నీకు ఇక శ్లేష్మము గురించి చెప్తాను. శ్లేష్మము ఎక్కువ అవడం ఒక దోషము. అది ఏ అవయవము మీద తన ప్రభావాన్ని చూపితే ఆ అవయవము రోగగ్రస్థమై చివరకు అన్ని అవయవాలకు సోకి చివరకు మరణానికి దారితీస్తుంది. శ్లేష్మము గొంతుకు అడ్డుపడినప్పుడు శ్వాస ఆడక ఎగశ్వాస వచ్చి చివరకు జీవుడు శరీరాన్ని వదిలివేస్తాడు. మానవుడికి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మొత్తం పది ఉన్నాయి. వీటిని మనస్సు నియంత్రిస్తూ ఉంటుంది. బుద్ధివీటికి మంచిచెడు చెప్తుంది. వీటి నియంత్రణకు లోబడి ఇంద్రియములు తమకు కావలసిన సుఖములు అనుభవిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే శరీరంలో శ్లేష్మము అధిక మైనప్పుడు ఇంద్రియములకు అది అడ్డుపడి వాటిని పనిచేయ నివ్వక వ్యాధికి మూలకారణమై మిగిలిన అన్ని అవయవముల పనులు ఆగిపోతాయి. తరువాతది వాతము. వాతము అంటే వాయువు. వాయువు శరీరం అంతా ప్రసరిస్తూ ఉంటుంది. మానవుని ఆహారనియమాల వలన దోషపూరితమైన వాయువు వ్యాధిని కలుగచేస్తుంది. వాత సంబంధిత వ్యాదులు క్రమంగా శరీరం అంతా వ్యాపిస్తాయి. నాలుకను చాపడం, చేతులు కాళ్ళు మడవడం చాపడం వంటి పనులను వాతము నియత్రిస్తుంటుంది. దోషపూరితమైన వాయువు ఆయా అవయవాలను పని చేయకుండా ఆపి వేస్తాయి. ఈ వాయువులు ఏక సమయంలో రెండు మూడు అవయవాలకు వ్యాపిస్తే దానిని సన్నిపాత వాతము అంటారు. అది మరణానికి దారి తీస్తుంది. వాతపిత్తశ్లేష్మములు అస్థవ్యస్థమై ఈ శరీరాన్ని రోగగస్థం చేసి చివరకు మరణానికి గురిచేస్తాయి. ఈ శరీరం నివసించడానికి యోగ్యం కానప్పుడు జీవుడు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి పోతాడు.
ఊర్ధ్వలోకాలు
ఈ శరీరాన్ని వదిలిన జీవుడు తాను చేసిన కర్మల శేషాన్ని అనుభవించదనికి తిరిగి వేరు శరీరంలో ప్రవేశిస్తాడు. ఆ జన్మలో తాను పూర్వజన్మలో చేసిన పాపపుణ్య ఫలితంగా కష్టసుఖాలను అనుభవిస్తాడు. పామలు చేసిన కష్టాలు పుణ్యాలు చేసిన సుఖాలు అనుభవిస్తాడు. ఏ బంధనాలు లేని జీవుడు మోక్షమును పొందగలడు. పుణ్యకార్యములు, ధర్మకార్యాములూ చేసిన మానవుడు సూర్యమండలం, చంద్రమండలం, నక్షత్రమండలం వెడతాడు. అక్కడ వారు చేసిన పుణ్యము సుఖములుగా అనుభవింఛీ పుణ్యము తీరగానే మానవ లోకంలో తిరిగి జన్మిస్తారు. కర్మశేషము లేని వారు మాత్రమే తిరిగిరాని మోక్షపదవిని పొందగలరు. మానవుడు గత జన్మలో చేసిన శుభాశుభములు మరుజన్మకు కారణం ఔతాయి. దానిని తప్పించుకోవడం ఎవరి తరము కాదు. స్త్రీపురుష సమాగమంతో తల్లి గర్భంలో పిండంగా ఏర్పడి శరీరధారి అయిన జీవుడు తొమ్మిది మాసముల గర్భవాసానంతరం ఈ లోకములో ప్రవేశించి తన గతజన్మల కర్మశేషాన్ని అనుభవిస్తాడు. మానవుడు జన్మరాహిత్యం పొందనంతకాలం ఇలా పుడ్తూ చస్తూ తిరిగి పుడుతూ మరలా చస్తూ సుఖదుఃఖాలను అనుభవిస్తూనే ఉంటాడు. మానవుడు మోక్షము పొందనంత కాలం జననమరణ చక్రభ్రమణం నుండి విముక్తి ఉండదు.