చెంగన్నూరు మహాదేవాలయం చాలాపురాతనమైంది. ప్రసిద్ధమైంది కూడా. ఇద్ ఆళప్పుళ జిలాలో ఉంది. ఈ ఆలయంలో గర్భగుడి వృత్తాకారంగా ఉంటుంది. శివపార్వతులు ఇక్కడ ప్రథాన దైవాలు. ఇతర ఆలయాలలో లాగ కాకుండా ఇక్కడ శివుడు తూర్పు ముఖంగాను, పార్వతి పడమర ముఖంగాను ఉంటారు. ప్రథానాలయం రాగి పూత కలిగి ఉంది. మూలస్థానంలోని దేవి విగ్రహం పంచలోహాలతో చేసింది. ప్రథాన లింగం మీద బంగారపు తొడుగుంది. అది అర్థనారీశ్వర రూపంగా శివ- శక్తి స్వరూపంగా ఉంది.
ఇతర దేవసన్నిధులు గణపతి, శాస్తా (అయ్యప్ప), చండికేస్వరుడు, నీలగ్రీవుడు, గంగ, నాగులు. పక్కనే శ్రీ కృష్ణుడికి కూడా ఒక సన్నిధి ఉంది.
ఈ ఆలయం చాలా శతాబ్దాల కిందట కట్టిందని, దాని కట్టడాన్ని బట్టీ, ప్రసిద్ధ శిల్పి పెరుంతచ్చన్ పనిచేశాడని తెలుస్తోంది. 18 శతాబ్దంలో అగ్ని ప్రమాదానికి గురైన ఆలయాన్ని కూత్తంబలం ( నాట్యశాల) తప్ప వంఘిపుళ తంబురాన్ పునరుద్ధరించాడు. కూత్తంబలం లో అన్ని దీపాలు వెలిగించినా కళాకారుడి నీడ పడదు. అది ఆ కట్టడ విధానం లోని విశేషం. ముఖమండపం, ఇతర మండపాలు చక్కని చెక్క పనితనంతో కూడి ఉంటాయి.
ఈ ఆలయం మిగిన ఆలయాలకన్నా విశిష్టమైంది, ప్రత్యేకమైంది. ఈ ఆలయంలో విశేషంగా “త్రిపుతరాట్టు” అనేది నిర్వహిస్తారు. ఇది పిల్లల పుట్టుకకు ప్రతీకట. ఈ పండుగ బహిష్టుతో సంబంధం కలిగింది. క్రమంతప్పక గుడిలో ఆచరిస్తారు. అందువల్ల ఇది శక్తి పీఠంగా భావింపబడుతోంది.