🍁🍁🍁🍁🍁
శ్రీహరి సింహముఖంతో, మానవదేహంతో నరసింహునిగా అవతరించాడు. హిరణ్యకశిపుణ్ణి అతని కోరికలకు అనుకూలంగానే సంహరించాడు. కానీ ఆ ఆవేశం తాలూకు ఉగ్రత్వం తగ్గనేలేదు. ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రార్థించినా ఆ ఉగ్రత్వం తగ్గలేదు. చివరకు ప్రహ్లాదుడు స్తుతించి, దగ్గరగా వెళ్లగా, ఆయన కోపం శమించినట్లుగా కనరసింహగాథ చెబుతోంది. అయితే ఇప్పటికీ స్వామి ప్రతికల్పంలోనూ ఆ నృసింహావతారం ఎత్తుతూనే ఉన్నాడు. ఈ వైవస్వత మన్వంతరంలోనే స్వామి ఇప్పటికే 28సార్లు అవతరించాడు. ఇది 28వ మహాయుగం. ఈ యుగంలో జరిగిన ఆ అవతారం కర్నూలు జిల్లా ‘అహోబిలం’లో జరిగినట్లుసాక్ష్యాలు కనబడుతున్నాయి. కేవలం అహోబిలంలోనే స్వామి తొమ్మిది మూర్తులు పూజలందుకుంటున్నాయి. లక్ష్మీనరసింహ స్వామి ఉపాసన మహావిశేషమైనది. స్వామి ఉగ్రత్వాన్ని ఆరాధిస్తే భయం ఉండదు. స్వామి వీరకృత్యాలను స్మరిస్తే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలం. స్వామి కోటిసూర్యకాంతితో జ్వలిస్తూ ఉంటాడు. ఆయన తేజం అన్నిదిక్కులకీ వ్యాపిస్తుంది కనుక ఆయన సర్వతోముఖుడు. ఆయన భీషణరూపం దానవులకీ, మహమ్మారులకు భీతి గొలుపుతుంది. ఆ భీషణత్వం భక్తులకు మాత్రం మంగళస్వరూపుడు. ఎటువంటి మృత్యువుకైనా ఆయన మృత్యువే. అటువంటి స్వామిని నిత్యం పూజిస్తే సర్వశ్రేయస్సులూ కలుగుతాయి. ఉగ్రనరసింహుణ్ణి చల్లబరడం కోసం చేసే అనేక ఉపచారాల్లో కల్యాణోత్సవ సేవ అతిముఖ్యమైనది. నృసింహ కల్యాణోత్సవాల్లో పాల్గొన్నవారికి రోగభయాలు తొలగుతాయి. పిరికివారు కూడా ధైర్యవంతులవుతారు.
*"ఉగ్రం వీరం మహావిష్ణుం*
*జ్వలంతం సర్వతోముఖం*
*నృసింహ భీషణం భద్రం*
*మృత్యోర్మృత్యుః నమామ్యహమ్"*
ఇది ఉగ్ర నరసింహ మహామంత్రం. దీనిని నిత్యం ఉపాసించేవారికి సర్వశుభాలూ కలుగుతాయి. ఎటువంటి మృత్యురోగాలూ దగ్గరకు రావు.