ళాడు. ధర్మరాజా ! భీమసేనుడు ఒకడే జరాసంధుని చంపగల సమర్ధుడు. అందుకని భీమార్జునులను నాతో పంపు " అన్నాడు. " కృష్ణా ! నీ అండ ఉండగా మాకు పొంద లేనిది ఏమున్నది. ఇక జరాసంధుడు మరణించినట్లే . నేను రాజసూయం నిర్విఘ్నంగా నెరవేర్చినట్లే " అని భీమార్జునులను దీవించి శ్రీకృష్ణునితో పంపాడు.

జరాసంధ వధ


జరాసంధుని భవనంలో కృష్ణార్జునులు భీముడు

శ్రీకృష్ణుడు భీమార్జునులతో కలసి కపట బ్రాహ్మణ రూపాలలో కపట స్నాతక వ్రతం స్వీకరించారు. జరాసంధుని నగరమైన గిరివ్రజపురం ససమీపించారు. ఆ పురం చుట్టూ ఉన్న పర్వతాలు ప్రాకారాలలా ఆ పురాన్ని రక్షిస్తున్నాయి. పక్కనే చైత్యకమనే కొండ ఉంది. దానిపై మూడు ఢక్కలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు భీమార్జునులకు ఆ ఢక్కలను చూపి " భీమా నగరంలోకి ఎవరన్నా కొత్త వారు ప్రవేశిస్తే ఆ ఢక్కలు మోగుతాయి " అని చెప్పాడు. భీమార్జునులు ఆఢక్కలను పగులకొట్టి చైత్యకపర్వత మార్గంలో నగరంలో ప్రవేశించారు. శ్రీకృష్ణుడు భీమార్జునులు సిగలో పూలు అలంకరించుకున్నారు. స్నాతకుల మాదిరి గోశాలలో ప్రవేశించారు. జరాసంధునికి బ్రాహ్మణులంటే భక్తి ప్రపత్తులు మెండు కనుక బ్రాహ్మణులు రాజమందిరంలోకి ఎప్పుడైనా వెళ్ళవచ్చు. బ్రాహ్మణవేషాలలో ఉన్న శ్రీకృష్ణుడు భీమార్జునులకు అర్ఘ్యపాద్యాలను ఇచ్చాడు. వారు

భీమ జరాసంధుల పోరాటం

వాటిని పుచ్చుకోలేదు. జరాసంధుడు సందేహపడి వారిని " మీరు గంధపుష్పాలు ధరించినా స్నాతకులుగా లేరు. మీ ఆకారాలు క్షత్రియుల మాదిరి ఉన్నాయి. మీరు ఎవరు? ఎందుకు వచ్చారు? " అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు, భీమార్జునులు " మేము క్షత్రియ స్నాతకులము. ముఖద్వారం గుండా మిత్రుల ఇంటికి, దొంగ ద్వారం గుండా శత్రువుల ఇంటికి ప్రవేశించడం క్షత్రియ ధర్మం " అన్నారు. జరాసంధుడు " నేను ఎవరికి అపకారం చేయలేదు. నేను బ్రాహ్మణులకు, దేవతలకు, మునులకు భక్తుడను. ఉత్తమ క్షత్రియ ధర్మాలు ఆచరిస్తున్నాను. మీకు నేనెలా శత్రువునైయ్యాను " అన్నాడు. " ఓ జరాసంధా ! ధర్మరాజు ఆజ్ఞపై శత్రుసంహారానికి వచ్చాము. ఉత్తమ క్షత్రియుడిని అని చెప్పుకుంటున్న నీవు క్షత్రియులను పట్టి బంధించి శివునకు బలి ఇచ్చి శివపూజలు ఎలా నిర్వహిస్తావు? ఉత్తమ క్షత్రియులు ఇలా చేస్తారా ? నిష్కారణంగా సాధు హింస చేసే వారు, జనులను హింసించే వారు అందరికి శత్రువులు కారా ? నిర్ధోషులైన సాటి కులం వారిని చంపడం పాపం కాదా. అలాంటి పూజలు ఫలిస్తాయా ? నీలాంటి పాపులను విడిచి పెడితే మాకు పాపం వస్తుంది. కనుక నీతో యుద్ధానికి వచ్చాము. నేను కృష్ణుడిని, ఇతను భీముడు, అతడు అర్జునుడు. ఇప్పటికైనా చెరలో ఉన్న రాజులను విడిచిపెడితే సరి లేని యడల వీరు నీ గర్వమణచి వారిని విడిపించ కలరు " అని శ్రీకృష్ణుడు అన్నాడు. జరాసంధుడు కోపించి " పరాక్రమంతో రాజులను జయించడం నేరమా. పరమ శివునకు బలి ఇవ్వడానికి తెచ్చిన వారిని నేను ఎందుకు

జరాసంధుని ముక్కలుగా చీలుస్తున్న భీముడు
వదిలి పెడతాను. సైన్యంతో వస్తే సైన్యంతో యుద్ధం చేస్తాను. లేనియడల మీ ముగ్గురితో కానీ, ఇద్దరితో కానీ, ఒక్కరితో కానీ యుద్ధం చేస్తాను మీకు ఏది ఇష్టమో చెప్పండి " అన్నాడు. శ్రీకృష్ణుడు " ముగ్గురు నీతో యుద్ధం చేయడం ధర్మంకాదు. మా ముగ్గురిలో నీకు సరిజోడుని కోరుకో. అతను మల్ల యుద్ధంలో నిన్ను జయిస్తాడు " అని అన్నాడు. జరాసంధుడు " నాకు సరిజోడు భీముడే. కనుక అతనితో యుద్ధం చేస్తాను " అని చెప్పాడు. జయాపజయాలు దైవాధీనం కనుక జరాసంధుడు ముందుగా కుమారుడు సహదేవునికి రాజ్యాభిషేకం చేసాడు. పురోహితుల చేత మంగళ శాసనాలు పొంది భీముని మల్ల యుద్ధానికి పిలిచాడు. భీముడు జరాసంధుడు ఘోరంగా తలపడ్డారు. ఒకరిని ఒకరు జయించాలన్న కాంక్షతో ఒకరిని మించి ఒకరు భీకరంగా తల పడ్డారు. ఇలా కార్తీక శుద్ధ పాడ్యమి నుండి త్రయోదశి వరకు సాగింది. అప్పటికి జరాసంధుడు అలసి పోయాడు. శ్రీకృష్ణుడు " భీమా ! జరాసంధుడు అలసి పోయాడు. ఇది తగిన సమయం అతడిని సంహరించు " అన్నాడు. భీమసేనుడు తన తండ్రి వాయుదేవుని తలచుకుని జరాసంధుని గిరా గిరా తిప్పి నూరు సార్లు విసిరి వేసాడు. అతడి ఎముకలు విరిచి ఘోరంగా సంహరించాడు. జరాసంధుని మృతదేహాన్ని అతని ముఖద్వారం ముందు పడవేశాడు. శ్రీకృష్ణుడు మగధవాసులకు అభయం ఇచ్చాడు. జరాసంధుని చెరలో ఉన్న రాజులను విడిపించాడు. జరాసంధుడి కుమారుడైన సహదేవునికి ధైర్యం చెప్పాడు. తరువాత వారు ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు. ధర్మరాజుకు జరిగినది చెప్పి విడిపించిన రాజులను చూపించాడు. రాజులంతా వారి వారి రాజ్యాలకు పయనమయ్యారు. శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుకున్నాడు.

జైత్ర యాత్ర

ధర్మరాజు తన నలుగురు తమ్ములను నలుగురిని పిలిచి నాలుగు దిక్కులకు జైత్రయాత్రకు పంపాడు.

అర్జునిని జైత్రయాత్ర

అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. ఉత్తర దిక్కున ఉన్న పుళిందుడిని, ప్రతివీద్యుడిని, ఆఖిలద్వీప మండలాధీశులను ఓడించి సామంతులను చేసాడు. ప్రాగ్జోతిషపుర మహారాజు భగదత్తుడి మీద దండెత్తాడు. అతనితో ఎనిమిది రోజులు యుద్ధం చేసాడు. భగదత్తుడు తన బలం క్రమంగా కోల్పోయాడు. భగదత్తుడు " అర్జునా ! మనమిరువురం ఇంద్రుని పుత్రులం. మనం యుద్ధం చేయడం ఉచితం కాదు. నీకు ఏమి కావాలో చెప్పు " అన్నాడు. అర్జునుడు " భగదత్తా ! ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడు. నీవు కప్పం చెల్లించు. యాగానికి రా " అన్నాడు. తరువాత అర్జునుడు అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరి రాజులను జయించి కప్పం గ్రహించాడు. ఉలూక దేశాధిపతి బ్రహంతుని, ఉత్తర ఉలూక దేశాధిపతులను, దేవప్రస్థ రాజు సేనా బిందుడిని, విష్వగశ్వుడిని, పర్వత రాజులను, బర్బర, శబర, తురుష్క రాజులను, మాళవ, పౌండ్ర, కాశ్మీరాది దేశాధిపతులను ఓడించాడు. సింహపురాధీశుడు, చిత్రాయుధుని, ఆటవిక రాజులను, దస్యులను, కాంభోజ కటక రాజును జయించాడు. మేరు పర్వతాన్ని దర్శించాడు. ఉత్తర కురుదేశాలమీద దండెత్తి ఓడించాడు. వారివద్ద కప్పములు, రత్నాభరణాలు గ్రహించాడు. ఈ విధంగా అర్జునుడు ఉత్తరదేశ జైత్ర యాత్ర పూర్తి చేసాడు.

భీమసేనుని జైత్రయాత్ర

భీమసేనుడు తూర్పుదేశా జైత్ర యాత్రకు వెళ్ళాడు. పాంచాలదేశం, విదేహదేశం, దశార్ణ దేశం జయించి ఛేది దేశంలో అడుగుపెట్టాడు. ఛేది రాజు శిశుపాలుడు భీమసేనుడికి లొంగిపోయి కప్పం కట్టాడు. ఆ విధంగా భీమసేనుడు తూర్పుదేశాలను జయించాడు. కోట్లసంఖ్యలో రత్నములు, వజ్రములు, బంగారం, ధనం కప్పంగా తీసుకు వచ్చాడు.

సహదేవుని జైత్రయాత్ర

సహదేవుడు దక్షిణ దిశగా జైత్ర యాత్రకు వెళ్ళాడు. సుమిత్రుడు, శూరసేనుడు, దంతవక్త్రుడు, యవనులను జయించాడు. నర్మదా నది తీరాన అవంతీ రాజులను ఓడించాడు. మహిష్మతీ పురం చేరాడు. ఆ దేశపురాజు నీలుడితో యుద్ధం చేసాడు. సహదేవుని సైన్యం మీద నీలుడు అగ్ని దేవుని పురికొల్పాడు. పూర్వం నీలుని వంశస్థుడు అయిన నిషాధుడు రాజ్యం చేసే సమయంలో అగ్ని దేవుడు బ్రాహ్మణ రూపంలో మహిష్మతీ పురంలో వేదాధ్యనం చేస్తున్నాడు. ఆ సమయంలో పొరపాటున పరస్త్రీతో సంగమించాడు. రాజభటులు అగ్ని దేవుని పట్టుకుని నిషధుని ముందు నిలబెట్టారు. అగ్ని దేవునికి కోపం వచ్చి తన నిజరూపం చూపించాడు. తన అగ్ని కీలలతో బుసలు కొట్టారు. నిషధుడు భయపడి అతనికి మొక్కాడు. అగ్ని దేవుడు శాంతించి నిషధుడిని వరం కోరుకొమ్మని చెప్పాడు. నిషధుడు " అగ్ని దేవా ! భవుష్యత్తులో మహిష్మతిపురం మీద దండెత్తిన వారిని దగ్ధం చేయి " అడిగాడు. బదులుగా అగ్నిదేవుడు నిషధుణ్ణి " మహిష్మతీపుర వనితలు శృంగారవతులు. వారి స్వేచ్చావివాహారానికి నీవు అనుమతి ఇవ్వాలి " అని అడిగాడు. అగ్ని దేవుని ప్రభావంతో సహదేవుని సైన్యాలను అగ్ని కీలలు చుట్టుముట్టాయి. సహదేవుడు శుచియై అగ్ని దేవుని స్థుతించాడు. అగ్ని దేవుడు అభయం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న నీలుడు సహదేవునితో స్నేహంచేసి విలువైన కానుకలు కప్పంగా ఇచ్చాడు. సహదేవుడు అక్కడ నుంచి రుక్మి, భీష్మక, శూర్వాక, దండక రాజులను జయించాడు. వారు సహదేవునికి కప్పం చెల్లించాడు. దక్షిణ సాగర ప్రాంతరాజులను జయించాడు. తాళవనం, పాండ్య, కేరళ, కాళింగ, ద్రవిడ, యవన, కరహాటక, రాజులను జయించాడు. చివరిగా లంకాధిపతి విభీషణునికి ధర్మరాజు రాజసూయ యాగం గురించి, తన దక్షిణదేశ జైత్ర యాత్ర గురించి వివరించి విభీషణుని వద్ద కప్పం తీసుకురమ్మని దూతలను పంపాడు. విభీషణుడు అందుకు అంగీకరించి కప్పం పంపాడు. సహదేవుని జైత్రయాత్ర పూర్తి చేసాడు.

నకులుని జైత్రయాత్ర

నకులుడు పశ్చిమదిశగా జైత్రయాత్రకు బయలుదేరాడు. మహితక దేశాన్ని, మరు, మాళవ, బర్బర, కర్బర, శైరీషక, దాశార్ణ దేశాలు జయించాడు. ద్వారకకు వచ్చి శ్రీకృష్ణునకు తన రాక తెలిపాడు. తన మేనమామ మద్రదేశాధిపతి శల్యుని వద్దకు వెళ్ళి అతని వద్ద నుండి మర్యాద పూర్వకంగా కప్పం కట్టించుకున్నాడు. మిగిలిన దేశాలను జయించి కప్పం కట్టించుకుని తిరిగి వచ్చాడు.

రాజసూయ యాగం ఏర్పాట్లు

భీమసేనుడు, అర్జునుడు, సహదేవుడు, నకులుడు నాలుగు దిక్కులను జయించి అసంఖ్యాకంగా ధన, కనక, వస్తు, వాహనములు తీసుకు వచ్చారు. ద్వారక నుండి శ్రీకృష్ణుడు అశేష ధన, కనక, వస్తు, వాహనాలతో వచ్చాడు. అవన్నీ ధర్మరాజుకు ఇచ్చి గౌరవించాడు. ధర్మరాజు అవి చూసి సంతోషించి రాజసూయయాగం ప్రారంభించాడు. ధర్మరాజు శ్రీకృష్ణునితో " కృష్ణా ! నీ దయ వలన సార్వభౌమత్వం లభించింది. అశేష సంపదలు లభించాయి. నన్ను రాజసూయయాగం చేయడానికి నియోగించు " అన్నాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో "ధర్మరాజ ! నీవు రాజసూయ యాగం ప్రారంభించు అందుకు నీ ఇష్టం పనికి నన్ను నీ ప్రియం కోరే ఇతరులను అనుమతించు " అన్నాడు. శ్రీకృష్ణుని అనుమతి పొంది ధర్మరాజు రాజసూయం ప్రారంభించాడు. యాగానికి కావలసిన ఏర్పాట్లను చూడటానికి సహదేవుని నియమించాడు. శిల్పులను పిలిపించి యజ్ఞశాలను నిర్మింపచేసాడు. నానా దేశాధీసులకు ఆహ్వానం పంపాడు. ఆహారధాన్యాలను సమృద్ధిగా సమకూర్చారు. ధర్మరాజు ఆహ్వానాన్ని మన్నించి భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, సోమదత్తుడు, కర్ణుడు, భూరిశ్రవుడు, శల్యుడు, శకుని, సైంధవుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు తదితరులు రాజసూయయాగానికి విచ్చేసారు. వచ్చినవారిని ధర్మరాజు తగిన రీతిన సత్కరించి వసతి ఏర్పాట్లు చేసాడు. అందరికి దానధర్మాలు చేయడానికి అధిపతిగా కృపాచార్యుని, కార్యాచరణకు భీష్ముని, ద్రోణుని, సకల వస్తు వ్యయమునకు విదురుని, నానాదేశరాజులు తెచ్చిన కానుకలు స్వీకరించటానికి దుర్యొధనుడిని నియోగించాడు. శుభముహూర్తములోధర్మరాజు యజ్ఞ దీక్ష తీసుకుని యజ్ఞశాలలో ప్రవేశించాడు. పైలుడు, ధౌమ్యుడు ఋగ్వేద ఋత్విక్కులుగానూ, యాజ్ఞవల్క్యుడు యజుర్వేద ఋత్విక్కునిగానూ, సుసాముడు సామవేద ఋత్విక్కుగానూ, వేదవ్యాసుడు ప్రధాన ఋత్విక్కుగానూ నారదాది మహర్షులు సదస్యులుగానూ భీష్ముడు సహాయకుడుగానూ ఉండగా యాగం మొదలైంది.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat