▪️ 1
▪️నను మన్నించి భవజ్జనంబులకు నానందంబు నిండించు నీ
తను రూపం బిదె నా మనంబున కచింత్యం బయ్యె; నీ యుల్లస
ద్ఘన విశ్వాకృతి నెవ్వఁ డోపు? నెఱుఁగన్ గైవల్యమై యొప్పు నా
త్మ నివేద్యంబగు నీదు వైభవము చందం బెట్టిదో? యీశ్వరా!
▪️ 2
▪️విజ్ఞాన విధము లెఱుఁగక
తద్జ్ఞులు నీ వార్త చెప్పఁ దను వాఙ్మనముల్
యజ్ఞేశ! నీకు నిచ్చిన
యజ్ఞులు నినుఁబట్టి గెలుతు రజితుఁడవైనన్.
▪️ 3
▪️శ్రేయములుఁ గురియు భక్తిని
జేయక కేవలము బోధసిద్ధికిఁ దపమున్
జేయుట విఫలము; పొల్లున
నాయము జేకుఱునె తలఁప నధికం బైనన్.
▪️ 4
▪️నిజముగ నిన్నెఱుఁగఁగ మును
నిజవాంఛలు నిన్నుఁ జేర్చి నీ కథ వినుచున్
నిజకర్మలబ్ధ భక్తిన్
సుజనులు నీ మొదలిటెంకిఁ జొచ్చి రధీశా!
▪️ 5
▪️విక్రియాశూన్యమై విషయత్వమును లేని-
దగుచు నాత్మాకారమై తనర్చు
నంతఃకరణ మొక్క యధిక సాక్షాత్కార-
విజ్ఞానమునఁ బట్టి వే ఱొరులకుఁ
నెఱుఁగంగ రానిదై యేపారి యుండుటఁ-
జేసి నీ నిర్గుణ శ్రీవిభూతి
బహిరంగవీధులఁ బాఱక దిరములై-
యమలంబు లగు నింద్రియములచేత
▪️ 6
▪️నెట్టకేలకైన నెఱుఁగంగ నగుగాని
గుణవిలాసి వగుచుఁ గొమరుమిగులు
నీ గుణవ్రజంబు నేర రా దెఱుఁగంగ
నొక్క మితము లేక యుంట నీశ!
▪️ 7
▪️తారా తుషార శీకర
భూరజములకైన లెక్క బుధు లిడుదురు; భూ
భారావతీర్ణకరుఁ డగు
నీ రమ్యగుణాలి నెన్న నేర రగణ్యా!
▪️ 8
▪️ఏ వేళం గృపఁ జూచు నెన్నఁడు హరిన్ వీక్షింతు నం చాఢ్యుఁడై
నీ వెంటంబడి తొంటి కర్మచయమున్ నిర్మూలముం జేయుచున్
నీ వాఁడై తను వాఙ్మనోగతుల నిన్ సేవించు విన్నాణి వో
కైవల్యాధిపలక్ష్మి నుద్దవడిఁ దాఁ గైకొన్నవాఁ డీశ్వరా!
▪️ 9
▪️మాయలు గల్గువారలను మాయలఁ బెట్టెడి ప్రోడ నిన్ను నా
మాయఁ గలంచి నీ మహిమ మానముఁ జూచెద నంచు నేరమిం
జేయఁగఁ బూనితిం; గరుణ చేయుము; కావుము; యోగిరాజ వా
గ్గేయ! దవాగ్నిఁ దజ్జనిత కీలము గెల్చి వెలుంగ నేర్చునే.
▪️ 10
సర్వేశ! నే రజోజనితుండ; మూఢుండఁ-
బ్రభుఁడ నేనని వెఱ్ఱి ప్రల్లదమున
గర్వించినాఁడను; గర్వాంధకారాంధ-
నయనుండ గృపఁజూడు ననుఁ; బ్రధాన
మహదహంకృతి నభో మరుదగ్ని జల భూమి-
పరివేష్టితాండకుంభంబులోన
నేడు జేనల మేన నెనయు నే నెక్కడ?-
నీ దృగ్విధాండంబు లేరి కైన
▪️ 11
సంఖ్య జేయంగ రానివి; సంతతంబు
నోలిఁ బరమాణవుల భంగి నొడలి రోమ
వివరముల యందు వర్తించు విపులభాతి
నెనయుచున్న నీ వెక్కడ? నెంతకెంత?
▪️ 12
▪️కడుపులోపల నున్న పాపఁడు కాలఁ దన్నినఁ గిన్కతో
నడువఁ బోలునె క్రాఁగి తల్లికి? నాథ! సన్నము దొడ్డునై
యడఁగి కారణ కార్యరూపమునైన యీ సకలంబు నీ
కడుపులోనిదె గాదె? పాపఁడఁ గాక నే మఱి యెవ్వఁడన్?
▪️ 13
▪️భూరి లయ జలధినిద్రిత
నారాయణనాభికమలనాళమున నజుం
డారఁయఁ బుట్టె ననుట నిజ
మో! రాజీవాక్ష! పుట్టె నోటు తలంపన్.
▪️ 14
▪️నళినాక్ష! నీ వాది నారాయణుండవు-
జలము నారము జీవచయము నార
మందు నీవుంట నీ యం దవి యుంటను-
నారాయణుండను నామ మయ్యె
సకల భూతములకు సాక్షి వధీశుండ-
వబ్ధి నిద్రించు నారాయణుఁడవు
నీ మూర్తి యిది నీకు నిజమూర్తి యనరాదు-
నళిననాళము త్రోవ నడచి మున్ను
▪️ 15
▪️కడఁగి నూఱేండ్లు వెదికి నేఁ గాననయితి
నేకదేశస్థుఁడవు గా వనేక రుచివి
జగములోనుందు; నీలోన జగములుండు
నరుదు; నీ మాయ నెట్లైన నగుచు నుండు.
▪️ 16
▪️వినుమో; యీశ్వర! వెల్పలన్ వెలుఁగు నీ విశ్వంబు నీ మాయ గా
క నిజంబైన యశోద యెట్లుగనియెం? గన్నార నీ కుక్షిలోఁ
గనెఁ బోఁ గ్రమ్మఱఁ గాంచెనే? భవదపాంగశ్రీఁ బ్రపంచంబు చ
క్కన లోనౌ; వెలి యౌను; లోను వెలియుం గాదేఁ దదన్యం బగున్;
▪️ 17
▪️ఒకఁడై యుంటివి; బాలవత్సములలో నొప్పారి తీ వంతటన్
సకలోపాసితులౌ చతుర్భుజులునై సంప్రీతి నేఁ గొల్వఁగాఁ
బ్రకటశ్రీ గలవాఁడ వైతి; వటుపై బ్రహ్మాండముల్ జూపి యొ
ల్లక యిట్లొక్కఁడవైతి; నీ వివిధ లీలత్వంబుఁ గంటిం గదే?
▪️ 18
▪️ఎఱిఁగిన వారికిఁ దోఁతువు
నెఱిఁ బ్రకృతింజేరి జగము నిర్మింపఁగ నా
తెఱఁగున రక్షింపఁగ నీ
తెఱఁగున బ్రహరింప రుద్రు తెఱఁగున నీశా!
▪️ 19
▪️జలచర మృగ భూసుర నర
కులముల జన్మించి తీవు కుజనులఁ జెఱుపన్
జెలిమిని సుజనుల మనుపను
దలపోయఁగ రాదు నీ విధంబు లనంతా!
▪️ 20
▪️మ్రబ్బుగొలిపి యోగమాయ నిద్రించిన
యో! పరాత్మభూమ! యోగిరాజ!
యే తెఱంగు లెన్ని యెంత యెచ్చోట నీ
హేల లెవ్వఁ డెఱుఁగు నీశ్వరేశ!
▪️ 21
▪️అది గాన నిజరూప మనరాదు; కలవంటి-
దై బహువిధదుఃఖమై విహీన
సంజ్ఞానమై యున్న జగము సత్సుఖబోధ-
తనుఁడవై తుదిలేక తనరు నీదు
మాయచేఁ బుట్టుచు మనుచు లే కుండుచు-
నున్న చందంబున నుండుచుండు;
నొకఁడ; వాత్ముఁడ; వితరోపాధి శూన్యుండ-
వాద్యుండ; వమృతుండ; వక్షరుండ;
▪️ 22
▪️వద్వయుండవును; స్వయంజ్యోతి; వాపూర్ణుఁ
డవు; పురాణపురుషుఁడవు; నితాంత
సౌఖ్యనిధివి; నిత్యసత్యమూర్తివి; నిరం
జనుఁడ వీవు; తలఁపఁ జనునె నిన్ను. ?
▪️ 23
▪️దేవా! యిట్టి నీవు జీవాత్మ స్వరూపకుఁడవు, సకలాత్మలకు నాత్మయైన పరమాత్మ స్వరూపకుఁడవు నని యెవ్వ రెఱుంగుదురు, వారు గదా గురు వనియెడు దినకరునివలనఁ బ్రాప్తంబైన యుపనిషదర్థజ్ఞానం బను సునేత్రంబునంజేసి సంసార మిథ్యాసాగరంబుఁ దరించిన చందంబున నుండుదురు; రజ్జువందు రజ్జువని యెఱింగెడి యెఱుక లేకుండ, న య్యెఱుంగమి నది సర్పరూపంబయి తోఁచిన పిదప నెఱింగిన వారివలన రజ్జువు రజ్ఝువని యెఱుంగుచుండ, సర్పరూపంబు లేకుండు కైవడి, నాత్మ యప్పరమాత్మ యని యెవ్వ రెఱుంగరు వారి కయ్యెఱుంగమివలన సకల ప్రపంచంబు గలిగి తోఁచు; నాత్మ యప్పరమాత్మ యని యెవ్వరెఱుంగుదురు, వారి కయ్యెఱుకవలనఁ బ్రపంచంబు లేకుండు నజ్ఞాన సంభావిత నామకంబులైన సంసార బంధ మోక్షంబులు, జ్ఞాన విజ్ఞానంబులలోనివి గావు; కావునఁ గమలమిత్రున కహోరాత్రంబులు లేని తెఱంగునఁ, బరిపూర్ణ జ్ఞానమూర్తి యగు నాత్మ యందు నజ్ఞానంబులేమిని బంధంబును సుజ్ఞానంబు లేమిని మోక్షంబు లే; వాత్మవయిన నిన్ను దేహాదికంబని తలంచియు, దేహాదికంబు నిన్నుఁగాఁ దలంచియు, నాత్మ వెలినుండు నంచు మూఢులు మూఢత్వంబున వెదకుచుందురు; వారి మూఢత్వంబుఁ జెప్పనేల? బుద్ధిమంతులయి పరతత్వంబు గాని జడంబును నిషేధించుచున్న సత్పురుషులు తమ తమ శరీరంబుల యంద నిన్నరయుచుందు రదిగావున.
▪️ 24
▪️దేవా! నీ చరణప్రసాదకణలబ్ధిం గాక లేకున్న నొం
డేవెంటం జను నీ మహామహిమ నూహింపంగ నెవ్వారికిన్?
నీ వారై చనువారిలో నొకఁడనై నిన్ గొల్చు భాగ్యంబు నా
కీవే యిప్పటి జన్మమం దయిన నొం డెం దైన నో! యీశ్వరా!
▪️ 25
▪️క్రతుశతంబునఁ బూర్ణ కుక్షివి; గాని నీ విటు క్రేపులున్
సుతులునై చనుఁబాలు ద్రావుచుఁ జొక్కి యాడుచుఁ గౌతుక
స్థితిఁ జరింపఁగఁ దల్లులై విలసిల్లు గోవుల గోపికా
సతుల ధన్యత లెట్లు చెప్పగఁ జాలువాఁడఁ గృపానిధీ!
▪️ 26
▪️పరిపూర్ణంబుఁ బురాణముఁ
బరమానందంబునైన బ్రహ్మమె చెలికాఁ
డరు దరుదు నందఘోష
స్థిరజనముల భాగ్యరేఖ చింతింపంగన్
▪️ 27
▪️ఏకదశేంద్రియాధీశులు చంద్రాదు-
లేను ఫాలాక్షుండు నిట్లు గూడఁ
బదుమువ్వురము నెడపడక యింద్రియ పాత్ర-
ముల నీ పదాంభోజముల మరంద
మమృతంబుగాఁ ద్రావి యమర నేకైకేంద్రి-
యాభిమా నులుమయ్యు నతి కృతార్థ
భావుల మైతిమి; పరఁగ సర్వేంద్రియ-
వ్యాప్తులు నీ మీఁద వాల్చి తిరుగు
▪️ 28
▪️గోప గోపికాజనముల గురు విశిష్ట
భాగ్య సంపదఁ దలపోసి ప్రస్తుతింప
నలవిగా దెవ్వరికి నైన నంబుజాక్ష!
భక్తవత్సల! సర్వేశ! పరమపురుష!
▪️ 29
▪️ఏలా బ్రహ్మపదంబు? వేదములకున్ వీక్షింపఁగారాని ని
న్నీలోకంబున నీ వనాంతరమునం దీ మందలోఁ గృష్ణ యం
చాలాపాది సమస్త భావములు నీ యందే సమర్పించు నీ
వ్రేలం దొక్కని పాదరేణువులు పై వేష్ఠించినం జాలదే?
▪️ 30
▪️నిను హింసించిన పూతనాదులకు మున్ నీ మేటి సంకేత మి
చ్చిన నీకుం బుర దార పుత్ర గృహ గో స్త్రీ ప్రాణ దేహాదు లె
ల్లను వంచింపక యిచ్చు గోపకులకున్ లక్షింప నే మిచ్చెదో?
యని సందేహము దోఁచుచున్నది ప్రపన్నానీకరక్షామణీ!
▪️ 31
▪️దేహము కారాగేహము
మోహము నిగళంబు; రాగముఖరములు రిపు
వ్యూహములు భక్తితో ని
న్నూహింపఁని యంతదడవు నో! కమలాక్షా!
▪️ 32
▪️ఆశ్రయించు జనుల కానందసందోహ
మీఁ దలంచి వివిధ హేలతోడ
నప్రపంచకుండ వయ్యుఁ బ్రపంచంబు
వెలయఁజేయు దీవు విశ్వమూర్తి!
▪️ 33
ఎఱిఁగిన వార లెఱుంగుదు
రెఱుఁగన్ బహు భాషలేల? నీశ్వర! నీ పెం
పెఱుఁగ మనోవాక్కులకున్
గుఱిచేయం గొలది గాదు గుణరత్ననిధీ!
▪️ 34
▪️సర్వము నీవ యెఱుంగుదు
సర్వవిలోకనుఁడ వీవ; జగదధిపతివిన్;
సర్వాపరాధి నను నో!
సర్వేశ! యనుగ్రహింపు; చనియెద నింకన్.
▪️ 35
▪️జిష్ణు! నిశాటవిపాటన!
వృష్ణికులాంభోజసూర్య! విప్రామర గో
వైష్ణవ సాగర హిమకర!
కృష్ణా! పాషండధర్మగృహదావాగ్నీ!
▪️ 36
▪️ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ పూర్వభాగ అంతర్గత బ్రహ్మదేవుని కృష్ణ స్తుతి ( *మోహ నాశము*)
హరిః ఓమ్. హరిః ఓమ్.