భగవంతుడు సంపూర్ణుడు అయితే అల్పమయిన మానవుల భక్తి కి ఎందుకు ఆశపడతాడు?

P Madhav Kumar

భూమి మీదున్న మిగతా జీవరాశితో పోలిస్తే, మానవుడు, తరతరాలుగా యుగయుగాలుగా, జ్ఞాన సముపార్జన చేసే ప్రస్థానం సాగిస్తూ మానవజాతిని సంస్కరించే ప్రయాణం చేస్తున్నాడు, కనక మానవుడు అల్పుడు కాదు, కాకపోతే బిడ్డ ఎంత ఎదిగినా తండ్రి కంటే చిన్నవాడే కనక …మనిషి ఎంత జ్ఞానం సంపాదించుకున్నా దేవుడి కన్నా చిన్నవాడే.. దేవుడి వద్ద భక్తుడే.అయినా ఆ దేవుడికి వారసుడే, రేపు దేవుడిగా ఎదగగలిగిన రాత ఉన్నవాడే అని జ్ఞానులు చెప్తారు.

మానవులది అల్పత్వం కాదు…ఎదిగే క్రమం.

దేవుడు ఏమీ మన భక్తికి "ఆశ" పడడు. మన భక్తికి వశం అవుతాడు. ఎందుకంటే ఆయన కరుణారసహృదయుడు కనుక.

ఆశపడటం, కోరుకోవడం మన స్థాయి ఆలోచనలు.. భక్తికి వశం అవడం, భక్తుడి ఆర్తినీ, ఆవేదనని అర్థం చేసుకొని చేయూతనివ్వడం దేవుడి స్థాయి ఆలోచనలు. అది ఆయన బాధ్యత కూడా.

స్థితప్రజ్ఞత్వం పేరుతో దేవుడు మన భక్తికి వశం కాకుండా…జరిగేది అంతా నిశ్చలంగా చూస్తో కూర్చుంటే, అతడు యాంత్రమో, జడుడో అవాలి తప్ప కరుణ కలిగిన దేవుడు అవడు.

మన జీవిత కాలంలో భగవంతుడు మన అందరికి ఒక పరిమిత కాలం నిర్ణయించి పంపాడు .. మన జీవిత కాలం అనేది మనము తీసుకునే ఉఛ్వాస, నిచ్వాస బట్టి ఉంటుంది అని ఋషులు చెప్తూ ఉంటారు .. అందుకే ఋషులు తమ శ్వాస మీద ముందు పట్టు సంపాదించి .. సమాధి వ్యవస్థ లోకి వెళ్ళి . తమ ఊపిరి స్థబ్దం చేసి నిమిషానికి ఒక శ్వాస తీస్కొని తపస్సు చేస్తారు .. తద్వారా భగవతుడ్ని స్మరించి ఆయనలో ఐక్యం అవ్వడానికి పాటు పడతారు ..

కానీ మన లాంటి సామాన్యులు .. దేవుడికి ఏమి ఇవ్వగలరు .. కేవలం చితశుద్ధితో రోజుకు కొంత సమయం మాత్రమే ... మన ఆయువును లో ని కొన్ని క్షణాలను, నిమిషాలు, ఘంటలు, లేదా రోజులను మనము ఖర్చు చేసి ఆ పరమాత్ముడిని స్తుతిస్తాము .. ఆ స్తుతి కూడా కొందరు తమ కోరికలు తీర్చుకోడానికి వాడితే ,మరికొందరు మాత్రం ఈ మానవ జన్మను ప్రసాదించిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతూ పాడే సంకీర్తనలు, పద్యాలు, కవిత్వాలు .రూపం లో ఉంటుంది .. ఎవరు దేని కోసం చేసిన కూడా తన కోసం, తాను ప్రసాదించిన ఇంత విలువైన కాలాన్ని తనకోసము వెచ్చించిన భక్తుడిని భగవంతుడు కరుణించకుండా ఎలా ఉంటాడు??

భక్తి అనేది దేవుడు అవసరం కాదు .. మానవుడి అవసరం .. భక్తికిని పట్టుకుంటే మనిషికి ముక్తి కి దారి కనిపిస్తుంది .. ఆ ముక్తి అనేది మనిషిని భగవంతుడితో ఐక్యం చేస్తుంది .. ఒక భక్తుడి జీవాత్మ పరమాత్మతో ఐక్యం అయినప్పుడే జీవాత్మకు ఒక పరిపూర్ణత అనేది సంతరించుకుంటుంది .. ఒక సముద్రం అనేది ఎప్పడికి పరిపూర్ణమైనదే .. ఒక నది సముద్రం లో కలిశాకే ఆ నదికి పరిపూర్ణత వస్తుంది..

అందుకే భక్తి అనేది మనకు అవసరం కానీ దాని కోసం భగవంతుడు పాకులాడడు !! కానీ అంత అమూల్యమైన తన సమయాన్ని భక్తి రూపం లో భక్తుడు సమర్పిస్తున్నప్పుడు భగవంతుడికి అంత కంటే ఆనందం ఏమి ఉంటుంది ..

భక్తి అనేది ఆయన్ను చేరుకోడానికి ఒక మార్గం .. ఆ మార్గం ఏర్పర్చడానికి భగవంతుడు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాడు .. అది అందుకుంటామా లేదా అనేది మన కర్మ ఫలం,సంస్కారం బట్టి ఉంటుంది.

భగవంతుడు సదా సంపూర్ణుడు ఆయన ప్రేమను పొందే మానవుడుకూడా సంపూర్ణుడే….

పండరిపురంలో ఉన్న శ్రీ కృష్ణ భగవానుడు బాలకృష్ణుడు, పాకుతూ ఉండే పసి బాలుడు నందగోపుని ఇంట బాలకృష్ణుని దర్శించిన పుండరీకుని ప్రేమకి బద్దుడైపోయి పాకుతూ వచ్చేస్తున్నాడుట అది కూడా బాలకృష్ణుని రూపంలో….

ఆ శ్రీమన్నారాయణ మూర్తి వైకుంఠం వదిలి పుండరీకుడు కొలిచే రూపంలో బాల కృష్ణుడిగా పాకుతూ వస్తూ బుడి బుడి అడుగులు వేసుకుంటూ పిల్లన మ్రోవి పడిపోతుండగా అడుగులు తడబడుతుండగా వచ్చేస్తున్నాడుట….అది చూసి ఆయన వెనుక శంఖు, చక్రాలు, ఆది శేషుడు, పిల్లన మ్రోవి పరిగెత్తుతున్నాయట.

ఆయన వెనుక పరిగెడుతూ పుండరీకుని బ్రతిమాలాడుకుంటున్నాయట మెల్లగా పిలవయ్యా స్వామి నీకోసం వస్తున్నాడు. ఆయన పడిపోతూ వస్తున్నారయ్యా…..మా స్వామి అంటూ వెనకే వస్తున్నాయట పాపం ఆ చిన్ని కృష్ణుని పదములు తడబడుతూ….ఉంటే నాకే కన్నీళ్లు వస్తున్నాయి. మరి వెనక వచ్చే ఆయన దాసులైన శంకు, చక్రాలూ, ఆదిశేషుడూ బాధపడక ఏం చేస్తారు.

అటువంటి భక్తులకోసం ఆ స్వామే పరిగెత్తుకొస్తున్నాడు. మరి భక్తి కన్నా ఆయనకు గొప్పవస్తువు ఏమున్నది.

కనుక సర్వ వ్యాప్తుడు అయినట్టి భగవంతుని ప్రేమిద్దాం, మన హృదయం, మనస్సు, ఆత్మ ను దేవదేవుని చెంత పెడితే అప్పుడు స్వామి మన పక్కనే ఉన్నాడనే విషయం మన ఎరుకలోకి వస్తుంది.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat