🪔🪔అంతర్యామి🪔🪔

P Madhav Kumar



🌹గౌతముడి శాపం కారణంగా అహల్య రాయిగా మారింది. రామచంద్రుడి రాకతో, స్పర్శతో 'లోభమోహాల నుంచి ఆమెకు విముక్తి కలుగుతుంది' అని వాల్మీకి రామాయణం చెబుతోంది. అహల్యకు దేవేంద్రుడి పట్ల లోభమోహాలు ఏర్పడ్డాయి కాబట్టి, రామదర్శనంతో వాటినుంచి బయటపడుతుందని వాల్మీకి మాటల సారాంశం. 


🌹ఇంద్రుడంటే సకల ఐశ్వర్యాలకు స్థావరమైనవాడని అర్థం. అహల్యకు ఐశ్వర్యం పట్ల లోభం ఏర్పడింది. దాన్ని సాధించాలంటే కామరూపమైన మోహం ఒక్కటే దారి. కనుక మోహానికి లోబడింది ఆమె. అర్థకామాలకు వశుడైన మనిషి ధర్మస్థితికి దూరమవుతాడు. రుషిపత్ని అనేది అహల్య విషయంలో అత్యున్నత ధార్మిక స్థితి. అహల్య ఆ స్థితి నుంచి జారి పతనమైంది.


🌹ఆమెను ఉద్ధరించడానికి గౌతముడు సంకల్పించి- మొదట 'నిరాహారవు' కమ్మని ఆమెకు సూచించాడు. మనసును అన్నమయంగా చెప్పింది ఉపనిషత్తు. అన్నాన్ని త్యజించడం ద్వారా మనసును జయించాలని గౌతముడి ఆదేశం. అన్నం లేకుండా జీవించడం సాధ్యం కాదు. కాబట్టి వాతభక్షవు... అంటే గాలిని ఆహారంగా తీసుకొమ్మని గౌతముడు చెప్పాడు. 'తప్యన్తీ' అని మరో మాట చెప్పాడాయన. అంటే తిరిగి ధర్మస్థితిని చేజిక్కించుకోవాలన్న | తీవ్రమైన కోరికతో తపించిపోవాలని గౌతముడి మాటల్లోని ఆంతర్యం.


🌹అలాగే 'భస్మశాయినీ' అనేది మరో ఆదేశం. శరీర భావన లేకుండా, అహంకార మమకారాదులను విడిచిపెట్టి బూడిదలో పడి ఉండమని దాని అర్థం. అలా ఎన్నో ఏళ్లు అహల్య తపస్సు చేసింది. దానికి ఫలితమే రామభద్రుడి దర్శనం.


🌹'నాలో మోహాన్ని తొలగించు' అని అహల్య భర్తను కోరింది. రాయిగా పడి ఉండటమనేది శిక్ష. ఆ శిక్షకు ఆమె సిద్ధపడింది. కాని మనసులోంచి మోహం చెరిగిపోకుంటే- ఆ శిక్ష శిక్షగానే మిగిలిపోతుంది. ఆమెలో దోషబీజం అలానే ఉండిపోతుంది. కాబట్టి ఆమె మోహం సమూలంగా నిర్మూలన కావాలంది. 


🌹దాన్ని గౌతమ మహర్షి గ్రహించాడు. ఆమె తపనను గుర్తించాడు. కాబట్టే రాముడి దయతో అహల్య పునీత కాగానే, గౌతముడు తిరిగి ఆశ్రమానికి చేరుకొన్నాడు. తన 'ధర్మపత్ని'ని చేరదీశాడు.తప్పును సరిదిద్దుకోవడానికి అహల్య పడిన తపన,చేసిన తపస్సు ఆమెను మానసికంగా సైతం దోషభావన నుంచి పూర్తిగా విముక్తిరాలిని చేశాయి. 


🌹ఆమెకు పూర్వస్థితిని, ధార్మిక చైతన్యాన్ని ప్రసాదించాయి. అందుకు కారకుడైన అవతార పురుషుడు రాముడే- అహల్య పాదాలను తాకి నమస్కరించాడు. చేసిన తప్పు ఎలాంటిదైనా- పశ్చాత్తాపంతో ఆ దోషాన్ని పోగొట్టుకొని తిరిగి పూజ్యురాలిగా మారినందుకే- అహల్యను మన పెద్దలు పతివ్రతగానూ పంచకన్యల్లో ఒకరిగానూ గౌరవించారు.

🌹🌹🌹🌹🌹🌹🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat