🔱 శబరిమల వనయాత్ర - 5 ⚜️ అళుదా ⚜️

P Madhav Kumar
1 minute read


⚜️ అళుదా ⚜️

స్వామి అయ్యప్ప మహిషిని తన పాదములతో మర్దనము చేయు తరుణాన ఆ బాధను తట్టుకోలేని మహిషి బిగ్గరగా రోదింపసాగెను. పరమాత్ముని పాద స్పర్శనముచే యథాస్థితి చెందిన రక్కసి ఈ పాదములు పరమాత్మునివే. ఈ పాదములే తనకు శాపవిమోచనము యొసంగగలదని గ్రహించి , తన పాపములకు ప్రాయశ్చిత్తముగా తన కన్నీటితో భగవంతుని పాదములను కడిగెను. అలా ఆవిడ చిందిచిన కన్నీరు అలసా నదిలో కలిసి నీటి ప్రవాహమును పెంచెననియు , మహిషి రోదించి రాల్చిన అశ్రువులతో కలిసి ప్రవహించే నీటితో గూడిన అలసానది అప్పటినుండి పురాణ ప్రసిద్ధమగు అళుదా నదిగా కారణ నామము పొందెననియు అందురు. కాళైకట్టి నుండి సుమారు 2కి.మీ దూరాన అళుదానది ప్రవహించుచున్నది.

ఈ వనయాత్రలోని మొదటి పుణ్యనదీ , స్నానఘట్టము ఈ అళుదానదియే. నదిలో యాత్రా సమయము నందు నీటి ప్రవాహము మోకాలెత్తు మాత్రమే యుండును. గనుక నదిని సులభముగా నడచియే దాటవచ్చును. అళుదానదికి ఇరువైపున ఎత్తైన కొండలు , నిటారైన వన వృక్షములు కనబడుచున్నవి. అళుదకు ఇరువైపున యాత్రాకాలమునందలి వ్యాపారస్తులు దుకాణములను పరచి దీపములను వెలిగించి భక్తులను ఆకర్షిస్తున్నారు. సాయం సంధ్యాసమయాన అళుద చేరు భక్త బృందము అచ్చట విరి ఏర్పరచుకొని ఒక రాత్రి విశ్రమించి మరునాడు ఉదయము అళుదా స్నానము

గావించి ఆ నది నుండి రెండు రాళ్ళను తీసి భద్రపరచుకొని తమ యాత్రను కొనసాగింతురు. అయ్యప్ప భక్తాదుల రద్దీ మూలానను , నదిలో నీటి ప్రవాహము మరీ తక్కువగా యున్నందు వలనను అళుదానదికి ఇరువైపుల మలినము నిండి కనబడుచున్నది.


ఈ నీటినే వంటకును , త్రాగుటకును ఉపయోగపరచవలసి యున్నందున తన్మూలాన కలుగు ఆరోగ్యహానిని నివారించుటకు , ఆరోగ్యశాఖవారు ముందు జాగ్రత్తగా సూది , మందు , మాత్రలను భక్తులకు ఉచితముగా వినియోగించు చున్నారు. అలాగే అఖిల భారత అయ్యప్ప సేవా సంఘమువారు అచ్చట బృందముగా కూడే భక్తులకు *'చుక్కువెళ్ళిం'* అనబడు శొంఠి , జీలకర్ర కలిపి కాచిన ఔషదయుక్త నీటిని సరఫరా చేసి భక్తులను వాతావరణ కాలుష్యపు బాధనుండి రక్షిస్తున్నారు. అలాగే రుచికరమైన , శుచియైన చిత్రాన్నము , పెరుగన్నము పొట్లములను సరసమైన ధరలకు అందించి భక్త సేవ చేయుచున్నారు. రద్దీ మూలాన బృందము వీడిన భక్తులను జతకలుపుట , దారి మధ్యమున అనారోగ్యము చెందిన వారికి ప్రథమ చికిత్స చేయుట మున్నగు సేవలను ఆత్మార్థముగా చేయుచున్నారు.


🙏🪷ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🎍🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat