అన్నార్తిని తీర్చే తిరువార్ప్ కృష్ణుడు
భగవంతుడు కొలువుదీరిన ప్రతీ ఆలయము పవిత్రమైనదే , విశిష్టత కలిగినదే. అయినా కొన్ని దేవాలయాలకు మాత్రమే విపరీతమైన ప్రచారము , యాత్రికుల రద్దీ వుంటుంది.
అటువంటి కీర్తిప్రతిష్టలతో విరాజిల్లుతున్న అతి ప్రాచీన అసాధారణ ఆలయం కేరళ రాష్ట్రం కోట్టాయం జిల్లా
తిరువార్పు వూరులో వెలసిన శ్రీ కృష్ణుని ఆలయం.
1500 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయం రోజుకు 23గం.58 నిముషాల సేపు భక్తులకోసం తెరిచే వుండడం ఒక విశేషం.
అంటే ఆలయం తలుపులు కేవలం 2 నిముషాలుసేపు మాత్రమే మూసి వుంటాయి.
ఎందుకంటే యీ ఆలయంలో నెలవైయున్న శ్రీ కృష్ణుడు వీరావేశ ఉగ్రమూర్తి అయినందున సదా ఆకలితో వుంటాడని ప్రతీతి. అందువలన స్వామికి నిత్య నైవేద్యములు ఆరగింపు చేస్తూ కృష్ణుని శాంతపరుస్తూంటారట.
అందుకే ఆలయం తలపులు మూసిన రెండవ నిముషాన్నే
ఆలయ ప్రధాన తంత్రీకి అందుబాటులో ఒక గొడ్డలిని వుంచుతారట. ఏ కారణంచేతనైనా ఆలయం తలుపులు తెరవబడకపోతే మరుక్షణమే గొడ్డలి తో తాళం పగులగొట్టి ఆలయంలోని స్వామి ఆకలితీర్చే ఏర్పాట్లు చేస్తారట.
కంసుని సంహరించిన పిదప కూడా శ్రీకృష్ణుని లో ఉగ్రత్వం తగ్గలేదట. ఆ స్ధితిలో వున్న కృష్ణుడే ఈ ఆలయంలో వెలసినట్లు ఐహీకం.
అందువలననే ఈ ఉగ్ర కృష్ణుని నిర్విరామంగా అభిషేకాలతో నైవేద్యాలతో శాంతపరుస్తూంటారు.
అభిషేకం ముగిసిన వెంటనే మూలమూర్తి శిరస్సును మొదట పొడి వస్త్రాలతో ఆరబెట్టి వెనువెంటనే నివేదన
చేస్తారు. ఆ తర్వాతే మిగిలిన శరీరాన్ని ఆరబెడతారు.
ఈ ఆలయ కృష్ణునికి సంబంధించిన మరొక అద్భుత ఘట్టం -
సాధారణంగా గ్రహణ సమయంలో అన్ని దేవాలయాలను కొన్ని గంటలసేపు పూర్తిగా మూసివేసి వుంచుతారు. ఆ సమయంలో స్వామి కి ఎటువంటి సేవలు నిర్వహించరు. ఒక గ్రహణ సమయంలో ఈ కృష్ణుని ఆలయం కూడా మూసివేసారు. తరువాత తలపులు తెరచి చూడగా అంతకుముందు
కృష్ణుని నడుముకు
కట్టిన పట్టువస్త్రం క్రిందికి జారిపోయి వుందట.కృష్ణుని పొట్ట కూడా ఆకలితో అణగారిపోయి
వుండడాన్ని అక్కడే విజయం చేసివున్న
ఆది శంకరాచార్యుల వారు గమనించి , శ్రీ కృష్ణుడు ఆకలితో
వున్నందువలననే ఆవిధంగా జరిగిందని
చెప్పారట. ఆనాటి నుండి ఆలయంలోని కృష్ణుడు కాని , ఆ కృష్ణస్వామిని దర్శించవచ్చిన భక్తులు కాని ఆకలితో బాధ పడకూడదని నిర్ణయించి ఆలయాన్ని మూయకుండానే వుంచుతారు.
ఈ ఆలయంలో భక్తులు
ప్రసాదం తీసుకోకుండా వెళ్ళడానికి అనుమతించరు.
ఎవ్వరూ ఆకలిబాధకు లోనుకాకూడదు.
ఈ ఆలయ ప్రసాదం స్వీకరించినవారికి
జీవితంలో ఆకలి సమస్యే వుండదని భక్తుల ధృఢ విశ్వాసం.
తనను నమ్మి వచ్చినవారికి ఈ ఆలయంలోని కృష్ణుడు
ఆకలి సమస్య లేకుండా అనుగ్రహిస్తాడని
ఐహీకం.
కొట్టాయం జిల్లాలోని తిరువార్పు బస్సు స్టాండ్ నుండి
220 మీ.దూరంలో వున్న యీ శ్రీ కృష్ణఆలయానికి సంవత్సరం పొడుగునా భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు.