మకర సంక్రాంతికి ముందు రోజున భోగిపండుగను జరుపుకుంటారు. భోగి పండుగకు సంబంధించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. భోగి పండుగ నాడు పూర్వం ప్రజలు వర్షాల కోసం ఇంద్రుణ్ణి పూజించేవారు. ఇలా పూజలందు కోవడం వల్ల ఇంద్రుడికి గర్వం పెరిగిపోయింది. అతడి గర్వం అణచాలని శ్రీకృష్ణుడు తలచి, ఇంద్రపూజలకు సిద్ధమవుతున్న యాదవులతో 'మన గోవులకు మేతనిచ్చేది గోవర్ధన పర్వతం. కాబట్టి ఈనాటి నుండి ఇంద్రుణ్ణి పూజించడం మాని గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం' అని అన్నాడు.
అప్పుడు ఇంద్రుడు కోపోద్రిక్తుడై, అతి వృష్టి కురిపించాడు. యాదవులందరూ శ్రీకృష్ణునితో తమ బాధలు చెప్పుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకుని, యాదవులకూ, గోవులకూ దాని క్రింద ఆశ్రయాన్ని కల్పించాడు. ఇంద్రుడు తన వద్ద ఉన్న ఏడు రకాల మేఘాలను వర్షింపజేసినప్పటికీ యాదవుల్ని ఏమీ చేయలేకపోయాడు. దానితో ఇంద్రుడి గర్వం అణిగింది. శ్రీకృష్ణుడి మహత్తు తెలుసుకొన్న ఇంద్రుడు పాదాక్రాంతుడయ్యాడు.
శ్రీకృష్ణుడు ఇంద్రుణ్ణి మన్నించి భోగిపండుగ నాడు ఎప్పటిలాగే మళ్ళీ ఇంద్రపూజ జరిగేందుకు ఆనతిచ్చాడు. మకర సంక్రాంతి మరునాడు కనుమ పండుగ జరుపుకుంటారు. వ్యవసాయదారునికి పశువులే సంపద. పంటలు వాటి శ్రమ ఫలితంగా వచ్చినవి కాబట్టి, ఆ రోజు పశువులను పూజించి వాటికి పొంగలి వండి పెడతారు.🙏