శ్రీ ఇస్కాన్ గోల్డెన్ టెంపుల్ - తెలంగాణలోని 1వ స్వర్ణ దేవాలయం

P Madhav Kumar

💠 Iscon హరే కృష్ణ స్వర్ణ దేవాలయం 


💠 వందల సంవత్సరాల క్రితం రోడ్డు నంబర్ 12 బంజారాహిల్స్ వద్ద భగవంతుడు స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిగా వెలిశాడు. స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామితో పాటు శివుడు కూడా స్వయంభూ శ్రీ పాంచజన్యేశ్వర స్వామిగా వెలిశాడు.

అటువంటి గొప్పదైన హైదరాబాదులోని ఉన్న స్వయంభూ నృసింహ క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాము


🌀 ఆలయ చరిత్ర:


💠 7-8 శతాబ్దాలకు చెందిన ఈ ఆలయాన్ని భక్తులు నాలుగు వందల ఏళ్ల క్రితం కనుగొన్నారట. అక్కన్న, మాదన్నలు కూడా ఈ స్వామివారిని సేవించుకున్నారని చెబుతారు.

శివుడు నృసింహ స్వామిని ఉద్దేశించి మహామంత్ర రాజపద స్తోత్రాన్ని పఠిస్తూ, 'దాసభూతాః స్వతః' అంటూ చివరి శ్లోకాన్ని ఈ భావంతో చదువుతారు.


"ఈ సమస్త జీవరాశి మీ సృష్టే కనుక, మేమంతా పుట్టుకతో మీ పాద దాసులమే. ఇది తెలుసుకుని, మా ప్రభువైన మిమ్ము చేరి, నమస్కరించి, మిమ్ము శరణాగతి వేడుతున్నాను."


💠 ఈ చివరి శ్లోకంతో ప్రసన్నులైన నృసింహ స్వామి, లక్ష్మి సమేతుడై శివుని ముందున్న ఉద్భవ శిలనుంచి, ప్రత్యక్షమై తన పాంచజన్యం తో శివుని శిరస్సు స్పృశించి, దీవించారట. అందుకే ఇక్కడి శివునికి 'పాంచజన్యేశ్వర స్వామి' అన్న పేరు వచ్చింది. యాదగిరిగుట్ట ఆలయంలో లాగానే స్వామి, అమ్మవారు ఇక్కడ నిల్చున్న భంగిమలో ఉంటారు.


💠 శివకేశవులు ఇరువురూ ఒకే ఆలయంలో పూజలు అందుకోవడం ఇక్కడి విశేషం.

1907 వ సం.లో ఈ ఆలయానికి శ్రీ కృషన్ ప్రసాద్ జాగీర్దారు 47.19 ఎకరాల భూమిని దానం చేసినట్లుగా శాసనాలు చెబుతున్నాయి. 2002లో యాదగిరిగుట్ట ఆలయం వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకున్నారు.


💠 రానురాను ఈ ఆలయ భూముల ఆక్రమణలు పాలు అవుతూ ఉండడంతో పురావస్తుశాఖ, ఈ ఆలయ బాధ్యతనంతా ఏదైనా ప్రతిష్టాత్మకమైన సంస్థకు అప్పగించాలని భావించింది. ఆ క్రమంలో 2011లో ఈ ఆలయాన్ని ఇస్కాన్ కు అప్పగించడం జరిగింది. అప్పటికి ఐదెకరాల భూమి మాత్రం మిగిలింది.


💠 ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని భక్తులు భావించినప్పుడు వారి చేతిలో రూపాయి లేదు. అటువంటిది, ఇప్పుడు అక్కడ తెలంగాణాలోనే మొట్టమొదటి బంగారు ఆలయమైన, 15 కోట్ల విలువైన స్వర్ణ దేవాలయం బూర్గు జువెలర్స్(బూర్గు వేంకటేశ్వర రావు, ఆయన శ్రీమతి రాధ) సహకారంతో నిర్మించబడింది. ఆలయ గోపురంపై సుదర్శన చక్రం కూడా ప్రతిష్టించ బడింది. మొత్తం ఆలయ నిర్మాణం ఎటువంటి ఆటంకాలు, ప్రమాదాలు లేకుండా జరిగింది.

ఇదంతా ఎలా సాధ్యమయింది?


💠ఈ ఆలయ నిర్మాణం జరుగుతున్న రోజుల్లో భక్తులు ఈ ప్రాంగణంలో 'హరే కృష్ణ' మంత్రాన్ని జపిస్తూ దశకోటి మంత్ర జపాన్ని పూర్తిచేశారు. స్వామివారి దయవల్ల ఈ ఆలయ నిర్మాణానికి కావలసిన డబ్బు, శ్రామికులు, ఇంజినీర్లు, వనరులు, సామాగ్రి, ఇలా సమస్తం సమకూరాయి. పరంపర ఆచార్యులైన ఓం విష్ణుపాద పరమహంస పరివ్రాజకాచార్య, శ్రీల ప్రభుపాదుల దీవెనలు, సూచనలు ఈ కార్యాన్ని మరింత సుగమం చేసాయి.


💠 నూతన ఆలయ నిర్మాణానికి ఇస్కాన్ శ్రీకారం చుట్టింది. ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. కొంతమంది వాస్తు బాగా లేదు అసలు ఇక్కడ ఆలయమే రాదన్నారు, స్వామి దయతో దోషాలన్నీ తొలగి, ఆలయ నిర్మాణం మొదలైంది. కొంతమంది వేయి అడుగులు తవ్వితే కానీ బంజారాహిల్స్ ప్రాంతంలో నీరు పడదన్నారు. 200 అడుగులకే ధారాళంగా నీరు పడింది.


💠 బూర్గు జువెలర్స్ వారు ఈ ఆలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో నేపాల్ లోని గండకీ నది నుంచి ఒక అరుదైన, అతి పెద్దదైన సాలగ్రామాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. గంగ నీరు ఈ సాలగ్రామంలో ఉండటంవల్ల (చెవి ఆనించి వింటే నీటి శబ్దం తెలుస్తుంది) దీనిని 'జలగర్భ సాలగ్రామ నారాయణ శిల' అన్న పేరుతో పిలుస్తారు. శృంగేరి శ్రీ భారతీ తీర్థ స్వామి వారి సూచనతో, ఈ సాలగ్రామాన్ని ఈ క్షేత్రానికి లభించిన అనుగ్రహంగా భావించి, గర్భాలయంలోనే ఉంచటం జరిగింది.


💠 యోగహనుమంతుడు ఈ క్షేత్రపాలకుడు. ఇదే ఆలయంలో రాధాకృష్ణ మూర్తులను కూడా ప్రతిష్టించి, వైదీక పరంపర ప్రకారం అనేక క్రతువులను ఇస్కాన్ వారు సంప్రదాయ బద్ధంగా, అద్భుతంగా నిర్వహిస్తున్నారు.


💠 ఈ ఆలయంలోనే రావి చెట్టు క్రింద స్వామివారి పాదుకలను ప్రతిష్టించారు. యాగశాల కూడా ఉంది. ప్రస్తుతం ఆలయ పరిసరాలను మరింత అభివృద్ధి చేస్తూ, మరికొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి.


💠 ఆలయానికి హరినామ మండపం ఉంది.

ధ్వజ స్తంభం తర్వాత జపమంటపం ఉంది. శ్రీకృష్ణుని దర్శనం కోసం ముందుకు సాగుతున్నప్పుడు అతని పవిత్ర నామాలను జపించడం ద్వారా ఆయనను స్మరించుకోవడానికి మరియు కీర్తించడానికి ఇది ఒక ప్రత్యేకమైన మార్గాన్ని సూచిస్తుంది..


💠 ఆలయాన్ని సందర్శించే భక్తులు సందర్శకులు హరినామ మంటపం గుండ 108 మెట్లు మరియు ప్రతి మెట్టుపై భక్తులు నిలబడి హరే కృష్ణ మహా-మంత్రాన్ని జపిస్తారు .


💠 ఇన్ని విశేషాలు ఉన్న ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించి స్వామి వారి అనుగ్రహానికి పాత్రులమవుదాము.


జయజయ నృసింహ!🙏

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat