*గోదానం చేస్తే మంచిదంటారు.. ఎందువల్ల..!!?*

P Madhav Kumar


దానాల్లో గోదానం విశిష్టమైనదిగా ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. గోదాన ప్రాధాన్యాన్ని తెలుసుకునేందుకు ధర్మరాజు అంపశయ్యపై వున్న భీష్ముని దగ్గరకు వెళ్లాడు.


గోదాన విశిష్టతను తెలపమని కోరడంతో గాంగేయుడు ఒక పురాణ వృత్తాంతాన్ని వివరించాడు. దీని ద్వారా గోదానం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు.


కొన్ని యుగాలకు పూర్వం ఔద్దాలకి అనే మహర్షి వుండేవాడు. నిత్యం యజ్ఞజపాదులు నిర్వహించేవాడు. ఒకనాడు తన కుమారుడైన నాచికేతుడిని పిలిచి నదీ తీరంలో వున్న సమిధలు, దర్భలను తీసుకురమ్మని ఆదేశించాడు. నదీ తీరానికెళ్లిన నచికేతుడికి అవి కనిపించలేదు.


నది పొంగడంతో అవి నది గర్భంలో కలిసిపోయాయి. తండ్రి దగ్గరకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. అప్పటికే ఆకలితో వున్న మహర్షి యజ్ఞకార్యాన్ని పూర్తిచేయాలన్న నిశ్చయంతో వున్నాడు. 


ఇంతలో కుమారుడు ఈ విషయాన్ని వెల్లడించడంతో పట్టరాని కోపంతో నచికేతున్ని నరకానికి వెళ్లు అని మండిపడ్డాడు. తండ్రి ఆజ్ఞను పాటిస్తున్నానని నచికేతుడు కూలిపోయాడు. వెంటనే అతని ప్రాణాలు నరకానికి వెళ్లిపోయాయి.


తన తొందరపాటును తెలుసుకున్న ఔద్దాలకి ఆ రాత్రంతా రోదించాడు. సూర్యోదయ సమయానికి నచికేతుని ప్రాణం తిరిగి వచ్చింది. పట్టరాని ఆనందంతో కుమారుడిని కౌగిలించుకున్నాడు. రాత్రి ఏయే లోకాలకు వెళ్లింది వెల్లడించమన్నాడు.


నచికేతుడు ఆత్మ నరకం చేరుకునేసరికి అక్కడ యమధర్మరాజు స్వాగతం పలికాడు. ఔద్దాలకి మహర్షి నరకానికి వెళ్లమని శాపం పెట్టాడే గానీ చనిపోమ్మని శాపం ఇవ్వలేదు కనుక నచికేతున్ని అతిథిగా పరిగణిస్తున్నట్టు యమధర్మరాజు చెప్పినట్టు నచికేతుడు తెలిపాడు.


అనంతరం నచికేతుడికి అతిథి మర్యాదలు చేశాడు. తనకు పుణ్యలోకాలను చూపించమని యమధర్మరాజును కోరగా అతిథుల అభీష్టం నెరవేర్చడం తమ విధి అని యముడు పేర్కొనట్టు అతను తెలిపాడు.


అనంతరం పుణ్యలోకాలను వీక్షించగా అందులో దివ్యతేజస్సులు కలిగిన పుణ్యపురుషులు వుండటాన్ని గమనించాడు. వారి గురించి యమధర్మరాజును ప్రశ్నించగా వారు గోదానం చేయడంతో పుణ్యలోకప్రాప్తి కలిగిందన్నాడు.


శుభసమయాల్లో గోదానం చేయడం ద్వారా పుణ్యగతులను పొందవచ్చని చెబుతూ... మూడు రాత్రులు నేల మీద పడుకుని నీటిని తీసుకుంటూ దీక్ష చేసిన వారు గోవులను దానం చేస్తే మంచి ఫలితాలు వుంటాయని వివరించాడు. 


చిన్న వయస్సులో మంచి ఆరోగ్యంతో వున్న ఆవును దానం చేస్తే ఆ ఆవుపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు పుణ్యలోకాల్లో వుండే వరాన్ని పొందవచ్చని యమధర్మరాజు తెలిపినట్టు నచికేతుడు తండ్రికి తెలిపాడు. ఈ కథ ద్వారా గోదానం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు. స్వస్తి.🌹🙏🌹



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat