⚜️ కరిమల ⚜️
ముక్కుకి తావళము నుండి సుమారు 5.కి.మీ. నడచినచో కరిమల క్రింది భాగమును చేరుకొన వచ్చును. ఇచ్చట ఒక చిన్న కాలువ కనబడుచున్నది. మన వనయాత్ర సమయమున ఈ కాలువలో నీటి పారుదల యుండదు. క్రింది భాగములో ఈ కాలువను దాటి కొండను తాకి మానసికముగా నమస్కరించి , శరణఘోషములను ఘోషించుచు భక్తాదులు కరిమల ఎక్కుదురు. ఏడు అంతస్థులతో కూడిన అతి భయంకరమైన మిట్టతో గూడినదారి ఈ కరిమల ఏట్రము. కరిమల ఏట్రం కఠినం - కఠినం' “స్వామినీవే శరణం శరణం" యని శరణ ధ్వనులు ఆ కరిమల ప్రాంత మంతయు ప్రతిధ్వనిస్తుందని చెప్పవచ్చు. మిన్నంటులా నిటారుగా పెరిగి కనబడు వృక్షములు , చూచిన వారి గుండెలను విల విలలాడించు లోయలు , చెట్లు , చేమలు తీగలు యని ప్రకృతి మాత తన సంపూర్ణ అందచందములతో ఈ వనలక్ష్మీపై ఆవాహనమై యున్నదాయను రీత్యా ఈ ప్రాంతమునకు అందము చేకూర్చుచున్నది. చిరుతపులి , పెద్దపులి , ఎలుగుబంట్లు , తోడేళ్ళు , అడవిఏనుగులు , కణితలు మున్నగు వన్యమృగముల సంచారము మిక్కిలిగా యుండు ప్రదేశమిదని అందురు. కానీ ఇన్నేళ్ళ శబరీ యాత్రీకులకు ఆ వన్యమృగముల వలన ఏమియు హాని కలిగినట్లు తెలియడం లేదు.
ఈ వన ప్రాంత మంతయు యాత్రా సమయములలో పలువేల భక్తుల శరణ
ఘోషముతో నిండుట వలన ఈ స్థలమునకు ఒక పవిత్రత కలుగ జేయుటయే గాక , మారుమ్రోగే శరణధ్వని వలన వన్య మృగములను సుదూరానికి తొలగించే తారక మంత్రముగా ,మార్గానుసారిగా , మార్గబంధువుగా ఈ శరణధ్వని సాయపడు చున్నది. మాలధరించిన దినము మొదలు శరణము పలుకనివారు గూడా *"స్వామియే శరణమయ్యప్ప"* - *"తూక్కిపడప్పు" "ఏట్రివిడప్ప", "పాదబలంతా” “దేహబలంతా"* అను ఆర్తనాదముతో శరణాలు పలుకుట గాంచి రోమాంజలి ఏర్పడుచున్నది. ఒకానొకప్పుడు ఉదయన్ అనబడు బందిపోటు నాయకుని ప్రధాన స్థావరముగా ఈ
కరిమల యుండినదట. అతి ప్రాచీనమైన శబరిగిరి క్షేత్రము దాని సమీపము నందుగల నిలక్కల్ అను గ్రామము ధ్వంసము చేయబడినదనియు ఈ బందిపోటు నాయకత్వముననే ననియు , కరిమల అగ్రభాగమున శత్రువులు సులువుగా సమీపించ లేని రీత్యా ఒక రాతి కోటను నిర్మించి ఒక సామంతరాజు వలె వ్యవహరించువాడు ఈ ఉదయనుడనియు ఈ చరిత్ర రేఖలు సూచించుచున్నది. తదుపరి దినములో శ్రీ అయ్యప్ప వావరుస్వామి సాయముతో ఇంజిప్పార కోటను స్వాధీనపరుచుకొని అచ్చటినుండి కరిమలచేరి , మెరుపుదాడి చేసి బందిపోటులందరిని ఉదయనునితో సహా సంహరించి కరిమలను గైకొన్నారని కేరళ చరిత్ర
తెలుపుచున్నది. అంతటి ఎత్తైన ప్రదేశమగు కరిమల ఉచ్చియందు పరిశుభ్రమైన త్రాగునీరు లభించునది ఆశ్చర్యభరితమే.
ఇచ్చట వేలసంఖ్యలో భక్తాదులు విశ్రాంతి పొంది యాత్రను సాగించే ఒక ప్రధానమైన తావళముగా పేర్కొనబడియున్నది ఈ కరిమల ఉచ్చి. ఇచ్చట ఒక చిన్న కోనేరు , ఒక చిన్నబావి , ఒక చిన్న ఊట గలదు. కావున కావలసినంత మంచినీటి సరఫరా యుంటుందని ఊహించుకొన నక్కరలేదు. ఆహార తయారీకును , దాహశాంతికిను , తదితర అత్యవసర పనులకు మాత్రము కావలసిన మంచినీరు ఇచ్చట లభించుచున్నది. మంచినీటి కొరకై భక్తులు అలమటించకూడదను సదుద్ధేశ్యముతో సేవాసంఘము వారు డ్రమ్ములలో నీళ్ళు నింపి , వేడిచేసి భక్తులకు సరఫరా చేయుచున్నారు. అంతేగాక సరసమైన సుస్థిర ధరకు రుచికరమైన అన్నపుపొట్లములను అందించుటయేగాక వనయాత్రవలన ఆరోగ్యము క్షీణించి చిన్న రోగములకు (పడిశము , జ్వరము , తలనొప్పి) ప్రథమచికిత్స చేయుట మున్నగు సత్కార్యములను నిర్వహించుచున్నారు. విద్యుత్ సరఫరా లేని రహదారి దుకాణములలోని పెట్రోమాక్సు దీపపుకాంతి ఇచ్చట రాత్రివేళ బసచేసే భక్తులకు మిక్కిలి ఉపయోగకరముగా యుండుటయే గాక రాత్రి ఏవేళకైనను కాఫీ , టీ , పండు , వేడిగంజి మున్నగు ఆహార పదార్థములు కావలసినంత విక్రయించబడుటచే యాత్రీకులు ఇచ్చట ఒక పూట యుండి విశ్రమించి ఆకలి తిప్పలు తీర్చుకొని కాసేపు నిదురించి లేసిన పిమ్మట తమ పయనమును కొనసాగింతురు.
🌹💐ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌸🙏