లక్ష్మీదేవి జన్మ, నివాస రహస్యం

P Madhav Kumar


సర్వలోక రక్షిణి, సర్వజ్ఞానప్రదాయిని. శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జననిని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది. సిరిసంపదలు, సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరినవారికి కొంగుబంగారమవుతుంది. లక్ష్మీదేవి పుట్టుక గురించి తెలుసుకోవాలంటే, ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా, ఎదురుగా దుర్వాస మహర్షి తారసడతాడు. అల్లంతదూరాన ఇంద్రుని చూసిన దుర్వాసుడు, అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండనిస్తాడు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు, దండ ఇచ్చినదెవరన్న విషయాన్ని పట్టించుకోకుండా, కనీసం కృతజ్ఞతలు చెప్పకుండా, ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు. తొండాన్ని అటు, ఇటు ఆడిస్తున్న ఏనుగు, దండను కిందికి విసిరేసి కాళ్ళతో తొక్కుతుంది. అసలే కోపిష్ఠి అయిన దుర్వాసుడు, ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపాద్రిక్తుడై, ‘‘ఓ ఇంద్రా! మితిమించిన అహంకారం, గర్వాతిశయాలతో ప్రవర్తించిన నిన్ను, ఈ భోగభాగ్యాలన్నీ వీడిపోతాయి’’ అని శపించాడు.




అప్పుడు ఇంద్రుని కళ్ళకు కప్పుకున్న తెరలు తొలగడంతో దుర్వాస మునిని క్షమించమంటూ వేడుకున్నాడు. అది విన్న దుర్వాసుడు, శాపాన్ని అనుభవించక తప్పదని, అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు. అనంతరం ఇంద్రునిపై దుర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించింది. బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతారు. ఇంద్రుని, అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమేస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి, తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు. అందుకు తగిర పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో, ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు పలకడంతో అందరూ విష్ణుసన్నిధికి చేరుకుంటారు. ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి, రాక్షసుల సాయంతో పాలసముద్రాన్ని చిలికి, అందులోనుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని అంటాడు. మందరపర్వతం, వాసుకితో పాలసముద్రాన్ని చిలకడం మొదలెడతారు.


విష్ణుమూర్తి కుర్మావతారరూపంలో మందరపర్వతం మునిగిపోకుండా భరిస్తాడు. అనంతరం పాలసముద్రం నుండి ఎన్నోరకాలైన జీవులు, వస్తువులు వెలువడతాయి. అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో, అందెల మృదుమధుర రవళులతో, చేతిలో కలువలమాలతో ఉదయిస్తుంది. ఆమె లక్ష్మీదేవి, ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి, నును సిగ్గులతో ఆయన సరసన నిలబడుతుంది. అలా క్షీరసాగర మథనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్టశిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నింటిలోనూ ఆయన సరసనే ఉంటుంది.


చంచల స్వరూపిణి...


లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా ఉండదనేది జగమెరిగిన సత్యమే. గర్విష్ఠులు, ఈర్ష్యాద్వేష పూరితుల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదనడానికి దుర్యోధనుని ఉదంతమే ప్రబల ఉదాహరణ. ఒకరోజు తన తండ్రి ధృతరాష్ట్రుని ముందు నిలిచిన దుర్యోధనుడు, పాండవాదులపట్ల తనకు గల అక్కసునంతా వెళ్ళగక్కుతాడు. పాండవులు సంపదల మధ్య తులతూగిపోతున్నారనీ, లెక్కలేనంత మంది భృత్యులతో, రాజప్రాసాదాలతో విలసిల్లుతున్నారని, తనేం చేయాలో చెప్పాలంటూ అభ్యర్థిసాడు. కొడుకు మాటలను విన్న ధృతరాష్ట్రుడు, పాండవుల్లా ఐశ్వర్యంలో తులతూగాలంటే నీతినియమాలతో ప్రవర్తించాలనీ, అందుకు ఉదాహరణ ప్రహ్లాదుడేనని చెబుతాడు. అవును, ప్రహ్లాదుడు రాక్షసుల మధ్య జన్మించినప్పటికీ, అతడు నడిచిన బాట నైతిక ఋజువర్తనతో కూడినదే. ప్రహ్లాదుని ఋజువర్తనం ఇంద్రుని ఉదంతంతో తెలుస్తోంది.


ఒకసారి విషయవాంఛలతో విసిగిపోయిన ఇంద్రుడు, తన గురువు బృహస్పతిని కలిసి, తను కోల్పోయిన సంతోషాన్ని ఏవిధంగా తిరిగి తెచ్చుకోవాలో చెప్పమంటాడు. ఇంద్రుని మాటలను విన్న దేవగురువు విజ్ఞానమే అన్ని విధాలై న సంతోషాలకు మూలమనీ, దానిని తెచ్చుకునేందుకు ప్రయత్నించమని చెబుతాడు. ఇంద్రుని మనసులో మరో సందేహం. విజ్ఞానం కంటే గొప్పదైన విషయం ఏమైనా ఉందా అని, అదే విషయాన్ని బృహస్పతిని అడిగితే, ఆ సంగతిని తెలుసుకోవాలంటే రాక్షసగురువు శుక్రాచార్యుని కలుసుకోమంటాడు. వెంటనే ఇంద్రుడు శుక్రుని దగ్గరకెళ్ళి తన సందేహాన్ని వెలిబుచ్చగా, అందుకు తగిన సమాధానం చెప్పగలవాడు ప్రహ్లాదుడేనని శుక్రుడు చెబుతాడు. ప్రహ్లాదుని దగ్గరకెళ్ళిన ఇంద్రుడు సంతోషానికైన అసలు మూలకారణం ఏమిటిని ప్రశ్నించగానే, తనిప్పుడు పరిపాలనలో నిమగ్నమై ఉండటంవల్ల సమాధానం చెప్పే తీరకలేదన్న ప్రహ్లాదుడు, తనను క్షమించమంటాడు. అయినా పట్టువదలని ఇంద్రుడు, ఏదో ఒకరోజు వీలుచిక్కినప్పుడు, ఆ రహస్యాన్ని వివరించమని, అప్పటి వరకు తాను అక్కడే ఉంటానంటూ ప్రహ్లాదునికి సేవలు చేస్తూ గడుపుతుంటాడు. అలా కొన్నాళ్ళు గడిచిన పిదప, ఇంద్రుని శ్రద్ధను మెచ్చిన ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్పాడు. ‘‘రాజాగా నా స్థాయిని తలచుకుని నేను ఏనాడూ గర్వపడలేదు. సాధుజనుల సేవకునిగా ఉంటూ, గురువులు, పెద్దలపట్ల గౌరవభావాన్ని కలిగివుంటాను. విపరీతమైన కోరికలతో గతి తప్పను. సంతోషానికి ఇదే కచ్చితమైన మార్గం’’. ప్రహ్లాదుని సమాధానం ఇంద్రుని సంతోషపరుస్తుంది.


ఇంద్రుని భక్తిని మెచ్చిన ప్రహ్లాదుడు ఏదైనా వరం కోరుకొమ్మంటాడు. వెంటనే కపటి ఇంద్రుడు తనకు నైతిక ఋజువర్తనను అనుగ్రహించమని అభ్యర్థిస్తాడు. ప్రహ్లాదుడు ‘సరే’నని ఒప్పుకోగానే, అతని నుంచి ఓ జ్వాల బయటకు వస్తుంది. ‘‘నేను నీలోని నీతివంతమైన నడవడిని, నువ్వు నన్ను వెలికి తీసినందువల్ల ఇక పై నీ శిష్యునిలో నివశిస్తానని చెప్పి, ఇంద్రునిలోకి ప్రవేశిస్తుంది. అనంతరం ప్రహ్లాదునిలో నుంచి బయల్దేరిన మరోజ్వాల, తాను అతనిలోని ధర్మశీలతనని, నైతిక సౌశీల్యం లేకుండా కండజాలనని ఇంద్రుని శరీరంలో ప్రవేశిస్తుంది. అనంతరం బయటపడిన సత్యం, తాను నిజాన్ని అని, ధర్మబద్ధతతో ఉంటానని చెప్పి వెళ్ళిపోతుంది. తదనంతరం వెలువడిన మరోజ్వాల తాను అధికారాన్ని అని, తాను నిజం వెంటే ఉంటానని ఇంద్రునిలో ఐక్యమవుతుంది. చివరగా ధవళకాంతులతో మెరిసిపోతోన్న ఓ దేవత బయటకొచ్చి, తనను లక్ష్మి అంటారనీ, సంపదల దేవతనని, దీర్ఘకాలం నీవెంటే ఉన్నానని, ప్రస్తుతం తనను వదలిపెట్టడానికి ప్రహ్లాదుడు సిద్ధపడినందున తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిపోవాల్సి వస్తోందని చెప్పి బయటపడుతుంది. ఈ విధంగా ధర్మ ప్రవర్తన, నిజం, అధికారం, నైతికబద్ధ ప్రవర్తన ఉన్నచోట లక్ష్మీదేవికొలువై ఉంటుందని అర్థమవుతోంది. లక్ష్మీదేవి చల్లనిచూపుల కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు. తమ ఇళ్లను పావనం చేయాలని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తుంటారు. ఆతల్లి భక్త జనప్రియ. తనను పూజించిన భక్తులను తప్పక కరుణిస్తుంది.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat