వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించారు. ఈయన పాండవుల చరిత్రలో ఒక ప్రధాన పాత్ర పోషించారు. వ్యాసుడు రాసిన మహాభారతం గురించి అందరికీ తెలిసిందే. అయితే అసలు వ్యాసుడు ఎవరు?? ఆయన జననం ఎలా జరిగింది?? వంటి విషయాలు చాలా కొద్దిమందికే తెలుసు. వ్యాసుడి గురించి, ఆయన జననం గురించి ఆసక్తికరమైన కథ ఉంది.
దాశరాజుకు మత్స్యగంధి అనే కూతురు ఉంది. అద్రిక అనే అప్సరస బ్రహ్మ శాపం వల్ల యమునా నదిలో చేపగా తిరుగుతున్నప్పుడు, ఉపరిచరవసువు వీర్యంవల్ల మత్స్యగంధి పుట్టింది. ఆమెను దాశరాజు కన్నబిడ్డలాగా పెంచుకొంటున్నాడు. చేపకడుపున పుట్టటం వలన మత్స్యగంధి శరీరం అంతా చేపవాసన కొడుతుండేది. అందువల్ల ఆమెనుమత్స్యగంధి అని పిలిచేవారు. ఆమె క్రమంగా పెరిగి పెద్దది అయ్యింది. దాశరాజు మత్స్యగందితో యమునానది మీద పడవ నడుపుతూ యాత్రికుల సేవ చేసుకోమని చెప్పాడు. తండ్రి చెప్పడం వల్ల మత్స్యగంధి ఆ పనిని ఎంతో శ్రద్దగా, భక్తిగా చూసుకునేది.
ఒకరోజు వశిష్ఠమహర్షి మనుమడు, శక్తిపుత్రుడు, మహాతపస్వి అయిన పరాశరముని యమునానది దాటటానికి పడవరేవుకు వచ్చి మత్స్యగంధిని చూశాడు. ఆమె శరీర సౌందర్యం ఆ మహర్షి మనస్సును దోచుకొన్నది. అతడు తన కోర్కెను ఏకాంతంగా ఆమెకు తెలియజెప్పాడు. మునిమాట కాదంటే శాపమిస్తాడనే భయంతో పరాశరునితో మెల్లగా మత్స్యగంధి ఇట్లా అన్నది.
'మహర్షీ! నేనెమో ఇంకా పెళ్లి కాని అమ్మాయిని. అందులోనూ నేను చేప కడుపున పుట్టడం వల్ల నా శరీరం అంతా చేపలకంపు వస్తుంది. మీరు అడిగిన దానికి నేను ఒప్పుకుంటే అప్పుడు తప్పు చేసినదాన్ని అవుతాను. తప్పు చేసి నేను మా నాన్న దగ్గరకు ఎలా వెళ్లగలుగుతాను?? కాబట్టి నాకు ఎలాంటి సమస్యా రాకుండా మీరు మీ శక్తి ఉపయోగించి ఏదైనా చేస్తే అప్పుడు మీ కోరిక తీర్చడానికి నాకేమీ సమస్య లేదు" అని చెప్పింది.
పరాశరుడు ఆ మాటలు విని, సంతోషంతో ఆమె కన్యాత్వానికి లోపం లేకుండా వరమిచ్చాడు. ఆమె శరీరంలోని చేపలకంపు పోయి ఒక యోజనదూరం వరకూ పరిమళించే సుగంధాన్ని సహజశరీర వాసనగా ప్రసాదించాడు. దానితో ఆమె 'గంధవతి'గా, 'యోజనగంధి'గా పేరుపొందింది. ఆమెకు చివ్యాంబర భూషణాలు అందించాడు మహర్షి, పడవ నది మధ్యలో ఉన్న దీవికి చేరింది. పట్టపగలు బట్టబయలు ఎట్లా సంగమం సాధ్యం? అని అనుమానించింది యోజనగంధి. పరాశరుడు పట్టపగలును చిమ్మచీకటిగా మార్చాడు. ఆ ముద్దరాలి అనురాగాన్ని అనుభవించాడు. ఆమెకు సద్యోగర్భంలో సూర్యతేజుడైన వ్యాసుడు ఉదయించాడు. పుట్టగానే సద్యోయౌవనుడైనాడు. సమస్తజ్ఞానం ఆయనకు స్వాధీనమైనది. పరాశరుడు మత్స్యగంధికి మరికొన్ని వరాలిచ్చి వెళ్లిపోయాడు.
నల్లని యమునాద్వీపంలో పుట్టటం వలనా, కృష్ణుడు అంటే నల్లనివాడు కావటంచేత వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు అయినాడు. కృష్ణాజినం, కాషాయాలు, కపిలజడలు, దండకమండలాలు సహజంగానే ధరించి వ్యాసుడు తల్లికి నమస్కరించాడు. 'మీకు నా అవసరం ఎప్పుడు ఉంటే అప్పుడు నన్ను తలుచుకొండి ఆక్షణమే మీ యెదుట ఉంటాను' అని చెప్పి తపోవనానికి వెళ్లాడు. ఘోరతపస్సు చేసి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది, చిక్కుపడి ఉన్న వేదాలను విడదీసి. లోకంలో వెలయించాడు వేదవ్యాసుడైనాడు. మహాభారతంలో తానూ ఒక పాత్రగా జీవించి చివరకు ఆ కావ్యాన్ని తానే రచించాడు. యోజనగంధి అసలు పేరు సత్యవతి. కౌరవ వంశ చరిత్రలో తరువాత కీలకపాత్ర నిర్వహించింది.
ఓం నమః శివాయ