శ్లోకము:
జటాలా మంజీర స్ఫురదరుణ రత్నాంశునికరైః
నిషిదంతీ మధ్యే నఖరుచిఝరీ గాంగపయసాం
జగత్త్రాణం కర్తుం మమ జనని కామాక్షి నియతం
తపశ్చర్యాం ధత్తే తవ చరణపాథోజయుగలీ
భావము:
దేవి చరణాలు జగాలను కాపాడేవి. ఆ చరణాలయందున్న అందెల రత్నకాంతులు, నఖకాంతులు శోభావహాలు.
దేవి చరణాలు- జడదారులు గంగలో నిలబడి తపస్సు చేస్తున్నట్లు ఉన్నాయని శ్రీ మూకకవి ఊహించాడు.
అమ్మ పాదాలను వర్ణిస్తూ శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్యలహరి..
శ్రుతీనాం మూర్ధానో - దధతి తవ యౌ శేఖరతయా
మమా ప్యేతౌ మాతః శిరసి దయయా ధేహి చరణౌ యయోః పాద్యం పాథః పశుపతిజటాజూటతటినీ యయోర్లాక్షాలక్ష్మీ - రరుణహరిచూడామణి రుచిః
భావము:
అమ్మా! జగన్మాతా..వేదములకు శిరస్సులవంటి ఉపనిషత్తులు, నీ పాదములను తమ సిగపువ్వులుగా తమ శిరమున ధరించుచున్నవి. పశుపతి తన జటాజూటమునందు ధరించు ఆ గంగాజలము నిత్యమూ నీ పాదములను కడుగుతూ నీకు పాద్యోదకమగుచున్నది. ఇక ఆ మహావిష్ణువు తన యొక్క కిరీటంలో ఉన్న శిరముతో నిరంతరమూ నిన్ను మొక్కుచూ నీ పాదములవద్ద ఉండుటచేత శ్రీహరి కిరీటమునందుండు కౌస్తుభమణి యొక్క ఎర్రెర్రని కాంతులు నీ పాదములపై పడి నీ పాదములకు పెట్టబడిన లత్తుక (పారాణి)లా ఆ కాంతులతో నీ పాదములు శోభిల్లుతున్నాయి, తల్లీ దయతో నీ పాదములు నా శిరమున ఉంచుమమ్మా.
{ ఇచట అమ్మవారి పాదపద్మములను శ్రీ శంకరులు వర్ణించారు.ఆదిశంకరులకు అమ్మ పాదములవద్దకు వచ్చుసరికి భక్తిభావము ఉప్పొంగి , గంగాతరంగ సదృశమై తన కవితా ప్రవాహం ఉవ్వెత్తున ఎగసిపడినట్లు మనకు కనబడును. సౌందర్యవర్ణనకు పరమార్ధమే ఈ అమ్మయొక్క చరణారవింద వర్ణన.}
ఆ తల్లి పాదపద్మాలకు నమస్కరిస్తూ..
*సర్వేజనా సుఖినో భవంతు*
సేకరణ:-💐🙏శుభమస్తు💐💐