*ఆదర్శం అంటే, అద్దం అనే అర్థంతో పాటు మేలుబంతి, దృష్టాంతము, అనుకరింపదగినది, ప్రామాణ్యము అనే అర్థాలుకూడా ఉన్నాయి.*
*అలంకరించుకొన్న ముఖం ఎలా ఉందో చూసుకోవాలంటే, అద్దాన్ని ఆశ్రయించక తప్పదు.*
*అలంకరణలో లోటుపాట్లను చూపించి, వాటిని సరి చేసు కోవటానికి అద్దం ఒక అవకాశం ఇస్తుంది. ఇది బాహ్య సౌందర్య ప్రసాధన విషయం.*
*దీనికి అతీతమైనది , అత్యవసరమైనది శీల సౌందర్యం. ఇది మానవులను ఉన్నతులను చేస్తుంది. అజరామరమైన కీర్తి ప్రతిష్ఠలను సమకూర్చుతుంది.*
*దీనికి మరింత శోభ కలగాలంటే, మహర్షుల ప్రవచనాలు, గాథలు, వారి ప్రవర్తనలు మార్గదర్శకాలుగా నిలుస్తాయి.*
*ఒక తరం మరొక తరానికి అందించిన ఆదర్శాలు - దీపం నుంచి మరో దీపం వెలిగినట్లుగా (“దీప ప్రదీపాదివ”) క్రమంగా ఒక సంస్కృతిగా రూపుదిద్దుకుంటాయి.*
*“యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః*
*స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ” *
– అటుంది భగవద్గీత.
*శ్రేష్ఠుడు దేనిని ఆచరిస్తాడో దానినే ఇతరులు ఆచరిస్తారు. అతడు ఒక ప్రమాణాన్ని ప్రతిష్ఠిస్తే లోకం దానిని అనుసరిస్తుంది. ఈ కారణంవల్ల ప్రతి వ్యక్తీ శ్రేష్ఠత్వాన్ని నిలుపుకోవటానికి, తన జీవితాన్ని ఆదర్శవంతంగా మలచుకోవటానికి కృషిచేయటంలో జీవనసార్థక్యం ఉంది.*
*ఉపాధ్యాయుడు తన శిష్యులకు, తల్లిదండ్రులు తమ సంతానానికి, ఒక అధికారి తన తోటి ఉద్యోగులకు, ఒక పీఠాధిపతి తన అనుయాయులకు, ఒక రాజకీయ నాయకుడు తన సిద్ధాంత ప్రచారకులకు లోకం మెచ్చే వ్యక్తిత్వాన్ని అలవడజేయాలంటే ముందుగా వారు ఆదర్శ జీవనులై ఉండాలి. ఆ జీవనం సమాజానికి ప్రయోజనకరంగా ఉంటుంది.*
*తైత్తిరీయోపనిషత్తులో ఆచార్యుడు, విద్యాభ్యాసం ముగించుకొన్న తన శిష్యులకు….*
*“యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని. నో ఇతరాణి.యాన్యస్మాకగ్ం సుచరితాని తాని త్వయోపాస్యాని . నో ఇతరాణి*
*”(నాయనా ! ఏవి దోషరహితాలైన కార్యాలో వాటినే నువ్వు ఉపాసించాలి. ఇతర కార్యాలు చేయవద్దు. మాలో ఏ సత్ప్రవర్తనాంశాలు ఉన్నాయో వాటినే నువ్వు స్వీకరించాలి. ఇతరములను కాదు) అని మహోన్నతమైన సందేశం ఇస్తాడు.*
*రామాయణ సందేశం - *
*"రామాదివ వర్తితవ్యం. న తు రావణాదివత్"*
*(రాముని వలె ప్రవర్తించాలి. రావణాదులవలె కాదు) అని.*
*రాముని సద్గుణాలు సర్వశ్రేష్ఠాలు కనుకనే ఆయన లోకంలో ఆదర్శ మానవునిగా ఆరాధింప బడుతున్నాడు.*
*“తీర్థానికితీర్థం, ప్రసాదానికి ప్రసాదం” అన్నట్టు చదివిన ఉత్తమగ్రంథాలలోని విషయాలను అధ్యయనానికే పరిమితం చేయకుండా, ఆచరించినప్పుడే ఆదర్శం సుప్రతిష్ఠితమౌతుంది. అలాగే, ఆదర్శ ప్రబోధకులు కూడా ఆచరణ శీలురు కావాలి. లేకపోతే వారికి విలువ ఉండదు. ప్రబోధించే అధికారమూ ఉండదు.*
*మానవత్వపు విలువలు, నైతికత, ఆధ్యాత్మిక చింతన, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి ఆదర్శజీవనుడు అనిపించుకుంటాడు.*
*తన తరువాత తరాలకు సమాదరణీయమైన ఒరవడిని చూపిన ఆ వ్యక్తికి మరణమే ఉండదు. అతడే దైవం అవుతాడు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖