విఘ్నాధిపతి అయిన వినాయకుడిని 16 రూపాల్లో తాంత్రికులు పూజిస్తుంటారు. నిజానికి వినాయకుడికి 32 రూపాలున్నాయనీ, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని చెబుతారు. ఈ 16 రూపాలలో ఒక్కో రూపానిదీ ఒక్కో విశిష్టత.
🌺 విఘ్నగణపతి 🌺
ప్రత్యేకముగా భయంకరమైన విఘ్నములు కలిగినప్పుడు
రాజ్యమునకుగాని, రాజునకుగాని, దేశ స్వాతంత్ర్యమునకు భయంకర ప్రమాదములు కలిగినప్పుడు పూజింపబడుతూ ఉన్నారు. ఈయనకు హోమము, ఆవాహన, జపపూజాదికములు ఆర్యచాణుక్యుని కాలం నుంచీ రాజులు చేస్తున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈయన త్రిమూర్వ్యాత్మకుడు.
ఈ విఘ్న గణపతి పది భుజములు కలిగి వెనుక భుజములలో
శంఖుచక్రములు ధరించి, విష్ణుస్వరూపుడై వెలుగొందును. కుడిచేత పరశువూ అంకుశము, శక్తిని ధరించి ఎడమచేత చెఅకుగడ, పాశము, దర్బలు ధరించియుండును. ముందున్న కుడిచేతిలో భిన్నదంతము (పెరికిన దంతము) పట్టుకుని ఎడమచేయి వరదము (వరము లిచ్చుచున్న ముద్రలో) కుడివైపు తిరిగిన తొండముతో పెద్దచెవులు మహోదరము కలిగి కుడిపాదము క్రిందకు చాసి పద్మము మీద నుండును. ఇది విఘ్నగణపతి మూర్తి.