హోలీ పండుగ గురించి శ్రీ మద్భాగవతంలో ....!

P Madhav Kumar
హోలీ పండుగ గురించి శ్రీ మద్భాగవతంలో ఒక ఘట్టం ఉంది..
హిరణ్యకశిపుడనే వాడు రాక్షసులకు రాజు. ఇంట్లో లేదా బయట, పగులు లేక రాత్రి సమయంలో కానీ, మనిషి లేదా మృగం చేత కానీ, భూమి లేక ఆకాశంలో కానీ, రోగాల వలన, ఆయుధముల వలన తనకు మరణం ఉండరాదని బ్రహ్మ దేవుని వద్ద వరం కోరుతాడు. వరం పొంది తనను ఎవరు ఏమీ చేయలేరన్న అహకారంతో యజ్ఞ యాగాదులను ధ్వంసం చేస్తాడు. గోశాలలను, పోలాలను, అడవులను, ఉద్యానవనాలకు నిప్పు పెట్టిస్తాడు. చెరువులను కలుషితం చేసి, విషతుల్యం చేస్తాడు. జనాలను అష్టకష్టాలు పెడతాడు. స్వర్గలోకం మీద దాడి చేసి ఇంద్రుడి ఆధిపత్యానికి విఘాతం కలిగిస్తాడు. తానే దేవుడినని, తననే పూజించాలని ప్రజలకు ఆజ్ఞ ఇస్తాడు. శ్రీ మహావిష్ణువంటే హిరణ్యకశిపుడికి మహాద్వేషం.

ఈయన పుత్రుడే 'ప్రహ్లాదుడు'. ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. ఎల్లప్పుడు విష్ణు నామాన్ని జపిస్తూ ఉండేవాడు. ఇది నచ్చని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. చివరకు సజీవంగా అగ్నిలో పడేసి ప్రహ్లాదుడిని చంపాలనుకుంటాడు.

హిరణ్యకశిపుడికి హోలికా అనే సోదరి ఉంది. సజ్జనులకు (మంచివారికి) అపకారం కలిగించనంతవరకు ఈమెకు అగ్ని వల్ల ప్రమాదం ఉండదని వరం ఉంది. ప్రహ్లాదుడు అగ్నిలోంచి పారిపోకుండా ఉండడానికి అగ్ని జ్వాలల మధ్య హోలికను కూర్చోబెట్టి, హోలిక ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెడతారు. ప్రహ్లాదుడు ఏ మాత్రం భయపడకుండా విష్ణు నామన్ని జపిస్తూ హాయిగా కూర్చుంటాడు. తనని కాపాడమని కూడా విష్ణువును ప్రార్ధించడు.

ఎందుకంటే నమ్ముకున్న వారిని రక్షించడం పరమాత్ముడి బాధ్యత. ప్రత్యేకించి అడగాల్సిన అవసరం లేదు. 'నా మే భక్తః ప్రణశ్యతి', నన్ను పూర్తిగా నమ్మినవారు ఎన్నటికి నాశనమవ్వరు అని పరమాత్మే గీతలో చెప్పాడు. అసలు భక్తి అంటే అవ్యాజయమైన ప్రేమ. నేను నమ్మాను కనుక నన్ను దైవం రక్షించాలి, నన్ను ఉద్ధరించాలి అని నిజమైన భక్తుడు కోరుకోడు. నాకు ఏది మంచో అది నా దేవుడు ఇస్తాడని కష్టాలను సైతం ఎదురుకుని పరమాత్ముడిపై మరింత ప్రేమను పెంచుకుంటాడు. అందుకే ప్రహ్లాదుడు ప్రత్యేకించి రక్షించమని అడగలేదు.

పరమాత్ముడి అనుగ్రహం ప్రసరించింది. హిరణ్యకశిపుడి ఆలోచన బెడిసికొట్టింది. అగ్ని ప్రహ్లాదుడికి చిన్న అపకారం కూడా చేయలేదు. కానీ హోలిక ఆ అగ్నిజ్వాలలకు మడి మసైపొయింది. పసివాడు, పరమభాగవతుడైన ప్రహ్లాదుడు చిరునవ్వులు చిందిస్తూ అగ్ని నుండి బయటకు వచ్చాడు.

మన చరిత్రలో జరిగిన ఈ సంఘటనకు చిహ్నంగా హోలికా దహనాన్ని చేసి హోలీ జరుపుకుంటాం.

సజ్జనులు, తపస్వులు, సత్యవంతులైన భగవత్భక్తులకు అపకారం చేయదలిస్తే సర్వనాశనమవుతారని, భగవంతుడుని నమ్ముకున్న వారు సదా రక్షింపబడతారని చెప్పడానికి ఇది ఒక తార్కాణం మాత్రమే.


🙏 ఓం నమో నారాయణాయ 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat