⚜️ కాళైకట్టి ⚜️
కొన్ని సంవత్సరములకు మునుపుగూడా ఈ ప్రదేశము భయానకమైన వన్య మృగములు తిరుగులాడే ఘోరాడవిగా యుండెను. కానీ నేడు టేకు , పనస , మామిడి మున్నగు పలురకములైన వృక్షములతో గూడిన సర్కారు వారి తోటగా పరిణమించి యున్నది. గిరిజనుల నివాస స్థలముగాను వారిచే నిర్వహించబడే చక్కని విశ్రాంతి ఘట్టముగాను ఈ కాళైకట్టి నిలయము వెలయుచున్నది. ఇచ్చట ఒక ప్రాచీనమైనశివక్షేత్రము పునరుద్ధరింపబడి కనబడుచున్నది. మునుపటి యాత్రీకులు ఈ కాళైకట్టి యందు ఒక నారీకేళము పగులగొట్టి మొక్కి దాటి వెడలిపోదురు. ఆ కాలములో ఈ స్థలము విశ్రమించుటకు అనువైన స్థలముగా ఎంచబడలేదు. ఎరుమేలి నుండి బయలుదేరి ఎడతెగని నడకగా అళుదా నదీతీరము చేరిన పిదపే విరి ఏర్పరచుకొని విశ్రాంతి పొందేవారట. స్వామి అయ్యప్ప వావరుని తోడుగా గొని సైన్యముతో ఎరుమేలి నుండి బయలుదేరువేళ సైన్యమునకు కావలసిన ఆహార ముడి పదార్థములను వృషభములపై తెచ్చినారనియు , ఆ వృషభములను కట్టి పెట్టిన స్థలమే ఈ స్థలము గనుక ఈ ప్రదేశమునకు కాళైకట్టి యను పేరు సార్ధకమైనదనియు చెప్పెదరు. మహిషి మర్దనము చేయు శ్రీ ధర్మశాస్తా వారి పరాక్రమమును కనులారా చూడనెంచిన శ్రీ పరమేశ్వరుడు తన వాహనమగు వృషభముపై ఎక్కి వచ్చి ఈ స్థలమున తన వాహనమగు వృషభమును కట్టి పెట్టినారనియు , కనుకనే ఈ స్థలమునకు కాళైకట్టియను కారణ నామము ఏర్పడినదనియు చెప్పెదరు. నేడు ఈ ప్రదేశము పలువేల భక్తులు శ్రమ పరిహారము చేసుకొని వెడలే ఒక ప్రధాన కేంద్రముగా వెలసియున్నది.
పేరూర్ తోడునుండి బయలుదేరిన భక్తులు తదుపరి ప్రధాన తావళ స్థలమైన "కాళైకట్టి" అను స్థలమను చేరుకొందురు. అచ్చటకు పేరూరుతోడు నుండి సుమారు ఎనిమిది మైళ్ళ దూరముండును. మనోహరము , మంజులమూ , నయనానందకరమైన
ఒక లోయ ప్రదేశమది. మహిషీమర్ధనమప్పుడు ఆనందముతో వృషభముపై నెక్కి ఈశ్వరుడు ఈ స్థలమునుండియే మహిషిని వధించుట చూచినాడనియూ , మహిషీ సంహారం పిదప తన వాహణమైన ఆ వృషభమును అచ్చటనున్న ఒక వృక్షమునకు కట్టినాడనియూ ఐతిహ్యము. అందుకే ఆ ప్రదేశమునకు కాళైకట్టి (వృషభమును కట్టిన
స్థలము) అను పేరు వచ్చెనందురు. మొదటిసారిగా యాత్ర చేయు కన్నిస్వాములు ఇచ్చట కొబ్బరికాయ పగుల గొట్టుటయూ , టపాకాయలు పేల్పించుటయూ కానుక లొసంగుటయూ , కర్పూరము వెలిగించుటయూ చేయుదురు. ఇచ్చట గూడా తావళమేర్పర్చుకొని నివసించవలయునని చెప్పబడుచున్ననూ దైవసన్నిధి త్వరగా చేరుకోవలెనన్న వాంఛతో సాధారణముగా ఎవరూ ఇచట తావళమేర్పర్చుకొని కాలమును వృథా చేయరు. అయ్యప్పస్వామి ఈ కాళైకట్టియందు విశ్రమించినట్లు భక్తులు విశ్వసించు చున్నందు వలననే అచ్చట పూజారాధనలు జరుపబడుచున్నవి. ఎరిమేలి నుండి ఈ కాళైకట్టి వనము గుండా ఒక రహదారి అళుదానది వరకూ గలదు.
🙏🌺ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🌻🙏