మహాభారతం - సభా పర్వము - ద్వితీయాశ్వాసం

P Madhav Kumar

ద్వితీయాశ్వాసం

రాజసూయ యాగమును చేయుచున్న యుధిష్టురుడు


- రాజసూయయాగం ప్రారంభం అయింది. భీష్ముడు ధర్మరాజుతో ఇలా అన్నాడు " ధర్మరాజా ! స్నాతకుడు, ఋత్విజుడు ,భూతలేశుడు, సద్గురుడు, జ్ఞానసంపన్నుడు, అందరికీ ఇష్టుడు అయిన మహానుభావుని ఒకరిని పూజించు " అని అన్నాడు. ధర్మరాజు భీష్మునితో " పితామహా ! అటువంటి మహానుభావుడెవరో మీరే శలవీయండి " అన్నాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఇంక ఎవ్వరున్నారు ? సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడే అగ్ర పూజకు తగిన వాడు " అని ధర్మరాజుతో చెప్పాడు. తనమనసులో మాట చెప్పినందుకు ధర్మరాజు ఆనందపడి సహదేవుడు తెచ్చిన అర్ఘ్యపాద్యాలను శ్రీకృష్ణునకు సమర్పించాడు. ఇది చూసి శిశుపాలుడు సహించలేక పోయాడు. ధర్మరాజుని చూసి " ఓ ధర్మరాజా! ఈ సభలో ఎందరో మహారాజులు, బ్రాహ్మణోత్తములు ఉన్నారు. వారిని కాదని ఈ గాంగేయుడు చెప్పాడని చెడు నడవడి కలిగిన ఈ కృష్ణుని పూజిస్తావా ? ఇది అవివేకం కాదా ? ఈ భీష్మునికి ఆలోచనలేకపోతే నీ బుద్ధి ఏమైంది? మీకు కృష్ణుడు కావలసిన వాడైతే మీ ఇంటికి తీసుకు వెళ్ళి పూజలు చేయండి. ఈ మహాసభలో పూజించి మమ్మల్ని అవమానించ కండి. కృష్ణుడు ఇంతటి మర్యాదకు అర్హుడు కాదు " అంటూ శిశుపాలుడు సభ విడిచి వెళ్ళాడు. ధర్మరాజు శిశుపాలుని వెంట వెళ్ళి " శిశిపాలా ! నీ వంటి ప్రభువులు ఇలా పరుషంగా మాటాడ తగునా ? శ్రీకృష్ణుడు సాక్షాత్తు మహావిష్ణు అవతారం కనుక భీష్ముడు అగ్రపూజ చేయమన్నాడు. లోకోత్తరుడని అందరిచే శ్లాగించబడే కృష్ణుని నువ్వు ఇలా కాదనడం భావ్యమా ? " అని శిశుపాలునికి నచ్చచెప్ప పోయాడు. భీష్ముడు " ధర్మరాజా ! శిశుపాలుడు బాలుడు, చెడు నడత కలిగిన వాడు. పెద్దలను అకారణంగా నిందించే వాడు. కొద్దిపాటి రాజ్యం లభించగానే మదం ఎక్కిన వాడు. వాడికి ధర్మాధర్మాలు తెలియవు. అతడిని ఒప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తావు ? " అని శిశుపాలుని చూసి " శిశుపాలా! బుద్ధిహీనుడా శ్రీకృష్ణునికి అగ్రపూజకు అర్హత లేదా ? ఇక్కడ ఉన్న రాజులంతా జరాసంధుని నుండి విడిపించింది ఈ మహానుభావుడే కదా. బాలుడైనా జ్ఞానవృద్ధుడు పూజనీయుడే. అమిత పరాక్రమవంతుడైన క్షత్రియుడు పూజనీయుడే. శ్రీకృష్ణుడు మహాజ్ఞాని, మురుడు అనే రాక్షసుని సంహరించిన పరాక్రమ వంతుడు. ఇతరులను పూజిస్తే వారు మాత్రం తృప్తి చెందుతారు. లోకారాద్యుడైన కృష్ణుని పూజిస్తే లోకమంతా తృప్తి చెందుతుంది " అన్నాడు. ఇంతలో సహదేవుడు లేచి " శ్రీకృష్ణునికి అగ్రపూజ చేయడం మా ఇష్టం . కాదన్న దుర్జనులను నా పాదం క్రింద అణిచివేస్తాను " అంటూ పాదం ఎత్తి భీకరంగా నిలబడ్డాడు. సభ అంతా సహదేవుని భీకరరూపంచూసి భయపడింది. శిశుపాలుని సైన్యాధిపతి తన సైన్యాన్ని తమపక్షాన ఉన్న రాజులందరిని ఒకటిగా చేర్చి యుద్ధానికి సిద్ధం అయ్యాడు. ఈ పరిణామానికి ధర్మరాజు కలత చెందాడు. భీష్ముని చూసి " పితామహా ! ఆహుతులైన రాజులంతా కలత చెంది ఉన్నారు. తమరే శాంతింప చేయాలి " అన్నాడు . భీష్ముడు " ధర్మజా! కలత పడకు. సకల రాక్షస సంహారుడు శ్రీకృష్ణుడు యాగరక్షకుడుగా ఉండగా ఈ యాగాన్ని ఎవరూ విఘ్నం చేయలేరు " అన్నాడు. ఆ మాటకు శిశుపాలుడు కోపించి " ఈ ముసలి భీష్ముడు యాదవుని పరమేశ్వరునిగా చేసాడు. ఈ పాండవువులు ధర్మాత్ములూ, ధీరులూ అయితే ఇక్కడున్న రాజులు అధర్మవర్తనులూ అధీరులా ? పూతన అనే స్త్రీని చంపుట, ప్రాణ రహితమైన బండిని తన్నుట, పుచ్చిన చెట్లను పడత్రోయుట, చిన్న పుట్టలాంటి కొండను ఎత్తుట పరాక్రమమా ? స్త్రీ వధ చేసినవాడికి మర్యాదలా ? అలాంటి వారిని పొగిడే వారిని సహస్ర చీలికలుగా చేయాలి. ఇక తమరి సంగతి మరొకరు ప్రేమించిన కన్యను తమ్ముడికి కట్టబెట్టాలని చూసావు. కాని ధర్మం తెలిసిన నీ తమ్ముడు అంబను విడిచి పెట్టాడు. సంతాన హీనుడివి నాకు ధర్మపన్నాలు చెప్తావా! ఈ కృష్ణుడు వీరత్వం తెలియనిదా. మహావీరుడైన జరాసంధునికి భయపడి పది సార్లు పారిపోయాడు. కపట బ్రాహ్మణవేషాలలో వెళ్ళి చంపడం వీరత్వమా ? " అని దూషించాడు. శ్రీకృష్ణుని తూలనాడటం సహించలేని భీముడు శిశుపాలుని చంపటానికి ముందుకు దూకాడు. భీష్ముడు భీముని ఆపాడు.

సభలో కృష్ణుని గొప్పతనమును గురించి చెప్పుచున్న భీష్ముడు

 

శిశుపాలుని జన్మవృత్తాంతం-వధ


నరకాసురుని మరణము తరువాత అదితి కుండలములను తిరిగి ఇస్తున్న అతని తల్లి భూదేవి
భీష్ముడు భీమునితో " భీమసేనా! ఈ శిశుపాలుని నువ్వు చంపరాదు. ఈ దుర్మార్గుడు దమఘోషుడు సాత్వతికి పుట్టాడు. పుట్టుకతోనే నాలుగు భుజాలతో, నొసటి మీద కంటితో, గార్దభ స్వరంతో పుట్టాడు. తల్లి తండ్రులు ఆ బాలుని చూసి కలత చెందారు. అప్పుడు అశరీరవాణి ఈ బాలుడిని ఎవరు ఎత్తుకున్నప్పుడు మామూలు రూపం పొందుతాడో అతని చేతిలో ఇతడు హతుడు కాగలడు " అని పలికింది. అప్పటి నుండి ఆ బాలుని ఇంటికి ఎవరు వచ్చినా చేతికి ఇవ్వసాగారు. ఒకరోజు బలరామ కృష్ణులు ఆ బాలుని చూడటానికి వచ్చారు. శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఆ బాలునికి మామూలు రూపం వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుని చేతిలో అతని మరణం తధ్యమని భావించిన సాత్వతి శ్రీకృష్ణుని చూసి " కృష్ణా ! నీ మరిది అయిన శిశుపాలుని రక్షించు " అని కోరింది. అలాగే అన్నాడు కృష్ణుడు. ఇతని నూరు తప్పులు సహిస్తాను అవి పూర్తి కాగానే నా చేతిలో హౌతుడౌతాడు " అని చెప్పాడు భీష్ముడు. అప్పటికి శిశుపాలుడికి బుద్ధి రాలేదు." కృష్ణా! ఈ ముసలి భీష్ముడు పాండవులు నిన్ను

శిశుపాలునిపై చక్రాయుధం ప్రయోగించిన కృష్ణుడు

సన్మానించడం నేను సహించలేను. నాతో యుద్ధానికి సిద్ధం కండి " అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సభాసదులను చూసి " మేము ప్రాగ్జ్యోతిష పురం మీద దండెత్తినప్పుడు ఈ శిశుపాలుడు ద్వారకను తగులబెట్టాడు. భోజరాజులు రైవతకాద్రి మీద భార్యలతో గడుపుతుంటే వారిని దారుణంగా చంపాడు. నా తండ్రి వసుదేవుడు అశ్వమేధయాగం చేస్తుంటే అశ్వాన్ని అపహరించాడు. బబ్రుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు. నా అత్త సాత్వతి కోరిక ప్రకారం నూరు తప్పులు సహించాను. ఇతడు నాకు పరమ శత్రువు అయ్యాడు " అన్నాడు. శిశుపాలుడు శ్రీకృష్ణుని చూసి " నేను వివాహమాడదలచిన కన్యను అపహరించి సిగ్గులేకుండా మాట్లాడుతున్నావా ? " అని దూషించావు .ఇక శ్రీకృష్ణుడు సహించలేక పోయాడు . తన చక్రాయుధం ప్రయోగించి శిశుపాలుని శిరస్సు ఖండించాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజు తో అతని అంత్యక్రియలు జరిపించమన్నాడు. శిశుపాలుని కుమారుని ఛేదిదేశానికి రాజుని చేసాడు. శిశుపాలుని వధతో రాజసూయం పరిసమాప్తి అయింది.

రాజసూయయాగం అనంతర విశేషాలు


నేల అని భ్రమపడి నీటిలో పడ్డ ధుర్యోధనుడు
ధర్మరాజు రాజసూయానికి విచ్చేసిన దేవతలను, గురువులను, బ్రాహ్మణులను తగు రీతిని సత్కరించి తృప్తిపరిచాడు. ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం భీమసేనుడు భీష్మ , దృతరాష్ట్రులను సాగనంపాడు. అలాగే అర్జునుడు దృపదుని సాగనంపారు. నకులుడు శల్యుని, సుబలుని సాగనంపాడు. సహదేవుడు ద్రోణ, కృప అశ్వత్థామ లను సాగనంపాడు. శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు వద్ద సెలవు తీసుకుని ద్వారకకు పయనమైయ్యాడు. పాడవులందరూ శ్రీకృష్ణుని సాగనంపారు. మయసభా విశేషాలు చూడటానికి శకుని దుర్యోధనుడు ఇంద్రప్రస్థంలో ఉన్నారు. ఒక రోజు సుయోధనుడు ఒంటరిగా మయసభను చూడటానికి వెళ్ళాడు. దాని అపూర్వ సౌందర్యానికి ఆశ్చర్యపడ్డాడు. దుర్యోధనుడు మయసభను చూసే సమయంలో అక్కడక్కడా భంగపడ్డారు. తెరచిన ద్వారం మూసి ఉన్నట్లు గానూ, మూసిన ద్వారం తెరచినది గాను భ్రమించి లలాటం కొట్టుకున్నాడు. నీరులేనిచోట ఉన్నదని, నీరు ఉన్న చోట లేదు అని బ్రమపడి దిగి దుస్తులు తడుపుకున్నాడు. అతని అవస్థ చూసి ధర్మరాజు సుయోధనునికి నూతన వస్త్రాలు ఇచ్చాడు. కానీ దుర్యోధనుడు అది తనకు జరిగిన అవమానంగా భావించి రోషపడ్డాడు. హస్థినకు బయలుదేరాడు. మయసభా విభవం పాండవుల వైభవం అతనిలో అసూయా అగ్నిజ్వాలలా రగిలించింది. దుర్యోధనుడు అసూయతో రోజురోజుకు కృశించి పోసాగాడు. శకుని ఇది గమనించి " సుయోధనా నీకు ఏమైంది? " అని అడిగాడు. దుర్యోధనుడు " మామా మయసభ చూసావు కదా. అంతటి మయసభ కలిగిన ధర్మరాజు ఎంతటి అదృష్ట వంతుడు. ధర్మరాజు చక్రవర్తి అయ్యాడు. రాజులంతా ధర్మరాజుకు అమూల్యమైన కప్పములు సమర్పించారు. శ్రీకృష్ణుడు శిశుపాలుని వధించినా రాజులు పొగిడారు కాని ఏమని అడగలేదు. పాండవుల ఐస్వైర్యం సహించరానిదిగా ఉంది. అభిమానధనుడు దాయాదుల వైభవాన్ని సహింపకలడా ? " అని దు॰ఖించాడు. శకుని " సుయోధనా ! దృతరాష్టృని అనుమతి పొంది నా మాట పాటిస్తే పాండవ లక్ష్మిని నీకు చెందేలా చేస్తాను " అన్నాడు.

మాయా జూదానికి నాంది

దుర్యోధనుడు శకునినితో దృతరాష్ట్రుని వద్దకు వెళ్ళాడు. కుమారుడు కృశించి పోతున్నాడని విని ధృతరాష్ట్రుడు చింతించాడు. " నాయనా సుయోధనా ! కౌరవ సంపదనంతా నీకు ఇచ్చాను కదా. దేవేంద్రునితో సమానమైన భోగభాగ్యాలు నీకు ఉన్నాయి కదా. నీవిలా కృశించడం ఎందుకు ? " అని అడిగాడు. " తండ్రీ ! పాండవుల ఐశ్వర్యం దేవేంద్రుని కంటే గొప్పది. వారి కీర్తి నలుదిశలా వ్యాపించింది. వారితో పోలచడానికి మూడు లోకాలలోని రాజులు సరిపోరు. హరిశ్చంద్రుడు చేసిన రాజసూయయాగం కంటే పాండవులు చేసిన రాజసూయ యాగం గొప్పది. సామంతుల వలన అశేషరత్నాభరణాలు కప్పంగా పొందారు. ధర్మరాజుకు సాత్యకి ముత్యాల ఛత్రం పట్టాడు. భీముడు చామరం వీచాడు. రాజులందరి చేత శ్రీకృష్ణుడు ధర్మరాజుకు మొక్కించాడు. సాటి రాజ కుమారుడుగా నేనిది సహించలేను " అన్నాడు. శకుని దుర్యోధనునితో " ధర్మరాజు జూద ప్రియుడు. అందులో కపటం తెలుయని వాడు. నేను అక్షవిద్యలో నేర్పరిని. జూదంలో ధర్మరాజుని అక్రమంగా ఓడించి అతని సంపద అంతా సుయోధనుని హస్తగతం చేస్తాను " అన్నాడు. సుయోధనుడు సంతోషించి " తండ్రీ ! ఇందుకు మీరు అంగీకరించండి " అన్నాడు. ధృతరాష్ట్రుడు " విదురుడు చాలా దూర దృష్టి కలవాడు. నీతి కోవిదుడు. మీ ఇరువురి క్షేమం కోరేవాడు. అతనితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము " అని అన్నాడు. దుర్యోధనుడు " తండ్రీ !విదురుడు పాండవ పక్షపాతి. అతడు ఇందుకు అంగీకరించడు. మీరు అంగీకరించనిచో నేను అగ్ని ప్రవేశం చేస్తాను మీరు విదురుడు సంతోషంగా ఉండండి " అన్నాడు. జూదం తగదని సంశయిస్తూనే ధృతరాష్ట్రుడు కుమారుని సంతోషపెట్టడానికి సభానిర్మాణానికి ఏర్పాట్లు చెయ్యమని చెప్పాడు. ఒక నాడు విదురునితో సుయోధనుని అభిప్రాయం చెప్పాడు. విదురుడు " ఇందుకు నేను అంగీకరించను. పాండవులకు కౌరవులకు విరోధం కలగడానికి పునాది వెయ్యద్దు. ఎంతటి శాంత స్వభావులకైనా జూదం విరోధం కలిగిస్తుంది. పాండవులు కౌరవులు కలసి ఉండేలా ఏర్పాటు చెయ్యి " అన్నాడు. ధృతరాష్ట్రుడు " విదురా ! నీవు అనవసరంగా అనుమాన పడవద్దు. మీరు భీష్ముడు ఉండగా అన్నదమ్ముల మధ్య విరోధం ఎందుకు వస్తుంది. కనుక నీవు ఈ జూదానికి అంగీకరించి ఇంద్రప్రస్థానికి వెళ్ళి పాండవులను జూదానికి తీసుకురా " అన్నాడు. ధృతరాష్ట్రుడు " దుర్యోధనా ! ఈ జూదం వలన మీకు విరోధం వస్తుంది మీ విరోధం భూమి మీద ప్రజలందరికి కీడు చేస్తుంది. విదురునికి ఇందులో అంగీకారం లేదు. నీకు సంపద కావాలంటే నీవు కూడా యాగం చెయ్యి. మీ రిద్దరూ రాజ్యాన్ని పాలించండి " అన్నాడు. దుర్యోధనుడు " మహారాజా ! ధర్మరాజు జూదం ఆడుతుండగా చూడటం ఒక యజ్ఞం. నేను సకలైశ్వర్యములు పొందడానికి అది మార్గం. శత్రువుల అభివృద్ధిని ఉపేక్షించిన మనలను అది నాశనం చేస్తుంది. పాండవుల ఐశ్వైర్యాన్ని కొల్లగొడితే కాని నాకు ఉపశమనం లేదు " అన్నాడు. వెంటనే శకుని " సుయోధనా! ఎలాంటి సైన్యం లేకుండా యుద్ధం రక్త పాతం లేకుండా పాచికలాడించి పాండవ రాజ్యలక్ష్మిని నీకు ఇస్తాను. జూదం కాక వేరు ఏ విధంగా పాండవులను జయించడం ఎవరి తరం కాదు " అన్నాడు. దృతరాష్ట్రుని మనసు జూదానికి అంగీకరించలేదు. " మీరు ఎన్ని చెప్పినా నేను వినను. విదురుడు జూదం అనర్ధ హేతువని చెప్పాడు. అతడు నీతి కోవిదుడు.నేను అతని మాట మీరను జూదం వదిలి ఎప్పటిలా ఉండు " అని దుర్యోధనునితో అన్నాడు. దుర్యోధనుడు " తండ్రీ !విదురుడు పాండవ పక్షపాతి అతడు మనకు ఆప్తుడు కాడు. జూదం పురాణంలో ఉంది. స్నేహంతో ఆడుకునే జూదం హాని కాదు. కనుక శకునితో జూదం ఆడ్టానికి అనుమతి ఇవ్వండి " అన్నాడు.

జూదానికి ఆహ్వానం

తప్పని సరి పరిస్థితిలో ధృతరాష్ట్రుడు విదురునితో " విదురా! మనము ఒక సభ నిర్మించాము కదా దానిని చూడటానికి ధర్మరాజుని అతని తమ్ములతో ఆహ్వానించి నీతో తీసుకుని రా. పొద్దు పోవడానికి దుర్వోధనునితో జూదం ఆడుతాడు " అన్నాడు. విదురుడు జూదం అనర్ధమని ఎన్ని మార్లు చెప్పినా ప్రయోజనం లేక పోయింది. ఇక తప్పదని ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. ధర్మరాజు విదురుని సాదరంగా ఆహ్వానించాడు. విదురుని రాకకు కారణం తెలుసుకున్న ధర్మరాజు విదురునితో " విదురా ! మా పెదనాన ఆహ్వానం మన్నించి నీ వెంట వస్తాము . సభను చూస్తాము కానీ జూదం తగునా జూదం వలన విభేదాలు వస్తాయి. అయినా దృతరాష్ట్రుని ఆజ్ఞ మాకు శిరోధార్యము . అందుకని మీతో వస్తాము " అన్నాడు. హస్థినాపురంలో కుమారులతోను భీష్ముడు, ద్రోణుడు, శల్యుడు , శకుని, అశ్వత్థామ, సైంధవుడు మొదలైనవారితో ఉన్న దృతరాష్ట్రుడికి, భానునుమతి మొదలైన కోడళ్ళతో ఉన్న గాంధారి కి ధర్మరాజాదులు నమస్కరించారు. ద్రౌపది సౌందర్యానికి గాంధారి కోడళ్ళకు ఆశ్చర్యంతో కూడిన అసూయ చెందారు. దుర్యోధనునితో కలసి పాడవులు సభను తిలకించి సుఖానుశీనులైనారు.

జూదం ప్రారంభం


ధర్మరాజు జూదంలో ఓడిపోవుట

ఆ సమయంలో దుర్యోధనుడు " ధర్మజా! కొంచెం సేపు జూదం ఆడతాము. నీకు జూదం ఆడటంలో ఆసక్తి ఉంది కదా " అన్నాడు. ధర్మరాజు " సుయోధనా ! జూదం అందులో మోసపూరిత జూదం క్షత్రియ ధర్మం కాదు. రాజులు జూదం ఆడుట ధర్మం కాదు. కుటిలులతో జూదం తగదు. దాని వలన ఎంతటి వారైనా సంపద కోల్పోతారు. ధర్మ జూదంలో గెలవడం పుణ్యం, కపట జూదంలో గెలవడం పాపం " అన్నాడు. శకుని " జూదంలో నేర్పరులు, లోకజ్ఞానం కలవారు, సుక్షత్రియులు, రాజనీతి తెలినవారు జూదాన్ని నిందించటం తగదు. బలహీనులు బలవంతులను ఓడించటానికి మాయలు పరిపాటి కదా. నీకు భయమైతే వద్దు " అన్నాడు. ధర్మరాజు " బలవంతంగా జూదానికి పిలువబడ్డాము. ఆడక తప్పుతుందా. ఇక మాటలెందుకు కానివ్వండి " అన్నాడు. ధర్మరాజు " మీలో నాతో ఎవరు జూదం ఆడుతారు " అని అడిగాడు. దుర్యోధనుడు " ధర్మజా! నా తరఫున శకుని జూదం ఆడతాడు అతడు ఓడిన ధనరాశులు నీవి " అన్నాడు. ధర్మరాజు " ఒకరి కోసం ఒకరు ఇది అక్రమం " అనుకున్నాడు. చేసేది లేక తన చేతి రత్నఖచిత కంకణాన్ని ఫణంగా పెట్టాడు. జూదం స్నేహపూరితంగా జరుగుతున్నది. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు వికల మనస్కులై చూస్తున్నారు. శకుని తనకోసం చేయించుకున్న ప్రత్యేక పాచికలతో జూదం ఆడి గెలుస్తున్నాడు. ధర్మరాజు లో పంతం పెరిగింది. ఒకటి తరువాత ఒకటిగా ఒడ్డుతూ ఓడుతున్నాడు. బంగారు బండాగారాలు, వజ్రాల బండాగారాలు, రత్నబండాగారాలు, బంగారు నిధులు, అశ్వములు, ఏనుగులు, సేవకులు, దాసదాసీ జనాలు, గూవులు, సేనావాహిని, అన్నింటినీ ఓడి పోయాడు. ఇది చూసి విదురుడు దృతరాష్ట్రునితో " దుర్యోధనుడు పాపాత్ముడు కురు వంశం పాపంతో నిండపోతుంది. దుర్యోధనుని నివారించు. ధర్మాన్ని రక్షించు. వినాశనాన్ని ఆపించు. దుర్యోధనుని బహిష్కరించు. అతడు బలవంతులతో యుద్ధానికి కాలుదువ్వుతున్నాడు. జూదాన్ని ఆపు ఉపేక్షించకు " అన్నాడు. పుత్రుల మీద మమకారంతో ధృతరాష్ట్రుడు మిన్నకున్నాడు. విదురుడు దుర్యోధనునితో " సుయోధనా ! నువ్వు ఈ ప్రకారంగా శకుని సహకారంతో పాండవులను కొల్లగొడుతుంటే ప్రజలు ఛీ కొట్టరా ? ఇలా మోసం చెయ్యటం మంచిదా " అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు విదురుని చూసి కోపంతో " నువ్వు ఎప్పుడూ పాండవుల పక్షాన మాట్లాడతావు. నువ్వు మా ఇంట్లో ఉంటే విష సర్పం ఉన్నట్లే. శత్రువుల సంపదను సులభ మార్గంలో అపహరించడం రాజధర్మం. కనుక మాకు బుద్ధులు చెప్పద్దు " అని దూషించాడు. శకుని ధర్మరాజు తో " ధర్మజా! నీవు నీ సంపదనంతా పందెంలో ఒడ్డి ఓడావు. తరువాత పందెం ఏమిటి " అన్నాడు. అప్పటికే ధర్మరాజు జూదానికి బానిస అయ్యాడు. తన సమస్త రాజ్యాన్ని ఒడ్డి ఓడిపోయాడు. తరువాత బ్రాహ్మణులకు, దేవాలయాలకు ఇచ్చిన భూములు తప్ప మిగిలిన ఆస్తులను ఒడ్డి ఓడిపోయాడు. తన తమ్ములను ఒడ్డి ఓడిపోయాడు ఆఖరున తనను తాను ఓడ్డుకున్నాడు. అప్పుడు శకుని " ధర్మజా ! అదేమిటి నిన్ను నీవు ఒడ్డుకున్నావు. నీ వద్ద ఒడ్డడానికి మరొక ధనం ఉంది మరిచి పోయావా ? నీ భార్య ద్రౌపది నీ ధనం కాదా?" అని ఎత్తి పొడిచాడు. అప్పుడు పాచికలు అందుకున్న ధర్మరాజు ద్రౌపది ని ఫణంగా పెట్టి ఓడి పోయాడు. అప్పుడు ఆట చాలించాడు.

ద్రౌపదికి సభలో అవమానం


కురుసభలో ద్రౌపదికి అవమానం

ఇదంతా చూస్తున్న భీష్మునకు నోట మాటరాలేదు. విదురుడు దుఃఖిస్తున్నాడు. కర్ణుడు, సైంధవుడు ఆనందంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పడు ధృతరాష్ట్రునికి తెలివి వచ్చింది. " విదురా! ఏమైంది? ఎవరెవరు ఏ పందాలు ఒడ్డారు?" అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు విదురుని చూసి " నా ఇల్లు తుడవటానికి దాసి ద్రౌపదిని పిలుచుకురా " అని ఆజ్ఞాపించాడు. విదురుడు " ఛీ నీవంటి మూర్ఖుడు లేడు. ఇలాంటి పనికి నన్ను పంపుతారా. ద్రౌపది ఎవరు ? సమస్త భూమండలానికి పట్టమహిషి. ఆ సాధ్విని అవమానిస్తారా ! " అని అడిగాడు. సుయోధనుడు ప్రాతిగామి అను సూతనందనుని పిలిచి " నీవు పోయి ద్రౌపదిని సభకు తోడ్కొని రా " అన్నాడు. ప్రాతిగామి ద్రౌపది వద్దకు పోయి " అమ్మా ! ధర్మరాజు జూదంలో సమస్త సామ్రాజ్యాన్ని, తమ్ములను, తనను, నిన్ను ఓడిపోయాడు. దుర్యోధనుడు నిన్ను సభకు తీసుకురమ్మని నన్ను పంపాడు. పదమ్మా పోదాము " అన్నాడు. అప్పుడు ద్రౌపది " అయ్యా! ఏ యుగంలోనైనా ఇలాంటి చెడ్డ జూదగాడు ఉంటాడా ? ధర్మరాజు ఇలా చేసాడా? తనను కూడా ఓడాడు అంటున్నావు. తన్నోడి నన్నోడెనా ? నన్నోడి తన్నోడెనా ? తెలుసుకుని వచ్చి నన్ను తీసుకు పో " అన్నది. ప్రాతిగామి తిరిగి వచ్చి ఇదే విషయం అడిగాడు. " ఇది సమాధానం చెప్ప వీలులేని విషయం. ఇక్కడికే వచ్చి అడగమను. నీవుపోయి ద్రౌపదిని తీసుకు రా " అని పంపాడు. ప్రాతిగామి ద్రౌపది వద్దకు పోయి " అమ్మా! నీవు అడిగిన విషయం తెలుసుకోవడానికి నిన్ను అక్కడికి రమ్మన్నారు " అన్నాడు. చేసేది లేక ద్రౌపది ఏకవస్త్రంతో సభకు వచ్చింది. దృతరాష్ట్రుని పక్కన నిలబడింది. ద్రౌపది దుస్థితి చూడలేక పాండవులు తలలు వంచుకున్నారు. అప్పుడు దుర్యోధనుడు దుశ్శాశనుని చూసి " నీవు పోయి ద్రౌపదిని ఇక్కడికి తీసుకు రా " అన్నాడు. ద్రౌపది ఒక్క పరుగున గాంధారి పక్కకు పోయి నిలబడింది. దుశ్శాసనుడు ద్రౌపదితో ఎక్కడికి పోతావు నిన్ను శకుని జూదంలో గెలిచాడు. నువ్వు దుర్యోదనుని సొత్తు అయినావు " అంటూ దగ్గరికి వచ్చాడు. " అయ్యా నేను రజస్వలను. ఏకవస్త్రను. నన్ను ముట్టవద్దు. సభకు రాలేను " అన్నది. దుశ్శాసనుడు నవ్వి " ఏకవస్త్రవైనా విగత వస్త్రవైనా రాక తప్పదు. నేను నిన్ను తీసుకు పోతాను " అంటూ దుశ్శాసనుడు ద్రౌపది కురులు పట్టుకుని ఈడ్చుకుంటూ సభకు తీసుకు వచ్చాడు. ద్రౌపది కురువంశ పెద్దలను చూసి " అయ్యా! దుశ్శాసనుడు నన్ను ఈ సభకు ఈడ్చుకు వచ్చాడు. మీరందరూ చూస్తుండగా అవమానించాడు. అధర్మం పెరిగి పోయింది " అని అంటూ భయంతో మనసులో శ్రీకృష్ణుని ధ్యానించింది. భీముడు ధర్మరాజుని చూసి " ఓ ధర్మజా! ఈ రాజ్యం, నీ తమ్ములు నీ వశంలో ఉన్నాము కనుక జూదంలో ఒడ్డావు. దృపదరాజ పుత్రిని జూదంలో పెట్టడం తగునా ? అందు వలన ద్రౌపది అవమానాల పాలైంది. జరుగుతున్నది అధర్మ జూదమని తెలిసి నువ్వు జూదం ఆడావు. నీ చెయ్యి కాల్చాలి కదా " అర్జునుడు " అన్నయ్యా ! స్నేహంగా ఆడుకునే జూదానికి , ధర్మయుద్ధానికి పిలిస్తే పోవడం రాజధర్మం. అందుకనే ధర్మరాజు ధర్మం పాటించి ఆడాడు కాని విధి వైపరీత్యానికి ఏమి చేస్తాం ? " అన్నాడు.

వికర్ణుడు

దుర్యోధనుని తమ్ముడు వికర్ణుడు " ఈ సభలో ఉన్న కురువృద్ధులు , గురువులు, పెద్దలు అందరూ మౌనంగా ఉన్నారు. మిగిలిన వారైనా ధర్మం చెప్పండి. ఆలోచించండి ఇక్కడ జరుగుతున్నది ధర్మమా ? " అన్నాడు. ఎవరూ బదులు చెప్పక పోవడం చూసి వికర్ణుడు " నేను ఇక్కడ ధర్మనిర్ణయం చేస్తాను. జూదం, వేట, మద్యపానం, అతిగా తినడం దుర్వ్యసనాలు. వీటి వలన మానవులు ధర్మం తప్పి ప్రవర్తిస్తారు. అలాంటి వారు చేసే పనులు లెక్కలోకి రావు. ఒక జూదరి చేత పిలువబడిన వ్యసనపరుడైన మరో జూదరి ధర్మరాజు పాండవుల ఉమ్మడి ధనమైన ద్రౌపది ని ఫణంగా పెట్టి ఆడి ఓడడం ధర్మం కాదు. పైగా ఏకవస్త్రను సభకు తీసుకు రావడం అన్యాయం " అన్నాడు. కర్ణుడు వికర్ణుని చూసిన కర్ణుడు " ఎందుకీ అధిక ప్రసంగం ? చిన్నవాడివి ధర్మం గురించి నీకేమి తెలుసు. ఇంత మంది పెద్దలు ఉండగా ధర్మ నిర్ణయం చెయ్యడం నీకు తగదు. ద్రౌపది ధర్మరాజు ధనం. కనుక ధర్మ విజిత. లేకుంటే పాండవులు అంగీకరిస్తారా. పెక్కు మంది భర్తలు కలిగిన ద్రౌపది బంధకి. అలాంటి వారిని ఏకవస్త్రగానే కాదు. విగత వస్త్రగా తెచ్చినా అధర్మం కాదు " అన్నాడు. దుర్యోధనుడు ఇలా అన్నాడు " కర్ణుడు బాగ చెప్పాడు. దుశ్శాశనా ! ద్రౌపది పాడవుల వస్త్రాలు తీసుకో " అన్నాడు. దుశ్శాసనుడు ఇది ధర్మం కాదు అని ఆలోచించక ద్రౌపది కట్టుకున్న చీరను లాగాడు. విచిత్రంగా ద్రౌపది నడుముకు ఉన్న చీర నడుము భాగాన్ని వదలలేదు. లాగుతుంటే అలాంటి వస్త్రాలు వస్తూనే ఉన్నాయి. విప్పిన చీరలు గుట్టలుగా పడ్డాయి కాని ద్రౌపది నడుముకు చీర అలాగే ఉంది. ఇది చూసి దుశ్శాసనుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఇది చూసి భీముడు ఆగ్రహంతో " కురువృద్ధులు, బంధువులు సభాసదులు చూస్తుండగా ద్రౌపది ని ఇలా అవమానించిన దుశ్శాశనుని సుయోధనుడు చూస్తుండగా యుద్ధ భూమిలో ఘోరంగా చంపి అతని రక్తం దోసిలి పట్టి తాగకుంటే నేను నా పితృ పితామహులకు పుట్టలేదు " అని భీముడు భీకర ప్రతిజ్ఞ చేసాడు. సభలోని వారు " కుమారుడి మీద ప్రేమతో ధృతరాష్ట్రుడు ద్రౌపది అడిగిన దానికి ఉపేక్షించాడు " అని అనుకున్నారు.

ద్రౌపదికి వరాలు రాజ్యాన్ని తిరిగి పొందటం


విదురుడు లేచి " అందరూ శాంతంగా ఆలోచించండి. వికర్ణుడు చిన్న అయినా బృహస్పతిలా ధర్మం చెప్పాడు. ధర్మం తెలిసి కూడా పక్షపాతంతో కాని ,లోభంతో కాని చెప్పక పోతే అసత్య దోషం అంటుకుంటుంది. పూర్వం ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు, సుధన్వుడు అనే బ్రాహ్మణుడు ఒక కన్య కొరకు తగులాడుతూ ప్రహ్లాదుని వద్దకు తీర్పు కోసం వెళ్ళారు. కొడుకు విషయంలో తీర్పు చెప్పటానికి జంకి ప్రహ్లాదుడు కశ్యపుని సలహా అడిగాడు. న్యాయమూర్తి సాక్ష్యాన్ని ధర్మాన్ని అనుసరించి ధర్మ బద్ధమైన తీర్పు చెప్పాలి. అలా చెయ్యకపోతే న్యాయమూర్తికి సభాసదులకు పాపం వస్తుంది. కనుక కామక్రోధాలకు అతీతంగా తీర్పు చెప్పు " అని కశ్యపుడు చెప్పాడు. ప్రహ్లాదుడు సంతోషించి తన కొడుకు అని ఆలోచించక సుధన్వుడికి అనుకూలంగా తీర్పు చెప్పాడు. కనుక మనం ఈ నాడు ద్రౌపదికి న్యాయం చేయకుంటే అందరికి పాపం వస్తుంది " అన్నాడు. దుర్యోధనునికి భయపడి ఎవరూ బదులు చెప్పలేదు. ద్రౌపది సభాసదులను చూసి " నేను పాండవుల ఇల్లాలిని లోకారాధ్యుడైన శ్రీకృష్ణ సోదరిని. ఇలా అవమానింప బడ్డాను. నేను అడిగిన దానికి ఎందుకు బదులు చెప్పారు.? నేను దాసినా కాదా చెప్పండి "

ధృతరాష్ట్రునికి సభలో జరిగిన దానిని గురించి చెప్పుచున్న గాంధారి
అని దుఃఖంతో అడిగింది . భీష్ముడు " అమ్మా! నీ ప్రశ్నకు ధర్మరాజు ఒక్కడే సమాధానం చెప్పగలడు " అని అన్నాడు. కర్ణుడు " తరుణీ ! ఐదుగు భర్తలకన్నా ఒక్క భర్త మేలు కదా ! జూదంలో భార్యను ఓడి పోని వ్యక్తిని భర్తగా ఎంచుకో " అని ఎగతాళి చేసాడు. సుయోధనుడు వచ్చి నా తొడపై కూర్చో. అని సైగ చేసాడు. అది చూసి భీముడు " రాజ్య సంపద వలన కలిగిన మదంతో ద్రౌపదిని తొడ మీద కూర్చోమని సైగ చేసిన ఈ దుర్మార్గుని తొడలు నా గధతో విరుగ కొడతాను " అని ముందుకు ఉరికాడు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు ఇది తగిన సమయం కాదిని శాంతింప చేసారు. అప్పటికి చలించిన గాంధారి విదురుని తీసుకుని దృతరాష్ట్రుని వద్దకు వచ్చి ద్రౌపదికి జరిగిన అవమానాన్ని వివరించింది. ధృతరాష్ట్రుడు " సుయోధనా ! పాండవ పట్టమహిషిని ఇలా అవమానించడం తగునా ? నీ కారణంగా పాండవులు దుఃఖితులైయ్యారు " అని ద్రౌపదిని పిలిచి " అమ్మా ! ద్రౌపది నా కోడళ్ళలో నీవు గౌరవించ తగిన దానివి. నీకు ఏమి వరం కావాలో కోరుకో ఇస్తాను " అన్నాడు. ద్రౌపది " ముందు నా భర్తను దాశ్యం నుండి విముక్తుని చేయండి " అని అడిగింది. ఇంకో వరం కోరుకో అన్నాడు. " ధర్మరాజు నలుగురు తమ్ములను దాస్యవిముక్తులను చేసి వారి వారి ఆయుధములను ఇప్పించండి " అన్నది. సరే ఇచ్చాను ఇంకో వరం కోరుకోన్నాడు. " వైశ్య సతికి ఒక వరం, క్షత్రియ సతికి రెండు వరాలు కనుక ఇక వరాలు కోర రాదు " అన్నది. ద్రౌపది ధర్మనిరతికి ధృతరాష్ట్రుడు సంతోషించి పాండవులను పిలిచి జూదంలో పోగొట్టుకున్న రాజ్యాన్ని సమస్త సంపదను తిరిగి ఇచ్చి " నేను బుద్ధి లేక జూదాన్ని ఉపేక్షించాను. వృద్ధుడను, అల్ప బుద్ధిని మీ తల్లి గాంధారి ముఖం చూసి దుర్యోధనాదులు మీ పట్ల చేసిన అపచారం క్షమించండి . మీరు ఇంద్రప్రస్థానికి వెళ్ళి హాయిగా రాజ్యం చేసుకోండి " అని దీవించాడు.

సతీసమేతంగా పాండుసుతులు అరణ్యములకు వెళ్ళుట


అరణ్యానికి వెళుతున్న పాండవులు

భీముడు " సతి కారణంగా పాండుసుతులకు రాజ్యం సంప్రాప్తించింది అనిపించుకోవడం కంటే యుద్ధం చేసి పొందడం మేలు కదా " అన్నాడు. ధర్మరాజు భీముని వారించి ఇంద్రప్రస్థానికి తీసుకు వెళ్ళాడు. దుర్యోధనుడు కర్ణుడు, శకునితో ఆలోచించి దృతరాస్ష్ట్రుని వద్దకు వెళ్ళి " తండ్రీ ! శత్రువును చంపడం వివేకమని దేవగురువు బృహస్పతి చెప్పాడు. పాండవులు మనకు శత్రువులు ఎంత చేసినా మనం వారికి మంచి వాళ్ళము కాదు. మనం వాళ్ళను విడిచి పెట్టి తప్పు చేసాం. అర్జునుడు గాండీవం, భీముడు గదాయుధం, ధర్మరాజ, నకుల సహదేవులు వారి వారి ఆయుధాలు పడితే మనం వారిని గెలవడం సాధ్యం కాదు. కనుక పాండవులను తిరిగి జూదానికి పిలిచి జూదం ఆడించి నిర్వాసితులను చెయ్యడం తక్షణ కర్తవ్యం " అన్నాడు. ధృతరాష్ట్రుడు అంగీకరించాడు. మరల జూదానికి రమ్మని ప్రాతిగామిని పంపింవాడు. తండ్రి మాట మీరరాదని ధర్మరాజు జూదానికి వచ్చాడు. అందరూ కూర్చున్నారు. శకుని " ధర్మరాజా! దృతరాష్ట్ర మహారాజు మీరు పోగొట్టుకున్న సమస్త సంపదలు రాజ్యాన్ని ఇచ్చాడు. ఇక అవి జూదంలో పెట్టడం తగదు. ఓడిన వారు వల్కలములు ధరించి కందమూలములు తింటూ పన్నెండేళ్ళు వనవాసం ఒక్క సంవత్సరం అజ్ఞాత వాసం చేయాలి ఇదీ పందెం ఇందుకు మీరు అంగీకరిస్తే " అన్నాడు. ధర్మరాజు " సరే " అన్నాడు. జూదం ఆడాడు ఓడి పోయాడు. అరణ్యానికి పోవడానికి సిద్ధం అయ్యారు. పాండవులు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుల వద్ద శలవు తీసుకున్నారు. కుంతీ దేవి వద్దకు వచ్చారు. ఆమె " పుత్రులారా! ఇలాంటి దుస్థితి వస్తుందని ముందుగా ఊహించి మీ తండ్రి, మాద్రి స్వర్గానికి వెళ్ళారు. నేను దురదృష్టవంతు రాలిని కృష్ణా ! నా కుమారులను కాపాడు " అని ప్రార్థించింది. కొడుకులను కోడలిని దీవించి పంపింది. అందరూ అడవికి పయనమయ్యారు. కోపం నిండిన చూపులకు జనం దహించబడతారని ధర్మరాజు ముఖానికి వస్త్రం అడ్డం పెట్టుకుని వెళ్ళాడు, ఎట్టకేలకు యుద్ధంలో బాహు బలం ప్రదర్శించే అవకాశం వచ్చిందని భీముడు రొమ్ము విరుచుకుంటూ వెళ్ళాడు. ఇంత కంటే ఎక్కువగా అస్త్ర సంధానం చేసి శత్రు సంహారం చేస్తానని అర్జునుడు చేతితో ఇసుక చల్లుకుంటూ వెళ్ళాడు. తమ అందచందాలు చూసి జనులు దు॰ఖిస్తారని నకులసహదేవులు మలిన వస్త్రాలతో వెళ్ళారు. తడిసిన బట్టలతో విడిన కురులతో దుఃఖిస్తూ యుద్ధంలో భర్తలను పోగొట్టుకున్న కౌరవుల భార్యలు ఇలా రాజ్యం వదిలి వెళతారని సూచిస్తూ ద్రౌపది వెళ్ళింది. పాండవులతో ధౌమ్యుడు, వేలాది బ్రాహ్మణులు పాండవులను అనుసరించారు. ఇలా పాండవులు అడవులకు బయలు దేరారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat