మార్గశిరమాసం లో మృగశిరా నక్షత్రం పౌర్ణమి కలసివచ్చిన రోజు రాత్రి శివాలయాలలో నటరాజస్వామి కి అభిషేకపూజలు చేసి,
ఆ మరునాడు ఆరుద్రా నక్షత్రం రోజున
చేసే ఘనమైన ఉత్సవమే తిరువాదిరై (ఆరుద్రా) నక్షత్ర
ఉత్సవము.
కాలానికి లెక్క కట్టలేనంత యుగాల క్రితం ఈ అఖిలాండ బ్రహ్మాండంలో అతిపెద్ద విస్ఫోటనం జరిగినది.
అప్పుడు చెదిరిపడిన ముక్కల నుండి
యీ భూమి,అనేక నక్షత్రాలు, గ్రహాలు ఉద్భవించాయని అంటారు.
ఆ సమయంలో ఉదయించిన నక్షత్ర సముదాయానికి
ఆరుద్రా నక్షత్రం అని పేరు. అందుకే ఆరుద్రా నక్షత్రాన్ని సృష్ట్యాది నక్షత్రం అంటారు. ఆ ఆరుద్రా నక్షత్ర సముదాయం పేరుతోనే ఈశ్వరుడు తిరువాదిరైయాన్ అని పిలువబడుతున్నాడు.
ఈ సందర్భంగానే మార్గశిర ఆరుద్రానక్షత్రం రోజున పరమేశ్వరునికి ఉత్సవం జరిపే
సంప్రదాయం ఏర్పడింది. ఆ రోజున
చిదంబరంలో నటరాజస్వామి కి మహా వైభవంగా ఉత్సవాలు జరుపుతారు.
మొదటి రోజు ధ్వజారోహణంతో
ఉత్సవం ఆరంభమౌతుంది.
దక్షిణ దేశపు శివాలయాలన్నిటిలో
తిరువాదిరై ఉత్సవాలు వైభవోపేతంగా చేస్తారు. పది రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
చిదంబరంలో మొదటి ఎనిమిది రోజులు సోమస్కందనికి పరివార దేవతలకు ఊరేగింపు సేవ జరుపుతారు.
9 వ రోజు ఉదయాన నటరాజస్వామిని శివకామిదేవిని ఒక పెద్ద రధంలో పురవీధులలో ఊరేగిస్తారు.
వినాయకుడు,కుమారస్వామి , చండికేశ్వరుడు చిన్నరధాలలో ఊరేగింపుగా వస్తారు.
ఆ రాత్రంతా తెల్లవారేవరకు బిందెలు బిందెలుగా పాలు , పెరుగు, తేనె , చందనం మొదలైన వాటితో " మహాభిషేకం " చేస్తారు. తరువాత లక్షార్చన జరుగుతుంది.
మధ్యాహ్నం సర్వాలంకారాలతో పరమేశ్వరుడు, అమ్మవారు వేయి కాళ్ళ స్ధంభం నుండి
తాండవం చేస్తూ
తిరుసభకి వస్తారు.
దానినే తిరువాదిరై దర్శనం అని, ఆరుద్రా
దర్శనం అని అంటారు.
ఆ సమయంలోనే పెరుందతురై ఆలయంలోని ఆత్మనాదర్ కి ఆదిరై ఉత్సవం
జరుపుతారు.
ఆత్మనాదర్, వృషభవాహనం , కైలస పర్వత వాహనం,
భూత వాహనం మొదలైన వాహనాలపై
ఊరేగింపు సేవోత్సవంలో భక్తులకు దర్శనం యిస్తాడు. తిరువారూరు లో ఆదిరై ఉత్సవాలు ఎంతో అమోఘంగా వైభవంగా జరుపుతారు.