మరణం అంటే ఏమిటి?

P Madhav Kumar


 *'ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఆశ్చర్యకరమైనదేది' అన్నది యక్షుడి ప్రశ్న.* 


*'నిత్యం అనేకమంది తన కళ్ళముందే చనిపోతున్నా తాను మాత్రం చిరంజీవినని అనుకుంటూంటాడు మనిషి. ఇంతకన్న ఆశ్చర్యం ఇంకేముంటుంది' అంటూ బదులిస్తాడు యుధిష్ఠిరుడు.* 


 *ప్రతి మనిషికీ మరణం తప్పదు. అయినా తాను మాత్రం శాశ్వతంగా బతకబోతున్నట్టు ప్రవర్తిస్తుంటాడు. తనకేదో రోజున హఠాత్తుగా రాబోయే మరణం గురించి తెలుసుకోవటానికి మనిషికి క్షణం కూడా తీరికలేదు.* 


*మనిషికి తన పుట్టుక గురించి తెలుసు. కాని, మరణం గురించి బొత్తిగా తెలియదు. దాన్నించి తప్పించుకోవటం అసంభవమనీ తలంచడు.* 


*చనిపోయాక ఏమవుతుంది, మరణం తరవాత మనిషి ఎక్కడికి వెడతాడు, అసలు మానవ జన్మకు ప్రయోజనమేమిటి, ఆత్మ అన్నది ఉన్నదా, శరీరాన్ని వదిలేశాక ఆత్మ ఎక్కడికి వెడుతుంది....* 


 *జీవితం మీద జిజ్ఞాస ఉన్న ప్రతి మనిషికీ ఎదురయ్యే ప్రశ్నలివి. జీవించటంలో మునిగిపోయి ఈ ప్రశ్నలకు జవాబుల గురించి అన్వేషించడు. చివరికి ప్రాణాంతకమైన జబ్బుచేసినా, ఆఖరి క్షణాలు ఆసన్నమవుతున్నా- ఇంకా జీవితాన్ని ఎలా పొడిగించాలా అన్న ఆలోచనే తప్ప, జన్మాంతర జీవితం గురించి తలంచడు.* 


 *వాస్తవంగా తల్లి గర్భంలో పడినప్పటినుంచి మరణంవైపు మనిషి ప్రయాణం ఒక్కొక్క అడుగే సాగుతూంటుంది. ఓ క్షణం ముందుకు నడుస్తోందంటే ఆయుష్షులో ఓ క్షణం తరిగిపోతున్నట్టే కదా! బ్రహ్మ జ్ఞానులకు ఇది అసంబద్ధమనిపించదు. ఎందుకంటే, మరణానంతర జీవితం గురించి మన వేదాలు ఘోషిస్తున్నాయి కనుక. ఈ జీవితం ఎంత ముఖ్యమో, ఆ జీవితమూ అంతే అవసరం !* 


 *కొన్ని మతాలు మరణానంతర జీవితం గురించి భయపెడుతుంటాయి. జీవితం ఎంత స్వేచ్ఛాసుఖాలతో అనుభవించవచ్చో మరణం కూడా అంత స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో ముగించవచ్చని మన వేదాలు చెబుతున్నాయి.* 


 *కొందరు మతస్తులు మనిషికి ఒకే జన్మ ఉంటుందని, మానవ జన్మ తక్కువ సమయంలో ముగిసిపోతుంది కనుక వస్తు రూపేణా దొరికే సుఖాలన్నీ ఈ జన్మలోనే తనివి తీరా అనుభవించేయాలని బోధిస్తారు.* 


*మనిషికొకే జన్మ అని అనుకోవటంలో ప్రమాదమే అది.*   


*రేపో, ఎల్లుండో ఎలాగా పోతాం కనుక త్వరత్వరగా అన్నీ అనుభవించేయాలని పిచ్చి పరుగులు పెడుతుంటారు వాళ్ళు.* 


 *వేద పరిజ్ఞానమున్నవారిని మరణం భయపెట్టదు. వస్తురూపంగా చవిచూసే గుణాలకన్న మానసికంగా దొరికే ఆనందమే వారికి ముఖ్యం. జీవితం దారి జీవితానిదే! మరణం దారి మరణానిదే!* 


*మరణం జీవితానికి ఆఖరిమెట్టు. ఆత్మ జీవితం అనంత వాహిని. ఒక జన్మ ఆత్మ వేసుకునే వస్త్రం మాత్రమే! ఆత్మకు చావులేదు* .


 *భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 'అర్జునా! ప్రతి దేహంలో నివసించే దేహి లేక ఆత్మ నిత్యుడు. అవధ్యుడు. మరణమనగా దేహంనుంచి దేహి బయటికి వెళ్ళడం. దేహం ధరించే వస్త్రం లాంటిది. ఈ రెండింటి సంయోగం క్షణికమే! పాత బట్టల్ని విడిచి కొత్త బట్టల్ని ధరించటం వంటిదే! ఆత్మ తన పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ఆశ్రయిస్తుంది' అని స్పష్టంగా చెప్పాడు.* 


 *ఏదో క్షణంలో ఈ జీవితం ముగిసిపోవచ్చు. ఈ ప్రశ్నలకు జవాబులు దొరక్కుండానే సమయం అంతం అయిపోవచ్చు. అందుకే, వస్తువుల ద్వారా దొరికే సుఖసౌఖ్యాలన్నీ కేవలం తాత్కాలికమేనని, శాశ్వతంగా లభించే ఆనందం వేరే ఉందని మనసులో జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి.* 


*అప్పుడే ఈ మానవ జన్మకు ముక్తిమార్గం లభ్యమవుతుంది. దివ్యజ్ఞానం దక్కుతుంది. ఈ ఆత్మ పరమాత్మకెంతో దగ్గరని అర్థమవుతుంది.* ✍️

                          …సేకరణ.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

            

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat