దేశంలో ఎక్కడా లేని విధమైన శివలింగం భీమవరం యనమదుర్రు గ్రామంలో ఉంది. తలక్రిందులుగా తపస్సు చేస్తున్నట్లుగా లింగంపై ముద్రలు ఉండటం ఇక్కడి విశేషం . ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు వున్నాయి. ప్రపంచానికి శివ, శక్తుల సమానత్వాన్ని నిరూపించటానికి ఒకే పీఠంపై నెలకొన్న శివుడు, పార్వతి, కుమార స్వామి విగ్రహాలు బయల్పడ్డాయి. పార్వతీ దేవి శక్తి. ఆ శక్తితో కూడుకున్న ఈశ్వరుడు శక్తీశ్వరుడు. జగన్మాత అయిన ఆ పార్వతీదేవి నెలల పిల్లాడయిన కుమారస్వామిని ఒడిలో లాలిస్తున్న రూపం ఇక్కడ అమ్మది.
అలాగే శివుడుకూడా ఒక ప్రత్యేక భంగిమలో వెలిశారు. సాధారణంగా దర్శనమిచ్చే లింగ రూపాన్ని వదిలెయ్యటమేకాక సాకార రూపంలో కూడా వైవిధ్యం చూపించారు మహాశివుడు. ఇక్కడ శీర్షాసనంలో తపో భంగిమలో కనబడతారు. శివుని జటాజూటం భూమికి తగులుతుంటుంది. ఆ పైన ముఖం, కంఠం, ఉదరం, మోకాళ్ళు, పాదాలు. పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ వెలియటానికి కారణంగా ఒక కధ కూడా చెప్తారు.
యమధర్మరాజుకి ఒకసారి తను చేసే పని మీద విసుగు వచ్చిందిట. పైగా ప్రజలంతా ఆయన పేరు చెప్తేనే భయపడుతున్నారు. అందుకని శివుడు కోసం ఈ ప్రాంతంలోనే తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై భవిష్యత్తులో యమధర్మరాజు ఒక రాక్షసుడిని చంపిన తర్వాత తమని ఇక్కడ ప్రతిష్టిస్తాడనీ, తమని దర్శించిన వారికి దీర్ఘరోగాలు వుంటే సత్వరం నయమవుతాయని, ఆరోగ్యంగా వుంటారనీ, తద్వారా యముడంటే ప్రాణాలు తీసేవాడేకాదు, దీర్ఘకాల రోగాలను నయంచేయగలవాడు కూడా అని ప్రజలచేత కొనియాడబడతాడు అని వరమిచ్చారు.
పూర్వం ఈ ప్రాంతం పేరు యమునాపురం. ఇక్కడ శంబిరుడనే రాక్షసుడుండేవాడు. శంబిరుడు తపస్సు చేసుకుంటున్న మునులను హింసిస్తూ పలు అకృత్యాలకు పాల్పడేవాడు. ఆ మునులు ఇవ్వన్నీ పడలేక యమధర్మరాజు దగ్గరకెళ్ళి వాణ్ణి చంపెయ్యమని మొరబెట్టుకున్నారు. యముడు కూడా మునులను రక్షించడానికి ఆ రాక్షసుడిని చంపటానికి చాలా ప్రయత్నం చేసి, అతని చేతిలో చాలా సార్లు ఓడిపోయాడు. అప్పుడు శివుని కోసం తపస్సు చేశాడు. శివుడు ఆ సమయంలో యోగనిష్టలో వుండటంతో ప్రత్యక్షంకాలేదు.
ఆలయానికి ఎదురుగా శక్తికుండము అనే మంచినీటి సరస్సు వుంది. స్వామివారి అభిషేకానికి, నైవేద్యానికీ ఈ నీటినే వినియోగిస్తారు. ఒకసారి చెరువుచుట్టూ ప్రాకారం నిర్మించాలని చెరువుని ఎండబెట్టారు. ఆ సమయంలో స్వామివారి నైవేద్యంకోసం వేరే చెరువు నీటిని వాడగా ఆ నైవేద్యం వుడకలేదుట. అప్పుడు పూజారి ఎండగట్టిన చెరువులో గుంట త్రవ్వగా నీరు వచ్చిందిట. ఆ నీటిని పోసి వండగా ప్రసాదం వెంటనే వుడికిందట. అప్పటినుంచీ స్వామి నైవేద్యానికి వేరే నీరు వాడరు. ఈ శక్తికుండములోని నీరు మామూలు నీరు కాదు. కాశీలోని గంగానదిలోని ఒక పాయ అంతర్వాహినిగా వచ్చి ఇక్కడ ప్రవహిస్తున్నదని జియాలజిస్టులు చెప్పారంటారు. అందుకే ఈ సరస్సు గంగానదితో సమానమైనదంటారు.
దక్షిణకాశీగా పిలవబడే ఈ క్షేత్రానికి పాలకుడు కుమారస్వామి. అంటే సర్పం. ఈ ఆలయానికి, చెరువుకు కాపలాగా రెండు నాగుపాములు వుండేవట. ఉదయం బ్రహ్మముహూర్తంలో ఈ నాగుపాములు చెరువులో వలయాకారంగా మూడుసార్లు తిరిగి, స్వామి దర్శనం చేసుకుని తిరిగి చెరువులోకెళ్ళిపోవటం చూసినవారున్నారు. ఇప్పుడు కూడా ఆ ప్రాంగణంలో రెండు నాగుపాము పిల్లలు తిరుగుతుంటాయి. ఇవి ఒక్కొక్కసారి స్వామి విగ్రహాన్ని చుట్టుకుని వుంటాయట. అయితే అవి ఎవరినీ ఏమీ చేయవు.
ఆలయ తూర్పు ద్వారానికి ప్రక్కగా వున్న నందీశ్వరుని మూతి, ఒక కాలు విరిగి వుంటాయి. తురుష్కులు ఈ ఆలయం మీద దాడి చేసినప్పుడు వారి ప్రభువు తన కరవాలం పదును చూసుకోవడానికి అక్కడున్న నంది మూతిని, కాలిని నరకగా అందులోనుండి రత్నాలు బయటపడ్డాయిట. ఒక జంతువు విగ్రహంలోనే ఇన్ని రత్నాలు వుంటే ఆలయంలో విగ్రహంలో ఎన్ని ఉన్నాయోనని ఆలయంలోకి వెళ్ళబోగా ఆలయం కప్పుకూలి అతనిమీద పడి మరణించాడుట. ఆ శిధిలాలు ఆలయం వెనక వున్నాయి. పంచారామాలకన్నా పురాతనమైనదని చెప్పబడే ఈ ఆలయంగురించీ, శక్తీశ్వరుని గురించీ, మహాకవి కాళిదాసు తన మహాకావ్యం కుమార సంభవంలో 68 శ్లోకాలలో స్తుతించాడుట. భోజరాజు ఇక్కడికి వచ్చి పూజలు సల్పినట్లూ, మహాకవి కాళిదాసు పలుమార్లు ఇక్కడికి వచ్చి శక్తిని పూజించినట్లు కూడా ఆ గ్రంధంలో స్పష్టంగా వుందిట. శ్రీనాధ మహాకవి వ్రాసిన కాశీఖండం కావ్యంలోకూడా ఈ ఆలయ ప్రశస్తి వున్నది
శంబరుని వధానంతరం యమునికి పార్వతీదేవి ఇచ్చిన వర ప్రభావంతో ఇక్కడ శక్తికుండంలో స్నానం చేసినవారికి అపమృత్యు భయం వుండదనీ, అకాల వ్యాధులు రావనీ, దీర్ఘకాలంగా పీడిస్తున్న రోగాలున్నవాళ్ళు ఈ కుండంలోని నీరు మంచినీటితో కలిపి సేవించటంవల్ల ఆ రోగాలు నయమవుతాయని నమ్మకం.