పరము అంటే ఏమిటి, పరలోకాలు అని వేటినంటారు?

P Madhav Kumar


పరము అంటే ఏమిటి, పరలోకాలు అని వేటినంటారు అనే విషయాలుకు మార్కండేయ పురాణంలో చక్కని వివరణ కన్పిస్తుంది. ఏ జీవుడైనా పుట్టడానికి తన పూర్వజన్మలో తాను చేసిన సుకృత, దుష్కృత కర్మలే ప్రధాన కారణం. జీవుడు అలాంటి జన్మలను ఎన్నింటినో పొందుతుంటాడు, పునరపి మరణం పునరపి జననం అన్నట్టుగా, జీవుని యొక్క గత జన్మలలోని కర్మఫలం మంచిదైతే జీవుడు స్వర్గాది భోగాలను అనుభవిస్తాడు. ఆ కర్మఫలం నీచమైనదైతే నరకలోక బాధలను పొంది, ఆ తర్వాత పశుపక్ష్యాది జంతువులలో జన్మిస్తాడు. అటు చెడుకి, ఇటు మంచికి మధ్యమ ఫలం ఉన్న కర్మ వల్ల కొంత వరకు మనిషిగా పుట్టడానికి వీలు ఉంది. ఇది కర్మఫలం, అయితే జీవన విధానాన్ని నిర్దేశించే ఈ కర్మఫలమే మరో మూడు రకాలుగా ఉంటుంది. అవి, సంచితం, ప్రారబ్ధం, ఆగామి అనేవి ఆ మూడు రకాలు. సంచితం అంటే పూర్వ జన్మలలో సంపాదించుకొన్న కర్మల వల్ల సమకూరిన ఫలితం. ఇది ప్రతిజన్మకు అపాదించబడి, మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, ఇక ప్రారబ్ధం అంటే గతజన్మలో చేసిన కర్మలవల్ల ఈ జన్మలో ఇప్పటికే అనుభవిస్తున్న ఫలితం. ఆగామి అంటే ఈ జన్మలో తెలిసో తెలియకో చేసి భవిష్యత్ జన్మలో అనుభవించడానికి సిద్ధంగా మూటగట్టుకుంటున్న కర్మ ఫలం. సంచితం అంటే ఇంతకు ముందు ఏడు జన్మలలో చేసిన కర్మ మానవుడికి ప్రస్తుత జన్మలో అనుభవించడానికి సిద్ధంగా ఉంటుంది.ఇది ఈ జన్మలో అనుభవించింది పోగా మిగిలినదానికి ఇంకొంత కలిసి వచ్చే జన్మకు బదిలీకావచ్చు, ఇక ప్రారబ్ధాన్ని ప్రతి మనిషి పురుషుడైన, స్త్రీ అయినా ఎలాంటి బేధము లేకుండా ఎవరు చేసింది వారు అనుభవించక తప్పదు. జీవునికి స్త్రీ పురుష భేదం ఉండదు, గత జన్మలలో మంచి చేసుకొని ఈ జన్మలో మోక్షాన్ని పొందొచ్చు. మోక్షమంటే జీవుడు దేవుడిలో లీనం కావటం. ఇలా మోక్షాన్ని పొందగల శక్తి, అర్హత మనుషులకు తప్ప పశుపక్ష్యాదులకు ఇతర జంతువులకు లేదు.
అందుకే అన్ని జన్మలలో మానవ జన్మ విలువైనది, గొప్పది. పశుపక్ష్యాదులు ఇదివరకు చివరి జన్మలో పొందిన మానవజన్మలో చేసిన పాపపు ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాయే తప్ప ఆగామికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకొనే అవకాశం ఉండదు. వాటికీ మానవులకు ఉన్నట్లుగా బుద్ధి, జ్ఞానం అనేవి ఉండవు. బుద్ధి పూర్వకంగా చేసిన కర్మఫలమే అనుభవించడానికి వీలుగా ఉంటుంది. బుద్దిలేని కారణంగా పశుపక్ష్యాదులు పుణ్యాన్ని సంపాదించుకోవటం దాదాపు లేనట్లు గానే పెద్దలు చెపుతారు. ఎక్కడో ఒకటి రెండు సందర్భాల్లో అది దైవసంకల్పం వల్ల పశువు, పక్షి లాంటివి వాటికీ తెలియకుండానే దైవ కార్యంలో పాలుపంచుకున్నప్పుడు ఆ కారణంగా వాటికి మోక్షప్రాప్తి కలిగినట్లు పురాణాలలో ఒకటి రెండు కథలలో కనిపిస్తున్నాయి. పశుపక్ష్యాదుల కన్న భిన్నంగా ఉండేందుకే దైవం మనిషికి బుద్ధిని అనుగ్రహించాడు ఆ బుద్ధిని వికసింపజేసుకోవడానికి విద్య ఎంతో ఉపకరిస్తుంది. విద్యాభ్యాసం వల్ల వినయము, దీనివల్ల ధనము సంపాదించుకోవచ్చు. ధనం వల్ల దాన, ధర్మాలు చేసే శక్తి రావటం, ఆ కార్యాల వల్ల ఇహ పర సుఖాలను పొందడం అనేది జరుగుతుంది. విద్య వల్ల పాపం ఏమిటో, పుణ్యం ఏమిటో మనిషి తెలుసుకోగలడు. విద్య వల్ల ఎక్కువ జ్ఞానాన్ని పొంది ఇహలోక సుఖాలు క్షణికమని తెలుసుకొని, పరలోక సంబందమైన మోక్షప్రాప్తి కోసం కృషి చేసేందుకు మనిషికి అవకాశం కలుగుతుంది. ఇహలోకంలో సుఖాలనుభావించడానికి కావలసిన జ్ఞానం వేరు, పరలోక సంబంధంగా ఉన్న మోక్షాన్ని జ్ఞానాన్ని పొందడం వేరు. పరలోక సంబంధమైన జ్ఞానాన్ని ఆత్మజ్ఞానమంటారు. సద్గురువు దగ్గర ఉపదేశం పొంది ఆయన చెప్పిన మార్గంలో ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. పరలోకాలు ప్రధానంగా నాలుగున్నాయి. వాటిలో మొదటిది స్వర్గం. దీనికి దేవేంద్రుడు అధిపతి. రెండోది బ్రహ్మలోకం, దీన్నే సత్యలోకమని అంటారు, బ్రహ్మ అధిపతి. మూడో లోకం కైలాసం, దీనికి ఈశ్వరుడు అధిపతి. నాలుగో లోకం పేరు వైకుంఠం. దీనికి అధిపతి శ్రీమహావిష్ణువు. ఈ అనుభవించాల్సిన సుఖాలన్ని అనుభవించాక ఆ జీవుడు మళ్ళి భూలోకంలో జన్మిస్తాడు. శాశ్వతంగా పరలోకాలలో భగవంతుడిలో లీనమై ఉండాలనుకుంటున్నవారు తమ జన్మంతా మంచిని ఆచరిస్తూ ముందుకు సాగాలని మార్కండేయ పురాణం పేర్కొంటోంది.



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat