భక్తకన్నప్ప

P Madhav Kumar


భక్త కన్నప్ప గొప్ప శివ భక్తుడు. 


పూర్వాశ్రమంలో తిన్నడు అనే బోయవాడు. 


చరిత్ర ప్రకారం శ్రీకాళహస్తి పరిసర ప్రాంత అడవుల్లో సంచరిస్తూ వేటాడి జీవనం సాగించేవాడు. 


ఒకనాడు అలా వేటాడుతుండగా అతనికి అడవిలో ఒక చోట శివలింగం కనిపించింది. 


అప్పటినుంచీ తిన్నడు దానిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే నైవేద్యంగా పెడుతుండేవాడు.


ఒక సారి శివుడు తిన్నడి భక్తిని పరీక్షించ దలచి తిన్నడు పూజ చేయడానికి వచ్చినపుడు శివలింగంలోని ఒక కంటినుంచి నీరు కార్చడం మొదలు పెట్టాడు. 


విగ్రహం కంటిలోనుంచి నీరు కారడం భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి నీరు కారుతున్న కంటికి అమర్చాడు. 


వెంటనే విగ్రహం రెండో కంటినుంచి కూడా నీరు కారడం ఆరంభమైంది. 


కాలి బొటనవేలును గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు. 


తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు అతనికి ముక్తిని ప్రసాదించాడు. 


అందువల్లనే తిన్నడికి కన్నప్ప అనే పేరు వచ్చింది.


తిన్నడు పూర్వ జన్మలో అర్జునుడు అనే ( కిరాతార్జునీయం) ఒక కథ కూడా ప్రచారంలో ఉంది.


తన కన్నును ఈశ్వరునికర్పించినందులకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. 


కన్నప్పనాయనారు అయ్యాడు. 


నేత్రేశనాయనారు అనునది సంస్కృతనామము..


       

శ్రీకాళహస్తి స్థల పురాణం లో శ్రీకాళహస్తీశ్వర స్వామి కన్నప్ప అనే భిల్లునికి ముక్తి ప్రధానం చేసిన పుణ్యదినం విశేషం కన్ను అర్పణ చేసిన తరువాత భిల్లునుతో పరమేశ్వరుడు ఈ విధంగా అన్నారు. 


శ్లో: మమ రూపం హృదిధ్యాయ న్నుషిత్వా పంచవత్సరాన్ పునరస్మిన్దినే ప్రాప్తే ప్రోక్త సర్వగుణోత్తరే !!

 

తాత్పర్యము :- నా యొక్క రూపాన్ని అయిదు సంవత్సరముల పాటు నీ హృదయము నందు ధ్యానము చేయవలసినది ఆ తరువాత అన్ని శుభగుణములు కలిగిన ఒక శుభదినమున.


శ్లో:మత్సమీపే కృతావాసో భవ కైలాస మస్తకే ఇత్యుక్త్వాంత దధేలింగే పశ్యత్సు మునిషుస్ఫుటం !!


తాత్పర్యము :- దక్షిణ కైలాస పర్వతంలోని మస్తక భాగంలో నా సమీపం (ప్రస్తుతం కన్నప్ప ధ్వజారోహణం అని పిలువబడే కైలాసనాథ స్వామి దగ్గర )లోని కైలాసనాథ లింగం దగ్గర ధ్యాన వ్యవస్థలో ఉచ్చ స్థితి అయిన సమాధి వ్యవస్థలో నిమగ్నమై ఉన్న సమయంలో.


శ్లో:అస్మిన్యః ఫాల్గునే మాసే పూర్ణిమాయాం తిధౌశుభే భృగువారేచ నక్షత్రే శుభాదే భగదైవతే !!


తాత్పర్యము :- ఒకానొక సందర్భమున ఫాల్గుణ మాసం పౌర్ణమి శుక్రవారం ఉత్తరఫల్గుణి నక్షత్రముతో కూడిన శుభదినమున.


శ్లో: శివాజ్ఞయా తత్రసోపి స్థిత్వావత్సర పంచకం త్యక్త్వాతనుం తతః ప్రాప శివ సారూప్యముత్తమం !!


తాత్పర్యము :- శివజ్ఞచే సమాధి స్థితిలో ఉన్న కన్నపకు అయిదు సంవత్సరములు తరువాత తనువు చాలించిన బిల్లునకు(కన్నప్పకు) పరమేశ్వరుడు సారూప్య ముక్తిని అనుగ్రహించాడు.


శ్లో: తనుం త్యక్త్వాత్ర వల్మీకే భుజంగమ ఇవత్వచం అవాప్య మమ సారూప్యం సర్వదేవాభికాంక్షితం !!


తాత్పర్యము :- అలా పరమేశ్వరుని అనుగ్రహం పొందిన బిల్లుని(కన్నప్ప) శరీరము నుండి ప్రాణము పాము కుబుసం వదిలిన విధానంగా అందరు దేవతలు ఆకాంక్షించే సారూప్యముక్తి పొంది దక్షిణకైలాస పర్వతం లో మస్తక భాగం లో కొలువైవున్న కైలాసనాధేశ్వరుడిలో ఐక్యం అయ్యారు అని స్థల పురాణం నందు తెలుపబడింది , 


కావున కన్నప్ప ముక్తి పొందిన ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున కైలాసగిరిలో కొలువైవున్న కైలాశనాధేశ్వరుణ్ణి అదే విధంగా భిల్లుని(కన్నప్పను) దర్శించడం చాలా విశేషము.


🌷🌷🌷🌷🌷

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat