వినాయకుడి ముందు గుంజీలు తీయడం వెనుక
ఉన్న పురాణగాథ..
పార్వతీదేవికి శ్రీమహావిష్ణువు సోదరుడు.
అందుకే పార్వతీదేవిని నారాయణి అని కూడా అంటారు.శివుడిని చూడటానికి ఒకసారి మహావిష్ణువు కైలాసానికి వెళ్లాడు.సుదర్శనం,గద సహా ఆయుధాలన్నీ తీసి పక్కనపెట్టి,శివుని పక్కన కూర్చుని ముచ్చట్లలో పడతాడు.అక్కడే ఆడుకుంటున్న బాల గణపతి స్వర్ణకాంతులతో ధగధగలాడుతున్న సుదర్శన చక్రాన్ని తీసుకుని అమాంతం నోట్లో వేసుకుని మింగేశాడు.శివుడితో కబుర్లలో మునిగిన విష్ణువు దీనిని గమనించలేదు.
కొద్దిసేపటి తర్వాత తన ఆయుధాలు ఉంచిన చోట చూస్తే సుదర్శన చక్రం కనిపించలేదు.ఎక్కడ ఉంచానో అనుకుంటూ వెతకడం ప్రారంభించాడు. అప్పుడే అక్కడకు వచ్చిన బాలగణేషుడు ఏం వెతుకున్నావ్ అని అడిగితే..‘నా సుదర్శన చక్రం ఎక్కడ పెట్టానో మరిచిపోయాను..దానినే వెతుకుతున్నా అని సమాధానం చెప్పాడు
శ్రీ మహావిష్ణువు.అప్పుడు బాలగణేషుడు నవ్వుతూ..నేను మింగేశానుకదా అంటాడు.
తన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని మహావిష్ణువు బతిమలాడతాడు.అప్పుడు బాలుడిని ప్రశన్నం చేసుకునేందుకు మహావిష్ణువు..తన కుడిచేత్తో ఎడమ చెవిని,ఎడమచేత్తో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీయడం మొదలుపెడతాడు.విష్ణువు గుంజీలు తీస్తుంటే విచిత్రంగా అనిపించడంతో వినాయకుడు పగలబడి నవ్వుతాడు.విపరీతంగా నవ్వడంతో కడుపులో ఉన్న సుదర్శన చక్రం నోటి నుంచి బయటపడుతుంది.విష్ణువు ఆ చక్రాన్ని తీసుకుని ఊపిరి పీల్చుకుంటాడు.అప్పటి నుంచీ వినాయకుడి ముందు గుంజీలు తీసి వేడుకుంటే ఏం కోరుకున్నా నెరవేర్చేస్తాడని భక్తుల విశ్వాసం.
#