🔱 శబరిమల వనయాత్ర - 33 ⚜️ శబరి పీరము ⚜️

P Madhav Kumar


⚜️ శబరి పీరము ⚜️


అప్పాచ్చిమేడు నుండి సరాసరి రెండు ఫర్లాంగుల దూరము వెడలినచో కనబడు స్థలమునందే మహాతపస్వియైన శబరి తపము చేయుచుండెడిది. ఆ స్థలమున ఒక విశాలమైన బండరాయి కనబడును. అది మహాశబరి ఉండిన పీఠము అని సంకల్పించి ఆ స్థలమునకు ప్రాధాన్యత నిచ్చి ఆరాధించవలసిన స్థలముగా భావించి కొబ్బరికాయ పగుల గొట్టియునూ , కర్పూరము వెలిగించియూ , దీపారాధన చేసియూ శబరికి నమస్కరించి అచ్చట నివాసములు ఏమియూ ఏర్పర్చుకొనక యాత్ర కొనసాగించెదురు.


పంబనుండి సుమారు మూడు కి.మీ. దూరము నిటారైన నీలిమల ఎక్కినచో అప్పాచ్చిమేడు బెల్లము , పిండి కలిపిన ఉంటలను విసిరి కాసేపు విశ్రమించిన పిమ్మట నడక ప్రారంభించెదరు. అప్పాచ్చిమేడు నుండి శబరిపీఠము వరకు బట్టబయలు లోనే నడువవలెను. రామాయణములో సూచింపబడు భక్త శబరియే ఇచ్చట నివసించినట్లు పౌరాణకర్తలు , శాస్త్రవేత్తలు చెప్పియున్నారు. శ్రీ రామలక్ష్మణుల దివ్యపాదములు సోకిన స్థలమని గూడా చెప్పడముతో భక్తాదులు మిక్కిలి భక్తి ప్రపత్తులతో ఇచ్చట కర్పూర హారతి చూపించి కొబ్బరికాయలు కొట్టి , కానుకలు సమర్పించి మ్రొక్కెదరు. పూర్వము మాకంద మునీశ్వరుల ఆశ్రమముగా యుండిన ఈ స్థలము పిదప శబర్యాశ్రమముగా మారి ఇప్పుడు శబరి పీఠముగా కన్పించుచున్నది. మహా తపస్వినియైన రామలక్ష్మణులు ఒక దినమున శబరి ఆశ్రమమునకు వచ్చిరి. వృద్ధాప్యముతో యుండిన శబరి వార్లను నిండు మనస్సుతో సత్కరించెను. శ్రీ రాముడు ఆమె వాత్సల్యమునకు సంతుష్టుడై ఏమి వరము కావలయునని అడుగగా ,ముక్తిని ప్రసాదించమని శబరిమాత కోరెను. అందులకు శ్రీ రామ చంద్రుడు  *'మాతా శబరీ ! నీవు నన్ను , నా రూపాన్ని మనస్సులో తలస్తూ రాముడు , రాముడని సగుణోపాసనచేసినందులకు నీకు స్వర్గ ప్రాప్తి మాత్రమే లభ్యమగును. ముక్తి నొందవలయుననిన నీవు నిర్గుణోపాసన చేసి యుండాలి'* అనెను.


రామచంద్రా ! నిర్గుణోపాసన యనిన నేమి ?' అని శబరి అడుగగా *'మాతా ! ఇందుకలడందులేడను సందేహమువలదు ఎందెందు వెతికినన్ అందందే కలడను రీత్యా సర్వము నందు నిండి నిబిడీకృతమైన పరబ్రహ్మమును చరాచర అన్నింటిలోను ఆ పరబ్రహ్మము యుండుట గ్రహించి , తనలాగే సకల జీవరాసులను తలచి , వాటిలో పరమాత్మను దర్శించి ఆనందించువాడు నిర్గుణోపాసి యగుచున్నాడు. భువిపై జన్మించిన ఎవరైననూ విధిరాతను అనుభవించి తీరవలసినదే. నిర్మలమైన నీ సత్కారము వలన మేము సంతుష్టులయ్యాము. ముక్తికోరిన నీవు తదుపరి జన్మలో ఇచ్చటే , శబరి నామముతోనే జన్మించెదవుగాక. తదుపరి జన్మలో జ్ఞాపకాలతో నిర్గుణోపాసన చేయుచుండగా నేను నీ వద్దకు వేరే స్వరూపములో నీవు పూర్వజన్మ వచ్చెదను. అప్పుడు  నన్ను పరబ్రహ్మముగా గ్రహించినచో నేను నీకు ముక్తిని ప్రసాదించెదను." అని వరమొసంగెను. శ్రీ రామచంద్రుని వరము ప్రకారము ముక్తి కాంక్షతో శబరి శేషజీవితమును గడిపి , తనువు వీడి మరల అదే గడ్డపై శబరినామముతో జన్మించెను. పూర్వజన్మజ్ఞాపకాలు ఉండడం వలన రామచంద్రుడు ఆదేశించినట్లే నిర్గుణోపాసన చేయుచుండెను. మహిషి సంహారము చేసిన హరిహరసుతుండైన ధర్మశాస్తా వారికి దేవతలు కాంతమలపై స్వర్ణముతో ఆలయము కట్టి వారికి పూజాదికాలు సలిపి స్తోత్రించుచుండిరి. పులిపాలకొరకై వనమునకు వెడలిన తన పుత్రుడు మణికంఠుడు ఇంకను తిరిగి రాలేదేయను దుఃఖముతో పందళరాజు తన పూజా మందిరమున కూర్చొని మణికంఠా యని మణికంఠ జపము చేయసాగెను. పందళరాజు యొక్క మణికంఠ జపము పొన్నంబల నాయకుడైన స్వామి అయ్యప్ప చెవిలో పడెను.


కర్తవ్యము ఇంకను యున్నదంటూ దేవేంద్రునితో శ్రీ స్వామి తెలుపగానే ఇంద్రుడు పెద్దపులికాగా , శ్రీ స్వామివారు ఆ బెబ్బులి మీద మరగా , తదితర దేవతలు పులిమందలై వెంబడించగా కలియుగ వరదుడైన మణికంఠుడు ధర్మాన్ని శాసించుటకొరకై

అవతరించిన శ్రీ ధర్మశాస్తావారు వ్యాఘ్రముపై పందలరాజ్యానికి పయనమయ్యెను. మార్గమధ్యమున తారకప్రభువైన శ్రీ స్వామి వారు ముక్తికోరి తపము చేయుచుండిన శబరిమాతను అనుగ్రహించ తలచి ఆమె ఆశ్రమము ముంగిట కాసేపు ఆగెను. దైవసాన్నిధ్యము వలన దివ్యానుభూతి చెందిన శబరి కనులు తెరచి చూచెను.  దర్శనమాత్రముననే భవసాగరము నుండి కడతేర్చి ముక్తిని ప్రసాదించగల పరబ్రహ్మమిదియే నను ప్రబోధ కల్గగా శ్రీ స్వామివారిని పలురీత్యాస్తుతిస్తూ భక్తి శ్రద్ధలతో పదునెనిమిది పర్యాయములు ప్రదక్షిణ నమస్కారములు చేయుచుండగానే ఆమె వద్ద దాగి యుండిన కామ క్రోధాదులనబడు ప్రారబ్ధములన్నియు పక్షిరూపమున ఆమె శరీరము నుండి వెలువడి నేలపై పడి మరణించెను. కర్మ తొలగగానే జనన మరణ రాహిత్యం జతకలిసెను.


ఇక ముక్తి తనకు తానే సంపాదించుకోగల్గేను. ఆహా ?  ఏమి ఆ శబరి మాతకు లభించిన భాగ్యము. ఏమి ఎరగని వారికి మల్లే తనను ప్రదక్షిణ నమస్కారములు చేసి నిలబడియున్న శబరిమాతను జూసి ఏమి వరము కావలెనని అడిగారు శ్రీ

స్వామివారు. దేనిని పొందిన పిమ్మట ఇంకోదానిని మనస్సు కోరుకోదో అట్టి ఉన్నతస్థాయిని చేరుకొన్న శబరిమాతకు స్వామి వారి వద్ద కోరుకొనుటకు ఏమియు గోచరించలేదు. ఆమె పరిపూర్ణత్వమును గ్రహించిన స్వామి వారు "హే ! భక్త శబరీ ! లోక క్షేమార్థం నీవు కోరుకునే రెండు వరములను ఇచ్చుటకు సిద్ధముగా యున్నాను. ఏమి కావలయునో కోరుకొమ్ము" అనెను. అందులకు శబరిమాత శ్రీ స్వామివారితో "మహాప్రభో ! నేను ఇచ్చట మిమ్ములను దర్శించి ముక్తి పొందినాను. కావున మీరు ఈ గిరిపై కోవెల గొనవలెను. ఇచ్చట మిమ్ములను దర్శించుకొనే భక్తులందరకి ముక్తిని ప్రసాదించవలెను"* అని కోరెను. అందుకా స్వామి వారు *"మాతా ! అనేకానేక జన్మలు పొంది విధిని అనుభవిస్తూ కష్టములెన్ని వచ్చినను భగవంతుని మీద భారము మోపి జీవించి , అంచెలంచెలుగా ఆత్మ నిగ్రహము పొందిన నీవంటి తపో సంపన్నులు మాత్రమే చేరుకోగల ముక్తి సామ్రాజ్యమును మానవులకు కేవలము ఒక దర్శన మాత్రమున ఒసంగుట ఎలా ?  ఐనను నీవు కోరినందువలన ఆ వరమును ప్రసాదించుచున్నాను.


ఏ యొకడు భక్తి శ్రద్ధలతో మాలధరించి మండలకాల వ్రతదీక్షను నియమనిష్టలతో ఆచరించి ఇరుముడి మోసి వనయాత్ర జేసి నన్నీ చోట దర్శించుకొనుచున్నాడో ఆతని

దుఃఖములను ఒక్కొక్కటిగా తొలగించెదను. ఇలా పదునెనిమిది సంవత్సరములు క్రమము తప్పక నన్ను దర్శించువాడు సద్గతివైపు అంచెలంచెలుగా ఎదిగి చివర ముముక్షువౌతాడు. ముముక్షువు కొరకు మోక్షద్వారము ఎల్లవేళలా తెరచి యుండును. ఇక ఇట్టివారు చేయవలసిన తపమును నీ కోర్కె మేరకు ఇచ్చట కోవిల గొనిని నేనే చేసెదను. నన్ను పరిపూర్ణముగా గ్రహించుకొన్న ముముక్షువులకు జ్యోతి స్వరూపుడై కనపడి ముక్తి మార్గమును చూపించెదను. ఇక నీకు రెండవ వరముగా నేను ఇచ్చట అమరి తపము జేయుకొండను నేటినుండి నీ పేరున *'శబరిమల' యని పిలిచెదరు గాక ! సూర్యచంద్రాదులు యున్నంత వరకు నీ పేరును లోకాన శాశ్వతముగా యుండును"* అని పలికి అయ్యప్ప వెడలెను. మానవుల జీవితము కడతేరే మార్గమును చూపించిన శబరి మాతను ధ్యానిస్తూ శబరిపీఠమందు నారికేళము గొట్టి , కర్పూరము చూపించి , కానుకలు సమర్పించి మొక్కిన పిమ్మట కొంచెము దూరము నడిస్తే శరంగుత్తి ఆల్ ' అను స్థలమును చేరవచ్చును. ఎరిమేలిలో

పేట ఆడిన పిమ్మట కన్నిస్వాముల కరములందు ఇవ్వబడిన శరములను ఇచ్చట యుండు (ఆల్) రాగి వృక్షమునందు గ్రుచ్చవలెను.


కొందరు సరైన మార్గదర్శకులు లేని కన్నిస్వాములు శబరిపీఠమునందే ఈ శరములను గ్రుచ్చుచున్నారు. శరంగుత్తిలోనే పైశరమును గ్రుచ్చవలెను. ఇదియే మన కన్నియాత్ర ముగిసినందులకు నిదర్శనము. పంబనుండి శబరిమలకు వెడలుటకు

ఇంకొక మార్గమును కొన్నేళ్ళకు ముందు నిర్మించారు. లఘువుగా ఎక్కే రీత్యా కొండచుట్టూ రోడ్డును నిర్మించియున్నారు. దూరపుచూపుకు మన తిరుపతి రోడ్డును గుర్తుచేస్తుంది. మట్టిరోడ్డే , ఇంకా సరిగ్గా సమదళముచేసి తారురోడ్డు గావించలేదు. ఈ రోడ్డును నిర్మించే ఖర్చు అంతయు మేరీలాండ్ సుబ్రహ్మణ్యం అను పరమభక్తుడు

భరించారట. వీరే స్వామి అయ్యప్ప సినిమా స్టూడియో యున్నది. కావున వీర్ని మేరీలాండ్ సుబ్రహ్మణ్యం అని పిలిచేవారట. ఈ రోడ్డును , శబరిమలలోని గెస్ట్ హౌసు సుబ్రహ్మణ్యం ట్రస్టు పేరిట నిర్వహిస్తున్నారు. వీరు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డులో మెంబరుగా గూడ యున్నవారు ప్రస్తుతము వీరు స్వర్గస్థులైనను ట్రస్టు మాత్రము చక్కగా నిర్వహించబడుచున్నది. ఉత్తరోత్తర ఈ రోడ్డు బస్సు రోడ్డుగా  మారవచ్చునను దీర్ఘాలోచనతో నిర్మించబడిన ఈ రోడ్డు క్రాస్ అగుచున్నది. ఆ దారివెంటే వెడితే శరంగుత్తి వెళ్ళకనే సన్నిధానము చేరుకొనవచ్చును.  *'చుమట్టుకార్'* అనబడు కూలీలు ఈ మార్గమున లఘువుగా కొండెక్కిపోతున్నారు. శబరిమల లోని మరమత్తు అనగా బిల్డింగ్  వర్కు కు కావలసిన సిమెంటు , ఇసుక , కమ్ములు మున్నగు

సామానులు గాడిద మీదుగా ఈ మార్గముననే తరలిస్తున్నారు. ఈ మార్గానగూడ అనేక భక్తులు ఎక్కి వెడలుచున్నారు.


అప్పాచ్చిమేడు , శబరిపీఠములోను , సుబ్రహ్మణ్యం రోడ్డులోను మార్గమధ్యములో రద్దీ నిండిన మకరవిళక్కు తిరునాళ్ళ వేళలలో పలు నైవేద్య సదుపాయాలు భక్తులకు

అందజేస్తున్నారు. క్రూరమృగములు సహజముగా తిరుగులాడే అడవిమార్గమగు ఈ స్థలమున యాత్రాదినములలో వాటిలో యొకటి గూడ ఏ యొకరి కంటపడి హింసించినట్లు చెప్పబడుట లేదు. రేయి , పగలు , ఎల్లవేళలా ఈ మార్గమున భక్తాదుల సంచారము యుండుటవలనను , వారి శరణ ధ్వని వినుట వలననూ వన్యమృగములు

ఈ ప్రాంతమునుండి అడవిలో సుదూరానికి వెడలిపోవుచున్నవి. అదియుగాక (వెడవయిపాడు) అనుపేరిట మార్గమధ్యములో అచ్చటచ్చట టపాకాయలను ప్రేల్చి దుష్టమృగములను అడవిలోనికి తరిమేస్తుంటారు. శబరిపీఠము నుండి శరంగుత్తి వెడలే మార్గములో సమతల ప్రదేశమును మరక్కూటం అందురు. ఇచ్చట (మరం) మాకులు నిటారుగా కూటమిగా పెరిగి ఒక ఉద్యానవనములా కన్పిస్తున్నది.


ఇచ్చట కాసేపు విశ్రమించి కప్పు , గంజి , కాఫీ , ఛాయ మున్నగు పదార్థములతో ఉదరశాంతి గావించుకొని పయనమగు చున్నారు. ఇచ్చట నుండి ఎడమ వైపు దారి తిన్నగా సన్నిధానంవైపుకు పోవును. కుడివైపుదారి శరంగుత్తి మార్గాన సన్నిధానమునకుగొనిపోవును. రెండు దార్లలోను విద్యుత్ దీపాలు పగలును

మించేలా ప్రకాశమును విరజిమ్ముచున్నవి. మైకుద్వారా సన్నిధానములో ప్రసారమయ్యే వార్తలు , విశేషాలు తప్పిపోయిన వారి దీనార్థి వదలక వినిపించు చునే యుండును. కన్నిస్వాములు కుడివైపు మార్గముగా వెడలి శరంగుత్తిలో తాము

ఎరుమేలి నుండి తెచ్చిన శరములను గుచ్చిన పిమ్మటే సన్నిధానము చేరవలెను.


🙏🌻ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌷🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat