కుళత్తుపుళ శాస్తా ఆలయం, కుళత్తుపుళ ఒడ్డున ఉంది. ఇది కొల్లం జిల్ల్లలోని పదనపురం తాలూకాలో పారే కల్లడ నదికి ఉపనది. ఇక్కడ శిశివు రూపంలో అయ్యప్ప కొలువై ఉంటాడు. కేరళా లోని 108 శాస్తా గుడులలో ఇది ఒకటి. ఇక్కడి విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్టించాడని ప్రతీతి. ఇక్కడ స్వామి ఉగ్ర, మంగళ రూపాలలో ఉంటాడు. ఉపదేవతలు – శివుడు, యక్షి, విష్ణువు, గణపతి, భూతతన్, నాగర్, కరుప్పుస్వామి.
ఈ ఆలయాన్ని పందళరాజు కట్టించినా, విగ్రహం మాత్రం ఒక బ్రాహ్మణుడికి కోట్టరక్కరలో లభించిందని ఐతిహ్యం. ఇది కోట్టరక్కర రాజు ఆధీనంలో ఉండి తర్వాత ట్రావన్కూర్ దేవస్వోమ్ బోర్డు ఆధీనం లోకి వచ్చింది.
ఆలయం దగ్గరి కొలను ఒక మంచి ఆకర్షణ. భక్తులు “మీనూట్టు వళిపాడు” ( చేపలకు ఆహారం వేయడం) చేయాటం ద్వారా చర్మ సంబధిత రోగాలనుంచి విముక్తులవుతామని నమ్ముతారు.
కొల్లం తూర్పున రిసర్వుడు అడవిలో ఈ ఆలయం ఉంది. తిరువనంతపురం – తెన్కాశి రహదారి కుళత్తుపుళ గుండా వెళుతుంది. తమిళనాడులోని తెన్కాశి, సెంగోట్టయ్, ఆర్యంగావు, తెన్మలల గుండా ఇక్కడికి చేరుకోవచ్చు. తెన్మలనే దగ్గరి రైల్వే స్టేషన్. తిరు ఉత్సవం మేషం నెలలో 5- 14 దాకా జరుగుతుంది.