అయ్యప్ప దీక్షా కాలంలో చాలా మందికి అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. వాటి అన్నిటికి సింపుల్ గా అందరికి అర్థం అయ్యే విధముగా నాకు ఉన్న పరిజ్ఞానం వరకు తెలియ పరుస్తున్నాను. తప్పులు ఉంటే పెద్దలు సరిదిద్దగలరు
అయ్యప్ప దీక్ష అత్యంత పవిత్రమైనది. ఈ దీక్ష చిత్తశుద్ధిగా , భక్తితో చేయాలి. అయ్యప్ప దీక్ష ఇంకా దీక్షా సంబంధమైన ఇతర ధర్మ సందేహాలకు ఇక్కడ క్లుప్తంగా వివరణ ఇవ్వబడినది..
అయ్యప్ప అంటే ఎవరు?
అయ్యప్ప అంటే "హరిహరసుతుడు". అంటే విష్ణువు (హరి) మరియు శివుడి (హరుడు) యొక్క కుమారుడు. "అయ్యా" - "అప్ప" కలిసి "అయ్యప్ప" అని అంటారు. అయ్యప్పని "మణికంఠుడు", "ధర్మశాస్త" అని కూడ అంటారు.
*అయ్యప్పలు నల్లని దుస్తులు ఎందుకు ధరిస్తారు ?*
శనీశ్వరుడికి నల్లని రంగు అంటే అత్యంత ఇష్టం. ఆ రంగు బట్టలని ధరించిన వాళ్ళకి శనిదేవుడు హాని కలిగించడు. అయ్యప్ప తన భక్తులను కాపాడటానికి నల్లని రంగు దుస్తులు ధరించమని చెప్తాడు.
అంతే కాక అయ్యప్ప దీక్ష శీతాకాలంలో చేస్తారు కాబట్టి నల్లని రంగు దుస్తులు శరీరానికి వేడిని ఇస్తాయి(శాస్త్రీయమైన కారణం).
గురు స్వామి అంటే ఎవరు ? గురుస్వాములు ఎట్టివారై ఉండాలి ? కన్నెస్వామి అని ఎవరిని పిలుస్తారు ?
భగవంతునియందు సంపూర్ణమైన స్వచ్ఛమైన భక్తియును కలిగి , శాస్త్ర సంప్రదాయాలను గౌరవించగలిగే , మానసిక ధర్మము కలిగి , అయ్యప్పదీక్షా నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ , భగవదారాధనలోను , భగవత్సేవలోను నిమగ్నుడై ఉండి , తనను ఆశ్రయించిన శిష్యులయెడ వాత్సల్యముతో వ్యవహరిస్తూ , నిష్కపటముగా మాట్లాడుచు , అయ్యప్ప యాత్రలో తగినంత అనుభవము కలిగిన స్వామిని , భక్తుడు గురువుగా స్వీకరించవచ్చు. ఆ సందర్భముగా మాలధారణ గావించిన గురుస్వామితో యాత్ర వెళ్ళే అవకాశం లేనివారు , మాల ధరింపజేసిన గురుస్వామి గారి పరిపూర్ణ సమ్మతితోనూ , వారి ఆశీస్సులతోను , తమకు అనుకూలముగా అందుబాటులో ఉన్న అర్హులైన గురుస్వాములతో యాత్రకు వెళ్ళటం వలన దోషమేమియు లేదు.
“కన్నె” అనగా క్రొత్తది , ప్రథమము అని అర్ధము. తొలిసారిగా అయ్యప్ప దీక్షను స్వీకరించిన భక్తుణ్ణి "కన్నెస్వామి" లేదా "కన్నిస్వామి" అని పిలుస్తారు.
మాల విశిష్టత ఏమిటి?
పూజా విధానములో జపమాలగా ఉత్కృష్ఠ స్థానాన్ని పొందే కంఠాభరణాలు రుద్రాక్ష , తులసి , చందనం , స్పటికం , పగడాలు మరియు తామర పూసల మాలలు శ్రేష్ఠమైనవిగా భావించబడుతున్నాయి. ఈ మాలధారణ మానవులు శారీరకంగా మరియు మానసికంగా ఎంతో ఉపయోగపడతాయి. అందుకే వీటిని పవిత్రమైనవిగా భావించి , ఈ మాలలకు అభిషేకము చేయించి , మంత్రోచ్చారణ ద్వారా అందు అయ్యప్పస్వామిని ఆవహింప చేసి వాటిని ధరించి భక్తులంతా త్రికరణశుద్ధిగా స్వామిని సేవించుకుందురు..
మాలధారణకు అర్హులెవ్వరు ? మాలధరించకూడని సందర్భాలు ఏవేవి ?
ఏవరైతే నియమములను పాటించుదురో , స్వామియందు ప్రేమానురాగములు కలిగియుందురో వారే అర్హులు. స్త్రీలలో 5 సంవత్సరముల నుండి 11 సంవత్సరముల వరకు , 50 సంవత్సరములు దాటిన వారు అర్హులు.
కుటుంబములో తల్లి , తండ్రి చనిపోయినచో ఏడాది కాలము , భార్య చనిపోయినచో ఆరు మాసములు దీక్ష తీసుకొనరాదు. సోదరులు , పుత్రులు , పెదనాన్న, చిన్నాన్న వర్గీయులు మరణించినచో 41 దినములు, అల్లుళ్ళు , మేనత్తలు , మేనమామలు , తాత , బామ్మ మున్నగువారు మరణించినచో 30 దినములు దీక్ష తీసుకొనరాదు. దాయాదులు , కూతురు , మేనల్లుళ్ళు , మేనకోడళ్ళు , మనమళ్ళు , మనవరాళ్ళు , మరదళ్ళు , వదినలు మరణించినచో 21 దినములు దీక్ష తీసుకొనరాదు. రక్తసంబంధీకులు , వియ్యలవారు మరణించినచో 13 దినములు తీసుకొనరాదు. ఆత్మీయులు , మిత్రులకు మూడు దినములు దుఃఖమనుష్టించిన చాలును. తన తల్లి , భార్య , కూతురు , కోడళ్ళు , మరదళ్ళు ఏడవ నెల గర్భిణి అయినచో మాల ధరించరాదు.
108 సంఖ్య బలమేమిటి?
సర్వాంతర్యామి , సకల జీవకోటి వ్యాపకుడు , అమిత నామధేయుడైన భగవంతుడిని భక్తులు వివిధ రూపాలలో సేవిస్తారు , సకల నామాలతో పూజిస్తారు. పూజా క్రతువులలో ఈ నామార్చనకు 108 పూసలు గల మాలను జపమాలగా చేతిలో ధరించి , ఒక్కొక్క పూసకు ఒక్కో పేరును ఆపాదిస్తూ భగవంతుని ధ్యానిస్తారు. అందుకే పూర్ణ ఫలితాన్నిచే 108 పూసలు గల మాల మెడలో ధరించి దీక్షాకాలములో అయ్యప్పస్వామిని జపించవలెను.
మకరజ్యోతి గురించి వివరించండి ?
శబరిమలలో జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనది మకరజ్యోతి. జ్యోతి స్వరూపునిగా స్వామివారు కాంతిమలై నుండి దర్శనమిస్తారు. ప్రతీ సంవత్సరం జనవరి నెలలో మకర సంక్రమణం రోజున మాత్రమే స్వామివారి జ్యోతిస్వరూప దర్శనం అవుతుంది. ఆ సమయంలో లక్షలాదిమంది భక్తుల శరణుఘోషతో శబరి కొండంతా నిండిపోయి , కర్పూర జ్యోతులు సన్నిదానం అంతా ప్రజ్వరిల్లగా , భక్త జనసందోహం ఆనందంతో స్వామివారి దివ్యస్వరూపాన్ని దర్శించి పునీతులౌతారు.
*“అహం బ్రహ్మాస్మి” తత్వం అనగా నేమి ?*
ఇది చాల గొప్ప సిద్ధాంతము. తాను , ఇతరులు , సృష్టిలోని సకల జీవరాసులన్ని భగవంతుని స్వరూపమని యెంచి అన్నింటిలోను దైవమును దర్శించగలిగే స్థాయికి మానవులు ఎదుగుటయే దీని అంతరార్థము. ప్రతి మానవుడు దీనిని పాటించినచో లోక కళ్యాణం తప్పక జరుగుతుంది. అందుకే అయ్యప్ప దీక్షలో ఈ తత్వమును పాటించటం తప్పనిసరిగా భావిస్తారు.
భూతల శయనం అనగానేమి ?
భూతల శయనం అనగా నేల మీద నిద్రించటం. నేలపై నిద్రిచటం వలన , భూమిలో ఉన్న ఖనిజ , లవణములను శరీరము కావలసినంత మేర గ్రహించగలుగుతుంది. అంతేకాక భూమిలో ఉన్న అయస్కాంత శక్తి వలన కీళ్ళ సంబంధమైన మరియు రక్తపోటు సంబందించిన వ్యాధులు నివారించవచ్చు.
బ్రహ్మచర్యం అనగానేమి ?
పరబ్రహ్మము గూర్చి చింతిస్తూ ఆ తలంపులోనే గడుపుటయే బ్రహ్మచర్యం అంటారు. దీక్షా సమయములో కాని , భగవంతునికి విశేష పూజ జరిపే సమయములో కాని భక్తులు సంసార జీవనానికి దూరంగా ఉండటం నియమముగా పాటిస్తుంటారు. దీనినే బ్రహ్మచర్యం అని అంటారు. ఇది హిందూ సాంప్రదాయముగా వస్తుంది.
అయ్యప్పలు నుదుట గంధం , కుంకుమ ఎందుకు ధరిస్తారు ?
మానవుల కనుబొమ్మల మధ్య భాగమునందు "సుషుమ్న" అనే నాడి ఉంటుంది. ఈ సుషుమ్న నాడిలో భగవంతుడు జ్ఞాన రూపములో సంచరిస్తూ ఉంటాడని భారతీయుల విస్వాసము. అందుచేతనే ఆ ప్రదేశాన్ని గంధంతోను , కుంకుమతోను అలంకరిస్తారు.
అయ్యప్ప దీక్ష అంటే ఏమిటి & ఏలా చేస్తారు ?
నిశ్చలమైన మనస్సుతో సంకల్పించడాన్ని దీక్ష అంటారు. మనస్సు , వాక్కు , శరీరము ఈ మూడింటిని త్రికరణములు అంటారు. ఈ మూడింటికి సమన్వయము కుదిరి చేసిన పనులనే "మనోవాక్కాయకర్మలు" అని అంటారు. అహింస , సత్యము , ఆస్తేయము , బ్రహ్మచర్యం , అపరిగ్రహము అనే మహవ్రతాలను మనోవాక్కాయ కర్మల ద్వారా ఆచరించుటను దీక్ష అంటారు.
మహావ్రతాలు:
1) అహింస: హింస చేయకుండా యుండుట.
2) సత్యం: దేవుని యందు నిజమైన భక్తిని కలిగియుండుట.
3) ఆస్తేయము: అవలంబించేందుకు తగినది.
4) బ్రహ్మచర్యము: శారీరక వ్యామోహాలు లేకుండా భగవంతుని గూర్చి త్రికరణశుద్ధిగా చేసే పవిత్ర కార్యము.
5) అపరిగ్రహము: తన భోగసాధనలకై ధనాదులను, ఇతరుల నుండి పుచ్చుకోకుండా ఉండుట.
ఈ 5 వ్రతాలను త్రికరణశుద్ధిగా ఆచరించుటను "దీక్ష" అంటారు
అయ్యప్ప దీక్షా విధానం
అయ్యప్ప దీక్ష యొక్క ప్రాశస్త్యము , విశిష్టతలు ఏమిటి ?
కుల మత భేదాలకు అతీతంగా , జాతి , భాషల వ్యత్యాసం లేకుండా శాంతిప్రియులై , నియమ , నిబంధనలతో కూడిన జీవన విధానముతో , నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ , సేవలు చేయుచూ జీవన శైలిని సుగమనము చేసుకొవటమే అయ్యప్ప దీక్షలోని ప్రాశస్త్యం. మానవుని మానసిక ప్రవృత్తులను , ఇంద్రియ వికారములను , భవధారలను భగవంతుని వైపునకు మరల్చి నిత్యానందమును అతి సహజముగా సిద్థింపజేయుటే అయ్యప్ప దీక్షలోని విశిష్టత.
అయ్యప్ప దీక్షలో అందరిని "స్వామి" అని ఎందుకు పిలుస్తారు ?
జీవులన్నిటిలోను దేవుడున్నాడనే భావంతోనే జీవులన్నిటిని “స్వామి” అని పిలవాలని అయ్యప్ప దీక్షలో నియమాన్ని విధించారు. అందుచేతనే అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులు అందరినీ "స్వామి" అనే పిలుస్తారు.
దీక్షలో పాటించవలసిన భోజన విధానం మరియు ఆహార నిబంధనలు ఏమిటి ?
ఆహార నిబంధనలు లేని దీక్ష దీక్షయే కాదు. ఈ దీక్షలో నియమిత , పరిమిత , సాత్విక , సకాల , ధర్మార్జన శాఖాహారమును మాత్రమే భుజించాలనే నిబంధన కలదు.
దీక్ష సమయంలో రోజుకు ఒక్కసారి మాత్రమే భుజించవలెను. ఉదయం , రాత్రి సమయంలో ఫలహారమును తగిన మాత్రములోనే తీసుకొనవలెను. మధ్యాహ్నం 12 గంటలకు చేయటం ఉత్తమం , 1 గంటకు చేయటం మధ్యమం , 2 గంటలకు చేయటం అధమం.
భోజనానికి ముందు తరువాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దీక్షాకాలములో మసాలా దినుసులు గల ఆహారమును విడిచిపెట్టుట అలవాటు చేసుకోవాలి.
ఉప్పు కారములు తక్కువగా ఉండి , పక్వమైన , శుద్ధమైన ఆహారాన్ని సాత్వికమైన ఆహారమని అంటారు. అట్టి ఆహారమును దీక్షాకాలములో భుజించవలెను. సాత్విక శాఖాహారము శరీరమును తేలికపరుస్తుంది. మనస్సుకు శాంతిని , కోరికలకు దూరముగా భగవత్ధ్యానముకు ఏకాగ్రతను కలిగిస్తుంది.
*దీక్షానంతరం మాల విసర్జన చేసిన తర్వాత విసర్జించిన మాలలను తిరిగి దీక్షకు ధరించవచ్చునా ?*
మాల విసర్జనముతో అంతవరకు అందుండి మనలను కాపాడుచుండిన శివ , విష్ణు చైతన్యం విసర్జింపబడిన మాలలోనే మిగిలిపోతుంది. అట్టి మాలను శుభ్రపరచి తదుపరి వచ్చే సంవత్సరం దీక్ష మాలగా ధరించువేళ మొదటి సంవత్సరం చేసిన తపఃఫలము , ధైర్యసాహసములు , వాక్శుద్ధి ఇవన్నియు లభ్యమౌతాయి. మాల విసర్జనానంతరం ఆ మాలను నిత్యం పూజలోయుంచి అనుదినం స్పర్శించువేళ శబరినాధుని చైతన్యముతోడున్నంత ధైర్యము లభిస్తుంది.
ఇరుముడి అంటే ఏమిటి ? దాని అంతరార్థము ఏమిటి ?
ఇరుముడి అంటే రెండు ముడులనియు , ముడుపులని అర్థం. ఇరుముడిలోని మొదటి భాగములో నేతితో నింపిన కొబ్బరికాయ , పసుపు , అగరువత్తులు , సాంబ్రాణి , వత్తులు , తమలపాకులు , పోకవక్కలు , నిమ్మపండు , బియ్యం , పెసలపప్పు , అటుకులు , బొరుగులు , నూరిన కొబ్బరికాయలు మూడు పెడతారు. రెండవ భాగములో ప్రయాణానికి కావలసిన బియ్యం , ఉప్పు , మిరపకాయలు , పప్పు , నూనె వగైరాలు రైక (జాకెట్) ముక్కలు పెడతారు.
"భక్తి" , "శ్రద్ధ" అనే రెండు భాగములు కలిగిన ఇరుముడిలో భక్తి అనే భాగమునందు ముద్ర కొబ్బరికాయ కలిగిన ముద్ర సంచిని ఉంచి , శ్రద్ధ అనే రెండవ భాగంలో తాత్కాలికంగా ఉపయోగించే ద్రవములను పెడతారు. భక్తి , శ్రద్ధలు ఎక్కడైతే ఉంటాయొ అక్కడే ఓంకారం ఉంటుందన్న నిజానికి నిదర్శనంగా ఇరుముడిని ఓంకారమనే త్రాటితో బిగించి కడతారు.
ముద్ర సంచిలో గురుస్వామిగారు మూడుసార్లు బియ్యము వేయటంవలన యాత్రాసమయములో మూడు విధములైన విఘ్నములు అనగా , ఆధిదైవిక విఘ్నము (మెరుపులు , వర్షము , వడగండ్లు వంటివి) , ఆధిభౌతిక విఘ్నము (భూకంపములు , అగ్ని ప్రమాదములు , వరదలు వంటివి) , ఆధ్యాత్మిక విఘ్నము (జడత్వము , భక్తిశ్రద్ధలు సన్నగిల్లుట , కామక్రోధాది అరిషడ్వర్గములు చుట్టుముట్టుట) లను అతిక్రమించవచ్చునని భక్తుల నమ్మకము.
ఇంటి ముందు కొబ్బరికాయ కొట్టి , ఇరుముడి కట్టించుకున్న తరువాత మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదని అంటారు. ఎందుకు ?
పరదేశ యాత్ర వెళ్తున్న తన ఇంటిని , ఇంటిలోని వారిని సురక్షితముగ తాను తిరిగి వచ్చేంతవరకు కాపాడమని గ్రామ పొలిమేర దేవతకు ప్రార్ధించుకునే చర్యయే ఇది. యాత్రకు బయలుదేరేవారు గుమ్మం వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రార్ధించుకోగానే తన పరివార గణములో ఒక గణమును మన ఇంటి ముంగిట మనము తిరిగి వచ్చు వరకు కాపలకాయుటకు కేటాయించును. మనము శబరియాత్రనుండి తిరిగి వచ్చిన తరువాత గుమ్మముయందు ఉన్న దేవతకు తిరిగి నమస్కరించి కొబ్బరికాయ కొట్టి ఇంటిలోపలికి వెళ్ళవలెను.
కొబ్బరికాయలోనే నెయ్యి ఎందుకు పోయాలి ?
కొబ్బరికాయ పైన ఉండే మూడు కన్నులు శివుని నేత్రాలుగా , కొబ్బరికాయ చుట్టూ ఉండే నిలువు చారలు విష్ణు నామాలుగా కలిగి ఉండి , శివకేశవుల అంశతో పుట్టిన అయ్యప్పను కొబ్బరికాయలోని కొబ్బరిగా భావిస్తారు. కొబ్బరికాయలో నెయ్యి పోయడమంటే సాక్షాత్ అయ్యప్పను అభిషేకించటం అని భక్తులు విశ్వసిస్తారు.
ఎరుమేలి అనగా అర్ధమేమిటి ? ఎరుమేలిలో పేటతుళ్ళై ఎందుకు ఆడతారు ?
ఎరుమా అనగా పశువు , కొల్లి అనగా చంపటం. ఎరుమేలి వచ్చిన ప్రతి అయ్యప్ప భక్తుడు తనలోని పశురూపంలో ఉన్న అజ్ఞానం , అహంకారమును వదిలి పెట్టాలని అర్ధము.
మనిషిలోని యవ్వనం , భోగం , భాగ్యం , అందం , ఇవేవి శాశ్వతం కావని , అయ్యప్ప శరణమే ముక్తికి మార్గమని , నాకు భవబంధాలు , భోగభాగ్యాల కన్నా నీ నామమే గొప్పదని భగవంతునిలో ఐక్యం కావాలని తనను తాను మరచిపోయి *"స్వామి దింతక తోంతోం , అయ్యప్ప దింతక తోంతోం"* అంటూ భక్తితో పరవశించిపోయి చేసే నృత్యమే ఈ పేటతుల్లి
అభిషేకం చేసిన తరువాత నేతి కొబ్బరికాయను హోమగుండంలో ఎందుకు వేస్తారు ?
శరీరమనే కొబ్బరికాయలో తన ప్రాణాన్ని నెయ్యిగా పోసి స్వామివారికి అర్పణ చేయడమే అభిషేకం యొక్క అంతరార్ధం. అభిషేకించిన తరువాత శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయడం అన్నమాట .
భగవదనుగ్రహం కలిగించే మూడు నియమములు ఏమిటి ?
1) ఆహార నియమము - దీక్ష సమయంలో తినవలసిన , తినకూడని ఆహారముల గూరిచి తెలుపును.
2) ఆచార నియమము - దీక్ష సమయంలో చేయవలసిన , చేయకూడని పనుల గూరిచి తెలుపును.
3) విహార నియమము - దీక్ష సమయంలో చేసే నదీ స్నానములు , దేవాలయముల సందర్శన , సత్పురుషుల బోధనలను వినడం , సజ్జన సాంగత్యం మొదలగు వాటిని గూరిచి తెలుపును.
ఈ మూడు నియమములను పాటించిన వారికి దైవానుగ్రహం కలుగునని భక్తుల నమ్మకం.
దీక్షలో ఒక్కో సంవత్సరమున స్వాములను ఒక్కో పేరుతో పిలుస్తారు , అవి ఏమిటి ?
1. శరం / కన్నెస్వామి
2. కత్తి స్వామి
3. గంట స్వామి
4. గద స్వామి
5. పెరు స్వామి
6. జ్యోతి స్వామి
7. రవి స్వామి
8. చంద్ర స్వామి
9. వేలాయుధం స్వామి
10. విష్ణు స్వామి
11. శంఖ స్వామి
12. నాగ స్వామి
13. మురళి స్వామి
14. పద్మ స్వామి
15. త్రిశూలం స్వామి
16. కొండ స్వామి
17. ఓం స్వామి
18. గురు స్వామి
శబరిమల ధ్వజస్తంభము యొక్క విశిష్టత ఏమిటి ? ఆ ధ్వజస్తంభముపై గుర్రపు బొమ్మ యుండుటకు కారణమేమిటి ?
శబరిమల ధ్వజస్తంభముపై గుర్రపు బొమ్మకు ఒక పరమార్ధ తత్వము గలదు. స్వామివారు తురగవాహన ప్రియుడు. దీనిని వాజివాహనము అని కూడ అంటారు. శ్రీ అయ్యప్పస్వామి వారు రాత్రి పూటల ఈ హయమునెక్కి పరిసర ప్రాంతమంతయు తిరిగి దుష్టగ్రహములు ఆయా గ్రామమునందు ప్రవేశించకుండా కాపలా కాస్తారట. అయ్యప్పస్వామి వారు తెల్లని అశ్వమెక్కి వనప్రాంతమంతా తిరుగుతూ నడిచి వచ్చే తన భక్తులకు వన్యమృగములచే , దుష్టగ్రహములచే ఎట్టి ఆపదలు కలగనీయక అదృశ్యరూపుడై వారిని శబరిగిరి చేరుస్తారట. దీనినే హరివరాసనం పాటలో *"తురగవాహనం స్వామి సుందరాననం"* అని వర్ణించియున్నారు.
ఆపద్భాందవనే శరణమయ్యప్ప !
పదునెట్టాంబడికి అధిపతియే శరణమయ్యప్ప
- అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి -
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప